tsmagazineకృష్ణా నది నీళ్ళ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలేమీ లేవన్నట్లుగా, క్రిష్ణా నదిలో పంచుకోవడానికి నీళ్ళు లేవన్నట్లుగా, గోదావరి నది జలాలను పంచుకోవాలని 5 డిసెంబరు న కోదాడలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ వ్యాఖ్యల వెనుక గల దురుద్దేశాన్ని తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్‌ వెంటనే పసిగట్టారు. అదే రోజు గజ్వేల్‌ లో జరిగిన సభలో ఆ విషయంపై ప్రతిస్పందించారు. కృష్ణా నదీ జలాలలో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా గురించి మాట్లాడకుండా, గోదావరి నది జలాల గురించి మాట్లాడడం కుట్రపూరితమైన ధోరణిని కొనసాగించడమేనని స్పష్టం చేశారు.

క్రిష్ణా నదిలో నీళ్ళు లేవనడం అంటే క్రిష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను నిరాకరించడమే అన్న విషయాన్ని కేసీఆర్‌ గ్రహించారు. మన రాష్ట్రానికి చెందిన ఏ ఇతర నాయకులూ, మేధావులు ఆంధ్రప్రదేశ్‌ ధోరణిని వ్యతిరేకిస్తూ మాట్లాడలేదు. ఖండించలేదు. నిజానికి, కొంత మంది ఇంజనీర్లు కూడా ‘అవును, నిజమే కదా! కృష్ణా నది బేసిన్‌ డెఫిసిట్‌ బేసిన్‌ (లోటు బేసిన్‌) కాబట్టి, ఇక మిగిలింది గోదావరి బేసిన్‌లోని నీళ్ళ పంపకమే కదా!’ అని అపోహ పడుతుంటారు. దశాబ్దాలుగా, ఆంధ్రా లాబీలు, మీడియా, పౌర సంఘాలవారు, నాయకులూ విసృతంగా ప్రచారం చేసిన కారణంగా క్రిష్ణా బేసిన్లో నీళ్ళు లేవు అన్నది ఒక సాధారణ విషయంగా చలామణిలోకి వచ్చింది. ఇటువంటు మరికొన్ని అపోహలను పూర్వపక్షం చేయాల్సిన అవసరం ఉన్నది.

అపోహ 1 :

తెలంగాణా విడిపోక ముందు కృష్ణా జలాలను మూడు రాష్ట్రాలు(తెలంగాణా ఇందులో భాగస్వామి) పంచుకున్నాయి. ఈ పంపిణీ ఒక ప్రభుత్వ కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా కాక సుదీర్ఘ న్యాయ విచారణ ద్వారా జరిగింది. అటువంటి సందర్భంలో విడిపోయిన తెలంగాణకి వాటా పెంపు ఎట్లా జరుగుతుంది? ఇంకా పంచడానికి నీళ్ళే లేవు.

తెలంగాణా విడిపోక ముందే మూడు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకం జరిగిన మాట వాస్తవం. అందులో తెలంగాణా భాగస్వామి అని పేర్కొనడం అబద్దం. నదీ జలాల ట్రిబ్యునల్‌ ముందు తమ వాదనలను వినిపించే అధికారం కేవలం బేసిన్‌ రాష్ట్రాలకు మాత్రమే ఉంటుంది. తెలంగాణా ఒక రాష్ట్రంగా లేదు కనుక బచావత్‌ ట్రిబ్యునల్‌ ముందుగాని, బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు గాని తెలంగాణా తన వాదనలని వినిపించడం చట్టపరంగా సాధ్యం కాదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం రావాడానికి ఒక ప్రధాన కారణమే ఇది. ఒక రాష్ట్రంగా ఎర్పడితేనే తెలంగాణ ఒక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయమని అడగడానికి గాని, ట్రిబ్యునల్‌ ఎదుట తన సమస్యలను నివేదించడానికి అవకాశం ఉంటుంది కాబట్టే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై ఉద్యమం సాగింది. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టం, 2014 లోనే ఇప్పటికే ఉన్న కృష్ణా ట్రిబ్యునల్‌ ను పొడిగిస్తూ దానికి నివేదించిన అంశాల పరిధి చాలా సంకుచితంగా ఉంది. అందువల్ల, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే జూలై 2014 లో క్రిష్ణా నదిలో తెలంగాణకు న్యాయబద్దమైన నీటి వాటా (Equitable Distribution) నిర్ణయించాలని ఇప్పుడున్న ట్రిబ్యునల్‌ కు నివేదించడమో లేదా కొత్త ట్రిబ్యునల్‌ ను ఏర్పాటు చేయాలని ఒక రాష్ట్రంగా అంతర్రాష్ట్ర నది జల వివాదాల చట్టం, 1956 లోని సెక్షన్‌-3 ప్రకారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ ఫిర్యాదు నాలుగేళ్లుగా పెండింగులో ఉంది.

