ప్రకృతి అందాలతో పర్యాటక శోభతో కళకళలాడే కేరళ రాష్ట్రం ప్రకతి విలయంతో ఛిద్రమైంది. గత వందేళ్ళలో ఎన్నడూ కనీవినీ ఎరుగని జలప్రళయంలో చిక్కుకొని విలవిల్లాడింది. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవించి కోలుకోలేని దుస్థితిలో ఉంది.
ఆపదలో వున్నవారిని ఆదుకోవడం కనీస మానవధర్మం. ఈ విషయంలో ఎప్పుడూ ముందుండే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కేరళ రాష్ట్రానికి తక్షణం 25 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర హోమ్ శాఖామంత్రి నాయిని నరసింహారెడ్డి స్వయంగా కేరళకు వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కు ఆ మెత్తాన్ని అందజేశారు. మంత్రి నాయిని పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులను కూడా పరామర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇంతటితో చేతులు దులుపుకోకుండా, పునరావాస కేంద్రాలలో సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులు, చిన్నారుల కోసం వంద టన్నుల పౌష్టికాహారం, 20 టన్నుల పాలపొడి, కలుషితమైన నీటిని శుద్ధిచేసేందుకు 2.5 కోట్ల రూపాయల విలువైన ఆర్వో మిషన్లను సైనిక విమానాలలో కేరళకు తరలించింది.దీనికితోడు కోటి రూపాయల విలువైన 500 టన్నుల బియ్యం, పశువులకు గ్రాసంతోపాటు రోగనిరోధక వ్యాక్సిన్ ను కూడా పంపింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉదారంతో ముందుకు రావడంతో పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, ఐ.ఏ.ఎస్ అధికారులతోసహా పలుశాఖల సిబ్బంది కూడా తమతమ వేతనం నుంచి కొంత మొత్తాన్ని కేరళ రాష్ట్రానికి విరాళంగా ప్రకటించారు. తమకు ఉదారంగా సహాయం చేసినందుకు కేరళ ప్రజల తరఫున ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ కతజ్ఞతలు తెలుపుతూ స్వయంగా మన ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
ఆపదలో వున్నవారిని మానవతాదృక్పధంతో ఆదుకోవడం తెలంగాణ ప్రభుత్వానికి కొత్తేమీ కాదు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన కొద్దికాలానికే హుదూద్ తుపానువల్ల నష్టపోయిన సోదర తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవడానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఉదారంగా స్పందించింది. యుద్ధ ప్రాతిపదికపై విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు వీలుగా 18 కోట్ల రూపాయల విలువైన సామగ్రితోపాటు పలువురు అధికారులను, సిబ్బందిని కూడా అక్కడికి పంపి ఆదుకుంది.
అదేసమయంలో కశ్మీరులో తీవ్ర వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలంచేయగా, అక్కడి ప్రభుత్వానికి అండగా ఆరు కోట్ల రూపాయల విలువైన తాగునీటిని శుద్ధిచేసే ఫిల్టర్లను విరాళంగా పంపింది. అప్పట్లో కాశ్మీర్ వాసులు ‘తెలంగాణ పానీ’ తాగుతున్నామని ప్రకటించడం మరపురాని విషయం.
ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న.. ఆపదలో ఉన్నప్పుడు పొరుగువారికి మానవీయకోణంలో సాయమందించే విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రం దాతలకు ఆదర్శం కాగలదని ఆశిస్తున్నాం.