kasu-rajinama-drama— శ్రీ వి. ప్రకాశ్‌

1969 జూన్‌ 27న పరిశ్రమల మంత్రి బి.వి.గురుమూర్తి రాజీనామా, ఆ తర్వాత కొద్దిసేపటికే ముఖ్యమంత్రి కాసు రాజీనామా తెలంగాణ ఉద్యమ కారులకు నూతనోత్తేజాన్ని కల్గించాయి. ముఖ్యమంత్రి నిర్ణయంపై పోటీ తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు యం.శ్రీధర్‌రెడ్డి, ‘‘పోరాటంలో ఇది ప్రథమ విజయం’’ అన్నారు.
ముఖ్యమంత్రి తన రాజీనామాపై పత్రికా విలేఖర్లతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్లమెంటరీ బోర్డు తెలంగాణ సమస్యపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవడానికి తన రాజీనామా వీలు కల్పించగలదని భావిస్తున్నామన్నారు.

మొదటినుండి విశాలాంధ్ర వాదియైన బ్రహ్మానందరెడ్డి ఏనాడూ తన పాలనలో తెలంగాణ రక్షణలు అమలు చేయడానికి ప్రయత్నించలేదు. తెలంగాణపై కరడుగట్టిన వ్యతిరేకతనే ఎప్పుడూ ప్రదర్శించారు. తెలంగాణ రక్షణలను గౌరవించని ముఖ్యమంత్రి కేంద్రాన్ని తెలంగాణ సమస్యపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోనిస్తాడా? ముఖ్యమంత్రి పత్రిక వారితో చెప్పేది పచ్చి అబద్ధమని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అసలు విషయం వేరే ఉన్నది.

ముఖ్యమంత్రి రాజీనామాకు ఒక్కరోజు ముందు తెలంగాణ మంత్రులు బి.వి. గురుమూర్తి, వి.బి.రాజు, శీలం సిద్ధారెడ్డి, కె.వి.నారాయణ రెడ్డి, మహమ్మద్‌ ఇబ్రహీం అలీ అన్సారీలు సమావేశమై తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను గురించి చర్చించారు. చెన్నారెడ్డి, ఇతర నేతల అరెస్టు తర్వాత ఉత్పన్నమైన పరిస్థితి తమకు ఇబ్బందికరంగా తయారైందని, ప్రతిరోజూ తెలంగాణ మంత్రుల రాజీనామాకై ప్రజలు ఆందోళనలు, తమ ఇండ్ల ముందు ధర్నాలు నిర్వహిస్తూ దిష్టిబొమ్మలు కాలుస్తుంటే ఇంకా ఈ సీట్లను పట్టుకొని వ్రేలాడడం మంచిదికాదని భావించి రాజీనామాకు సిద్ధమైనారు. తమ రాజీనామా వల్ల తెలంగాణలో ప్రశాంత పరిస్థితి నెలకొంటుందని భావించారు. జూన్‌ 27న ముఖ్యమంత్రికి రాజీనామాలు సమర్పించాలని నిర్ణయించారు. కానీ, ఈ లోపే ముఖ్యమంత్రికి నమ్మినబంటుగా వున్న బి.వి.గురుమూర్తి తెలంగాణ మంత్రుల రాజీనామా విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పడంతో బ్రహ్మానందరెడ్డి తన రాజీనామా నాటకానికి తెరతీశారు. తెలంగాణ మంత్రులు అంతా మధ్యాహ్నం రాజీనామాలు ఒకేసారి ముఖ్యమంత్రికి అందజేయాలని నిర్ణయించుకోగా, గురుమూర్తి ఎందుకు వారికన్నా ముందే ముఖ్యమంత్రిని కలిసి రాజీనామా చేశారు? ఆ తర్వాత కాసేపటికే బ్రహ్మానందరెడ్డి రాజీనామా…
ఒక వేళ తెలంగాణ మంత్రులు రాజీనామా చేస్తే, తెలంగాణ ఉద్యమానికి వారి రాజీనామాలు గొప్ప నైతిక బలాన్నిస్తాయి. జైలులో వున్న నేతందరినీ విడుదల చేయాల్సి రావచ్చు. ఈ రాజీనామా పర్యవసానంగా కేంద్ర ప్రభుత్వం కొత్త ముఖ్యమంత్రిని, అదీ తెలంగాణ వ్యక్తిని నియమించవచ్చు. తానే ముందు రాజీనామా చేసి నిజలింగప్పకు పంపిస్తే ఆయన ఎలాగూ గవర్నర్‌కు పంపే అవకాశం వుండదు. పార్టీలో అంతర్గతంగా చర్చ జరిపి రాజీనామాకు సిద్ధపడ్డ మంత్రులను విరమింపచేయవచ్చునని భావించి కాసు బ్రహ్మానందరెడ్డి తన రాజీనామా డ్రామా మొదలుపెట్టాడు.

