paleruఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో దాదాపు 60వేల ఎకరాలకు సాగునీరు, ఆ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలు, గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన భక్త రామదాసు ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 11 నెలల్లో పూర్తి చేసి చరిత్ర సృష్టించింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కనీవినీ ఎరుగని వేగంతో, అత్యంత నిబద్ధతతో చేపట్టి, పూర్తి చేసిన ప్రాజెక్టు భక్త రామదాసు ప్రాజెక్టు, జనవరి 31వ తేదీన భక్త రామదాసు జయంతి రోజున ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కూసుమంచి మండలం ఎర్రగడ్డ తండావద్ద ప్రారంభించి, జాతికి అంకితం చేశారు.

నిర్దేశించిన గడువుకన్నా ముందుగానే ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా యావత్‌ దేశంలోనే ప్రభుత్వం రికార్డు సృష్టించినట్లయింది. కరవుతో విలవిల్లాడుతున్న పాలేరు నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలు, గ్రామాలు భక్త రామదాసు ప్రాజెక్టువల్ల జలసిిరితో కళకళలాడనున్నాయి. విద్యుత్‌ ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ పథకం మాదిరిగానే నీటిపారుదల ప్రాజెక్టులను ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తుండడంతో కేవలం ఈ రెండున్నర సంవత్సరాలలో 19 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీరు సమకూరింది. నీటిపారుదల ప్రాజెక్టులంటేనే ఏళ్ల తరబడి నిర్మాణంలో ఉండడం, పదేపదే గడువు పొడిగించడం ఆనవాయితీ. అయితే, భక్త రామదాసు ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిన 11 నెలల్లో పూర్తయి, నీటి విడుదలకు సిద్ధం కావడం సంభ్రమాశ్చర్యాలు కలిగించక మానదు. 2016, ఫిబ్రవరి 16న ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలోని పాలేరులో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా, 2017 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే గడువుకు 2 నెలల ముందుగానే ప్రాజెక్టు పూర్తి అయింది. దేశంలో అత్యంత వేగంగా పూర్తయిన ప్రాజెక్టుల్లో ఇదొకటి, పాలేరు శాసనసభా నియోజకవర్గంలోని కరవుపీడిత తిరుమలాయపాలెం (14గ్రామాలు), కూసుమంచి (13 గ్రామాలు), నేలకొండపల్లి (1 గ్రామం), ముదిగొండ (3 గ్రామాలు), ఖమ్మం గ్రామీణ (12 గ్రామాలు) మండలాలేకాక, మహబూబాబాద్‌ జిల్లాలోని డోర్నకల్‌ మండలంలోని (2 గ్రామాలు) మొత్తం 60,000 ఎకరాలకు భక్త రామదాసు ప్రాజెక్టు సాగునీరు, తాగునీరు అందిస్తుంది. ఈ పథకంలో పాలేరు వద్దనున్న నాగార్జునసాగర్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి 5.5 టీఎంసీల నీటిని 125.7 మీటర్ల ఎత్తునుంచి 187 మీటర్ల ఎత్తులోకి డీబీఎం-60 (శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రెండవ దశ) కు పంపింగ్‌చేసి, 45వ కి.మీ. వద్ద విడుదల చేస్తారు.

ఈ ప్రాజెక్టుకోసం ప్రభుత్వం ఇ-ప్రొక్యూర్‌మెంట్‌ ప్రాతిపదికన టెండర్లు ఆహ్వానించగా, మెగా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు కాంట్రాక్టు దక్కింది. జీవో నెం. 123 ద్వారా 128.70 ఎకరాల భూసేకరణను అతి స్వల్పకాలంలో ప్రభుత్వం పూర్తి చేసింది. రైతులకు నష్టపరిహారం తక్షణమే అందించడం జరిగింది. దాంతో రైతులు కూడా ప్రాజెక్టుకు పూర్తి సహకారం అందించారు. దాంతో 16.50 కి.మీ. పొడవుగల ప్రధాన పైప్‌లైన్‌ నిర్మాణం రికార్డు సమయంలో పూర్తయింది. ఇందిరాసాగర్‌ ఎత్తిపోతల పథకం కోసం తెప్పించి వృధాగా ఉంచిన రెండు మోటారు పంప్‌లు, తదితర పరికరాలను ఈ ప్రాజెక్టుకు ఉపయోగించారు. ఇతర సివిల్‌ పనులు, మోటార్లు, పైప్‌లైన్లకోసం రూ. 90.87 కోట్లు ఖర్చు చేశారు.