బచావత్‌ ట్రిబ్యునల్‌, బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ముందు అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా బేసిన్‌ ఆవల ఉండే కోస్తా, రాయలసీమ ప్రాంత అవసరాలకు ప్రాధాన్యతనిచ్చి వాదనలు వినిపించిందే తప్ప తెలంగాణా అవసరాలను ట్రిబ్యునల్‌ ముందు పెట్టలేదు. ఈ విషయాలను ట్రిబ్యునల్‌ కూడా తన నివేదికలో ఎత్తి చూపించింది. నికర జలాలు కేటాయింపులో జూరాల ప్రాజెక్టు కంటే, ఇంకా క్రిష్ణా డెల్టాకు, కేసి కెనాల్‌ అదనపు కేటాయింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరిన సందర్భంలో, బచావత్‌ ట్రిబ్యునల్‌ ” మేము మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్రాంతం నీటి పారుదలలో వంచించబడ కూడదని భావిస్తున్నాం….. జూరాల ప్రాజెక్టు స్టేజ్‌-1 కు 17.84 టీఎంసీల నికరజలాలను కేటాయిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ ఈ నీటిని తెలంగాణ ప్రాంతంలోనే వినియోగిస్తుందని భావిస్తున్నాం” అని పేర్కొంది (బచావత్‌ ట్రిబ్యూనల్‌ రిపోర్టు పేజీ 581). మొత్తం ఆయకట్టు బేసిన్‌ ఆవలనే గల తెలుగుగంగ ప్రాజెక్టుకు కేటాయింపులు చేయాలని పట్టుబట్టిన ఆంధ్రప్రదేశ్‌,బేసిన్లోని కరువు ప్రాంతాలకు నీళ్లిచ్చే కల్వకుర్తి, నెట్టెంపాడు, SLBC  ప్రాజెక్టులకు పట్టుబట్టలేదు. ఆ సందర్భంగా 25 టీఎంసీలు తెలుగుగంగా ప్రాజెక్టుకు కేటాయిస్తూ బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ” తెలుగు గంగ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చాలా ఒత్తిడి చేసింది. అది బేసిన్‌ ఆవల ప్రాంతాలకే నీటిని అందిస్తున్నప్పటికీ, ఆ ప్రాంతాలకు తీవ్రమైన నీటి కొరత ఉన్నది, వాటికి ఏ ఇతరమైన నీటి సరఫరా అవకాశం లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ అధిక మొత్తంలో బేసిన్‌ ఆవలకు నీటిని మళ్లిస్తున్నప్పటికీ, బేసిన్‌ అవలకు మళ్లిస్తే పునరుత్పత్తి జలాల పరంగా బేసిన్‌ కు పూర్తిగా నష్టమే’ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ఒత్తిడి మేరకు కేటాయిస్తున్నాం ” అని పేర్కొంది (బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యూనల్‌ రిపోర్టు పేజీ 788).

