‘‘అందకత్తెల సహచర్యము కొరకు చిత్రలేఖన విద్యనభ్యసిస్తా’’నని
గాలిబ్ అంతటి మహాకవి వ్రాసుకున్నాడు. కాని తోట వైకుంఠం మాత్రం అందుకోసమే చిత్రలేఖనం నేర్చుకోలేదట. అయినా ఆయన చిత్రాలెక్కడ ప్రదర్శితమైనా వాటిలో భామలే కన్పిస్తారు.
శ్రీ టి. ఉడయవర్లు
అయితే అవన్నీ తెలంగాణ పల్లెపట్టులలో కాయకష్టంచేసి బతికే మహిళల జీవన చిత్రాలు. వారి బాధల గాధలే ఆయన చిత్రాలకు ఆధారం. వారి శారీరక సౌంద ర్యాన్నేకాదు వారు పుట్టిపెరిగిన నేల ప్రభావం ఆ గ్రామీణ స్త్రీలపై ఎలా పడిరదో వైకుంఠం చిత్రాలు చూస్తే స్పష్టమవుతుంది. ఒక్కొక్క సూక్ష్మాంశాన్ని తేటతెల్లం చేయడానికి ఆయన కుంచెతో చేసిన పనితనం, పోయిన పోకడలు ప్రశంసనీయమైనవి. ఎర్రని, పసుపుపచ్చని, ఆకుపచ్చని ప్రాథమిక వర్ణాలను తీసుకుని భావోద్వేగంతో ఆయన చిత్రించిన పల్లీయుల చిత్రాల మల్లెల వాసనలు కళాహృదయులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఒక్కొక్క చిత్రాన్ని నాలుగైదు రోజులపాటు విశ్రాంతిలేకుండా వేయగల సమర్థుడు వైకుంఠం.
గ్రామీణ జీవితాన్ని, అందులోని సొగసులను, సూక్ష్మాలను అరచేతిలో చూపే వైకుంఠం ప్రయత్నం అనితరసాధ్యమైంది. అందుకే ఆయన వర్ధమాన చిత్రకళా రంగంలో, మూఠాల వైకుంఠపాళితో సంబంధంలేకుండా సాధనమనే నిచ్చెనకే సదా కట్టుబడి ఉంటాడు. ఆయన చిత్రించిన ఎన్నో సృజనాత్మక చిత్రాలకు అవార్డులు పొందాడు. అన్నింటిలోకి భారత కళాభవన్ ద్వైవార్షిక పోటీలలో జాతీయ అవార్డు పొందడం శిఖరప్రాయమైనది.
వేములవాడలో ఏడవ తరగతి చదువుతున్న రోజులనుంచి చిత్రకళ అంటే వైకుంఠంకు ప్రాణం. చిన్ననాటి గురువు రామాచారి ప్రేరణలో డ్రాయింగ్స్ వేయడంలో ఎంతో కృషి చేశాడు. తొలి రోజులలో వ్యక్తుల స్వభావాలు ద్యోతకమయ్యే చిత్రాలకంటే, ప్రకృతి చిత్రాలు వేయడంలోనే ఎక్కువ మక్కువ చూపాడు. డ్రాయింగ్‌లో లోయర్, హయ్యర్ పరీక్షలు ఇచ్చి కృతార్థుడయ్యాడు. సిరిసిల్లలో పదవ తరగతి చదివి పరీక్ష వ్రాయకుండానే అర్థాంతరంగా మానివేశాడు. స్నేహితుల ప్రోద్భలంతో తండ్రిని ఒప్పించి హైదరాబాద్‌వచ్చి లలితకళల కళాశాలలో చేరాడు. చిత్రకళను అభ్యసించాడు. ఈలోగా మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, చిత్రకళలోనూ డిప్లొమా తీసుకున్నాడు.
