– జింబో

ఆమె పేరు కాశమ్మ. మా బాపు దవాఖానా సందులో ఆమె ఇంల్లుండేది. మా చిన్నప్పుడే ఆమెకు అరవై అయిదు సంవత్సరాలుంటాయి. ఆమెకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు పెద్ద కిష్టయ్య. చిన్న కొడుకు పేరు లక్ష్మీరాజం. మా వేములవాడలో వేదం చదివిన వ్యక్తి పెద్ద కిష్టయ్య. ఘనాపాటి.

కాశమ్మ తమ్ముడు బుచ్చి కిష్టయ్య, అతను మా పురోహితుడు. కాశమ్మ భర్త ఎప్పుడు చనిపోయాడో మాకు తెలియదు. భర్త చనిపోయినాడని కాశమ్మ తెల్ల చీర ట్టుకునేది. తల వెంట్రుకలు కూడా తీయించేది. గుండ్రటి కళ్ళద్దాలు. గట్టి గొంతు ఆమెను చూడగానే పిల్లలు జాగ్రత్తగా వుండాలని అనుకునే వాళ్ళు.

కాశమ్మ వేములవాడలో వుంటే మా ఇంటికి రాని రోజు వుండేదికాదు.

ఉదయం పదకొండు గంటలకి ఇంటికి వచ్చేది. చీకటి పడే వరకు వుండి వెళ్ళిపోయేది. బొగ్గుల పొయ్యి మీద టీ పెట్టుకొని చాయ తాగేది. ఆ టీలో నీళ్ళు తక్కువా-పాలు ఎక్కువా అని అనే వాళ్ళు. మా అమ్మని, అత్తా అని, మా బాపుని, మామ అని పిలిచేది. అమ్మని అత్త అనేది కానీ, మా అమ్మే ఆమెకు కోడలు మాదిరిగా ఒదిగి వుండేది.

కాశమ్మ అంటే మా పిల్లలందరికీ భయమూ వుండేది. భక్తీ ఉండేది, ఎన్నో కథలు చెప్పేది. మహా భారతం ఆమెకు నోటికి వచ్చేది. మా బాదర్ర ముందు అరుగు మీదో లేదా దేవునర్ర ముందు అరుగు మీదో ఆమె కూర్చునేది. ఆమె కూర్చున్న స్థలంలో పాన్‌దాన్‌ని, పాన్‌ నమిలి ఉమ్మడానికి ఒగల్‌దాన్‌ని మా అమ్మ తెచ్చి పెట్టేది.

పాన్‌దాన్‌ పక్కన ఓ పెద్ద గుండు పెట్టుకునేది. పిల్లలు సరిగ్గా చదవకపోయినా, అల్లరి చేసినా, వినకపోయినా ఆమె తన దగ్గర వున్న గుండుని మింగిస్తుందని మా ఇంట్లోని పెద్దవాళ్లు అనేవాళ్ళు. ఆమె కూడా అట్లాగే చెప్పేది. ఎప్పుడు ఎవరికీ గుండును మింగియ్యలేదు కానీ కాశమ్మ గుండు మింగిస్తుందన్న భయం మా పిల్లలందరిలో వుండేది. కాశమ్మ పాన్‌ వేసుకొని కాస్త నిదానంగా కన్పిస్తే పిల్లలు ఆమె చుట్టూ చేరేవాళ్ళు. ఏదో ఓ కథ చెప్పేది.