తెలంగాణా అవసరాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ట్రిబ్యునల్‌ ముందు పెట్టకపోవడం చేత బేసిన్‌ లోపల ఉండే మహబూబ్‌ నగర్‌, నల్లగొండ జిల్లాల ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు జరగలేదు. కృష్ణా బేసిన్‌ ఆవల ఉండే కృష్ణ డెల్టా ఆయకట్టు, నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టు, కేసి కాలువ ఆయకట్టు ప్రాంతాలకు ముందు నుంచి నీటిని వినియోగిస్తున్నారన్న సిద్దాంతం మీద వాటికి రక్షణలు కల్పించుకున్నారు. ఈ రక్షణల కారణంగా బేసిన్లోఉన్న ప్రాంతాలు నికర జలాల కేటాయింపుల్లో తీవ్రంగా నష్టపోయినాయి.The State Andhrapradesh,no doubt,has been allocated enough water for historical reasons,but still Telangana part of Andhrapradesh stands in need of irrigation అని బచావత్‌ ట్రిబ్యునల్‌ వ్యాఖ్యానించింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణా ఉన్నప్పటికీ చాలా మంది అపోహ పడుతున్నట్టు ట్రిబ్యునల్‌ ప్రక్రియలో తెలంగాణా భాగస్వామి కాదు.

ఇకపోతే క్రిష్ణా నది లోటు బేసిన్‌ కాదు. బేసిన్‌లోని న్యాయమైన, సమంజసమైన అవసరాలకు సరిపోను నీళ్లున్నాయి. క్రిష్ణా బేసిన్‌ లోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాగుకు అనువైన భూములకు సరిపోయేంత పరిమాణంలో నీళ్ళు ఉన్నాయి. కానీ బేసిన్‌ ఆవల ఉన్న ప్రాంతాల అవసరాలకు బేసిన్లో ఉన్న ప్రాంతాల అవసరాల కంటే పెద్ద పీట వేసి చూసినప్పుడు అది లోటు బేసిన్‌ గానే కనబడుతుంది. నాడు బచావత్‌ ట్రిబ్యునల్‌ ముందు కర్ణాటక, మహారాష్ట్రలు ఆంధ్రప్రదేశ్‌ బేసిన్‌ ఆవలకు తరలించే నీటి పరిమాణం వల్లే క్రిష్ణా బేసిన్లో లోటు ఏర్పడిందని స్పష్టం చేశాయి. రెండో పంట, మూడో పంటలకు నీళ్ళు వినియోగించడాన్ని ఎత్తి చూపాయి. నిజానికి, వరి పండించడానికి కూడా 130 టీఎంసీల వినియోగం కృష్ణా డెల్టా ప్రాజెక్టుల్లో సరిపోతాయి(క్రిష్ణా బేసీన్లోని ఆయకట్టుకు 8.5 టీఎంసీలు, బేసిన్‌ ఆవల ఆయకట్టుకు 121.5 టీఎంసీలు). అవి భూగర్భ జలాలకు అనువైన, మంచి వర్షపాతం ఉన్న ప్రాంతాలు కూడా. కానీ, ప్రతి సంవత్సరం 200 నుండి 300 టీఎంసీలకు పైగా నీటిని ఆ ఆయకట్టుకు మళ్లించారు. అట్లాగే కేసి కెనాల్‌, నాగార్జునసాగర్‌ కుడి కాలువల కింద వినియోగాలు కూడా అత్యధికశాతం బేసిన్‌ ఆవలనే ఉన్నాయి.
tsmagazine

ఇట్లా తాము బేసిన్‌ అవల ఉన్న ప్రాంతాలకు మళ్లించడం వల్లనే కృష్ణాలో లోటు ఏర్పడిందన్న విషయాన్ని మరుగు పర్చి క్రిష్ణా బేసిన్లో నీళ్లు లేవు, అది లోటు బేసిన్‌ అని ప్రచారం లోకి తెచ్చారు. శ్రీశైలం రిజర్వాయర్‌ వద్ద మామూలు సంవత్సరాల్లో చూస్తే దాదాపుగా 400టీ ఎంసీలకు తక్కువ గాకుండా అందుబాటులో ఉంటాయి. వర్షపాతం మెరుగ్గా ఉన్న సంవత్సరాల్లో కనీసం 700 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు కృష్ణా నది ఒడ్డునే కృష్ణా బేసిన్లోనే ఉన్న మహబూబ్‌ నగర్‌, నల్గొండ జిల్లాలలోని ప్రాంతాలకు నీటి కేటాయింపులు చేయలేదు. అదే సమయంలో కృష్ణా బేసిన్‌ అవల వందల కిలోమీటర్ల దూరాలలోఎక్కడెక్కడో ఉన్న ఆంధ్ర ప్రాంతాల కు నీటి కేటాయింపులు జరిగాయి. బేసిన్‌ ఆవలకు నికర జలాల కేటాయింపులే 350 టీఎంసీలు పైగా జరిగాయి. ఈ వాస్తవాన్ని ఆంధ్రప్రదేశ్‌ తరపున ట్రిబ్యునల్‌ ముందు సాక్షిగా పాల్గొన్న సుబ్బారావు కూడా అంగీకరించారు. ఈ కేటాయింపులు ఎట్లా చేశారన్న విషయం ఒకసారి చూద్దాం.