ముఖ్యమంత్రి డ్రామాను అర్థం చేసుకోని తెలంగాణ నేతలు ఇది ఉద్యమ విజయంగా భావించి పత్రికాప్రకటనలిచ్చారు. పత్రికలు తర్వాత ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఊహాగానాు చేశాయి. టీ.ఎన్‌.జీ.ఓ. అధ్యక్షుడు కె.ఆర్‌.ఆమోస్‌ ముఖ్యమంత్రి కుట్రను పసిగట్టి, ముఖ్యమంత్రి రాజీనామా చేసినా తెలంగాణ పోరాటం ఆగదని ప్రకటించారు. నిజానికి ముఖ్యమంత్రి రాజీనామా వార్త మధ్యాహ్నం వరకే తెంగాణ అంతటా తెలిసిపోయినా ఆందోళనకారులు దీనికి అంతగా ప్రాముఖ్యతనివ్వకుండా ఉద్యమాన్ని కొనసాగించారు.
కొనసాగిన ఆందోళన.. పలు చోట్ల కాల్పులు

నిజామాబాద్‌ జిల్లా బాన్స్‌వాడలో పోలీసు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడని పత్రికలు తెలిపాయి. తెలంగాణ అంతటా రైళ్ళకు, బస్సులకు అంతరాయం కలిగింది. చాలా ప్రదేశాల్లో పోస్టాఫీసులకు, హోటళ్ళకు నిప్పు పెట్టారు. హైదరాబాద్‌ రాష్ట్రపతి రోడ్డులో నాలుగు సార్లు పోలీసు కాల్పులు జరిపారు. ఆ రోడ్డు పొడవునా ఆందోళనకారులు వందల సంఖ్యలో గుమి కూడినారు. మార్కెట్‌ వీధి క్రాస్‌రోడ్‌, ఘాస్‌ మండి, క్రాస్‌రోడ్ల మధ్య ఆందోళన కారులపై జూన్‌ 27 సాయంత్రం 5.30 నిమిషాలకు పోలీసులు కాల్పులు జరిపారు. ముందుగా భాష్ఫవాయువు ప్రయోగించారు. కింగ్స్‌వే లక్ష్మీభవన్‌ హోటల్‌ ఎదుట పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. 10 సంవత్సరాల బాలునితో సహా ఎంతోమంది ఈ కాల్పుల్లో గాయపడ్డారు.

జులై 1న పార్లమెంటరీ బోర్డు సమావేశం – నిజలింగప్ప

రాజీనామా చేసిన బ్రహ్మానందరెడ్డిని కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిజలింగప్ప అభినందించారు. జులై ఒకటిన పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. బ్రహ్మానందరెడ్డికి నిజంగానే రాజీనామా చేయాలని వుంటే రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కే నేరుగా పంపించేవారు. నిజలింగప్పకు పంపించారంటేనే ఈ ఇద్దరి మధ్య ఏదో అవగాహన వుందని అనుకోవచ్చు. ముఖ్యమంత్రి రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి ముందే ఉప ప్రధాని మురార్జీదేశాయ్‌తో, నిజలింగప్పతో ఫోన్‌లో మాట్లాడి వారితో అవగాహనకు వచ్చి రాజీనామా చేశారు. తెలంగాణపై ఎన్నికుట్రలో!
తెలంగాణా మంత్రుల మూకుమ్మడి రాజీనామా

