magaరాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను పలు శాఖల కార్యదర్శులను కలిశారు. మొదట కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా పత్తి కొనుగోలు కేంద్రాల పెంపునకు, పత్తికి మద్దతు ధర కల్పించేలా చొరవ చూపాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం పత్తి సాగు 5 లక్షల హెక్టార్లలో అదనంగా సాగుకానున్న నేపథ్యంలో దాదాపు 143 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరామని మంత్రి తెలిపారు. గత సంవత్సరం కేవలం 85 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పత్తి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని కేంద్ర మంత్రికి వివరించామని తెలిపారు. మెదక్‌, నల్గొండ, ఆలేరు, సూర్యాపేటలలో ఉన్న సీసీఐ సబ్‌ సెంటర్‌ని, వరంగల్‌కి మార్చాలని విజ్ఞప్తి చేశామని మంత్రి తెలిపారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో తెలంగాణలో పర్యటించాలని జౌళి శాఖ కార్యదర్శి అనంత్‌ కుమార్‌ సింగ్‌ ను ఆదేశించారని తెలిపారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌ సింగ్‌తో భేటి అయిన రాష్ట్ర మంత్రి హరీష్‌ ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించారు. పెసర్లకు మద్దతు కల్పించాలని కోరారు. కేంద్ర వ్యవసాయ శాఖ, ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 1న అన్ని పంటలకు ఎమ్‌ఎస్‌పిని నిర్ణయిస్తుందని కానీ, తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్‌ మొదటి వారంలోనే పెసర్ల అమ్మకాలు జరుగుతున్నాయి కాబట్టి పెసరు రైతులు క్వింటల్‌కి దాదాపు వెయ్యి రూపాయలు నష్టపోతున్నారని కేంద్ర మంత్రికి వివరించామన్నారు. ఎమ్‌ఎస్‌పి లో మార్పులు తీసుకువచ్చి, తెలంగాణ రైతులను ఆదుకోవాలని కోరామని మంత్రి పేర్కొన్నారు. ఈ – నామ్‌ అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ మార్కెట్‌ యార్డ్‌ అగ్రస్థానంలో నిలిచి ప్రధాని చేతుల మీదుగా అవార్డు దక్కించుకుందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 58 ఈ – నామ్‌ సెంటర్లను కేటాయించారని, అయితే ఒక్కో ఈ – నామ్‌ సెంటర్‌ కి 75 లక్షల రూపాయలు రావాల్సి ఉండగా, కేవలం 30 లక్షల రూపాయలను మాత్రమే విడుదల చేశారని, మిగిలిన 45 లక్షల రూపాయల బకాయిలను సైతం వెంటనే విడుదల చేయాలని కోరామని మంత్రి వివరించారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా రాజన్న సిరిసిల్ల జిల్లా, మహబూబ్‌ నగర్‌ జిల్లాలకు కృషి విజ్ఞాన్‌ కేంద్రాలను నూతనంగా ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దాదాపు వెయ్యి కోట్లతో సుమారు 18 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న గోదామ్‌ ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని కేంద్ర మంత్రికి వివరించామని మంత్రి తెలిపారు. అయితే ఆర్కేడీవై పథకంలో భాగంగా గోదామ్‌ ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్రానికి బకాయి ఉన్న 132 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కోరామని మంత్రి వివరించారు. ఈ నాలుగు అంశాలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌, త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కారిస్తామని హామి ఇచ్చారని మంత్రి హరీష్‌ రావు తెలిపారు. చివరగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్‌ నారాయణ ఝాతో సమావేశమైన రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పర్యావరణ, అటవీ శాఖ అనుమ తులపై చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కు సంబంధించిన తొలి దశ అనుమతుల మంజూరు ఆలస్యం అవుతున్న విషయాన్ని కేంద్ర పర్యా వరణ, అటవీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్‌ నారాయణ ఝా దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. అయితే దీనిపై సానుకూలంగా స్పందించిన కార్యదర్శి అజయ్‌ నారాయణ ఝా త్వరలో అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మొదటి దశ అనుమతులు మంజూరు కానున్నట్లు వివరించారు. కేంద్ర మంత్రులు, కార్యదర్శులను కలిసిన వివిధ సమావేశాల్లో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావుతో పాటు, పార్లమెంట్‌ సభ్యులు జితేందర్‌ రెడ్డి, బి.వినోద్‌ కుమార్‌, గుత్తా సుఖేందర్‌ రెడ్డి, తెలంగాణ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Other Updates