వి.ప్రకాశ్‌

tsmagazine
జూలై 24న హైదరాబాద్‌లో ఫీల్‌ ఖానా (ఘోషా మహల్‌)లోని స్వగృహంలో మరణించిన మాజీ ఉపముఖ్యమంత్రి, ప్రముఖ తెలంగాణా వాది కొండా వెంకట రంగారెడ్డి అంత్యక్రియలు మరునాడు (జూలై 25) సకలవిధ ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో అంబర్‌పేట స్మశాన వాటికలో జరిగాయి.

అధికార లాంఛనాలతో నిర్వహించడానికి తొలుత కాసు బ్రహ్మానంద రెడ్డి (ముఖ్యమంత్రి) అంగీకరించలేదని, తెలంగాణ వాదులు శాసన సభలో ఆందోళన చేయడంతో ఆయన అందుకు ఒప్పుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
కె.వి. రంగారెడ్డి నివాస భవనానికి వెళ్ళి ఆయన భౌతిక దేహాన్ని కడసారి దర్శించి నివాళులర్పించిన ప్రముఖులలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమరయ్య, మేయర్‌ లక్ష్మినారాయణ, ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి, ఉపముఖ్యమంత్రి జె.వి. నర్సింగారావు, ఉప సభాపతి వాసుదేవ నాయక్‌, స్వతంత్ర పార్టీ నేత గౌతులచ్చన్న, పిసిసి అధ్యక్షులు పి. నరసారెడ్డి, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్‌ బాపూజీ, కేంద్ర సహాయ మంత్రి ఎం.ఆర్‌. క్రిష్ణ, టి.ఆర్‌.సి. అధ్యక్షులు చొక్కారావు, ఉస్మానియా విశ్వ విద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ రావాడ సత్యనారాయణ, మాజీ వి.సి. డి.ఎస్‌. రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, శాసన సభ్యులు, తెలంగాణ వాదులు ఉన్నారు. ఉదయం 10.45 గంటలకు కె.వి. రంగారెడ్డి

భౌతిక కాయాన్ని అంతిమ దర్శనం కోసం ఇంటిముందు బల్ల పై వుంచగా తొలుత ఆయన దేహంపై పుష్పమాలను పెట్టి డా|| మర్రి చెన్నారెడ్డి నివాళులర్పించారు. దివంగత నేతకు స్వయానా మేనల్లుడైన డా. చెన్నారెడ్డి పై కె.వి. రంగారెడ్డి ప్రభావం ఎంతో వుంది.

కె.వి. రంగారెడ్డి స్వగ్రామమైన చేవెళ్ళ తాలూకాలోని పెద్ద మంగళారం గ్రామ ప్రజలు ట్రక్కులలో వచ్చి తమ ప్రియతమ నాయకున్ని కడసారి సందర్శించారు. తెలంగాణ నేతలతో బాటు పలువురు ఆంధ్ర ప్రాంత ఎం.ఎల్‌.ఏలు, ఆంధ్ర కాంగ్రెస్‌ (పాత) కమిటీ అధ్యక్షులు జి. బ్రహ్మయ్య, ఉన్నతాధికారులు, ప్రముఖ పౌరులు, సంఘంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు, వెనుకబడిన తరగతుల

ప్రముఖులు, జమీయత్‌-ఉల్‌-ఉలేమా మజ్లీస్‌, ఇతర రాజకీయ పార్టీల నాయకులు, కార్పొరేటర్లు, కె.వి. రంగారెడ్డి నివాసానికి వచ్చి నివాళులర్పించారు.

