ఈ విశాల విశ్వంలో భూమి పవిత్రమైనది. అందులోనూ భారతదేశం పరమపవిత్రమైనది. ఇంకా ఈ దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలూ, ధన్యతీర్థాలూ పవిత్రాతిపవిత్రమైనవి. మీదుమిక్కిలి వీటన్నింటిలోనూ కాశీనగరం మరింత పవిత్రమైనది. ఈ మోస్తరు అభిప్రాయాలు, భావనలు, విశ్వాసాలు, ఆధ్యాత్మికవాదులవే అయినా వీటితో చాలామంది సైతం ఏకీభవించే వీలున్నది. ముప్పైమూడు కోట్ల దేవతలతో సహా పరమేశ్వరుడు కాశిని శాశ్వత నివాసంగా చేసుకొని భక్తులను తరింపజేస్తున్నాడని హిందువుల నమ్మకం. ఏ రకంగా చూసినా కాశి ఒక ప్రధానమైన పట్టణం.

తెలుగులో ”కాశికి పోయినవాడూ, కాటికి పోయినవాడూ ఒకటే” అనే సామెత ఉన్నది. ఎందుకన్నారలా? పూర్వం యిప్పటిలాంటి రవాణా సౌకర్యాలు లేవు. నడిచి లేదా యితర వాహనాలు (బండ్లు, గుర్రాపు జట్కాలు) సాయంతో వెళ్ళాలి. వెళ్ళే వాళ్లు దాదాపు ముక్తిని కాంక్షించే ముసలులై వుంటారు. ప్రాయం వాలిపోయి వుంటుంది. కాశి చాలా దూరంలో వుంటుంది. అనేక వ్యయ ప్రయాసలకు లోనై ఒకవేళ కాశికి వెళ్ళినా మళ్ళీ యింటికి తిరిగివచ్చే అవకాశాలు తక్కువ. అందుకే ”కాశికి వెళ్ళినవాడూ, కాటికి వెళ్ళినవాడూ ఒక్కటే” అన్నారు.ఇవాళ ఆ పరిస్థితి లేదు, హాయిగా వెళ్ళవచ్చు. అది విషయాంతరం.

తెలంగాణ ప్రాంతంలో ”గడపలోపల ఉన్న సుకం కాశికి పోయినా దొరుకది” అనే సామెత వాడుకలో వుంది. సామెతలు జానపదుల నిండు జీవితానుభవంలోంచి, నిసర్గజీవనానుభూతుల్లోంచి ఆవిర్భవిస్తాయి. కాశీ నగరం ఎంతగా ముక్తిస్థానం అయినప్పటికీ గడపలోపల వున్న సుఖం మాత్రం అక్కడ దొరకదట! అది నిజం. ఒక్క కాశీపట్టణం అనేకాదు, ఏ దూర ప్రాంతానికి వెళ్ళినా మన యింట్లో వున్న సౌకర్యాలుండవు. చాలా కష్టపడాల్సి వస్తుంది.

అయినా తెలంగాణలో కాశీపై వున్న ప్రేమతో తమ పిల్లలకు తల్లిదండ్రులు ”కాశయ్య, కాశవ్వ” అనే పేర్లు పెట్టుకుంటారు. అసలు కాశి అంటే అర్థం ఏమిటి? ‘ప్రకాశించునది’ అని అర్థం. ‘సరకాశించునది’ అంటే సమీపంలో వున్నది అని అర్థం. దేనికి సమీపంలో వున్నది మోక్షానికి సమీపంలో వున్నదని. కాశి ఉత్తర భారతాన ఉన్న ప్రపంచంలోని అత్యంత ప్రాచీన నగరం. కాశీకి వెళ్ళడం పూర్వకాలంలో కష్టసాధ్యం అని చెప్పుకున్నా, దాని ప్రాముఖ్యం దానికి వుంది. అందుకనే తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో వున్న వేములవాడను పరమ ఇష్టంగా ప్రజలు నోరారా ”దక్షిణ కాశి” అని పిలుచుకుంటారు. ఉత్తరకాశికి వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో అంతే పుణ్యమూ వేములవాడలో లభిస్తుందని భక్తుల నమ్మకం.

