శ్రీ అన్నవరం దేవేందర్
మంది అందరు పురాగ అడివైయిండ్రు. లావు శానత్తం మాట్లాడవట్టిండ్రు. ల్యాకపోతే ఏంది మరి. గా ఆన్వెకాయ అంటె తెల్వదా! అన్వెకాయను సోరకాయ అనవడ్తిరి. గంపల కూరగాయలు అమ్ముకునే ఎంకటవ్వసుత సోరకాయలు అంటాంటె నాకు ఎక్కన్నో కాలుకస్తంది. ఎన్కటి తాతల కాలం నుంచి మనమాట మన ముచ్చట మరుస్తండ్రు. గమ్మతిపాడుగాను గా ఎంకటిగానికి ఇద్దరు కూతుర్లు అట ఈ కూతురేందిర బై బంగారమోలె బిడ్డలు అంటే పోలేదా! బిడ్డ అంటె ఎంత ఆత్మగల్లమాట తెల్వనే తెలుస్తలేదు. ఎన్ని చెప్పు ఎనుకటి కెల్లి మందిదే మంచిగనిపిస్తది. మంది ముచ్చటే నిజమనిపిస్తదేమో ఎందో. వారీ పెయ్యికాక వచ్చింది దవఖానకు పోరా అంటే పోరడు పరేశానుగ సూస్తండు. పెయ్యికాక అంటే పెయ్యికాక ఎక్కుడు అంటే సమజ్ అయితలేదు. జ్వరం వచ్చింది. అనాలెనట. దవాఖాన అనురా అంటే ఆసుపత్రి అంటడు. ఇదేమి అలువాటో తెలుస్తలేదు. తానం శేసి రారా కొడుకా! అంటే స్నానం అంటడు. ఇంకా తానం అని మా కాలంల అన్నంగని మా అయ్యల కాలంల పెయ్యి కడుక్కునుడు అనేది, ఇదే రామసక్కదనం మాట. నాలుగు తెల్లకమ్మలు ఇయ్యి అంటె అటూ ఇటూ సూస్తండు మా మనుమడు తెల్ల పేపర్లు అనాల్నట. కమ్మలు ఎంత కమ్మటి మాట. ఈత కమ్మలు తాటి కమ్మల నుంచే కమ్మల పేరువచ్చింది. ఎన్కటి దినాన తాటి కమ్మల మీదనే రాసేదట. గమ్మతి మాట్లాడుతాంటే నాకు తలకాయ తిరుగుతంది. ఇంటి అద్దె రెండు వెయ్యిలు అని ముచ్చట చెప్పుతండు. అద్దె ఏందిర కిరాయి అనరాదా అన్న గప్పుడు, సప్పుడు చెయ్యలే. ఏం కూర తమ్మీ అంటే చికెన్ అంటడు. కోడికూర అని కూడ అనస్తలేదు. పురాగ పరాయి మాటలు చెవులకు ఎక్కి మనిషి ‘ఆపరేటింగ్ సిస్టమ్’ మారిపోయింది.
అరె మనదైన ఒక బాస యాస కమ్మగ ఉండెనే ఉండే. అదే బాసల మన పోతన భాగోతంల లేదా! పాల్కురికి సోమన్న పద్యాలు లేవా! మన పివీ సాబ్ మాట్లాడంగ ఇనలేద, మన టంగుటూరి అంజయ్య ఎట్ల మాట్లాడిండు, ఇంతెందుకు మన కెసిఆర్ సాబ్ ఎంతమంచిగ మాట్లాడుతడు. అసలు సిసలైన మాటలు అన్పిస్తయి. హన్మంతరావు మాట్లాడడా ఎన్కట చొక్కారావు సుత అట్లనే మాట్లాడేది. ఎన్కట మాట సూసినా రాత సూసిన ముద్దుగ ఉంటది.