జూన్‌ 28 ఉదయం బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలోని మిగిలిన ఏడుగురు తెలంగాణ మంత్రులు వి.బి.రాజు, జె.వి.నర్సింగరావు, పి.వి.నరసింహారావు, కె.వి.నారాయణరెడ్డి, శీలం సిద్ధారెడ్డి, ఇబ్రహీం అలీ అన్సారీ, అరిగె రామస్వామి తమ రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి ఇచ్చారు. కొండా లక్ష్మణ్‌, గురుమూర్తి అంతకు ముందే రాజీనామా చేశారు. గురుమూర్తి రాజీనామా లేఖను వీటితో కలిపి ముఖ్యమంత్రి గవర్నర్‌కు అందించారు. గవర్నర్‌ ఈ లేఖలపై ఏం చేయాలో కూడా బ్రహ్మానందరెడ్డి చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగిన అనంతరం వారి రాజీనామాలు ఆమోదించడం జరుగుతుందని, అంతవరకు పదవులలో కొనసాగించవసిందిగా ముఖ్యమంత్రి సలహాను పురస్కరించుకొని గవర్నరు పై మంత్రులకు తెలియజేశారని ఆంధ్రప్రభ (29-6-1969) తెలిపింది.
మే 28న కూడా తెలంగాణ ఆందోళన కొనసాగింది. సికింద్రాబాద్‌లో కాల్పులు జరిపారు. మే 27న జరిపిన కాల్పుల్లో గాయపడిన ఒక వ్యక్తి మే 28న మరణించాడు. ఆ వ్యక్తి 19 ఏళ్ళ బాద్దూలాల్‌ హైదరాబాద్‌ డిప్యూటీ మేయర్‌ కాశీరామ్ కు మేనల్లుడు.

ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టం క్రింద డిటెయిన్‌ చేయబడిన డాక్టర్‌ చెన్నారెడ్డి, కొండాక్ష్మణ్‌ బాపూజీతో సహా ప్రజాసమితి నాయకులందరినీ విడుదల చేసే వరకు హర్తాళ్‌ కొనసాగించాలని సికింద్రాబాద్‌లోని వర్తకులు నిర్ణయించారు (ఆంధ్రజ్యోతి జూన్‌ 29, 1969).

మంత్రుల రాజీనామాలు బూటకం – ప్రజాసమితి

రాష్ట్ర మంత్రివర్గంలో మిగిలిన ఏడుగురు తెలంగాణా మంత్రులు నేడు రాజీనామా చేయడం బూటకం అని ప్రజా సమితి ప్రధానకార్యదర్శి పి.నర్సింగరావు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రే రాజీనామా చేసినపుడు వీటికేం విలువ ఉంటుందని ఆయన అన్నారు. పార్లమెంటరీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే, మంత్రులంతా రాజీనామా చేసినట్లేనని ఆయన వివరించారు. మంత్రుల ప్రకటన మొసలి కన్నీళ్ళు కార్చినట్లు ఉన్నదని ఆయన తెలిపారు. మంత్రులందరూ బాహాటంగా ప్రత్యేక తెలంగాణను బలపరచినప్పుడే వారిని ప్రజలు ప్రశంసించగలరని నర్సింగరావు ఉద్ఘాటించారు (ఆంధ్రజ్యోతి, 29 జూన్‌ 1969).

పరిణామాలు క్లుప్తంగా:
— ప్రత్యేక తెంగాణకు పూర్తి సమర్ధనను ఇస్తున్నట్లు నాగభూమిలోని హిందూ నాగరక్షదళ్‌ ఉపనాయకుడు యస్‌.బి.శాస్త్రి పేర్కొన్నారు.

— సి.పి.ఐ.(యం) పార్టీ జూన్‌ 29 నుంచి జూలై 6 వరకు విశాలాంధ్ర పరిరక్షణకు సమైక్యతా వారం జరపాలని ప్రజలకు పిలుపునిచ్చింది.

