వి.ప్రకాశ్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని 1970 మార్చి 8వ తేదీలోపు ఏర్పాటు చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని తెలంగాణ కళాశాలల, పాఠశాలల విద్యార్థులు కేంద్ర ప్రభుత్వానికి తుది హెచ్చరిక చేశారు. తరగతులను బహిష్కరిస్తామని ప్రకటించారు. మార్చి ఒకటిన ఆంధ్ర సారస్వత పరిషత్తు హాలులో విద్యార్థి ప్రతినిధుల సమావేశం తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సంఘం అధ్యక్షులు మల్లిఖార్జున్ అధ్యక్షతన జరిగింది.
ప్రత్యేక తెలంగాణ సాధించాలన్న ప్రజల ఆకాంక్షలకనుగుణంగా వ్యవహరించ వలసిందని సమైక్యవాదులైన శాసనసభ్యులను సమావేశం హెచ్చరించింది. ప్రాంతీయ సంఘానికి హెచ్చుఅధికారాలు ఇచ్చినందున, తెలంగాణా అభివృద్ధికి రూ. 45 కోట్లు టాేయించిన ఫలితంగా తెలంగాణ ఆందోళన తగ్గుముఖం పట్టిందని దేశీయాంగశాఖామంత్రి వి.సి. శుక్లా చేసిన ప్రకటనను ఈ సమావేశం గర్హించింది ప్రత్యేక తెలంగాణ లక్ష్య సాధనకై నిర్విరామ పోరాటం సాగించేందుకుగాను ఐకమత్యంగా ఉండవలసిందని విద్యార్థులకు ఈ సమావేశం విజ్ఞప్తి చేసింది. ప్రత్యేక తెలంగాణా కోసం జరుగుతున్న పోరాటం రెండవఘట్టం ప్రారంభమైందని, విద్యార్థులు అసంఖ్యాకంగా పాల్గొని విజయపథాలకు దారితీయాలని మల్లిఖార్జున్ కోరినారు. విద్యార్థి నాయకులు బి. వెంకటరెడ్డి, ఎస్. గోపాల్‌లను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ తీర్మానం చేశారు. ఆరువందలమంది విద్యార్థులు పాల్గొన్న ఈ సమావేశంలో మల్లికార్జున్‌తోపాటు విద్యార్థి నేతలు అబ్దుల్ రవూఫ్, జాఫర్ హుస్సేన్ ప్రసంగించారు.
శాసనసభలో తెలంగాణ ఎమ్మెల్యేల సమైక్యవాదం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలు లాభపడతారనేది స్వార్థపరులు చెప్పేమాట అని, ఆంధ్రప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో తెలంగాణ ప్రజల సమగ్ర వికాసము, అభ్యుదయము, శ్రేయస్సు ఆధారపడి ఉన్నదని ఫిబ్రవరి 28న శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో పాల్గొన్న పి. నర్సారెడ్డి అన్నారు.
తెలంగాణ మిగులు నిధులు, నిబంధనల ప్రకారం రావలసిన ఉద్యోగాలు, కలిసికూర్చొని సామరస్యంతో పరిష్కరించుకోవాలని, తెలంగాణ ఉద్యమమనేది తెలంగాణ ప్రజల శ్రేయస్సు కాదని నర్సారెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ధనికులయిన భూస్వా ముల ఉద్యమమని నర్సారెడ్డి అన్నారు. పోచంపాడు ప్రాజెక్టుగా గోదావరి ఉత్తరకాలువ విస్తృత పథకంతోసహా అమలు చేసిననాడు తెలంగాణ బీద ప్రజానీకానికి ఆశాజ్యోతి సాక్షాత్కరించగలదని నర్సారెడ్డి అన్నారు. స్వార్థపరులైన ప్రత్యేక తెలంగాణవాదులు కొందరు విశాలదృష్టిగల విశాలాంధ్రవాదులను సంకుచిత, అల్పదృష్టితో విమర్శిస్నున్నారని, ప్రత్యేక తెలంగాణ వస్తే భూతల స్వర్గం ఏర్పడుతుందని భ్రమలు కొలిపితే ప్రజలు మోసబోరని ఆదిలాబాద్ ఎమ్మెల్యే గెడ్డన్న అన్నారు. పెద్ద రాష్ట్రమైనప్పుడు పెద్ద పథకాలు అమలు జరిగి కార్మికులకు మంచి వేతనాలు లభిస్తాయని, గిరిజనులకు, హరిజనులకు, దీన జనులకు అనంతమైన లాభాలు రాగలవని గెడ్డన్న అన్నారు. గెడ్డన్న ప్రసంగానికి మరో సభ్యుడు మాణిక్‌రావు అడ్డుతగులుతూ ఉప ముఖ్యమంత్రి ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని పనులు జరిగాయని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి (జె.వి. నరసింగారావు) స్వార్థ, సంకుచిత దృష్టిలేని విశాల హృదయంగల పసందైన మనిషి. రాష్ట్రం మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుంటూనే ఆదిలాబాద్ జిల్లాకు చేయవలసిన సేవ చేశారని గెడ్డన్న బదులిచ్చారు. అయితే 13 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు ఏమి జరిగిందని ఈశ్వరీబాయి అడుగగా… గెడ్డన్న జవాబిస్తూ-విద్యాలయాలు, ఆసుపత్రులు, నీటి వనరులు వృద్ధి అయినాయని చూడదలుచుకుంటే కనిపించ గలదన్నారు.