మధ్యాహ్నం పోలీస్‌ శకటం పైకి రంగారెడ్డి భౌతిక కాయాన్ని ఎక్కించారు. సాయుధ రిజర్వు పోలీసులు ఆయుధాలు తలక్రిందులుగా పట్టుకొని, పోలీసు బ్యాండ్‌ విషాద గీతం ఆలపిస్తూ ఉండగా పోలీసు శకటం పురవీధుల గుండా మోజం జాహీ మార్కెట్‌, ఆబిడ్స్‌, రెడ్డి హాస్టల్‌, సుల్తాన్‌ బజార్‌, వీర సావర్కర్‌ చౌరస్తా, కాచిగూడ, నింబోలి అడ్డల ద్వారా అంబర్‌పేట స్మశాన వాటికకు చేరింది. ఈ కొద్ది దూరం ప్రయాణించడానికి మూడున్నర గంటలు పట్టింది. వీధుల్లో ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరి కె.వి. రంగారెడ్డి అంతిమ యాత్రను అశ్రునయనాలతో దర్శించారు. శవపేటికను ఉంచిన వాహనంపై డా. మర్రి చెన్నారెడ్డి, కె.వి. రంగారెడ్డి కుమారుడు హరిశ్చంద్రారెడ్డి, ఎం.ఎల్‌.సి. ఎస్‌. వెంకట్రామారెడ్డి, శాసన సభ్యులు మాణిక్‌ రావు తదితరులు ఉన్నారు. కుటుంబ సభ్యులు కార్లలో అనుసరించారు.

భౌతిక కాయంపై తెలంగాణ పతాకాన్ని కప్పినారు. త్రోవలో నింబోలిఅడ్డ వద్ద విద్యా మంత్రి పి.వి. నరసింహారావు, పిసిసి అధ్యక్షులు పి. నరసారెడ్డి, పి.సి.సి. ప్రధాన కార్యదర్శి ఎస్‌. జైపాల్‌ రెడ్డి, ఊరేగింపులో కలిసి దివంగత నేత భౌతిక కాయం పై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. దారి వెంట ఎందరో ప్రజా సంఘాల నేతలు కూడా రంగారెడ్డి భౌతిక కాయంపై పుష్పగుచ్చాలు

ఉంచి ‘జై తెలంగాణ’, ‘తెలంగాణ పితామహ అమర్‌ రహే’ నినాదాలిచ్చారు.

రెడ్డి హాస్టల్‌ సమీపంలో అంతిమయాత్ర కొద్ది సేపు ఆగింది. హాస్టల్‌ విద్యార్థులు పెద్ద సంఖ్యలో వచ్చి తమ దివంగత నేతకు ‘జై తెలంగాణ’ నినాదాలతో నివాళులర్పించారు. రెడ్డి హాస్టల్‌ వ్యవస్థాపకులలో కె.వి. రంగారెడ్డి ముఖ్యులు.

అంతిమ యాత్ర వెంట వెళ్ళిన వారిలో ప్రముఖ తెలంగాణ నేత కొండా లక్ష్మణ్‌ బాపూజీ, శాసన సభ్యులు బద్రీ విశాల్‌ పిట్టీ, టి. అంజయ్య, మున్సిపల్‌ కార్పోరేషన్‌ కౌన్సిలర్లు, ప్రముఖ తెలంగాణ వాదులు కూడా ఉన్నారు.

ముఖ్య మంత్రి బ్రహ్మానంద రెడ్డి, ఉప ముఖ్యమంత్రి జె.వి. నర్సింగా రావు, శాసన మండలి అధ్యక్షులు పి. రంగారెడ్డి, రవాణా మంత్రి డా|| ఎం. లక్ష్మీనరసయ్య, ఉస్మానియా వి.సి. రావాడ సత్యనారాయణ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమురయ్య, హైదరాబాద్‌ జిల్లా పరిషత్‌ అధ్యక్షులు భోజరెడ్డి, పలువురు మంత్రులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, బంధువులు, విద్యార్థులు అంబర్‌పేట స్మశాన వాటిక వద్ద వేచి వున్నారు. బ్రహ్మానందరెడ్డి దివంగత నేత భౌతికకాయం పై పూలమాల ఉంచుతున్నప్పుడు, తరువాత ఆయన మంచిగంధపు చెక్కలను చితికి అంటిస్తున్నప్పుడు ‘జై తెలంగాణ’ నినాదాలు మిన్నుముట్టాయి. శవదహనమయ్యేంత వరకు ముఖ్యమంత్రి ఉద్విగ్నులై ఉండిపోయారు. నినాదాలు ఆపాలని డా|| చెన్నారెడ్డి విజ్ఞప్తి చేశారు. జ్యేష్టపుత్రుడైన హరిశ్చంద్రారెడ్డి తండ్రి భౌతిక కాయానికి నిప్పటిస్తుండగా పోలీసు బృందం చరమగీతం ఆలపిస్తూ గౌరవ వందనం సమర్పించారు. గాల్లోకి తుపాకులు కాల్చారు.

