తెలుగు నేలపై పారే నదుల్లో అతి పెద్ద నదులు రెండు. ఒకటి గోదావరి, రెండు కృష్ణ. ఈ రెండు నదులను ప్రాచీన కాలం లో తెల్లనది, నల్లనది అనే అర్థంలో తెలివాహ, కణ్ణ బెణ్ణ అని పిలిచేవారు. వీటికీపేర్లు బౌద్ధ వాఙ్మయంలో లభిస్తున్న పేర్లు. అంతే కాదు పచ్చేరు అని మరో ఏరుంది. దాన్ని ఈనాడు హరిద్రానది అని అంటున్నాం. అది గోదావరికి ఉపనది. నిజామాబాద్ జిల్లాలో కందకుర్తి వద్ద ఎగువగా గోదావరిలో కలుస్తుంది. తెలి అంటే తెల్ల, కణ్ణ అంటే కృష్ణ. అంటే నల్లనది. నది నీళ్లకు రంగు లేకున్నా అది పారే ప్రాంతాల మట్టితో నదికి రంగు, రంగుతో నదికి పేరు పెట్టుకున్న అతి ప్రాంచీనమైన ప్రాంతాలు ఈ తెలంగాణవే.
ఉత్తర తెలంగాణ అదిలాబాద్ జిల్లాల నుండి మధ్యకృష్ణా నది తీరాలైన మహబూబ్ నగర్, నల్గొండల వరకు ఉభయ నదుల (గోదావరి, కృష్ణా నదుల) మధ్య ప్రాంతాలలో ఆదిమ మానవులు నివసించినారు. వీరి మూలాల ఆధారాలు ఉట్నూరు ప్రాంతంలో లభించాయి. ఈ తీరాల లోయల్లో అరణ్య మానవ నివాసాలకు తారీఖులు చెప్పలేకున్నా, రాజ్యాల నిర్మాణం బట్టి కనీస చరిత్ర మూడు వేల సంవత్సరాలని భావించవచ్చు. ప్రాక్‌శిలా యుగం నుండే మానవ జీవనంకు చారిత్రకాధారాలున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలోని అమరాబాద్, మన్ననూరు, నల్లగొండలో ఏలేశ్వరం, కర్నూలులో కేతవరం, గుంటూరు జిల్లాలో నాగార్జునకొండ మొదలగుచోట్ల వీటి ఆనవాళ్లున్నాయి.
కృష్ణా నది సుమారు 1400 కి.మీ. ప్రయాణం చేసి తూర్పు సముద్రమైన బంగాళాఖాతంలో రెండు పాయలుగా విడిపోయి వలుస్తుంది. ఒకపాయ హంసల దీవి వద్ద మరోపాయ నాచుగుంట వద్ద కలుస్తుంది. తిరిగి ఏటిమొగ వద్ద మూడు పాయలుగా చీలి మొదటిపాయ గుల్లలమోద వద్ద గోటిముట్టిపాయ లేదా బల్లలేరు పేరుతో ప్రవహించి సంగమం చేస్తుంది. రెండో పాయ నాచుగుంట వద్ద ఈల చెట్ల దిబ్బలగుండా ప్రవహించి, మూడో పాయ లంకవేణి దిబ్బను చేస్తూ ప్రవహించి, చేమలమండి వద్ద సంగమిస్తుంది. ఇలా పాయలుగా చీలడం జడకుచ్చులుగా జన్నకారణంగా దీనికి కృష్ణవేణి అనే పేరు వచ్చిందని కొందరు పేర్కొన్నా, నిజానికి ఇది, కృష్ణ, వేణ్ణా అనే రెండు నదుల సంగమం. అపుడే కృష్ణవేణి అవుతుంది. అలాగే గోదా శబరితో కల్సి గోదావరి అవుతుంది. తుంగానది భద్రానదితో కల్సి తుంగభద్ర అని, వారణ, అసితో కల్సిపోయి వారణాసి (గంగా) నది అనిపేర్లున్నాయి.
కృష్ణానది గోదావరివలె కాక, ప్రవహించే దూరం తక్కువైనా, కలిసే ఉపనదులు ఎక్కువే కనుక దీనికి కృష్ణవేణి (నల్లని జడ) అన్న పేరు సార్థకమే. దీని ఉపనదులు సుమారు 30 వరకు ఉన్నాయి.
వేణ్ణా, భీమా, మూలా, మన్, కుందళి, పవనా, కమండలా, ఘోడ్, ఇంద్రాయణి, భోగవతి, కోయనా, యెర్లా, దిండి, వర్నా, దూద్‌గంగా, పంచగంగా, మూసీ, పాలేరు, భవనాశిని, వేదా, అవతి (వేదవతి), నాదవతీ, మున్నేరు, ఆకేరు ఇలా కొండల్లో పారే ఈ నదిని కలిసే చెలికత్తెలెందరో!
