ఆఫ్రికా ఖండంలోని టాంజానియాలోని కిలిమంజారో పర్వతంపై మెదక్ జిల్లా కే.జీ.బీ.వీ. విద్యార్థుల బృందం ఆగస్ట్ 14 నాడు భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. ఈ బృందంలో పర్వతారోహకులు శేఖర్ బాబు ఆధ్వర్యంలో కుమారి పూర్ణా మలావత్ నాయకత్వంలో 21 మంది విద్యార్థులతో కూడిన బృందం ఆగస్ట్ 8న కిలిమంజారోకు బయలుదేరి వెళ్ళింది. ఇందులో మెదక్ జిల్లాకు చెందిన కే.జీ.బీ.వీ. విద్యార్థినులు టి. మంజుల, జి. రమ్య, బి. అనసూయ, ఎం. నాగమణి, ఎల్. మౌనిక, జి. నర్సమ్మ(11 సంవత్సరాల11 నెలల చిన్నారి), ఎల్.బూలి. జె. కవిత, ఇ. జ్యోతి ఉన్నారు. వీరితోపాటు వెల్దుర్తి పీఈటి చిలుక కమల కూడా ఉన్నారు. మిగిలిన 11 మందిలో నలుగురు సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు, ఇద్దరు గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులు ఉండగా, గైడ్ టి. రాజి, అర్జున అవార్డు గ్రహీత బి. నేగీ, పద్మశ్రీ అవార్డు గ్రహీత జి. అనితాదేవి, ఆదిలాబాద్ అడిషనల్ ఎస్ పి జి ఆర్ రాధిక, అర్జున అవార్డు గ్రహీత బి. శేఖర్‌బాబు ఉన్నారు.
వీరందరూ ఆగస్ట్ 10న పర్వతారోహణను ప్రారంభించి, కిలిమంజారో పర్వతాన్ని ఆగస్ట్ 14 ఉదయం చేరుకున్నారు. అక్కడ 20 ఫీట్ల పొడవైన భారత జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. కాగా ఈ బృందంలోని 17 మంది పర్వత శిఖరాగ్రంవరకు కూడా చేరుకుని వచ్చారు. ఈ పర్వతారోహక బృందం ఆగస్ట్ 18న హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నది.
ఈ బృందానికి శంషాబాద్‌లో ఘనమైన స్వాగతం లభించింది. వీరిని స్వాగతించిన వారిలో రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్, సాంఘిక సంక్షేమ శాఖ, కస్తూర్బా పాఠశాల విద్యార్థులు ఉన్నారు. ఈ బృందానికి మెదక్ జిల్లా ప్రజలు, విద్యార్థులు సంగారెడ్డి చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు భారీ మానవ హారంతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో బృందం సభ్యులందరినీ కలెక్టర్ రోనాల్డ్‌రాస్, జె సి వెంకట్రామిరెడ్డి ఘనంగా సన్మానించారు.