tsmagazine
గత డిసెంబర్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్నవారు ఎవరూ ప్రారంభ కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన ప్రసంగాన్ని మరచిపోలేరు. అంత అద్భుతమైన ప్రసంగమది. నిరుపమాన ప్రసంగ శైలికి అది నిజమైన నిరూపణ అది. రాజకీయరంగంలో ఉన్నవారు అనునిత్యం ఎన్నో ప్రసంగాలు చేయవలసి ఉంటుంది. పలుసార్లు అది వారి బాధ్యతలలో విడదీయరాని ప్రక్రియగా మారుతుంది. అయితే అందరు రాజకీ

యవేత్తలకు ఒకేస్థాయి ప్రసంగ ప్రతిభ ఉంటుందని భావించేందుకు వీలులేదు. కొంతమంది ప్రసంగాలు ప్రబోధాలతో ఉంటే, మరికొందరివి సమాచార వాహకాలుగా ఉంటాయి. కొందరు ఉద్వేగంగా మాట్లాడితే మరికొందరు అత్యంత ప్రసన్నరీతిలో ఉపన్యసిస్తూ ఉంటారు. సభలో ఉన్నవారందరినీ వారివారి వయోస్థాయీ భేదాలతో నిమిత్తం లేకుండా ఆకట్టుకోవడమే గొప్ప వక్త లక్షణం. అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతి ప్రసంగంలోనూ ద్యోతకమవుతుందన్నది సహృదయ శ్రోతల అభిప్రాయం. ఇందులో ఎటువంటి అభిప్రాయ భేదాలకూ తావు లేనేలేదు!

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రసంగాలు వింటూ ఉంటే ఆనాటి అటల్‌బిహారీ వాజ్‌పేయి వక్తృత్వ ప్రతిభ కళ్ళముందు కదలాడుతుంది. మాజీ ప్రధాని వాజ్‌పేయి ఎంతో గొప్ప వక్త అన్నది గత తరానికి బాగా తెలుసు. ప్రతిపక్ష ప్రముఖుడిగా పార్లమెంటులో ఆయన ప్రసంగాలు వినేందుకు నాటి ప్రధానమంత్రులు జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ కూడా ఆసక్తి చూపేవారని చరిత్ర చెబుతోంది. గంగాతీరపు స్వచ్ఛమైన హిందీలో అనర్గళంగా సాగే వాజ్‌పేయి ప్రసంగ తరంగాలు అనిర్వచనీయమైన అనుభూతుల్ని శ్రోతలకు పంచి ఇచ్చాయి. అత్యంత సహజమైన హావభావాలు, చెబుతున్న అంశానికి సరిపోయేరీతిలో దేహపరిభాష (బాడీ లాంగ్వేజీ) అక్కడక్కడా ఆగి ఆగి తిరిగి వేగంగా వాక్య విన్యాసాన్ని ప్రదర్శించడం-ఇవన్నీ వాజ్‌పేయి ప్రసంగ శైలిలోని మౌలిక లక్షణాలు. ఇవన్నీ మన ముఖ్యమంత్రి ప్రసంగంలోనూ స్పష్టంగా కనబడుతాయి. అటు పార్లమెంటుతోపాటు ఇటు వేలాది ప్రజానీకం ముందు వాజ్‌పేయి చేసిన ప్రసంగాలు నిన్నటితరంలో పదిలమైన జ్ఞాపకాలుగా ఉన్నాయి. చంద్రశేఖరరావు అటు అసెంబ్లీలో ఇటు విస్తృత ప్రజాసమూహాల్లో చేసిన ప్రసంగాలూ అదేస్థాయికి చెందుతాయి. రాజకీయరంగంలో గొప్ప వక్తలుగా పేరున్న అనేకమంది ఆనాటి ప్రముఖుల ప్రసంగాలతో సాటి రాగల ప్రసంగాలు కేసీఆర్‌ చేశారు.tsmagazine

గతంలో తెలంగాణలో ప్రజా జీవితంలో సేవలందించిన ఎంతోమంది ప్రముఖులు గొప్ప వక్తలుగా చరిత్రలో గుర్తింపును పొందారు. మాడపాటి హనుమం తరావు మంచి వక్త అని వెల్దుర్తి మాణిక్యరావు ఒక చోట గుర్తు చేసుకున్నారు. సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, భాగ్యరెడ్డివర్మ, ఎం.ఎస్‌. రాజలింగం, రావి నారాయణరెడ్డి, మగ్ధూం మొహియుద్దీన్‌ వంటివారు నాటి తెలంగాణలో గొప్ప వక్తలు. వారి కోవలో చేరుతారు కె.సి.ఆర్‌.