— డాక్టర్‌ చెన్నారెడ్డితో మొదలైన అరెస్టుల పర్వం జూన్‌ 30న కూడా కొనసాగింది. శాసనసభ్యులు బాగారెడ్డి, శివరావు షేట్కర్‌, ప్రజాసమితి కోశాధికారి రామకృష్ణ ధూత్‌, ఉస్మానియా విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు తదితరులను జూన్‌ 28, 29 తేదీల్లో అరెస్ట్‌ చేశారు.

— తెలంగాణ మంత్రుల రాజీనామాలను ఆమోదించే విషయంలో ముఖ్యమంత్రి సలహామేరకు గవర్నర్‌ వ్యవహరించిన తీరును ప్రజాసమితి తప్పు బట్టింది. రాజకీయ వేత్తలు (మంత్రులు) ప్రజలతో చెలగాటమాడటం ఆశ్చర్యకరంగా వున్నది అని పి.నర్సింగరావు ఒక ప్రక టనలో పేర్కొన్నారు.

— కొండా క్ష్మణ్‌ బాపూజీ అరెస్టయినందున తెలంగాణ పి.సి.సి. తాత్కాలిక అధ్యక్షులుగా రాజమల్లును ఎన్నుకొన్నారు.

— రాష్ట్రపతి పాలన విధించేవరకు ఆందోళన కొనసాగగలదని ప్రజాసమితి తాత్కాలిక అధ్యక్షుడు మదన్‌ మోహన్‌ అన్నారు. ఆయన ఢిల్లీలో వై.బి.చవాన్‌ను కలిసి ప్రజా సమితి నాయకుఢిల్లీను విడుదఢిల్లీ చేయవఢిల్లీసిందిగా కోరారు.

— రాజీనామా ఇచ్చిన తెలంగాణ మంత్రులపై సాంఘిక బహిష్కరణ విధించాలని ప్రజాసమితి నేతలు ఎస్‌. వెంకట్రామిరెడ్డి, లాయక్‌ అలీఖాన్‌, ఎమ్మెల్యే ఈశ్వరీబాయి ఒక సంయుక్త ప్రకటనలో జూన్‌ 29న విజ్ఞప్తి చేశారు.

— తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామా చేయడానికి కొందరు తెలంగాణ పార్లమెంటు సభ్యులు సంసిద్ధత వ్యక్తపరిచారని ప్రజాసమితి ఉపాధ్యక్షుడు, ఎం.పి. జి.ఎస్‌. మేల్కొటే అన్నారు.

— తెలంగాణ ప్రజాసమితి తాత్కాలిక అధ్యక్షుడు మదన్‌ మోహన్‌ను ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టం కింద జూలై 2న హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. విద్యార్థి నాయకులు ఆరీఫుద్దీన్‌, సురిరుద్దీన్‌ను కూడా అరెస్టు చేశారు. వీరందరిని రాజమండ్రి జైలుకు పంపించారు.

— మదన్‌ మోహన్‌ అరెస్టు కావడంతో ప్రజాసమితి తాత్కాలిక అధ్యక్షురాలుగా మాజీ మంత్రి శ్రీమతి టి.ఎన్‌. సదాలక్ష్మి ఎన్నికయ్యారు.

— ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని రాజీనామా చేసిన మంత్రులలో ఒకరైన కె.వి.నారాయణరెడ్డి కోరారు. మరో ప్రకటనలో శాసనసభ్యులు పి.నరసారెడ్డి (నిర్మల్‌), కమాలుద్దీన్‌ (జనగాం), పి.నరసింహారెడ్డి (సంగారెడ్డి), దేవ్‌షా (ఉట్నూర్‌), గద్దెన్న (మేడ్చల్‌) రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

(విశాలాంధ్ర, జూలై 3, 1969)
ముఖ్యమంత్రి రాజీనామా ఓ డ్రామా అని నిరూపిస్తున్న పార్లమెంటరీ బోర్డు