కైత్కాల కనకచంద్రం తోని ఆయిల్ల చెర్వుకట్టమీంచి వస్తుంటే మనసు మస్తు అన్పియ్య వట్టింది. అటు పొద్దు గూట్లె పడెటాల్లకు కట్టెక్కె వరిగడ్డి మోపు ఎత్తుకొని నడుసుకుంటవస్తున్నం పొద్దు మాయమైతాంటె వచ్చే ఎర్రరంగు మంచిగనిపిచ్చింది. కట్ట పోడుగూతా నడుస్తాంటే కట్ట పొంట ఊడుగు చెట్లు కట్టమీది మైసమ్మ దాటిన తర్వాత తూము, తూము నీళ్ళ సప్పుడు చిన్నప్పుడు ఇదొక సంబురం ఉండే. తూముకాడ గాలాల తోటి శాపలు పట్టుకొని అవ్వకిచ్చి వండిపెడితె నాసామిరంగ అస్సలుంటది. ఇంటికొచ్చేటాల్లకు చీకటిపడ్డది. ‘బావా ఎన్నీల కాస్తంది జాజిరి ఆడ పోతాం జర జప్పన తిని ఈవలికి రా’ అని కైత్కాల కనకచంద్రం అన్నడు. ‘మా వస్త తియ్యవోయి’ అని నేను జల్ది ఇంట్లకు పోయి బర్రెకు గడ్డేసి పాలు పిండి సర్వ ఇంట్ల పెట్టిన. సర్వ తీసి ఉట్టి మీద పెట్టురా! పిల్లి తాగుద్ది అని అవ్వ అనంగనే తీసి తనబ్బిల దాసిన తలెల ఇంత బువ్వ ఏయించుకోని వాకిట్ల అరుగుమీద కూసోని జప్పన తిని పోదామనుకున్న. అంతలనే మా తాత మల్లయ్య గడంచ వాల్చుకొని వాకిట్లకు అచ్చిండు. ఇగ ఆయన అచ్చిండంటే శిత్రాలు చెప్పతాంటే మేం ఆడ సుట్టు కూసోని ఇనాలె. ఓ పెద్ద పెద్ద శాస్త్రాలుంటాయి. అంతల్నే కనక చంద్ర సుత ఆడికి అచ్చిండు. ‘కోలలు తెచ్చినావు బామ్మర్ధి’ అంటే ‘మా తెచ్చిన బావ’ అన్నడు. కాసేపు తాత పక్కపొన్న కూసోని ఎన్నీల ఎలుగుకు శిత్రాలు ఇన్నం. కాముని పున్నం గద మస్తు ఎన్నీల పాలు పారపోసినట్టున్నది. సుట్టు గుట్టలు సుత తేటగ కన్పిస్తన్నయి. దూరం మనిషి సూత కానస్తండు. ఇగ మెల్లగ నేను బామ్మర్ధి కల్సి కోలలు పట్టుకొని నాలుగు బాటల కాడికి పోంగనే జాజిరి గుంపు కన్పడ్డది. ఇంకేంది.
” జాజిరి జాజిరి జాజిరి జాజా
జాజరి ఆడపోతే ఏమేం దొరికే
రింగుడుపుల్లా రూపు దండ
దండకాదురో దామెర మొగ్గ
మొగ్గ కాదురో మోతుకు నీడ
నీడ కాదురో నిమ్మల బాయి
ఆ బాయి కాదురో”… అంట
ఇంటింటికి తిరిగి వడ్లు, జొన్నలు అడుక్కుంట తిరుగుడు గమ్మతిగ అన్పియ్య వట్టింది. ఊల్లె ఒగ పెద్ద పటేలు సోల నిండ జొన్నలు తెస్తండు. అరె గీ పటేలు సోలెడు జొన్నలు ఎన్నడు తేనోడు గిన్ని తెస్తండని పరేశాన్ గావట్టినం.జోలె పట్టంగనే జప్పున జోలెల పోశిండు కొంచెమే జొన్నలు పడ్డయి. ఇదేం మాయరా సోడు జొన్నలు తెచ్చిండు. పిరికెడే పడ్డయి. అనుకోంగనే సోలల బెండ్లు చెక్కిన సంగతి సగాడు ఎర్క వట్టిండు. అబ్బో అదో గమ్మతి. సోలల కమానంగ వడ్లు జొన్నలు జాజిరి ఆట ఊరంత తిరుగుడు పోరగాండ్లప్పుడు గమ్మతి అన్పియ్య వడ్తది యాదికస్తే. మా కైత్కాల కనకచంద్ర అయితెె మస్తు పరాశ్కిం ఆడుతడు పేర్నాల పెడతడు. రామసక్కదనం మాటలు మాట్లాడ్తడు. శిల్క నవ్వునవ్వుతడు. ఇచ్చంత్రం మాటలు మాట్లాడ్తడు. వాడు మాట్లాడ్తెనైతే శడ శింగారం అన్పిస్తది. ఎన్నటికైనా మన బాస మనమాట మనకు శింగారం ఉంటది. ఎన్ని ఏండ్ల నుంచి మనం బతుకమ్మ ఆడుతున్నం. మన బతుకమ్మ ఎక్కన్నన్న ఆడుతరా! ఆడరు. ఈడికి వచ్చిన వాల్లు సుత ఎన్ని ఏండ్లు ఈడ ఉన్నా బతుకమ్మ సుట్టు తిరుగరు. మరి మనం అయితె గా కోలాటం సూత ఆడుతం ఇంక మనయిగాక పరాయివి సుత ఆడుతం. పరాయి మాటలు మాట్లాడుతం.
మన మాటలు మన పాటలు మన మనసులు మన యాస మన భాస మన ఆట నడవాలె.
మనది మనం ఇంట్ల పనికాడ బడికాడ గుల్లె యాడవడితే ఆన్నే మన మాట మాట్లాడుదాం. ‘శాని కోసం శాని బాస ఎందుకు మనది, మనది మాట్లాడితే నాదానా బావా’ అని కనక చంద్రం అనవట్టే. ఇయ్యాల రేపు బడికి పోరా అంటె స్కూల్‌కా అంటరు. లేకుంటే పాఠశాలకా అంటరు. గుడికి పారా అంటే టెంపుల్‌కా అంటండ్రు. బువ్వ తిన్నవా అంటే ఇప్పుడే అన్నం తిన్నం అంటండ్రు. నీళ్ళు అంటే వాటర్ అంటండ్రు. సోపతి గాళ్ళను స్నేహితులు అంటండ్రు. సరే నేను కైత్కల కనక చంద్ర ఇంటిమొకాన మర్రినం.