పుణ్యస్థలాలూ, తీర్థ క్షేత్రాలూ వున్న ప్రాంతాల్లోని దుకాణాల్లో రకరకాల దేవుళ్ళూ, దేవతల ఫొటోలూ, ప్రసాదాలూ వగైరా అమ్మకం పరిపాటి. ఐతే నలుపురంగులో వుండే మెరుపు కలిగివున్న దారాలను ”కాశిదారాలు” అంటారు. అట్లాగే ”కాశిదండలు” కూడాను. ఈ దారాలను చేతులకు కట్టుకుంటారు. కాశీ పట్టణంలో విశ్వనాథుని సమీపస్థలాల్లో యిటువంటి దండలూ, దారాలూ దర్శనమిస్తాయి. ఇటువంటివే తెలంగాణలోని దేవాలయ సమీపంలోని దుకాణాల్లో అమ్ముతుంటారు. కాశీ పవిత్రతే ఈ దారాలకూ, దండలకూ వుంటుందని జనుల నమ్మకం.

తెలంగాణలో ”కాశీపుల్ల” అనే ఒక ఆటవుంది. దీన్నే ”చుకు చుకు పుల్ల’ ఆట అని యితర ప్రాంతాల వారు అంటారనుకుంటాను. ఈ ఆటలో ఎదురుబదురుగా ఇద్దరు పిల్లలు కూచునుంటారు. ముందర కొంత యిసుకను పోసుకొని అందులో ఒకడు ఈ కాశీపుల్లను కనిపించకుండా పెట్టి దానిమీద తన దోసిలిని పెడతాడు, అవతలివాడు ఇసుకలో వెతికి దాన్ని కనిపెట్టాలి.

ఒక వ్యక్తి బాగా ఆస్తిపాస్తులు కూడబెట్టాడనుకుందాం. అతనికి వారసులు లేరు. ఒకవేళ వున్నా ఆ మనిషి తనవాళ్ళకు ఆ సంపదను యివ్వడానికి నిరాకరిస్తున్నాడు. అటువంటి వ్యక్తిని వుద్దేశించి జనాలు ”మరి ఈ ఆస్తి అంతా కాశిల గంగ రామనిపాలా ఏంది?” అని ప్రశ్నిస్తారు. ఐతే ఈ కాశిల గంగరాముడు ఎవరు? ఎవడో దారినపోయే దానయ్య, పేరూ, వూరూలేని ఉమ్మయ్య, జక్కయ్య. శ్రీరామలంకల బోడకోతి వంటివాడు. ప్రత్యేకమైన ఉనికి, అస్తిత్వమూలేని వాడు. ఇంత కష్టపడి సంపాదించి చివరకు ఆ ఆస్తిని తన కుమారులకూ, కూతుళ్ళకూ యివ్వకుండా ఎవడో కాశిలవున్న గంగరామని పాలు చేస్తడా ఏమిటనే అడుగుతుంటారు.

తెలుగులో ఒక సామెత ఉంది. అది, కడుపే కైలాసం, వాకిలే వారణాసి, ఇల్లే తీర్థం. ఇక్కడ వారణాసి అంటే కాశీ నగరమే. అయితే ఈ సామెత తెలంగాణలో ”ఇల్లే వైకుంఠం, కడుపే కైలాసం, జాలారే కోనేరు” రూపంలో కాశీ ప్రశంస లేకుండా వుంది. ఈ రెండు సామెతలూ ఇంటిని వదలి బయటకు వెళ్ళని వ్యక్తులను ఉద్దేశించి వ్యంగ్యంగా చెప్పిన బాబతులు.

కుంకుమదాసెన బుక్కమీద కూడా/కంపెని రక్కసి కన్నుపడ్డది/పూసలాళ్ళ తాళం కప్పలు/కాశిల కలిసి ఖతమై పోయెను/బొట్టు బిళ్ళలు నొసటికొచ్చినవిరో నా పల్లెల్లోన/ మా బుట్టి దాసరి బతుకులాగమాయే మా పల్లెల్లోనా” అనే ”పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల” పాటలోని చరణంలో కూడా కాశీ ప్రస్తావన వుంది. ”పూసపేరుల వాళ్ళ తాళం కప్పలు కాశిల కలిసి ఖతమైపోయెను” అంటూ ప్రపంచీకరణ దుష్ప్రభావాన్ని, ఆ ప్రపంచీకరణ స్వభావాన్ని గొప్పగా ప్రపంచానికి ప్రవచించాడు గోరటి వెంకన్న.

ఏమైనా, తెలంగాణలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు సాహిత్యంలో కాశీ ప్రస్థావన వచ్చిన అంశాలు బోలెడున్నాయి. శ్రీనాథుని కాశీఖండం, మధిర సుబ్బన్న దీక్షితుల కాశీమజిలీ కథలు, ఏనుగుల వీరస్వామయ్య కాశీయాత్రా చరిత్రలు పాఠకులకు తెలియనివి కావు కదా!

డా|| నలిమెల భాస్కర్‌

Other Updates