కె.సి.ఆర్‌. సమకాలీన రాజకీయ ప్రపంచంలో ఇంత గొప్ప వక్తగా ఎదగడానికిగల నేపథ్యాన్ని పరిశీలించినపుడు రెండు ఆసక్తికరమైన అంశాలు ఆవిష్కృతమవుతాయి. ఆయన బాల్యంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని దుబ్బాక పాఠశాలలో చదువుకున్నారు. ఆనాడు ఆయనకు పాఠాలు బోధించినవారిలో తిరుమల శ్రీనివాసాచార్యులవంటి ప్రతిభావంతులైన వక్తలున్నారు. డిగ్రీ సిద్ధిపేట ప్రభుత్వ కళాశాలలో చదివారు. ఆ రోజుల్లో అక్కడ పరాశరం గోపాలకృష్ణమూర్తి, ముదిగొండ వీరభద్రయ్య వంటి గొప్ప వక్తలు తెలుగు విభాగం అధ్యాపకులుగా ఉండేవారు. బహుశా కె.సి.ఆర్‌ బాల్యంలోనే గురువుల వక్తృత్వ విలక్షణత్వం ద్వారా ప్రభావితులై ఉంటారు. గొప్ప వక్తలకు సాహిత్యంతో, మాతృభాషపట్ల గట్టి పట్టు ఉండాలి. దాన్ని కె.సి.ఆర్‌. డిగ్రీ స్థాయిలోనే సాధించుకున్నారు. వివిధ భాషా సంబంధ అంశాలు అత్యంత సునిశితంగా సమీక్షించుకోవడం, సంప్రదాయ సాహిత్య సౌరభాలను, ఆధునిక సారస్వత పరిమళాల్ని అధ్యయనం చేయడంతో కె.సి.ఆర్‌. వక్తృత్వానికి ఒక నవ్య అలంకారికత వచ్చి చేరింది. స్వయంగా గొప్ప వక్తగా ఎదిగిన తర్వాత కూడా వక్తృత్వాన్ని అధ్యయనం చేయడం కె.సి.ఆర్‌.గొప్పతనం, ప్రసిద్ధ వక్త, యువ భారత సంస్థ ప్రముఖుల్లో ఒకరైన డాక్టర్‌ ఇరివెంటి కృష్ణమూర్తి రచించిన ‘వాగ్భూషణం భూషణం’ ప్రసంగకళను పరిచయం చేసే పుస్తకం. కె.సి.ఆర్‌. కూడా ఈ పుస్తకాన్ని ఇష్టంతో అధ్యయనం చేశారని చెబుతారు. మన ప్రసంగాన్ని వినే శ్రోతలు ఎవరు? వారికి ఏ తీరులో ఉండే ప్రసంగం అవసరం? అన్న వివేచన కె.సి.ఆర్‌. ప్రతి ప్రసంగంలోనూ అంతర్లీనంగా కనబడుతుంది. పండితమండలిలో ఉన్నప్పుడు ఆయన మాటలు విద్వాంసుల స్థాయిని చేరుకుం టాయి. ఎక్కడెక్కడి సాహిత్యాంశాలు శరపరంపరగా ముందుకువస్తాయి. ప్రజా సమూహంలో ఉన్నప్పుడు వారికి పూర్తిగా అవగాహనలోకి వచ్చే రీతిలో కె.సి.ఆర్‌. మాట్లాడుతారు. ఈ రకమైన ఔచిత్యపు తీర్పులు ఆయన ప్రసంగాల్ని అత్యంత ఆకర్షణీయంగా మార్చాయి. ప్రసంగించవలసిన సమయాన్ని కచ్ఛితంగా ముందే నిర్ధారించుకోవడంతో వినేవారికి ఎక్కడా విసుగుపుట్టదు.

స్థానీయమైన నుడికారాలపట్ల ప్రగాఢమైన మమకారం ఉన్నవారు గొప్ప వక్తలుగా ఎదుగుతారు. ఇది కె.సి.ఆర్‌లో సంపూర్ణంగా ఉంది. ఆయన మాటల్లో తరాలకింద మరుగునపడిపోయిన సామెతలు నూతన జవజీవాలతో ఆవిష్కృతమవుతాయి. తెలంగాణలోని మారుమూల పల్లెల్లో ఉండే అచ్చమైన మాటలు కాంతివంతంగా పరుగులు పెడతాయి. అడపాదడపా వాడే ఉర్దూ మాటలతో కొత్త ‘మణి ప్రవాళ శైలి రూపుకడుతుంది. తరచుగా వచ్చి చేరే కథలు, గాథలు ప్రసన్న వక్తృత్వాన్ని పరిచయం చేస్తాయి. ప్రసంగంలో ఒకటికిరెండుసార్లు శ్రోతల స్పందనకోసం చూడడం ఆయన ఆచరించే మరో గొప్ప సాంకేతికత!

రమారమి మూడున్నర దశాబ్దాల కె.సి.ఆర్‌. రాజకీయ జీవితంలో కొన్నివేల ప్రసంగాలు చేసి ఉంటారు. ఆనాటినుంచి ఆయన విలక్షణమైన వక్త. అయితే వక్తగా మరింతగా ఎదిగిన తీరును గత పుష్కరకాలపు క్రమంలో చూడవచ్చు. మంచి వక్త మాతృభాషకాని ఇతర భాషల్లోనూ గొప్పగా ప్రసంగించగలరు. ఇందుకు డాక్టర్‌ సి. నారాయణరెడ్డి మంచి ఉదాహరణ. మరో మంచి ఉదాహరణ కె.సి.ఆర్‌. ఇద్దరూ తమ మాతృభాషతో పాటు ఉర్దూ-ఇంగ్లీషు ల్లోనూ అసాధారణ వక్తలు. అనుకరణకు సాధ్యం కాకపోవడం ఉత్తమ వక్తృత్వ లక్షణం కె.సి.ఆర్‌. ప్రసంగకళ ఆస్వాదిం చేందుకు అనుకూలమైంది. అనుకరణకు అసాధ్యమైంది!

డాక్టర్‌ గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి

Other Updates