జులై 1వ తేదీన సమావేశమైన కాంగ్రెస్‌ పార్లమెంటరీ బోర్డు ఆ రోజు సమావేశంలో ముఖ్యమంత్రి రాజీనామాపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. మళ్ళీ 3వ తేదీన సమావేశమైన బోర్డు ముఖ్యమంత్రి రాజీనామా సమస్యపై రాష్ట్ర శాసనసభా పార్టీ నిర్ణయమే తుది నిర్ణయమని తేల్చింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిజలింగప్ప పత్రికా విలేఖరులతో మాట్లాడుతూ బ్రహ్మానందరెడ్డి రాజీనామాను ఆమోదించవలసింది కాంగ్రెస్‌ పార్లమెంటరీ బోర్డు కాదు. ఆయన్ని ఎన్నిక చేసిన రాష్ట్ర శాసనసభా పార్టీ అని అన్నారు. ఈ విషయమై శాసనసభా పార్టీ అభిప్రాయాలు తెలుసుకొనడానికి హైదరాబాద్‌ వెళ్ళవసిందిగా నిజలింగప్ప ఎం.పి.కామరాజ్‌ను నియమించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ సమావేశాన్ని జూలై 6న నిర్వహిస్తారు. ఈ పరిణామాన్ని బట్టి ముఖ్యమంత్రి రాజీనామా, ప్రజాసమితి నాయకులు అరెస్టు తర్వాత ఉధృతమైన తెలంగాణ ఉద్యమంపై నీళ్లు చల్లడానికి, తెలంగాణ మంత్రులు అసంతృప్తిని చల్లార్చడానికి తీసుకున్న నిర్ణయమే తప్ప నిజంగానే ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవాలనే ఆలోచన బ్రహ్మానందరెడ్డికి లేదని స్పష్టమవుతున్నది.

తెలంగాణ మంత్రుల రాజీనామాలనేమో గవర్నర్‌కు ఇచ్చి తన రాజీనామాను నిజలింగప్పకు పంపడం బ్రహ్మానందరెడ్డి ఉద్దేశ్యం బయటపెడుతున్నది. ముఖ్యమంత్రి రాజీనామాను స్వాగతించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు నిజలింగప్ప ఆ రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపించాలని కాసు బ్రహ్మానంద రెడ్డిని ఆదేశించవచ్చు. కానీ ఆయన ఆ పని చేయలేదు. హైదరాబాద్‌లో పర్యటించవద్దని కామరాజ్‌, నిజలింగప్పలను తెలంగాణా విద్యార్థి కార్యాచరణ సమితి హెచ్చరించింది. కాంగ్రెస్‌ పార్లమెంటరీ బోర్డు తెలంగాణ ప్రజలను మోసం చేసిందని కార్యాచరణ సమితి పేర్కొన్నది. రాష్ట్ర విభజనను కాంగ్రెస్‌ పార్లమెంటరీ బోర్డు వ్యతిరేకించడం కూడా విద్యార్థి నేతల ఆగ్రహానికి కారణం.

కాసుపై విశ్వాసాన్ని ప్రకటించిన శాసనసభా పక్షం

తెలంగాణ ప్రజలు భావిస్తున్నట్లే కాసు బ్రహ్మానందరెడ్డి రాజీనామా పచ్చి డ్రామా అని రుజువైంది. కాంగ్రెస్‌ పార్లమెంటరీ బోర్డు సూచనతో సభాపక్షం బ్రహ్మానందరెడ్డి నాయకత్వం పట్ల సంపూర్ణ విశ్వాసం ప్రకటించింది. ఈ సమావేశానికి 24 మంది తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ శాసనసభ్యులు హాజరు కాలేదు. వీరిలో 9 మంది జైళ్ళలోనే ఉన్నారు.

