aethiఇంధ్రజాలం వస్తువుగా తీసుకుని, తనకుంచెతో, కలంతో రంగురంగుల ఇంధ్రధనుస్సును సృష్టించి చూపరులను, మరీ ముఖ్యంగా బాలలను మంత్ర ముగ్ధులను చేస్తున్న చిత్రాలను రూపకల్పన చేసిన సృజనాత్మక చిత్రకారుడు జి.రంగారెడ్డి 

టి. ఉడయవర్లు

హైస్కూల్ చదువు పూర్తికాగానే 1968లో వృత్తి వెతుక్కొని అప్పటి ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీలో దినసరి వేతనంపై చేరిన జి.రంగారెడ్డి పుక్కడి చిత్ర – శిల్పకళలకు సంబంధించిన వాతావరణం, ఉన్నత కళాకారుల సహచర్యం వల్ల భ్రమరకీటక న్యాయానికిలోనై ఆయన చిత్రకారుడైపోయాడు. ఆయనలో గూడుకట్టుకొని వున్న ప్రవృత్తి మెల్లమెల్లగా పురివిప్పి డ్రాయింగ్‌, పెయింటింగ్‌లలో సాధన చేయడానికి దోహదం చేసింది. కార్యాలయం వేళల అనంతరం అకాడమీలోనే గూర్చుని బొమ్మలు వేయడం ఆయనకు నిత్యకృత్యమైంది. చేసేది ఉద్యోగమైనా వేళలు, సెలవుదినాలు అంటూ ఏమీ లేకుండా లలితకళా అకాడమీ రంగారెడ్డి రంగస్థలమైపోయింది. ఆయనలోని కళాకారుణ్ణి గుర్తించిన రాష్ట్ర లలితకళాఅకాడమీ స్కాలర్‌షిప్‌ ఇచ్చి సుప్రసిద్ధ చిత్రకారుడు వడ్లమాని మధుసూదనరావు చెంత ఆయన శిక్షణ పొందడానికి అవకాశం కల్పించింది.

క్రమంగా పలుచోట్ల నిర్వహించే చిత్రకళా పోటీ ప్రదర్శనలకు రాష్ట్రంలో, రాష్ట్రేతర ప్రాంతాలకు తన చిత్రాలను పంపించడం రంగారెడ్డికి అలవాటైపోయింది. ఈ క్రమంలో గత నాలుగున్నర దశాబ్దాల కాలంలో ఆయన గీసిన చిత్రాలకు డజనుకుపైగా అవార్డులు అందుకున్నారు.

తొలి రోజులలో రంగులతో ప్రకృతి చిత్రాలు గీసిన రంగారెడ్డి ఆ తర్వాత మానవాకారాలను ఎంపకి చేసుకున్నారు. పిదిప డ్రాయింగ్స్‌ వేయడానికి ఉపక్రమించాడు. రంగుల్లో డ్రాయింగ్స్‌ వేశాడు. అనంతరం ఇంద్రజాలం వస్తువుగా తీసుకొని ఎన్నెన్నో చిత్రాలు గీశాడు. క్యాన్వాస్‌పైన, ఆర్ట్‌ పేపర్‌పైన మాత్రమే కాకుండా కొంతకాలం గ్రాఫిక్స్‌ ప్రక్రియ చేపట్టినా ఇంద్రజాలమే ఆయన వస్తువు. ఆయన కన్న స్వప్నాలు, సుందర తీరాలలోని ఇంద్రజాల లోకంలోకి ప్రేక్షకులను తీసుకుపోతాడు. నిజానికి ప్రస్తుతం ఇంద్రజాలం ఆయన సంతకమైపోయింది.

అందుకే చిత్రకళలో ఆయన గురువు, హైదరాబాద్‌లోని ఫైన్‌ ఆర్ట్స్ కళాశాలలో ఆచార్యుడుగా పని చేసిన సుప్రసిద్ద చిత్రకారుడు వడ్లవంచి మధుసూదనరావు తనదైన పద్ధతిలో సృష్టించిన అద్భుతమైన ఫాంటసీ-ఇంద్రజాల ప్రపంచంలోకి ప్రేక్షకులను రంగారెడ్డి తీసుకువెళతాడు. ఆయన గీసిన చిత్రాలు మనను ఆనంద లోకాల్లో విహరింపజేస్తాయి” అన్నారు.