ఈ నదికి తెలుగునాట ఉభయ పార్శ్వాల్లో ఎడవ వైపు భీమా, డిండి (మహబూబ్‌నగర్ జిల్లా) మూసీ (రంగారెడ్డి జిల్లాలో ప్రవహించి నల్లగొండ జిల్లా వాడపల్లి వద్ద సంగమం), హాలియా (నల్లగొండ జిల్లా), పాలేరు, మున్నేరు (వరంగల్ జిల్లాలో వ్రహించేవి), కడివైపు నుండి తుంగభద్ర (మహబూబ్ నగర్ జిల్లా) ఘటప్రభ, మలప్రభ, బుడమేరు, తమ్మిలేరు, రామలేరు అనేవి లుస్తాయి. మహబూబ్‌నగర్‌లో తంగెడ వద్ద తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశించి ప్రవహించి మహబూబ్‌నగర్, నల్లగొండ, కృష్ణా, కర్నూలు, గుంటూరు జిల్లాలను కృష్ణా నది పునీతం చేస్తున్నది.
సహ్యాద్రి పర్వత శ్రేణిలో పుట్టిన ఈ నది మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రవహిస్తూ అనేక ఉపనదీ జలాలతో పుష్టమై తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడుతుంది. దీనికి కలుస్తున్న ఉప నదుల్లో తుంగభద్ర పెద్దనది. దాని ప్రవాహం, నిడివి దృష్ట్యా అది ప్రత్యేక నదిగా గుర్తించబడింది. ఇది కర్ణాటక రాష్ట్రంలో పారుతుంది.
ఈ నది పరిసరాల నేలిన శాతవాహన పూర్వరాజులు భట్టిప్రోలు – కుబ్బీరకుడు, వడ్డమాను – సోమకుడు, అమరావతి – అవతకామ, పెదవేగి – కికీచక మొదలగు ప్రభువులు, ధాన్య కటకమును పాలించిన సదా వంశీయులు సిరిసద, మహాసద, శివసద మొదలగువారు. శాతవాహన ప్రభువులలో శాకర్ణి (తొలి) ప్రభువు నుండి గౌతమీపుత్ర శాతకర్ణి వరకు తొలినాళ్ల ప్రభువులీ కృష్ణా తీరాలు ఏలినారు. ఇక్ష్పాకు ప్రభువుల విజయపురి కృష్ణాతీరమే. బందరు ప్రాంతాల నేలిన బృహత్ఫలాయనులు, ఏలూరు ప్రాంతాలేలిన శాలంకాయనులు, ఆనంద గోత్రీకులు, పల్లవులు ఏలిన తరువాత కృష్ణానదీ ప్రాంతాలైన నల్లగొండ ఇంద్ర పాలనగరం, రాజధానిగా ఏలిన విష్ణు కుండినులు, మహబూబ్‌నగర్ కర్నూలు ప్రాంతాల నేలిన బాదామీ చాళుక్యులు, ఆపై రాష్ట్రకూటులు, తూర్పు చాళుక్యులు, నల్గొండ, మహబూబ్‌నగర్ కృష్ణా దివి సీమలు గెల్చిన కాకతీయులు, నల్గొండ నేలిన పద్మనాయకులు, వీరి రాచకొండ దేవరకొండ రాజ్యములు, ఆపై విజయ నగర రాజ్య సీమలు కృష్ణానదీ పరీవాహక రాజ్యములుగా తెలుగువారి ప్రాభవాన్ని పులకించేలా చరిత్రలో కీర్తిమంతం ఐనాయి.
కృష్ణా తీరాన్ని నివసించిన ప్రజలు వివిధ మతాలను కాలానుసరణంగా ఆదరించినారు. భారత దేశంలోని అన్ని మతాలు ఇక్కడి ప్రజల జీవితాలతో ముడివేసుకున్నాయి. తొలుత ఆచరణలోకి వచ్చిన బౌద్ధం క్రీ.పూ. 4వ శతాబ్ది నుండి క్రీ.శ. ఆరవశతాబ్ది వరకు అనగా సహ స్రాబ్ది పర్యంతం రాజుల, ప్రజల ఆదరణకు నోచుకొంది.