బచావత్‌ ట్రిబ్యునల్‌ ఎదుట నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం క్రిష్ణా డెల్టా, కెసికెనాల్‌, నాగార్జునసాగర్‌ కుడికాలువలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, వాటికి కేటాయింపులు చేసిన తర్వాతనే జూరాల ప్రాజెక్టు, ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టులకు కేటాయించాలని లిఖితపూర్వకంగా నివేదించింది. అట్లా కేటాయింపులకై డిమాండ్లు తమ ప్రాంత ప్రాజెక్టులకై ప్రథమ ప్రాధాన్యతతో అడిగినప్పటికీ, బచావత్‌ ట్రిబ్యునల్‌ ముందుచూపుతో రాష్ట్రాలకు చేసిన కేటాయింపులు గంపగుత్త (enbolc) కేటాయింపులని స్పష్టం చేశారు. అంటే, నాటి ఆంధ్రప్రదేశ్‌కు చేసిన కేటాయింపులు 811 టీఎంసీలు ఆయా ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్‌ ఉంచిన డిమాండ్ల ప్రకారంగా కాకుండా, రాష్టంలో అవసరాన్ని బట్టి ఏ ప్రాజెక్టు వద్ద అయినా వాడుకునే వెసులుబాటు ఉంది. బచావత్‌ గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీలను నాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీఓల ద్వారా పునః కేటాయింపులు జరిపింది. తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు 299 టీఎంసీలు, ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టులకు 512 టీఎంసీలు కేటాయింపులు చేసింది. వాటిలో కూడా తెలంగాణ ప్రాంత కేటాయింపులేమో ఇక్కడి వర్షపాతంపై ఆధారపడే మైనర్‌, మీడియం ప్రాజెక్టులకు చేసింది. (తెలంగాణ మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కేటాయించిన 90 టీఎంసీలలో సరాసరి 30 టీఎంసీలు కూడా రావడంలేదు.) కర్ణాటక నుండి వచ్చే కృష్ణా, తుంగభద్రా నది ప్రవాహాలపై ఆధారపడే ఆంధ్ర, రాయలసీమ మేజర్‌ ప్రాజెక్టులకు కేటాయింపులు చేసింది. ఇట్లా పలువిధాలుగా తెలంగాణ వినియోగాలను అన్యాయంగా కట్టడి చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. అవే వినియోగాలు కొనసాగాలని నేడు బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ వద్ద వాదిస్తున్నది విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. కృష్ణా నదిలో పంచడానికి నికర జలాలు లేవు అనడం అంటే తెలంగాణాకు దక్కవలసిన న్యాయమైన వాటాను నిరాకరించడమే.

అపోహ 2 :

విభజన తర్వాత ఎగువన ఉండే తెలంగాణా వలన ఆంధ్రకు కృష్ణా జలాల్లో నష్టం వాటిల్లుతుంది. కృష్ణా బేసిన్లో ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణా దూకుడుగా వ్యవహరిస్తున్నది.