ఈ ప్రాజెక్టుకు విద్యుత్‌ సరఫరా చేయడానికిగాను సంబంధిత పనులను కూడా భక్త రామదాసు ప్రాజెక్టు పనులతోపాటే ప్రభుత్వం చేపట్టింది. కూసుమంచి పవర్‌హౌస్‌ వరకు 7.83 కి.మీ. హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్లు వేయాలని, పంప్‌హౌస్‌ వద్ద 132/11 కె.వి. సబ్‌స్టేషన్‌ నిర్మించాలని తలపెట్టిన తెలంగాణ ట్రాన్స్‌కో 100 రోజుల్లో రికార్డు సమయంలో వాటిని పూర్తి చేసింది.

గోదావరి, కృష్ణా నదులవల్ల ఖమ్మం జిల్లాలో సాగునీటి సౌకర్యం ఉన్నప్పటికీ, పాలేరు నియోజకవర్గంలోని మండలాలు మాత్రం నీటి కరవును ఎదుర్కొంటూ

ఉండేవి. జిల్లా మొత్తం పంటలతో కళకళలాడుతుంటే, ఈ మండలాలు మెట్ట భూములుగా మారిపోయాయి. వీటికి సాగునీరు అందించడానికి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు రెండవ దశకింద కాలువలు తవ్వారు. కాని వరంగల్‌ జిల్లా సరిహద్దులు దాటి నీరు ఎప్పుడూ ఇక్కడకు చేరుకోలేదు. పాలేరు దుస్థితిని గమనించిన ముఖ్యమంత్రి ఈ మండలాలకు నీరు అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. పాలేరు రిజర్వాయర్‌ నుంచి నీటిని ఎత్తిపోసి, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాలువల్లోకి పంపిగ్‌ చేయాలని ప్రతిపాదన రాగా, ముఖ్యమంత్రి వెంటనే ఆ పనులకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేశారు. నిధులు కూడా వెంటనే మంజూరు చేశారు. ఆయనే స్వయంగా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి, నిర్మాణ పనులను నిరంతరం సమీక్షించారు. అదే సమయంలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు కాలువ మరమ్మతు పనులను కూడా చేపట్టారు. కాలువల ద్వారా సాగునీటిని అందించడంతోపాటు, చెరువులను కూడా నింపాలని సంకల్పించారు. దాంతో భూగర్భ జలాలు కూడా పెరగడమేకాక, పాలేరు ప్రాంతం మొత్తం రూపురేఖలు మారనున్నది.

జనవరి 31న ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి సూర్యాపేట మీదుగా ఖమ్మంజిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామానికి చేరుకున్నారు. పాలేరు జలాశయం వద్ద నిర్మిస్తున్న మిషన్‌ భగీరథ ఇన్‌టేక్‌వెల్‌ పనులను పరిశీలించి, తరువాత కూసుమంచి మండలంలోని ఎర్రగడ్డ తండాకు చేరుకున్నారు. అక్కడ భక్త రామదాసు ఎత్తిపోతల పథకానికి చెందిన రెండు మోటార్లకు స్విచ్‌ ఆన్‌ చేశారు. అనంతరం తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్‌ తండాకు చేరుకుని అక్కడ కృష్ణమ్మతల్లికి పూజలు చేశారు. తరువాత మాదిరిపురం సమీపంలోని ఓ ఎత్తయిన గుట్ట ఎక్కి మిషన్‌ భగీరథ పనులను పరిశీలించారు. తరువాత తిరమలాయపాలెం చేరుకుని బహిరంగసభలో ప్రసంగించారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెంలోని ఎదళ్లగుట్ట సమీపంలో చేపట్టిన మిషన్‌ భగీరథ పనులను ముఖ్యమంత్రి మార్గమధ్యంలో పరిశీలించారు.