నల్లగొండ జిల్లాలోని నాగార్జున కొండ పరిసరాలు, కృష్ణా ఉభయత టాలు, ఫణిగిరి, నేలకొండపల్లి ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు. అమరావతి, జగ్గయ్యపేట, భట్టిప్రోలు, ఘంటసాల, గుడివాడ బౌద్ధ పుణ్య క్షేత్రాలుగా విరాజిల్లినవి. ఆచార్య నాగార్జునితో ముడిపడ్డ శ్రీ నర్వత విహారం కృష్ణవేణి జలాలతో నిత్యం పునీతమైన గిరి ప్రాంతం. మహాయాన బౌద్ధానికి, భిక్షుకనివాస, నివేశన స్థలాలకు, స్థూప, చైత్య నిర్మాణాలకు, గుహలకు, ఈ ప్రాంత ప్రజల దానాలు విరివిగా ఇవ్వబడ్డాయి. విష్ణుకుండి రాజుల్లో గోవింద వర్మ మూసి ఒడ్డున (నేటి చైతన్యపురిలో) బౌద్ధ విహారం ఏర్పాటు చేసిన శాసనం, ఈ రాజులు బౌద్ధాభిమానానికి కృష్ణానదికి సంబంధం తెలుపుతూ ఉంది. శ్రీపర్వతం ఆక్రమించిన పల్లవుల నుండి హిందూ ధర్మం ప్రాభవంలోకి వచ్చింది. కృష్ణలోయలో బౌద్ధం ప్రాభవం క్షీణించడానికి త్రిలోచన పల్లవుడు కారణం. జైనం బౌద్ధం కంటే ముందే కృష్ణమ్మతో ముడివేసుకుని ఉంది. గుంటూరు వడ్డెమాను, మాండలికులు కళింగ నేలిన ఖారవేలుడు, తూర్పు చాళుక్య (వేంగి) ప్రభువులు జైనాన్ని ఆదరించారు. కృష్ణా తీరంలోని విజయవాడ, గుడివాడ, నందిగామ, జగ్గయ్యపేటల్లో జైన క్షేత్రాలుండేవి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా మునుగోడు, చేజెర్ల వంటిచోట్ల జైనాల ఆలయాలుండేవి. మలిశాతవాహనులు వైదిక మతావలంబులు. ఇక్ష్వాకులు విష్ణుకుండినులు కృష్ణాతీరప్రాంతాల నేలిన రాజులు. వీరు వైదిక మతాన్ని పోషించి యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించారు. శైవం కృష్ణా తుంగ భద్రతీరాల్లో తొలినాళ్ల నుండి ఉండేది. ఏనది కృష్ణలో సంగమించినా, ఆ సంగమ క్షేత్రంలో శివాలయాలుండేవి. సంగమేశ్వరుడనే శివునికి పేరు. శివాలయాలతో బాటు కృష్ణా తీరంలో కార్తికేయాలయాలు నిర్మించబడ్డాయి. ఆనంద గోత్రీకుల చేజెర్ల కపోతేశ్వరాలయం, సంగమేశ్వర, మల్లేశ్వరాలు మొదలగు ప్రసిద్ధ క్షేత్రాలు అడవి దేవులపల్లి, బీచుపల్లి, వాడపల్లి వంటి క్షేత్రాలు నారసింహారాధన వెలిసాయి. తూర్పు చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు అనేక శివాలయాలుగా బౌద్ధ రామాలను మార్చినారు. కాలాముఖ, పాశుపాత, కాపాలిక శైవ శాఖలు కృష్ణ వెంబడి నడిచాయి. కూడలి సంగమేశ్వరం (కర్ణాటక) మొదలు, బెజువాడ, దుర్గి, తాడికొండ, శ్రీశైలం, భైరవకోన, అలంపురం వంటివి ఎన్నయినా చూపవచ్చు. వైష్ణవం కూడా శైవంతోబాటు అభివృద్ధి పొందినది. నారసింహ క్షేత్రాలు తెలంగాణలోని కృష్ణా తీరాల్లో వెలిసాయి. ఉండవల్లి, మాచెర్ల, శ్రీకాకుళం, మంగళగిరి, రాచకొండ, మాచెర్ల వంటివి ఉదాహరణలు. కృష్ణా జల పానం చేసిన రాజులు ప్రజలు రెండువేల సంవత్సరాలు వివిధ మతాలను ఆచరించినారు.