తాను కళాశాలలో విద్యార్థిగా ఉన్న కాలం చిత్రకళ నేర్చుకోవాలనే కుతూహలం గలవారికి అనువుగా ఉండేది. గత స్మృతులను ఆయన హాయిగా నెమరవేసుకుంటాడు. తనకు సీనియర్లుగా ప్రస్తుతం దేశ చిత్రకళారంగంలో ప్రథమశ్రేణిలో ఉన్న లక్ష్మాగౌడ్, సూర్యప్రకాశ్ ఉండేవారని, అధ్యాపకులుగా సృజనాత్మక చిత్రకారులైన`కొండపల్లి శేషగిరిరావు, విద్యాభూషణ్, వడ్లమాని మధుసూధనరావు, సయ్యద్ బిన్ మహ్మద్‌లు ఉండేవారు. ఆ రోజుల్లో చిత్రకళను అభ్యసించాలనుకునే ప్రతి ఒక్కరూ వీరందరినీ చూసి ప్రేరణ పొందేవారు.
వారిలాగా తానుసైతం చిత్రకళారంగంలో తనదైన ముద్రను వేయాలని కలలుగనేవారు. తత్ఫలితంగా విద్యార్థులైన చిత్ర కారులు ఎంతగానో పాటుపడేవారు. రామప్ప, వేయిస్తంభా లగుడి, లేపాక్షి, అజంతా, ఎల్లోరావంటి కళాక్షేత్రాలకు వెళ్ళి వందలాది స్కెచ్‌లు వేస్తూ తర్ఫీదు పొందేవారు. తమదైన బాణిని రూపొందించుకోవడానికి చిత్రకళను నిరంతరం అధ్యయనం చేసేవారు. చిత్రకారులంతా ఎక్కడ కలిసినా కళగురించే మాట్లాడుకునేవారు.
మంగళంపల్లి బాలమురళీకృష్ణ వంటి వాగ్గేయకారుల కచేరీలువిని, బిస్మిల్లాఖాన్‌వంటి విద్వాంసుల షహనాయి ఆస్వాదించి తమ చిత్రలేఖనానికి వస్తువును ఎంచుకునేవారమని ఆయన చెబుతారు. ఒకనాటి జ్ఞాపకాలను ఆయన హృద్యంగా వివరిస్తూ తనపై బిస్మిల్లాఖాన్ వేసిన ప్రభావంవల్లనే ‘సంగీతం’ శీర్షికన సుమారు నలభై చిత్రాలదాకా ఆయన గీయగలిగారట. ఇందుకు దోహదం చేసింది బరోడా జీవితమంటారు.
చిత్రకళలో డిప్లొమా తీసుకున్న తర్వాత బరోడా వెళ్ళి సుప్రసిద్ధ చిత్రకారుడు, ఆచార్యుడు సుబ్రహ్మణ్యం చెంత శిక్షణ పొందాడు. ఆయన వైకుంఠం ఆలోచనా ధోరణిని ఆసాంతం మార్చివేశాడు.
వైకుంఠం చిత్రకళా జీవితం తొలినాళ్ళలో గుర్రం వస్తువుగా తీసుకుని అయిదారు చిత్రాలు వేశాడు. ఆ తర్వాత దాదాపు నలభైదాకా ప్రకృతి చిత్రాలు గీశాడు. అరవై నైరూప్య చిత్రాలను కూడా రూపొందించాడు. ఆ తర్వాత ‘సంగీతం’ వస్తువైనది. సొంతబాణి అలవాటైంది. ఆయన చిత్రాలలో వైకుంఠం సంతకంలా తోచే రేఖలు, రంగులు, వాటి సమ్మేళనం కనిపించడం ప్రారంభ మైంది. ఆ తర్వాత ‘తల్లీ`బిడ్డ’ శీర్షికన అపురూప మైన చిత్రాలు వేశాడు. అప్పటికి ఆయన కన్నతల్లి మంచాన పడడంతో తమ ఊరు కరీంనగర్ జిల్లాలోని బూరుగుపల్లి వెళ్ళిపోయి అమ్మసేవలో గడిపాడు. సతతం ఆమె ప్రక్కనే ఉంటూ ఆమె జ్ఞాపకాలలో ఒకసారి వ్యష్టిచిత్రకళాప్రదర్శన ఏర్పాటు చేయగలిగిన చిత్రాలు వేశాడు.