మామూలు పరిస్థితి ఏర్పడి, సులభంగా నాయకత్వాన్ని తెలంగాణ వారికి అప్పగించడానికి బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలనీ తీర్మానంలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కాసుపట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్న తీర్మానాన్ని తెలంగాణ మంత్రి పి.వి.నరసింహారావుచే ప్రవేశపెట్టించారు ఆంధ్రనేతలు. తీర్మానం, చర్చకన్న ముందే కాంగ్రెస్‌ అధ్యక్షుడు తెలంగాణ శాసనసభ్యులను బెదిరించే ధోరణిలో విచ్ఛిన్నకర ధోరణులకు ఎంత మాత్రం తావివ్వరాదని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రకటించిన విధానానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై తీవ్రమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని బెదిరించారు. ఈ సమావేశంలో తెలంగాణలో బ్రహ్మానందరెడ్డి అనుచరులైన శాసనసభ్యులు పురుషోత్తమరెడ్డి (నల్గొండ), వాసుదేవరావు (నల్గొండ), రోడామిస్త్రీ (ఎమ్మెల్యే), జి.సంజీవరెడ్డి (ఆదిలాబాద్‌), పి.రామచంద్రారెడ్డి (మెదక్‌) తదితరులు విశ్వాసాన్ని ప్రకటించిన వారిలో ఉన్నారు. సమావేశంలో పాల్గొన్న రీజనల్‌ కమిటీ అధ్యక్షుడు జె.చొక్కారావు తెలంగాణ ప్రజల కష్టాలను, ఇబ్బందులను సమావేశం దృష్టికి తెచ్చే తెంగాణ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలని తద్వారా రాష్ట్ర సమైక్యతను కాపాడాలని కోరారు. అసెంబ్లీ భవనం రెండవ అంతస్తులో ఈ సమావేశం జరుగుతున్నప్పుడు మొదటి అంతస్తులో జై తెలంగాణ, లేకే రహేంగే.. లేకే రహేంగే, తెలంగాణ లేకే రహేంగే, లాఠీ గోలీ ఖాయేంగే, తెలంగాణా లేంగే అంటూ కొందరు నినాదాలిచ్చారు. ఈ నినాదాలతో అసెంబ్లీ ప్రాంగణం మార్మోగింది. ‘జై తెంగాణ’ నినాదం చేయాలని నిజలింగప్పను ఈ ఆందోళనకారులు కోరగా ఆయన జై ‘భారత్‌’ అన్నారు.

రాష్ట్రపతిపాలన కోరిన 6 గురు ఎంపీలు

జూలై 6న లేక్‌ వ్యూ గెస్ట్‌హౌజ్‌లో నిజలింగప్ప, కామరాజ్‌ను కలిసిన ఎం.పి.లు డా.జి.ఎస్‌.మేల్కొటే, శ్రీమతి సంగం లక్ష్మీభాయి, జె.రామేశ్వరరావు, జె.రమాపతిరావు, ఎం.నారాయణరెడ్డి, ఆర్‌.సురేందర్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. కాంగ్రెస్‌ శాసనసభాపక్షం సమావేశం నిర్వహిస్తున్నందుకు నిరసనగా, తెలంగాణ నేతల అరెస్టుకు నిరసనగా ప్రజాసమితి జులై 7న బంద్‌ పిలుపునిచ్చింది. తెలంగాణ శాసనసభ్యుల్లో ఎవ్వరు కూడా ముఖ్యమంత్రి పదవిని తీసుకోకూడదని విద్యార్థి కార్యాచరణ సంఘం హెచ్చరించింది. జూలై 5 రాత్రి తెలంగాణకు చెందిన మంత్రి జె.వి.నర్సింగరావు ఇంటి వెనక గోడ ఆవలి నుంచి బాంబు విసిరారు. ప్రేలుడు వల్ల కిటికీ ముక్కలైంది. ఆ సమయంలో మంత్రి ఇంట్లోలేరు. పెద్దమనుషుల ఒప్పందంపై సంతకాలు చేసిన వారిలో ఈయన ఒకరు.తెలంగాణ జిల్లాల్లో, జంటనగరాల్లో ఆందోళనకారులు నిజలింగప్ప, కామరాజ్‌ దిష్టిబొమ్మకు నిప్పుపెట్టారు. జూలై 7న బంద్‌ పాటించాలని విద్యార్థి కార్యాచరణ సంఘం, పోటీ తెలంగాణా ప్రజా సమితి పిలుపునిచ్చినవి. ఈ బంద్‌ను విజయవంతం చేయాలని నగర మేయర్‌ శ్రీమతి కుముదినీ నాయక్‌, ఎం.పి. డా.జి.ఎస్‌. మేల్కొటే ఇతర ప్రముఖులు పిలుపునిచ్చారు.
(సశేషం)

Other Updates