kuravi-templeమహబూబాబాద్‌ జిల్లా కురవి వీరభద్రస్వామికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొక్కు చెల్లించుకున్నారు. ఫిబ్రవరి 24న పర్వదినమైన మహాశివరాత్రి రోజు కేసీఆర్‌ కురవి వెళ్ళి బంగారు కోరమీసాలను, పట్టు వస్త్రాలను కూడా స్వామికి అందచేశారు. భద్రకాళి అమ్మవారికి పట్టు చీరను సమర్పించారు. కేసీఆర్‌కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన అనంతరం వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజాదికాలు ముగిసిన అనంతరం అర్చకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పట్టు వస్త్రాలతో సత్కరించారు. డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ కురవి వీరభద్రస్వామి చిత్రపటాన్ని సీఎంకు బహూకరించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. త్వరలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఎంపీ సీతారాంనాయక్‌, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, దేవాదాయశాఖ అధికారులు వచ్చి ఆలయాన్ని పరిశీలిస్తారని తెలిపారు.

సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పురుషులకు, మహిళలకు వేరు వేరు స్నానఘట్టాలను ఏర్పాటు చేయాలని సూచించారు. స్వామివారి ఆశీస్సులతో గోదావరి నదిపై నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు త్వరగా పూర్తి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆ ప్రాజెక్టు పూర్తవుతే మహబూబాబాద్‌ జిల్లా సస్యశ్యామలమవుతుందని తెలిపారు. డోర్నకల్‌, మరిపెడ మండలాలకు రూ. కోటి చొప్పున, మిగతా మండలాలకు రూ. 50 లక్షల చొప్పున నియోజకవర్గంలోని మండలాలకు అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

అదేవిధంగా డోర్నకల్‌ నియోజకవర్గంలోని 77 గ్రామపంచాయతీలకు ఒక్కో దానికి రూ. 25 లక్షలు గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయశాఖా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పర్యాటకశాఖా మంత్రి అజ్మీరా చందూలాల్‌, ఎంపీలు సీతారాంనాయక్‌, పసునూరి దయాకర్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌లతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

Other Updates