ఆ తర్వాత కాలంలో సుప్రసిద్ధ సినీ దర్శకుడు బి. నర్సింగరావు నిర్మించిన ‘మా భూమి’ చిత్రానికి కళాదర్శకత్వం నిర్వహించాడు. పిదప నర్సింగరావు దర్శకత్వంలోనే ఒక చిత్రాకారుడి జీవితానికి అద్దంపట్టిన ‘రంగులకల’ చిత్రానికి కళాదర్శకత్వం నెరపారు. అందులో చిత్రకళానాయకుడు గీసే విప్లవభావాలు కలిగిన చిత్రాలన్నింటికి వైకుంఠం కుంచె ప్రాణం పోసింది. ఆ చిత్రం వైకుంఠం చిత్రకళకు విశ్వరూపంలా రూపొందింది. ఆ తర్వాత నర్సింగరావు దర్శకత్వంలో ఒకనాటి దొరతనాన్ని, దాసీ వ్యవస్థను ప్రతిబింబిస్తూ తీసిన ‘‘దాసి’’ చిత్రానికి ఈయన కళాదర్శకత్వం వహించి, జాతీయస్థాయిలో ఉత్తమకళా దర్శకుడుగా అవార్డును పొందాడు.
అనంతరం పశువులకాపరి జీవితాన్ని ఆధారంగా చేసుకుని నర్సింగరావు నిర్మించ సంకల్పించిన చిత్రానికిగాను గ్రామీణ స్త్రీల వేషభాషలు, కట్టుబొట్టు, ఆచార వ్యవహారాలు అధ్యయనం చేయడానికి 1983`84లో వైకుంఠం పల్లెపట్టులకు వెళ్ళి వేసుకున్న సుమారు మూడువేల స్కెచ్‌లు, డ్రాయింగ్‌లు ఆయన గీతనే మార్చివేశాయి. గ్రామీణ స్త్రీలు, వారి సొగసు, వారి ముక్కుపుడకలు, ఇతర ఆభరణాలు, ధరించే పద్ధతి, చీరకట్టే విధానం, వారు కూర్చుండే పద్ధతులు, గంపలు నెత్తిన ఎత్తుకునే వైఖరి, కల్లుకుండలు ముందు పెట్టుకుని విక్రయించే తీరుతెన్నులు` సర్వం ఈనాడు వైకుంఠం చిత్రాలలో కొట్టవచ్చే రంగులలో చోటుచేసుకుని జీవం ఉట్టిపడుతున్నాయి. అయ్యగార్లు, అమ్మ గార్లు కూడా విశేషంగా ఆయన చిత్రాల్లో ఒదిగిపోయారు.
అంతకుముందు ఆయన గీసిన ఒక్కొక్క చిత్రంలో ఒక్కొక్క వనిత, లేదా గ్రామీణుడు మాత్రమే ఉండేవారు. ప్రస్తుతం ఆయన చిత్రాలలో ఒకరికిమించి, బృందాలుగాను కనిపిస్తున్నారు. పల్లీయుల సముదాయాలు వైకుంఠం గీతలో, శైలిలో ఉన్నది ఉన్నట్లుగా, వినూత్నంగా దర్శనమిస్తున్నారు.
తన గీతలపై ఏ చిత్రకారుడి ప్రభావంలేదని వైకుంఠం చెబుతారు. చిత్రకారుడుగా తనకొక వ్యక్తిత్వాన్ని నిర్మించు కోవ డానికి నిరంతర సాధనే కారణమన్నారు. పికాసో తర్వాత తిరిగి అంతటి చిత్రకారుడు రాలేదు. కాబట్టే, ఈనాటికీ మనం పికాసోను గుర్తుపెట్టుకున్నాం. అంతదాకా ఎందుకు`దామెర్ల రామారావు వాన చిత్రకళలో ఆధునికత చూపారు. అందుకే ఆయనను మరవలేము. పైడిరాజు, కె.రాజయ్యలాంటి చిత్ర కారులు జానపదబాణీలో వేసిన చిత్రాలు ఒకానొక ప్రత్యేకత కలిగినవి. తెలంగాణకు చెందిన పి.టి.రెడ్డి, కొండపల్లి శేషగిరి రావు, లక్ష్మాగౌడ్‌లాంటి చిత్రకారులు వేసిన చిత్రాలు వేటికవేసాటి. అట్లాగే ‘‘ఏ చిత్రకారుడైనా ఒక కొత్తకోణంనుంచి తన రచనలు అందిస్తే రసజ్ఞలోకం ఆనందిస్తుంది. చిత్రకారుడు రాణిస్తాడు’’ అన్నారు. తన అనుభవసారంతో తోట వైకుంఠం.