99.5 శాతం తెలంగాణ భూభాగం కేవలం గోదావరి, క్రిష్ణా నది పరీవాహక ప్రాంతాల్లోనే ఉంటే, ఆంధ్ర ప్రదేశ్‌ భూభాగం ఈ రెండు నదుల పరీవాహక ప్రాంతాల్లో 21.5 శాతం మాత్రమే ఉంది. తెలంగాణ రాష్ట్రానికి గోదావరి క్రిష్ణా నదులు తప్ప వేరే ఆధారమే లేదు. ఆంధ్రప్రదేశ్‌ కు దాదాపుగా 80 శాతం భూభాగం ఇతర నదుల పరీవాహక ప్రాంతాలలో ఉంది. కోస్తాంధ్రలో వర్షపాతం ఎక్కువ. ఈశాన్య ఋతుపవనాల వల్ల కూడా వర్షపాతం వస్తుంది. కోస్తాంధ్రలో భూగర్భ జలాల లభ్యత కూడా చాలా ఎక్కువ. వాస్తవాలు ఇట్లా ఉంటే, గోదావరి క్రిష్ణా నదీ జలాల మీదనే ఆంధ్రప్రదేశ్‌ సాగు ఆధారపడి ఉన్నది అనడం పూర్వం నుంచి ఉన్న ఒక అపోహ. 68.50 శాతం తెలంగాణ ప్రాంతం కృష్ణా బేసిన్లో ఉంటుంది. కృష్ణా బేసిన్లో ఆంద్ర ప్రాంతం కేవలం 22.50 శాతం మాత్రమే. క్రిష్ణా నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్‌ ఆయకట్టుకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ తరువాతే తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాలి అనడం ఎంతవరకు న్యాయం?
tsmagazine

కృష్ణా నది తెలంగాణలో ప్రవహించాకే ఆంధ్రప్రదేశ్‌ చేరతాయి. కనుక ఉపయోగ సరళి తెలంగాణకే అనుకూలం. ఆంధ్రప్రదేశ్‌ కావాలనుకున్నా తెలంగాణను ఇబ్బంది పెట్టలేదు. నిజానికి విభజన తర్వాత కృష్ణా బేసిన్లో ప్రాజెక్టుల నిర్మాణాలపై తెలంగాణ చురుకుగా వ్యవహరిస్తోంది. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసుకొని నీటిని సాగు, తాగునీటి అవసరాల కొస సరఫరా చేస్తున్నది. క్రిష్ణా నదీ జలాలను ఇప్పటికే బచావత్‌ ట్రిబ్యునల్‌ నికర జలాల పంపకాలు చేసింది. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ మిగులు జలాల పంపకాలు చేసింది. ఈ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చినందున తీర్పు అమల్లోకి రాలేదు. అయితే రాష్ట్ర విభజన తర్వాత బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకాల ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ లోపల రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ తాత్కాలిక పద్దతిన 299 (తే) : 512 (ఆంప్ర) నిష్పత్తిలో జరపడానికి ఒప్పందం కుదిరింది. ఆ ప్రకారమే కృష్ణా బోర్డు ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ జరుగుతున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్నప్పుడు కూడా కర్ణాటక మహారాష్ట్రలు ఎగువ రాష్ట్రాలుగా ఉన్నాయి. అప్పుడు లేని సమస్య తెలంగాణ రాష్ట్రం ఎగువ రాష్ట్రంగా ఏర్పడినందువల్లనే వస్తుందా? విభజన తర్వాత కూడా కర్ణాటక, మహారాష్ట్రలు గోదావరి, క్రిష్ణా నదుల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లకు ఎగువ రాష్ట్రాలుగా ఉంటాయి. మరి వాటివల్ల లేని సమస్య కేవలం తెలంగాణ వల్లనే ఎందుకు ఉంటుంది? వాటి విషయంలో ట్రిబ్యునల్‌ కేటాయింపుల ప్రకారం వినియోగాలు సాధ్యమైనప్పుడు తెలంగాణ విషయంలో అదే విధంగా ఉంటుంది కదా. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టం, 2014 లో గోదావరి, క్రిష్ణా యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేసి, ప్రాజెక్టుల నిర్వహణలో కేంద్ర బలగాలను వినియోగించాలని చేర్చారు. తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకున్నదే సాగునీటి రంగంలో తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని రూపుమాపడానికి. కాబట్టి కృష్ణా బేసిన్లో పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌ సాగర్‌, సాగర్‌లో లెవెల్‌ కాలువ, ఉదయసముద్రం ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసుకొని సాగుకు నీరు అందిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రం ఆమోదించి అటకేక్కించిన పాలమూరు రంగారెడ్డి, డిండీ ఎత్తిపోతల పథకాలను చేపట్టింది. నికర జలాల కేటాయింపులు ఉన్న ఆర్డీఎస్‌ ఆయకట్టుకు నీరు అందివ్వడానికి తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకాన్నిచేపట్టి 10 నెలల రికార్డు సమయంలో పూర్తి చేసింది. కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణా ప్రభుత్వం చురుకుగా వ్యవహరించడాన్ని ఎవరూ తప్పు పట్టడానికి వీలు లేదు.