ముఖ్యమంత్రితోపాటు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్‌, తుమ్మల నాగేశ్వరరావు, టి. హరీశ్‌రావు, 25మందికి పైగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ప్రాజెక్టులు కట్టి తీరుతాం… కోటి ఎకరాలకు నీళ్లిస్తం…

భక్త రామదాసు ఎత్తిపోతల ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆ కార్యక్రమం అనంతరం తిరుమలాయపాలెంలో జరిగిన బహిరంగసభలో భావోద్వేగంతో ప్రసంగిస్తూ, తన ప్రతి రక్తపుబొట్టును రంగరించి అయినా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి, కోటి ఎకరాలను నీళ్లిస్తామని ప్రకటించారు. ఇదే వేగంతో ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, తెలంగాణలో కోటి ఎకరాలకు నీరు అందించేవరకూ విశ్రమించేది లేదని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.

ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే క్లుప్తంగా..

కష్టపడి రాష్ట్రాన్ని సాధించుకున్నం. ఎన్నో అవమానాలు, విమర్శలు, వ్యక్తిగత నిందలు భరించి, ఒక సమయంలో నా ప్రాణాలు కూడా ఫణంగా పెట్టి తెలంగాణ సాధించుకున్నం. ఇప్పుడు కూడా ‘తెలంగాణ వచ్చింది. కానీ, ప్రజలకేం రాలేదు’, అంటున్నది. ఈ రోజు రూ. 35,000 కోట్ల ఖర్చుతో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా సంక్షేమ పథకాలు చేపడుతున్నది తెలంగాణ అనేది వాస్తవం కాదా?

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేనివిధంగా వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు వేలమందికి 1000 రూపాయల పింఛన్‌ ఇవ్వడం లేదా? స్కూళ్లలో, హాస్టళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో చేసిన అన్నం పెట్టడం లేదా? ఎందరున్నా ఒక కుటుంబానికి 20కిలోల బియ్యమే ఇచ్చేవాళ్లు. పేదల కడుపు నింపాలని కుటుంబంలో సభ్యులెంతమంది ఉంటే అన్ని 6 కిలోల బియ్యం ఇవాళ ఇస్తున్నాం. రాష్ట్రంలోని 5.5 లక్షలమంది బీడీ కార్మికులలో పీఎఫ్‌ కార్డులున్న వారందరికీ పింఛన్‌ ఇవ్వాలని నిర్ణయించినం. 3 లక్షలమంది పేద ఒంటరి మహిళలకు రాబోయే ఏప్రిల్‌ నుంచి 1000 రూపాయల పింఛన్‌ ఇస్తమన్నం.

దేశంలోనే ఎక్కడాలేని విధంగా ఆడపిల్ల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల ద్వారా రూ. 51,000 ఇస్తున్నం. రూ. 17,500 కోట్ల మేరకు రైతుల రుణాలు మాఫీ చేసింది ఈ ప్రభుత్వం కాదా? ఇటీవల రూ. 4,000 కోట్ల రూపాయల మేరకు పేదల ఇంటి రుణాలు మాఫీ చేసిన మాట వాస్తవం కాదా?

రాబోయే సంవత్సర కాలంలో తెలంగాణలో ఇంటింటికీ ఇంటర్నెట్‌ సదుపాయంతోపాటు, ప్రభుత్వ ఖర్చుతో నల్లా బిగించి, పరిశుభ్రమైన మంచినీటిని అందివ్వబోతున్నం. మిషన్‌ కాకతీయ కింద 16,000 చెరువులు బాగు చేసినం. మిగిలిన 30,000 చెరువులను కూడా బాగు చేయడానికి జరుగుతున్న కార్యక్రమం కనపడడంలేదా? పేదలకు డబ్బాలాంటి ఒక రూమ్‌ కట్టేవారు. ఇవాళ రూ. 5.4 లక్షల ఖర్చుతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కడుతున్నం.

తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రపంచం మొత్తంలోనే మూడవ అతిపెద్ద మానవ ప్రయత్నం 230 కోట్ల మొక్కలను నాటే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. ఇవాళ రాష్ట్రంలో 21 కొత్త జిల్లాలను, 68 కొత్త రెవిన్యూ డివిజన్లను, 125 కొత్త మండలాలను ఏర్పాటు చేసి పరిపాలనా సంస్కరణలు తేవడం కనపడడంలేదా?

కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తమని చెప్పినం. ముస్లిం మైనారిటీ విద్యార్థులకోసం 200 రెసిడెన్షియల్‌ స్కూళ్లు, 31 పాఠశాలలు ఇప్పటికే ప్రారంభించినం. ఈ ఏడాది మరో 200 స్కూళ్లు పెట్టబోతా ఉన్నాం. దేశంలో ముస్లింలకోసం ఎక్కడన్నా రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఉన్నాయా? ఒక్క తెలంగాణలోనే ఉన్నయి. ఇవ్వన్నీ కనపడుత లేదా?

ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీల్లోని పేద విద్యార్థులు విదేశాలకు పోయి చదువుకోవడానికి రూ. 20లక్షల స్కాలర్‌షిప్‌ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ కాదా? బీసీ విద్యార్థుల కోసం ఇప్పటివరకు 120 రెసిడెన్షియల్‌ స్కూళ్లు ఉంటే, ఇప్పుడు 501 రెసిడెన్షియల్‌ స్కూళ్లు ప్రారంభిస్తా ఉన్నాం. ఇవి కనపడుతలేవా? దళిత ఆడపిల్లలకు పట్టణాల్లో కొద్దిమంది దుర్మార్గులు రూం కిరాయికి ఇవ్వటం లేదు. వారి బాధలు గమనించి గతేడాది 25 రెసిడెన్షియల్‌ కాలేజీలు మంజూరు చేసినం. ఈ ఏడాది ప్రతి రెవిన్యూ డివిజన్‌కు ఒకటి ఉండేలా 60 కాలేజీలు మంజూరు చేయబోతున్నాం.

సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాలను హరించివేశారు. ఇప్పుడు 25000 నుంచి 30,000 మందికి సింగరేణిలో డిపెండెంట్‌ ఉద్యోగాలు దొరుకుతున్న మాట వాస్తవమా, కాదా? ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాల హయాంలో 2,686 కి.మీ. జాతీయ రహదార్లు ఏర్పాటు చేస్తే, ఆర్‌ అండ్‌ బీ మంత్రిగా తుమ్మల పట్టుదలతో తక్కువ సమయంలోనే కొత్తగా సాధించుకొచ్చింది 2776 కి.మీ. ఇది అభివృద్ధి కాదా?

ప్రపంచం మొత్తం మెచ్చుకున్న పారిశ్రామిక విధానం టీఎస్‌-ఐపాస్‌. రూపాయి లంచం లేకుండా, ఒక్క ఆఫీసు చుట్టూ తిరగకుండా రాష్ట్రంలో 3000 పరిశ్రమలకు 15 రోజుల్లోపల అనుమతులు ఇచ్చినది కనపడడం లేదా? ఇందులో 1600 పై చిలుకు పరిశ్రమలు ఉత్పత్తిలోకి వచ్చిన మాట వాస్తవమా కాదా?

తెలంగాణ ఏర్పడ్డనాటికి 4 లక్షల మెట్రిక్‌ టన్నుల కెపాసిటీ గోదాములున్నయి. కొద్ది కాలంలోనే 21 లక్షల మెట్రిక్‌ టన్నుల కెపాసిటీతో గోదాములు నిర్మించాం. ప్రతి మండల కేంద్రంలో రైతుల అవసరం దృష్ట్యా, గోదాములు నిర్మించినం. ఇవి కనపడడం లేదా?

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలి. కులవృత్తులు బాగుపడాలి. రాబోయే బడ్జెట్‌ను అద్భుతంగా తీసుకొస్తం. రాష్ట్రంలో ఉన్న 25 లక్షల పైచిలుకు యాదవుల్లో ప్రతి యాదవ కుటుంబానికి ఒక గొర్రెల యూనిట్‌ ఇస్తం. 75 శాతం సబ్సిడీతో నాలుగు లక్షల యూనిట్లు ఇస్తం. మత్స్య కార్మికులకు మత్స్య ఉత్పత్తిని పరిశ్రమగా మలుస్తం. చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తం.

