tsmagazineఅతి భారీ వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం ఇబ్బంది పడుతున్నది.గత శతాబ్దంలో ఎన్నడూ సంభవించని విపత్తు కేరళ రాష్ట్రాన్ని కబళించింది. కేరళ రాష్ట్రం, ప్రజలు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటువంటి తరుణంలో అక్కడి వారిని ఆదుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికీ వుండి తీరాలి. సాటి వారికి సహాయం చేయడం లో మేము ముందుంటాము అని చాటి చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.

కేరళ రాష్ట్రానికి రూ. 25 కోట్లను తెలంగాణ తరఫున తక్షణ సహాయంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. ప్రకటించడమే కాదు వెంటనే ఆ డబ్బులను కేరళ రాష్ట్రానికి అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం ప్రధాన కార్యదర్శి వెనువెంటనే నిధులను విడుదల చేయగా,ఆ మరుసటి రోజునే, రాష్ట్ర హోం శాఖా మాత్యులు నాయిని నరసింహా రెడ్డి స్వయంగా వెళ్ళి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కు రూ. 25 కోట్ల చెక్కును అందజేశారు.

కేవలం ఆర్థిక సహాయం చేయడంతోనే సరిపెట్టకుండా, మరికొన్ని విధాలుగా కూడా కేరళ వాసులను ఆదుకునేందుకు సమాయత్తమైంది తెలంగాణ ప్రభుత్వం. తీవ్రమైన వరదల వల్ల, అపరిమితంగా జల కాలుష్యం జరిగినందున నీటిని

శుద్ధి చేయడం కోసం రెండున్నర కోట్ల విలువైన ఆర్వో మిషిన్లను ముఖ్యమంత్రి అదేశానుసారం ఆ రాష్ట్రానికి పంపారు. కేరళ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నందున వారిని ఆదుకోవాల్సిన కర్తవ్యం సాటి రాష్ట్రంగా మనకుందని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ఐటి రంగ ప్రముఖులు, వ్యాపార వాణిజ్య వేత్తలు, ఇతర రంగాల వారు ఇతోధిక సహాయం అందించడానికి ముందుకు రావాలని సిఎం పిలుపునిచ్చారు. సిఎం రిలీఫ్‌ ఫండ్‌ కు విరాళాలు అందిస్తే వాటిని తక్షణం కేరళ రాష్ట్రానికి పంపే ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. కేరళ రాష్ట్రంలో సంభవించిన ప్రకతివైపరిత్యం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విపత్తు నుండి కేరళ రాష్ట్రం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ తరఫున అవసరమైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సిఎం ప్రకటించారు.

ఇంతేకాకుండా కేరళ వరదల్లో చిక్కుకుపోయిన చిన్నారులకు ఆహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణలోకి దిగింది. హైదరాబాద్‌ నాచారంలోని తెలంగాణ ఫుడ్స్‌ నుంచి రూ. 52.5 లక్షల రూపాయల విలువైన 100 మెట్రిక్‌ టన్నుల బాలామతాన్ని,చిన్నారుల కోసం తెలంగాణ ఫుడ్స్‌ తయారుచేసే పౌష్టికాహార ప్యాకెట్లను రక్షణ శాఖకు చెందిన విమానం ద్వారా బేగంపేట ఎయిర్‌ పోర్ట్‌ నుంచి కేరళకు తరలించింది. ఇది కాకుండా, వరదల్లో చిక్కుకున్న ప్రజలకు ఆహారం సరఫరా చేయడానికి బియ్యం పంపాలని కేరళ రాష్ట్రం నుంచి విజ్ఞప్తి వచ్చినవెంటనే సీఎం స్పందించి 500 టన్నుల బియ్యం పంపాలని ఆధికారులను ఆదేశించి, వెంటనే పౌర సరఫరాల శాఖా మంత్రి ఈటల రాజేందర్‌, ఛీఫ్‌ సెక్రటరీ ఎస్‌ కె. జోషి, పౌర సరఫరాల శాఖ కమీషనర్‌ అకున్‌ సభర్వాల్‌తో సీఎం మాట్లాడారు. వెంటనే కేరళకు 500టన్నుల బియ్యం పంపాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో తెలంగాణ అధికారులు కేరళకు కోటి రూపాయల విలువైన 500 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని 30 ట్రక్కులలో పంపారు.

వరదల బీభత్సం తో ప్రజలే కాకుండా,పశువుల పరిస్థితి కూడా ఎంతో దయనీయంగా మారింది.ఈ అంశాన్ని కూడా దష్టిలో పెట్టుకుని, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు పశువుల దాణాను కూడా పంపమని సంబంధిత మంత్రిని ఆదేశించగా, ముఖ్యమంత్రి ఆదేశానుసారం పాడిపరిశ్రమల అభివద్ధి శాఖా మంత్రి, తలసాని శ్రీనివాస యాదవ్‌ మూగ జీవాల ఆకలిని తీర్చడానికి వీలుగా,సుమారు 100 టన్నుల పశువుల దాణాను,అలాగే పశువులలో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు గాను, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలోని వెటర్నరీ బయోలాజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ఉత్పత్తి చేసిన సుమారు 2 లక్షల రూపాయల ఖరీదు చేసే గొంతువాపు, జబ్బవాపు వ్యాధి నిరోధక టీకాలు, ఒక లక్షా 25 వేల డోసులను పంపారు.

ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలకు స్పందిస్తూ, కేరళ సీఎం పినరయి విజయన్‌ తెలంగాణ సీఎంకు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ సిబ్బంది ఒక్కరోజు వేతనం 9 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వగా, విద్యుత్‌శాఖ 2.46 కోట్ల విలువైన విద్యుత్‌ పరికరాలను కేరళకు పంపించింది.

తెలంగాణ రాష్ట్ర మంత్రులు తమ ఒక నెల వేతనాన్ని విరాళంగా అందించగా, ఐఏఎస్‌ అధికారులతో సహా రాష్ట్రం లోని వివిధ ఉద్యోగ వర్గాలు కూడా స్పందించి తమ శక్తి కొలది కేరళ సి.యం. సహాయ నిధికి విరాళాలు పంపారు.జల విధ్వంసానికి ప్రతిస్పందించిన సింగరేణి

ఉద్యోగులు తమ వంతు సాయంగా ఒక్కరోజు వేతనమైన రూ. 9 కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు అందించారు.

Other Updates