ఇంజినీరింగ్ సీట్లపై వివాదం
హైదరాబాద్‌లోని నాగార్జున ఇంజినీరింగ్ కాలేజీలో ముల్కీల అన్ని సీట్లు టాేయిస్తూ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ప్రగడ కోటయ్య, జి. వెంకటరెడ్డి, సి.వి.. రావు, మరో తొమ్మిదిమంది ఇచ్చిన సావధాన తీర్మానంపై శాసనసభలో విద్యామంత్రి పి.వి. నరసింహారావు సమాధాన మిచ్చారు. నాగార్జున ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశం వేలం ముల్కీ సర్టిఫిట్‌ె ఉన్నవారికి మాత్రమే లభిస్తుంది. తెలంగాణ ప్రాంతీయ సంఘం నిర్ణయం ప్రకారం ప్రభుత్వం ఈ పద్ధతిని అవలంభించిందని పి.వి. శాసనసభలో ప్రకటించారు. ఈ కళాశాలలో 60 సీట్లు వున్నాయని, తెలం గాణవారు కానివారు కూడా కొందరు సీట్లు పొందినారని, ఇటువంటి కళాశాల మరొకటి విశాఖపట్నంలో ూడా వున్నదని పి.వి. అన్నారు. ముల్కీలకు మాత్రమే ప్రవేశం ఈ ఒక్క కళాశాలలోనే గాక వైద్య, ఇతర కళాశాలల్లో కూడా వున్నదన్నారు. ఈ కళాశాలకు నిర్ణయించిన సీట్లు 60 కాగా, రాజధాని నగరంలో నివసిస్తున్న తెలంగాణేతరులు (నాన్ ముల్కీల) ఇబ్బందుల దృష్ట్యా ప్రాంతీయ సంఘంతో చర్చించి సీట్ల సంఖ్య మరో ఇరవైకి పెంచాలని ప్రయత్నిస్తున్నామని పి.వి. అన్నారు. దీనిపై ప్రగడ కోటయ్య స్పందిస్తూ… ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తున్నదని, తెలంగాణ వారిని సంతృప్తి పర్చాలనే ఉద్దేశ్యంతో ఆంధ్రులకు అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. ఇటువంటి చర్యలవల్ల ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ ధోరణికి దోహదం చేస్తున్నదని, ప్రభుత్వమే చేతులారా విభజనకు పూనుకున్నదని అన్నారు.ప్రాంతీయ సంఘం నిర్ణయాలకు ప్రభుత్వం కట్టుబడి వుండాలని విద్యామంత్రి పి.వి. అనగా, ఈ సంఘం నిర్ణయాలు సిఫార్సులు మాత్రమే. కట్టుబడి వుండాలని ఎక్కడాలేదని కోటయ్య అనగా విద్యామంత్రి పి.వి. బదులివ్వలేదు. నాన్‌ముల్కీలకోసం రాజధానిలో ప్రత్యేక కళాశాలను ఏర్పాటు చేయాలని జి. వెంకటరెడ్డి కోరినారు.