అపోహ 3 :

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణాకు అన్యాయం జరగలేదు. ఈ రోజు పాత మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కృష్ణా జలాల ఆధారంగా(నికరం మిగులు) 142 టిఎంసి ల వినియోగానికి సుమారు 10 లక్షల ఎకరాల సాగుకి ప్రాజెక్టులు పూర్తి అయినాయి లేక పూర్తి కాబడుతున్నాయి. అలాగే పాత నల్గొండ జిల్లాలో 135 టిఎంసిల కృష్ణా జలాల వినియోగానికి 8 లక్షల ఎకరాల సాగుకి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించినవే. ఇక అన్యాయం జరిగింది ఎక్కడ?’

నిజానికి తెలంగాణ ఏర్పడక ముందే కృష్ణా నదీ జలాల పంపిణీ విషయంలో తెలంగాణకు వివక్ష చూపించిన కారణంగా వంద శాతం బేసిన్లో ఉన్న మహబూబ్‌ నగర్‌, నల్లగొండ జిల్లాలు దారుణంగా నష్టపోయినాయి. కృష్ణా బేసిన్లో లేని ఆంద్ర, రాయలసీమ ప్రాంతాలు గణనీయంగా లాభపడినాయి. తెలంగాణా విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అవే వినియోగాలను కొనసాగించాలని నేడు ట్రిబ్యునల్‌ ముందు వాదిస్తున్నది. తుంగభద్ర నది నుండి వచ్చే నీటిపై ఎగువన ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలు ఉంటాయి తప్ప తెలంగాణ కాదు. తుంగభద్ర నదిపై ఆంధ్రప్రదేశ్‌ కు 100 టీఎంసీల పైగా కేటాయింపులుంటే, అక్కడనుండి తెలంగాణకు కేవలం ఆర్డిఎస్‌ కి 15.90 టీఎంసీలు మాత్రమే కేటాయింపులున్నాయి. ఆర్డిఎస్‌ పరిస్తితి ఏమిటో మనకు తెలిసిందే. ఏటా సగటున 6 టిఎంసిలు కూడా రావడం లేదు. ఆర్డిఎస్‌ కింద ఉన్న కేసి కెనాల్‌ కేటాయింపులకు రెట్టింపు నీళ్ళు వాడుకుంటుంటే ఆర్డిఎస్‌కు కేటాయింపుల్లో మూడవ వంతు కూడా రావడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ఆర్డిఎస్‌ ఆధునీకరణ పనులను విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ నాలుగేండ్లుగా అడ్డుకుంటున్నది. శ్రీశైలం జలాశయ నిర్వాహణ ఆంధ్రప్రదేశ్‌ చేతుల్లో ఉండటం మూలంగా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా కృష్ణా బోర్డు అనుమతి లేకుండా నీటిని తరలిస్తూనే ఉన్నది. తరలించిన నీటిని తక్కువ చేసి చూపుతున్నది. ఈ నీటి చౌర్యాన్ని తెలంగాణా ఇంజనీర్లు సాక్షాలతో కృష్ణా బోర్డు ముందు పెట్టినారు. ఆ తర్వాతనే నీటిని వినియోగాన్ని కొలవడానికి ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రి విధానాన్ని కృష్ణా బోర్డు అమల్లోకి తెచ్చింది.tsmagazine