మరో సుప్రసిద్ధ చిత్రకారుడు, బరోడా ఎం.ఎస్‌. విశ్వవిద్యాలయం డీన్‌గా వ్యవహరించిన ఆచార్యుడు ఎన్‌.ఎస్‌. బిందే. ఈ వయస్సులోనూ, ఒకప్పటి బాల్యం నాటి ఫాంటసీని రంగారెడ్డి తన చిత్రాలలో చూపుతున్నాడు. ఇది ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఒక వంక డ్రాయింగ్‌ మనుషులు, ఇతర ప్రాణికోటిని ప్రతిబింబిస్తూ, మరోవంక వాటికి తగిన డిజైన్లు పొందుపరుస్తూ సమతూకాన్ని పాటించడంలో రంగారెడ్డి దిట్ట.” అని కొనియాడారు. ఇలా ఇంకా ఎందరో రంగారెడ్డిపై ఎన్నెన్నో ప్రశంసల వర్షం కురిపించారు.

1968 నుంచి రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన పలు సమష్టి చిత్రకళాప్రదర్శనలు, చిత్రకారుల శిబిరాల్లో పాల్గొన్న రంగారెడ్డి వ్యష్టి చిత్రకళా ప్రదర్శనకు అదే యేడాది శ్రీకారం చుట్టారు. 1969, 71, 72, 76, 82 లలో వరుసగా రాష్ట్ర లలితకళా అకాడమీ తాలూకూ కళాభవన్‌లో చిత్రకళాప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 1983లో మద్రాసు రాష్ట్ర మ్యూజియంలో, 2008లో బెంగళూరులోని డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ స్టేడియంలో, 2013లో హైదరాబాద్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్‌ గ్యాలరీలో నిర్వహించారు. 1985లో అమెరికాలో నిర్వహించిన ”ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా” సందర్భంగా ఏర్పాటు చేసిన ”సమకాలీన భారతీయ ప్రింట్‌ మేకింగ్‌” ప్రదర్శనలోనూ వీరి చిత్రం ప్రేక్షకులను ఆకర్షించింది.

తొలుత 1968లోనే హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీ వారి అవార్డు వీరి చిత్రం గెలుచుకున్నది. ఆ తర్వాత ఆంధ్రా, అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ (విజయవాడ), లలితకళాసమితి (సిద్ధిపేట), చిత్రకళా పరిషత్‌ (విశాఖపట్నం), ఆంధ్రప్రదేశ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్టిస్ట్‌ (హైదరాబాద్‌) భారతకళాపరిషత్‌ (హైదరాబాద్‌), అవార్డులు పొందారు. పూర్వ ఆంధ్రప్రదేశ్‌ లలితకళా అకాడమీ అవార్డులు రెండు పర్యాయాలు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డులు మూడు సార్లు వీరు గెలుచుకున్నారు. ఆల్‌ ఇండియా ఫైన్‌ ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌ కౌన్సిల్‌ (న్యూ ఢిల్లీ) అవార్డు కూడా వీరికి వచ్చింది. కేంద్ర లలితకళా అకాడమీ (న్యూ ఢిల్లీ) పోటీ ప్రదర్శనకు వీరిచిత్రమొకసారి ఎంపికైంది.

వీరి చిత్రాలను కేంద్ర లలితకళా అకాడమీ, ఆంధ్రప్రదేశ్‌ లలితకళా అకాడమీ, సాలార్‌జంగ్‌ మ్యూజియం, హైదరాబాద్‌ రాష్ట్ర మ్యూజియం, ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడమీ, లలితకళా అకాడమీ మద్రాసు ప్రాంతీయ కేంద్రం, నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మాడ్రన్‌ ఆర్ట్‌ (న్యూ ఢిల్లీ), పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సరళ ఆర్ట్‌ సెంటర్‌ (మద్రాసు) మాత్రమే కాకుండా జగదీష్మిత్తల్, పి.టి. రెడ్డిలాంటి ప్రముఖ చిత్రకారులు నందిని వెంకట రామన్ (అమెరికా), అరవింద టక్కర్ (అమెరికా) లాంటి చిత్రకళాభిమానులు వీరి చిత్రాలను సేకరించారు.

జి.కిష్టారెడ్డి – రంగమ్మ దంపతులకు 1945లో నల్లగొండ జిల్లాలోని కుగ్రామం దోనకల్లులో జన్మించిన రంగారెడ్డి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సూపరింటెండెంట్‌గా వృత్తిరిత్యా 2003లో పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం ఆ విశ్వవిద్యాలయంలోనే మ్యూజియంలో కొనసాగుతూ సేవలందిస్తూ, మరోవంక సరికొత్త చిత్రాలకు రూపులు దిద్దుతున్నారు.

Other Updates