ప్రధానికి ఎంపీల అల్టిమేటం
తెలంగాణ ప్రాంత అధికార కాంగ్రెస్ ఎంపీలు ఆరుగురు ప్రధానిని కలిసి తెలంగాణాపై మార్చి 8లోపు తగు నిర్ణయం తీసుకోవాలని కోరినారు. రెండు ప్రత్యామ్నాయ మార్గాలను వారు ప్రధాని ముందు ప్రస్తావించారు. ఒకటి) ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు అంగీకరించాలి (లేదా) రెండు) ప్రత్యేక తెలంగాణా అంశంపై జనవాక్య సేకరణ జరపాలి. ఈ రెండు ప్రత్యామ్నాయాలలో ఏదో ఒక దానిని ఆమోదించకపోతే మార్చి 8 తర్వాత తమ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా ఇవ్వడంగానీ లేదా తామంతా ప్రతిపక్ష స్థానాల్లో కూర్చోవడం జరుగుతుందని ఈ 6గురు సభ్యులు ప్రధానికి తేల్చి చెప్పారు.
ప్రధానిని కలిసిన ఎంపీలు: ఆర్. సురేందర్‌రెడ్డి, జి. వెంకటస్వామి, శ్రీమతి సంగెం లక్ష్మీబాయి, డా|| జి.ఎస్. మేల్కోటే, ముత్యాలరావు, గంగారెడ్డి. వీరితోబాటు తెలంగాణకు మద్దతిస్తున్న ఈ ప్రాంత ఇతర పార్లమెంటు సభ్యులుః బాకర్ అలీ మీర్జా, పండిట్ నారాయణరెడ్డి (ఇండిపెండెంట్), రాజా రామేశ్వరరావు (పాత కాంగ్రెస్), ఇద్దరు మంత్రులు ఎం.ఆర్. కృష్ణ, యూనస్ సలీం. ఈ ప్రాంతంనుండి గెలిచిన మరో ఇద్దరు ఎంపీలు జి.ఎస్.రెడ్డి, లక్ష్మీకాంతమ్మలు ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డికి మద్దతుగా సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించా లంటున్నారు.తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీ బాకర్ అలీ మీర్జా మార్చి 3న పార్లమెంట్‌లో బడ్జెట్‌పై చర్చలో పాల్గొంటూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరినారు. తెలంగాణ ఆందోళన అపూర్వమైనదని, ఈ ఆందోళనలో ఎంతోమంది మరణించినా న్యాయ విచారణ జరుపలేదని ఆయన ఆవేదనను తెలియజేశారు.
జలీల్ పాషా నిర్దోషి: కోర్టు తీర్పు
తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన విద్యార్థి నాయ కులను బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఎలా వేధిస్తున్నది అర్థం చేసుకోవడానికి జలీల్‌పాషా అరెస్టు, విడుదల ఒక చక్కని ఉదాహరణ. 1969 నవంబర్‌లో హై స్కూల్ విద్యార్థి కార్యాచరణ కమిటీ ఛైర్మన్ జలీల్‌పాషా ప్రత్యేక తెలంగాణ కోసం ఆబిడ్స్‌లో ఆమరణ నిరాహార దీక్ష సాగించారు. అక్టోబర్ 10 నుండి మల్లికార్జున్, అక్టోబర్ 18న తొమ్మిదవ తరగతి విద్యార్థిని రమాదేవి ఆమరణ నిరాహారదీక్షలు జంటనగరాల్లో ప్రారంభించారు. ఈ ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేసి ఆత్మహత్యా నేరం ఐ.పి.సి. 309 సెక్షన్ కింద సుేలు పెట్టి హాస్పిటల్‌కు తరలించారు. వీరిపై కోర్టులలో విచారణ సుదీర్ఘకాలం జరిగింది. ముందుగా 1970 మార్చి 4న జలీల్‌పాషాను నిర్దోషిగా ప్రకటిస్తూ ఆరవ సిటీ క్రిమినల్ కోర్ట్ మెజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. నాలుగు నెలల నిర్బంధం నుండి జలీల్‌పాషా విడుదలకు ఉత్తర్వులిచ్చారు.