కృష్ణానది సాహిత్యానికి ప్రసిద్ధిగాంచిన ఎందరో సారస్వత మూర్తులకు జన్మనిచ్చి, జీవ జలాలతో లాలించి, పాలించి, పెంచి, పోషించిన నదీమతల్లి. మత్స్య, వాయు, విష్ణు, స్కాంద పురాణాలతో బాటు మహాభారతంలో పేర్కొబడ్డ ఈ నది పరిసరాల్లో 9వ శతాబ్ది వరకు సంస్కృతానికి, ఆపై తెలుగు సాహిత్యానికి నెలవైనాయి. 12 శతాబ్దంలోని పాల్కుర్కి సోమన పండితారాధ్య చరిత్రలో శ్రీశైల పాతాళ గంగను వర్ణించడంతో ఈ నదీ స్తుతి ప్రారంభమౌతుంది. గుంటూరికవి తిక్కన, శ్రీనాథుడు కృష్ణా తీర జన్ములు. శ్రీకాకుళపు తిరునాళ్లకు స్మరించిన వినుకొండ వల్లభరాయుడు, రామరాజ భూషణుడు వంటి కవులు కృష్ణను వర్ణింపగా, ఈ తీరాన్నే జన్మించిన మరెందరో కవులు ప్రసిద్ధులైనారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 13 శతాబ్ద చివరన రంగనాథ రామాయణం రాసిన గోనబుద్ధారెడ్డి, కేశంపేట మండల కాకునూరి నివాసి అప్పకవి, జట్రపోలు నందు చాంద్రికాపరిణయం రాసిన సురభి మాధవరాయలు, ఈ సంస్థానాశ్రితుడు ఎలకూచి బాల సరస్వతి, చింతలపల్లి ఛాయాపతి, వీర రాఘవ, సంజీవ కవులు అనర్ఘరాఘవ కర్త ప్రాగ తూరు రాజైన బిజ్జల తిమ్మ భూపాలుడు, ప్రసిద్ధులు. నల్గొండ జిల్లాలోని విష్ణుకుండి 4వ మాధవ వర్మ జనాశ్రయీ ఛందఃకర్త. కొలనుపాక నేలిన 2వ తైలపుని కొలువులోని రన్న కవి, అభిలషితార్థ చింతామణీ కారుడు మూడవ సోమేశ్వరుడు, పానుగల్లు నేలిన ఉయాదిత్యాలంకార కర్త ఉదయాదిత్యుడు, రాచకొండనేలిన రసార్ణవసుధాకర కర్త సింగభూపాలుడు, పశుపతి నాగనాథుడు (విష్ణుపురాణకర్త), చమత్కార చంద్రికాకారుడు విశ్వేశ్వరుడు బొమ్మకంటి అప్పయ, శాకల్య మల్లభట్టు, 3వ సింగభూపాలుని కొలువులో ఉన్న బమ్మె పోతన, నవనాథ చరిత్ర కర్త గౌరన వంటి ప్రసిద్ధులున్నారు. గుంటూరు మండలంలోని ఆంధ్రాభాషా భూషణ కర్త మూల ఘటిక కేతన, భోజరాజీయ కర్త అనంతామాత్యుడు, అయ్యంకిపుర వాసిగా చెప్పుకొన్న వాడైన మాదయగారి మల్లన మహాకవులు.
కృష్ణా జిల్లాలోని పదకర్త క్షేత్రయ్య, కూచిపూడి నాట్య స్రష్ట సిద్ధేంద్ర యోగి మొదలగు వారున్నారు. శ్రీకృష్ణదేవరాయల ఆముక్త మాల్యదకు శ్రీకారం చుట్టింది కృష్ణా తీరమే. కర్నూలు జిల్లా (కందవోలు)లోని అయ్యలరాజు రామభద్రుడు, పింగళిసూరన (నంద్యాల) మొదలగు ప్రాచీన మహాకవులతో బాటు విశ్వనాథ సత్యనారాయణ (విజయవాడ), జాషువా (గుంటూరు), సురవరం ప్రతాపరెడ్డి (మహబూబ్‌నగర్) వంటి ఆధునిక సత్కవులకు కృష్ణాతీరం పుట్టుగడ్డ.
కృష్ణానది అతి ప్రాచీనమైన తెలుగు జాతితో సంబంధం కల్గి, జాతి, భాషా, సారస్వత, కళా, సామాజిక రంగాలలో శతాబ్దుల వెంబడి ఎంతో వికాసాన్ని సాధించింది. ఈ నదీమతల్లి ఒడిలో వికసించిన సంస్కృతీ వైభవం ఘన వారసత్వం కల్గిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగువారి సంస్కృతీ చరిత్రలో విడదీయరాని ఒక భాగం కృష్ణమ్మతల్లి, ప్రాజెక్టుల రూపంలో, విద్యుదుత్పత్తి రూపంలో, సాగు, తాగు నీటి అవసరాల్లో, పరిశ్రమల విషయంలో కృష్ణవేణి తెలుగింటి విరిబోణి.
– డా. సంగనభట్ల నరసయ్య