శ్రీశైలం జలాశయాన్ని నింపడానికే ప్రాధాన్యతను ఇస్తూ దిగువన నాగార్జునసాగర్‌ ఆయకట్టు అవసరాలకు, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు నీటిని మాత్రం వదలడానికి ఆంధ్రప్రదేశ్‌ ముందుకు రావడం లేదు. వీటి కోసం బోర్డు వద్ద తెలంగాణా పోరాటం చెయ్యవలసి వస్తున్నది. వాస్తవం ఇట్లా ఉంటే ఎవరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నట్టు? ఇక క్రిష్ణా నది ద్వారా, భీమా నదిపై వచ్చే నీటిలో తెలంగాణకు నికరజలాల కేటాయింపు నామ మాత్రమే ఉంది. శ్రీశైలం వద్ద ఒక్క టీఎంసీ కూడా నికర జలాల కేటాయింపులు తెలంగాణకు చేయలేదు. మిగులు జలాలలో కూడా ఆంధ్రప్రదేశ్‌ తో పోలిస్తే చాలా తక్కువ కేటాయింపు చేశారు. వాటినే కొనసాగించాలని కోరుతున్నది ఆంధ్రప్రదేశ్‌.

ఈ రోజు పాత మహబూబ్‌ నగర్‌ జిల్లాలో కృష్ణా జలాల ఆధారంగా(నికరం మిగులు) 142 టిఎంసిల వినియోగానికి సుమారు 10 లక్షల ఎకరాల సాగుకి ప్రాజెక్టులు పూర్తి అయినాయి లేక పూర్తి కాబడుతున్నాయి. అలాగే పాత నల్గొండ జిల్లాలో 135 టిఎంసిల కృష్ణా జలాల వినియోగానికి 8 లక్షల ఎకరాల సాగుకి ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించినవే’ అని పేర్కొంటూ ‘ఇక అన్యాయం జరిగిది ఎక్కడ?’ అని ఆంద్ర మేధావులు ప్రశ్నిస్తున్నారు. మహబూబ్‌ నగర్‌ , నల్లగొండ జిల్లాలు వంద శాతం కృష్ణాబేసిన్‌లో ఉన్న జిల్లాలు. ఈ జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టులలో నికర జలాలకేటాయింపులు ఉన్నవి ఏవి? మిగులు జలాల కేటాయింపులు ఉన్నవి ఏవీ? ఈ వింగడింపు చేసి మాట్లాడితే న్యాయంగా ఉంటుంది. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో నికర జలాల కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులు జూరాల (17.84 టిఎంసి), రాజోలిబండ (15.9టిఎంసి), భీమా (20టిఎంసి) మాత్రమే. కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు లేవు. రాజోలిబండ కింద అందుతున్న నీరు సగటున 6 టిఎంసిలకు మించడం లేదని రికార్డులు చెపుతున్నాయి. ఇక నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్‌ ఎడమకాలువకు (105 టిఎంసి), మూసి ప్రాజెక్టుకు (9.40 టిఎంసి)లు మాత్రమే. నల్లగొండ జిల్లాలో చేపట్టిన AMRP, డిండీకి నికర జాలాల కేటాయింపులు లేవు. ఇవి బేసిన్‌ లో ఉన్న ప్రాజెక్టులు కాబట్టి తెలంగాణా ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు జరగాలని పోరాడుతున్నది.

అపోహ 4 :

పాలమూరు రంగారెడ్డి, డిండీ ప్రాజెక్టులు కొత్తవి. విభజన చట్టం ప్రకారం వీటికి అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి కావాలి. తెలంగాణా ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రాజెక్టులు నిర్మిస్తున్నది.

పాలమూరు రంగారెడ్డి, డిండీ ప్రాజెక్టులు కొత్తవి కావు. ఇవి ఉమ్మడి ప్రభుత్వం అనుమతించిన ప్రాజెక్టులే అన్నది అబద్దమా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం డిండీ ప్రాజెక్టుకు 2007 లో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 2013 లో అనుమాతులు మంజూరు చేసింది. ఉమ్మడి రాష్ట్రం అనుమతించిన ప్రాజెక్టులు విభజన చట్టంలో పేర్కొన్న నిబందనల పరిధిలోకి రావు. వీటిని బోర్డులకు (KMRB,GMRB) నివేదించనక్కర లేదు. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి పొందనక్కెర లేదు. అయితే పాలమూరు, డిండీ ప్రాజెక్టులను ఉమ్మడి ప్రభుత్వం అనుమతించినప్పటికీ వాటిని అటకెక్కించినారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వీటిని అటక దించి దుమ్ము దులిపి నిర్మాణం ప్రారంభించింది. ఈ రెండు ప్రాజెక్టులు కూడా వంద శాతం కృష్ణా బేసిన్లో ఉన్నాయి కాబట్టి తెలంగాణా ప్రభుత్వం వీటికి కూడా నికరజలాల కేటాయింపులు జరగాలని కోరుతున్నది. 2016 లో ధిల్లీలో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆధారాలతో ఈ అంశాలను వివరించారు. అయినా కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పదేపదే అవే శికాయతులను చేస్తూనే ఉన్నది.

