పంచాయితీరాజ్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారకరామారావుతో భాతరదేశంలోని నార్వే రాయబారి ఫిబ్రవరి 9న సచివాలయంలో కలిశారు.
నార్వే దేశంతో వాణిజ్యసంబంధాలు వ్యాపారాభివృద్ధిపైన చర్చించారు. ప్రపంచలోనే అతిపెద్ద సావరీన్ (సార్వభౌమ) ఫండ్ కలిగిన నార్వే ద్వారా తెలంగాణలో పెట్టుబడులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని వివిధ మౌలిక వసతుల కల్పనా రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి వారిని కోరారు. నగరాభివృద్ధికి తమ వద్ద ఉన్న ప్రణాళికలను వివరించిన మంత్రి నార్వే దేశపు పరిశ్రమలుసైతం తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన ప్రదేశమని వివరించారు.
ఈ సందర్భంగా నగరంలో చేపట్టబోయే స్కైవేలను, చెరువుల పునరుద్ధరణ, మూసీ ప్రక్షాళన వంటి అంశాలపైన నార్వే బృందం ఆసక్తి చూపింది. త్వరలోనే ఫండ్ మేనేజర్లతో సమావేశాన్ని సైతం ఏర్పాటు చేయిస్తామని నార్వే రాయబారి మంత్రికి హమీ ఇచ్చారు. ఇక ఐటి రంగంతోపాటు, లైఫ్ సైన్సెస్ రంగాల్లోనూ నార్వే సంస్ధలకి ఆసక్తి ఉందన్నారు. మార్చిలో ఢిల్లీలో జరిగే నార్వే సంస్ధల సమావేశానికి మంత్రిని అహ్వానించారు. ఈ సమావేశంలో ఐటిశాఖ కార్యదర్శి జయేష్ రంజన్, మున్సిపల్ శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ ఎం.జి.గోపాల్, జిహెచ్‌యంసి కమీషనర్ జనార్దనరెడ్డిలు పాల్గొన్నారు.