తెలంగాణ చరిత్రలో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని పొందిన కె.వి. రంగారెడ్డి భౌతిక దేహాన్ని అగ్నిజ్వాలలు దహిస్తుండగ విషణ్ణ వదనాలతో, అశృనయనాలతో ప్రజలు, నేతలు స్మశానవాటిక నుండి వెనక్కి మరలినారు.

కె.వి. రంగారెడ్డికి నివాళులర్పిస్తూ ‘ఆంధ్రప్రభ’ జూలై 26 (ఆదివారం) దినపత్రికలో రాసిన సంపాదకీయంలోని కొన్ని వ్యాఖ్యలు…

  • శ్రీ రంగారెడ్డి నీతి, నిజాయితీలు, వ్యక్తిత్వము గల నాయకులు
  • అ చిన్ననాడు పేదరికంలో వుండి కష్టించి చదువుకుని విలువలు తెలుసుకున్న వారు కావడం చేత వీరు విద్యావ్యాప్తికై విద్యాలయాలు, విద్యార్థి వసతి గృహాల స్థాపనకై ఎంతో కృషి చేసారు. శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం, ఆంధ్ర సారస్వత పరిషత్తు భాషా నిలయం, ఆంధ్ర సారస్వత పరిషత్తు, వేమన ఆంధ్ర భాషా నిలయం మున్నగు సంస్థలతో వీరికి గల సంబంధం ఆంధ్ర సారస్వతంలో వీరికి గల మక్కువను తెలియజేస్తుంది.
  • అ మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా వీరు కీర్తి గడించారు. ఏ విషయంలో నైనా కేవలం ఉద్యోగుల మీదనే ఆధారపడక స్వతంత్రంగా పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకునేవారు. ఆఫీసు ఫైల్స్‌ పై వీరి నిర్ణయాలు న్యాయస్థానాల్లో జడ్జీల తీర్పును పోలివుండేవని ప్రఖ్యాతి వచ్చింది.
  • అ చిత్తశుద్ధితో పనులు నిర్వహించడంలో శ్రీ రంగారెడ్డి ఆదర్శప్రాయులు. న్యాయశాస్త్రంలోనూ, రెవెన్యూ విషయాలలోనూ వీరికి అఖండ ప్రజ్ఞ ఉండేది. ఆంగ్లంలో న్యాయ శాస్త్ర విద్యనభ్యసించక పోయినా ఎక్కడెక్కడి హైకోర్టుల తీర్పులను ఉదహరిస్తూ న్యాయస్థానాల్లో వీరు చేస్తుండే వాదాలు బూర్గుల రాంకిషన్‌ రావు వంటి జూనియర్‌ న్యాయవాదులకు అచ్చెరువు గొలుపుతూ వుండేది.
  • అ రెవెన్యూ విషయాలలో వీరి విశేష పరిజ్ఞానానికి ఆంధ్ర ప్రదేశ్‌ అంతటా శిస్తు హెచ్చింపు ప్రయత్నం సందర్భంలో వీరు చేసిన ప్రసంగాలే ప్రబల సాక్ష్యం.

సంతాప సూచకంగా ప్రభుత్వ సెలవు

జూలై 25 (శనివారం)న కె.వి. రంగారెడ్డి మృతికి సంతాపం తెలుపుతూ హైదరాబాద్‌ జిల్లాలోని, జంటనగరాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై జెండాలను అవనతం చేసారు. హైదరాబాద్‌లోని విద్యా సంస్థలు, దుకాణాలను నిర్వహకులు స్వచ్ఛందంగా మూసివేశారు.
(వచ్చే సంచికలో… పోచంపాడు

ప్రాజెక్టు ప్రారంభోత్సవం)

Other Updates