మా వేములవాడ చుట్టు ప్రక్కల గ్రామాలంతటికీ వున్న ఏకైక డాక్టర్‌ మా బాపు. ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోయినా వారు మా బాపు దవాఖానకి వచ్చేవాళ్ళు. దగ్గుకి తియ్యటి మందు, జ్వరానికి ఎర్రటి గోళీ, కషాయం, ఇలా ఎన్నో గోళీలు, కషాయాలు వుండేవి. ఎవరికి జ్వరం వచ్చినా బాపు దవాఖానాకి వచ్చి గోళీలు తీసుకొని వెళ్ళేవాళ్ళు. గోళీల ప్రభావమో, మా బాపు హస్తవాసో అందరి రోగాలు జ్వరాలు జల్ది తగ్గిపోయేవి. ఇది మా వేములవాడ గ్రామంలోని పరిస్థితి. చుట్టు ప్రక్కల వున్న గ్రామాల పరిస్థితి. అయితే మా ఇంట్లో పరిస్థితి మరో విధంగా వుండేది. మా అమ్మకి కాశమ్మ అంటే మహా గురి. మా పిల్లలకి ఎవరికి జ్వరం వచ్చినా, దిష్టి తగిలిందని మా అమ్మ భావించినా కాశమ్మతో మంత్రం వేయించేది. మా బాపు మందులకన్నా కాశమ్మ మంత్రం బాగా పనిచేస్తుందని మా అమ్మ నమ్మిక. ఆమె నమ్మిక సత్ఫలితాలని ఇచ్చిందని తరుచూ చెప్పేది.

మా పిల్లల జ్వరాలని తగ్గించే కాశమ్మకి, మాకు దిష్టి తగలకుండా మంత్రం వేసే కాశమ్మకి ఓ వింత ఆరోగ్య సమస్య వుండేది. వేములవాడలో ఎక్కువ రోజులు వుంటే తిన్న తిండి వొంటికి పట్టేది కాదు. వాంతులు అయ్యేవి. వాళ్ళ కుటుంబాల్లో ఎవరన్నా జన్మనిచ్చినప్పుడు, ఎవరైనా కాలం చేసినప్పుడు మాత్రం ఈ సమస్య ఉండక పోయ్యేదట. ఈ విషయాలన్ని మా అమ్మ తరచూ చెప్పేది. ఆమెకు వాంతులైనప్పుడు మా బాపు ఇచ్చిన గోళీలతో కుదుటపడేది.

ఈ ఆరోగ్య సమస్యకి విరుగుడుగా ఆమె వేములవాడకి దూరంగా జిళ్ళెళ్ళ దగ్గర ఓ గుడి దగ్గర వుండేది. కొంతకాలం వుండి అక్కడి నుంచి సిరిసిల్లకు వచ్చేది. అక్కడ మా పెద్దమ్మ దగ్గర కాసిన్ని రోజులు వుండేది. అక్కడ ఆమెకు అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేసేవాళ్ళు. తన వంటని తనే చేసుకునేది. పూజ చేసుకునేది.

అక్కడి నుంచి మా వేములవాడకు వచ్చేది. వేములవాడలో వాళ్ళ ఇల్లు వుంది కాబట్టి అక్కడికి వెళ్ళి పడుకునేది. కానీ రోజంతా మా ఇంట్లోనే కాశమ్మ మా ఇంటి ఆడపడచులా వ్యవహరించేది.

మా పెద్దన్న అకాలంగా మరణించినప్పుడు మహాభారతాన్ని మా వదినకు చెబుతూ ధైర్యాన్ని నింపేది. మా వదిన బాధను తొలగించడానికి భద్రాచలం తీసుకొని వెళ్ళి రాములవారి దర్శనం కలుగచేసింది. పెద్దవాళ్ళకి ఆ విధంగా ధైర్యాన్ని, పిల్లలు బాగా చదువుకునేటట్టుగా భయంలో వుంచేది. గుండు మింగిస్తుందన్న ఆలోచనే మా అందరిలో క్రమశిక్షణ ఏర్పరిచేది.

కొంతకాలం తరువాత మళ్ళీ జిళ్ళేళ్ళకి వెళ్ళేది. మళ్ళీ వచ్చేది. ఇదీ కాశమ్మ జీవిత విధానం.