అపోహ 5 :

కృష్ణా నికర జలాల పంపినీ పూర్తి అయ్యింది. కనుక తెలంగాణా కోరుతున్నట్టు అదనపు కేటాయింపులు చేయడానికి కృష్ణాలో నీళ్ళే లేవు. నీళ్ళే లేనప్పుడు తెలంగాణాకు అదనపు కేటాయింపులు ఎట్లా సాధ్యం?

tsmagazine
నికర జలాలు ఎక్కడ నుంచి వస్తాయి అన్నది కీలకమైన ప్రశ్న. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన పరిశోధనలు జరిగినాయి. గతంలో 150 రోజుల పంట కాలాన్ని పరిగణనలోకి తీసికొని వరి పంటకు అవసరమయ్యే నీటి వినియోగాన్ని (Crop Water Requirement) లెక్కించినారు. ఇప్పుడు 120 రోజుల పంట కాలం కలిగిన వరి వంగడాలు ఉనికిలోకి వచ్చాయి. వరి పంటకు నిలువ నీరు అవసరంలేదు. ఆరుతడి పంటగా కూడా వరిని సాగు చేసే పద్దతులు అభివద్ధి అయినాయి. ఆరుతడి పద్దతిలో వరి సాగు వలన దిగుబడి కూడా గణనీయంగా పెరిగినట్టు నాగార్జునసాగర్‌ ఎడమకాలువ, శ్రీరాంసాగర్‌, నిజాంసాగర్‌ ఆయకట్టులో గత మూడేండ్లుగా సాగిన ప్రయోగాలు నిరూపించినాయి. పంట దిగుబడి పెరగడమే కాదు ఒక టిఎంసికి 13 వేల ఎకరాల వరి సాగుబడి అయ్యింది. కాబట్టి కృష్ణా డెల్టా రైతులు, నాగార్జునసాగర్‌ కుడికాలువ రైతులు, కె సి కాలువ రైతులు ఆరుతడి సాగు పద్దతికి మారక తప్పదు. కృష్ణా డెల్టా ఆయకట్టుకు పోలవరం ద్వారా, పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని సరఫరా చేసే వ్యవస్థ నిర్మాణం అయి ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ఏటా 100 టిఎంసిలకు పైగా డెల్టా ఆయకట్టుకు గోదావరి నీటిని సరఫరా చేస్తున్నది. కాబట్టి కృష్ణా డెల్టాకు కేటాయించిన 152 టిఎంసిల నీటిని తెలంగాణా ప్రాజెక్టులకు కేటాయించవచ్చు. నాగార్జునసాగర్‌ కుడి కాలువ ఆయకట్టుకు కూడా గోదావరి నుంచి నీటిని సరఫరా చేసే అవకాశం ఉన్నది. ఈ వాస్తవాలను ట్రిబ్యునల్‌ ముందు ఆంధ్రప్రదేశ్‌ తరపున సాక్ష్యం ఇస్తూ అంగీకరించినారు. మొత్తం మీద ఆంధ్రా ప్రాంత అవసరాలకు ఎటువంటి భంగం వాటిల్లకుండానే తెలంగాణాకు మరో 200 టిఎంసిల నికర జలాల కేటాయింపులు జరపడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వచ్చిన చిక్కు ఏమిటంటే కృష్ణాలో పంచడానికినీళ్ళే లేవు అనే ఘనీభవించిన మూసభావన నుంచి ఆంధ్రా పాలకవర్గాలు, మేధావులు బయటపడకపోవడం, 1960వ దశకంలో ప్రపంచ దేశాలు ఆమోదించిన హెల్సింకి రూల్స్‌లో ఉన్న న్యాయ భావనలను నిరాకరించడం.

Other Updates