విద్యార్థుల సమ్మె కొనసాగుతున్న సత్యాగ్రహాలు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభమైన సత్యాగ్రహాలు జంటనగరాల్లోని ముఖ్యమైన కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ప్రతిరోజూ కొనసాగుతూనే వున్నాయి. పలువురు నేతలను విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తూనే వున్నారు. ప్రధానికి తెలంగాణ విద్యార్థులు ఇచ్చిన తుది గడువు మార్చి 8 పూర్తయినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో మార్చి 9న జంటనగరాల్లో విద్యార్థులు మల్లికార్జున్, శ్రీధర్ రెడ్డి, పుల్లారెడ్డి, రమాకాంత్‌ల నాయకత్వాన తరగతులను బహిష్కరించి వీధుల్లోకి వచ్చి పలు బస్సులను, ఆంధ్ర వ్యాపారుల దుకాణాలను ధ్వంసం చేశారు. ఆబిడ్స్, కోటి, చార్మినార్ వద్ద నిషేధాజ్ఞలను ఉల్లంఘించి సత్యాగ్రహానికి దిగిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. 21 మంది బాలికలతో సహా సుమారు 50 మంది విద్యార్థులు అరెస్టు అయినారు.
ఉధృతమైన తెలంగాణా ఆందోళన
1970 మార్చి 9 నుండి పునః ప్రారంభమైన తెలంగాణా విద్యార్థుల ఆందోళన మార్చి 16 నాటికి ఉగ్రరూపం దాల్చింది. నగరంలోని వివిధ రద్దీ ప్రదేశాల్లో ఆందోళనకారులు ఒసాేరి బస్సులపై రాళ్ళతో దాడిచేశారు. ఈ హఠాత్ సంఘటనలకు పోలీసులు, ఆర్టీసీ అధికారులు నివ్వెరపోయారు. రాళ్ళు రువ్విన ప్రాంతాల్లో రెండు గంటలపాటు బస్సులను ఉపసంహరించారు. ఆందోళనా కారులు గెరిల్లా ఎత్తుగడల ననుసరించారని పత్రికలు వ్యాఖ్యానించినవి. పెట్రోల్ డబ్బాలతో వచ్చి బస్సులకు నిప్పం టించి వెంటనే మాయం కావడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. చిలుకలగూడ, ఇసామియాబజార్, గౌలిగూడా, మూసీ బ్రిడ్జిపై, రాష్ట్ర లైబ్రరీ ముందు బస్సులను తగులబెట్టారు. ముగ్గురు బస్సు డ్రైవర్లు గాయపడ్డారు.
పాఠశాలల బహిష్కరణకు విద్యార్థినుల నిర్ణయం
ప్రజా సమితి అధ్యక్షుడు డా|| ఎం.చెన్నారెడ్డి సమక్షంలో విద్యార్థినుల కార్యాచరణ కమిటీ మార్చి 14న ఉదయం సమావేశమై ప్రత్యేక తెలంగాణా సాధించేవరకు నిరవధికంగా కళాశాలలను, పాఠశాలలను బహిష్కరించాలని నిర్ణయించారు. ప్రజాసమితి మహిళా విభాగం కన్వీనర్‌గా శాంతాబాయిని, జంటనగరాల కన్వీనర్‌గా కుమారి భానుమతిని ఎన్నుకున్నారు.
సత్యాగ్రహుల అరెస్ట్
నగరంలోని నిషేధాజ్ఞలు ఉల్లంఘించినారనే అభియోగంపై 34 మంది తెలంగాణ ఉద్యమకారులను బేగంబజార్, చార్మినార్, చాదర్‌ఘాట్, నల్లకుంటలలో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 12 మంది పాఠశాలల విద్యార్థులు 9 మంది చిన్నవ్యాపారులు, నలుగురు నిరుద్యోగులు ముగ్గురు తాపీపని వారు. ఇతరులు వడ్రంగి, దర్జీ, ఇంటిపనులు చేసేవారు. ఒకరు రిటైర్డ్ సైనికోద్యోగి. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారని పోలీసులు ప్రకటించిన పై వివరాలు స్పష్టం చేస్తున్నాయి.
(వచ్చే సంచికలో… ప్రాంతీయ సంఘానికి విస్తృతాధికారాలు)