ఇవేకాదు మార్కెట్‌ కమిటీల్లో రిజర్వేషన్లు తెచ్చి అందరికీ అవకాశాలు కలిగించిన మాట వాస్తవం కాదా? న్యాయవాదుల సంక్షేమానికి రూ. 100 కోట్ల నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా? బ్రాహ్మణుల్లోని పేదల సంక్షేమానికి రూ. 100 కోట్లు మంజూరు చేసిన మాట నిజం కాదా? మొట్టమొదటిసారిగా దేశంలో ఏ రాష్ట్రం చేయనివిధంగా జర్నలిస్టు సంక్షేమానికి రూ. 10 కోట్ల నిధులు విడుదల చేయలేదా? అర్థాకలితో నకనకలాడుతూ పనిచేస్తుండే 20,000 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడం కనపడలేదా?

ఎన్నో సందర్భాలలో వ్యవసాయ ట్రాక్టర్లకు పన్ను మినహాయించమని రైతులు అడిగినారు. ఎవరూ చేయలేదు. ఇవాళ వ్యవసాయ ట్రాక్టర్లకు ఈ ప్రభుత్వం పన్ను మినహాయించింది. లక్షకుపైగా ఆటో కార్మికులకు దేశంలో ఎక్కడాలేనివిధంగా పన్ను మాఫీ చేసింది. చాలా దుర్మార్గంగా వెట్టి చాకిరీ చేయించుకున్న వాళ్లలో హోంగార్డులు కూడా ఉన్నారు. వారిలో అర్హులైన వారందరినీ పోలీసు డిపార్టుమెంటు ఉద్యోగాల్లోకి తీసుకుంటం. మిగతా వారికి వేతనాలు పెంచుతం.

ఇలా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నం. ఇవన్నీ కన్పించవు. అవినీతి రహితంగా ప్రభుత్వాన్ని నడుపుతుంటే, అవాకులు, చవాకులు పేలుతున్నారు. ఇప్పటికైనా మానుకోండి. మంచికోసం సహకరించండి. ప్రాజెక్టులు కట్టాలని అడగండి. ప్రాజెక్టులకు అడ్డుపడే దుర్మార్గాన్ని మానుకోండి. ఎవరెన్ని వేషాలు వేసినా, నా రక్తం బొట్టుబొట్టు రంగరించి అయినా, ఖచ్ఛితంగా ప్రాజెక్టులు కట్టి తీరుతం. కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తం.

భక్త రామదాసు ప్రాజెక్టు ఓ నమూనా: హరీశ్‌రావు

అనుకున్న సమయానికంటే చాలా ముందుగా, కేవలం 11 నెలల్లోనే పూర్తయిన భక్త రామదాసు ప్రాజెక్టు ఓ నమూనా. ఇతర ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలకు ఆదర్శం. రూ. 50,000 కోట్లతో ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరిస్తున్నాం. ఇది తెలంగాణ ప్రభుత్వ ఘనత. కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ మారాలనే స్వప్న సాకారానికి కృషి చేస్తున్నం. భక్త రామదాసు ప్రాజెక్టు స్ఫూర్తితో మిగిలిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేసి, ఆకుపచ్చని తెలంగాణగా మారుస్తం.

సీతారామ ప్రాజెక్టు కూడా ఇలాగే పూర్తి చేస్తాం: తుమ్మల

నేను కూడా నాగలిపట్టి పొలం దున్నిన వ్యక్తినే. అన్నదాతల కష్టాలు నాకు తెలుసు. చిత్తశుద్ధి, కార్యదక్షత ఉంటే వేగంగా ప్రాజెక్టులు పూర్తి చేయవచ్చని ఈ ప్రాజెక్టు నిరూపించింది. రాబోయే కాలంలో సీతారామ ఎత్తిపోతల పథకం కూడా పూర్తిచేసి, జిల్లాలోని 7 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తాం. తెలంగాణలోని ప్రాజెక్టులన్నిటికీ భక్త రామదాసు ఎత్తిపోతల పథకమే స్ఫూర్తి.

సుజాత గొట్టిపాటి

Other Updates