మా వేములవాడ కాశమ్మ లేకపోయినా మా అరుగుమీద ఆమె వుంచిన గుండు

ఉండేది. ఆ గుండును చూసినప్పుడల్లా కాశమ్మ గుండు మింగిస్తుందేమోనని పిల్లలందరమూ అనుకొని జాగ్రత్తగా వుండే వాళ్ళం.

కాలం అలా గడిచిపోయింది. కాశమ్మ మా ఇంట్లో వుంచిన గుండు అలాగే వుండిపోయింది. కాశమ్మ మా రాజేశ్వరునిలో ఐక్యమైపోయింది. కొంతకాలం తరువాత మా బాపూ చనిపోయాడు. అమ్మా చనిపోయింది.

జీవిత పరుగులో పడ్డ మాకు కాశమ్మ జ్ఞాపకం మసక బారింది. అంతేకానీ ఎవ్వరమూ మర్చిపోలేదు. ఆమెను తలుచుకున్నప్పుడల్లా మా వినోదక్కలో, మా పెద్దవదినలో ఎన్నో జ్ఞాపకాలు.

విచిత్రం ఏమంటే – ఊరందరికి మా బాపు గోళీలు కావాలి. కాశమ్మకు కూడా. మాకు జ్వరం వస్తే మా అమ్మకి కాశమ్మ మంత్రం కావాలి.

ఎవరి విశ్వాసం వారిది.

తన వల్ల ఇతరులకి ఇబ్బంది కలుగకూడదని అందరినీ వదిలి ఎక్కడో దూరంగా జీవిస్తూ మా వేములవాడకి వచ్చేది కాశమ్మ. అలా వచ్చిన కాశమ్మని అపురూపంగా చూసుకునేది మా అమ్మ.

ఆ మధ్యన నాకు జ్వరం వచ్చింది. అల్లోపతి మందులు వాడుతున్నప్పటికీ జ్వరం తగ్గినట్టు అన్పించడం, మళ్ళీ రావడం మొదలు పెట్టింది.

మూడు రోజులు గడిచాయి.

శరీరం వేడిగా వుంది. మా ఆవిడ లేచి టెంపరేచర్‌ చూసింది. 101 డిగ్రీలు వుంది.

డోలో 650ని ఇచ్చింది.

వేసుకున్నాను. నిద్రరావడం లేదు. అప్పుడు మా అమ్మ గుర్తుకు వచ్చింది. మా అమ్మతో బాటు కాశమ్మ గుర్తుకొచ్చింది.

యాభై సంవత్సరాల క్రితం నా మొఖం మీద కాశమ్మ వేసిన జ్వరం మంత్రం గుర్తుకొచ్చింది. ఆమె ఇంకా నా మొఖం మీద ఊదుతున్నట్టు అన్పించింది.

కాశమ్మ రూపురేఖలూ, గదిరింపు మాటలు హావభావాలు అన్నీ కళ్ళ ముందు కదలాడాయి. కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగాయి. అది సంతోషమో బాధో అర్థం కాలేదు.

ఇప్పుడు అమ్మలేదు. కాశమ్మ లేదు. బాపు లేడు. అమ్మ ఆదుర్ధా లేదు. కాశమ్మ మంత్రమూ లేదు. బాపు గోళీలూ లేవు.

కానీ ఆ రాత్రి అవి అన్నీ వున్నాయన్న భావన నాలో కలిగింది. వాళ్ళందరూ నావెంటే వున్నారన్న ఫీలింగూ కలిగింది.

తెల్లవారి నుంచి మళ్ళీ డోలో 650 వేసుకోవాల్సిన అవసరం కలుగలేదు.

ఇది యాదృచ్ఛికమా కాదా నేను చెప్పలేను.

జర్వంలో అమ్మ కన్పించింది. మా కాశమ్మ మంత్రమూ విన్పించింది.

మా బాపు ఆశీస్సులు లభించాయి.

Other Updates