చరిత్ర ప్రసిద్ధికెక్కిన రాచకొండ ప్రాంతం మరోసారి అంతర్జాతీయ ఖ్యాతిని సంతరించుకోనుంది. రాచకొండ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతోకూడిన సినిమాసిటీ, స్పోర్ట్స్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీలను నిర్మించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రతిపాదించారు.
ఈ మేరకు డిసెంబరు 15న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రాచకొండ గుట్టలు పరిసర ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ప్రాంతంలో సుమారు 3 గంటలపాటు గడిపిన ముఖ్యమంత్రి అధికారుల నుంచి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు.
నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మధ్యనున్న ఈ గుట్టల ప్రాంతంలో భూముల స్థితిగతులమీద సీఎం దృష్టి కేంద్రీకరించారు. ఏయే సర్వే నంబర్లలో ఏ మేరకు భూములున్నాయి. ఎలాంటి భూములున్నాయో అన్న విషయమై రెండు జిల్లాల కలెక్టర్లు చిరంజీవులు, శ్రీధర్‌లు వివరించారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములతోపాటు పట్టా, అటవీ భూములు కూడా ఉన్నాయని అధికారులు చెప్పారు. అటవీ భూమిగా పేర్కొన్న ప్రాంతంలో చెట్లే లేకపోవడంపట్ల ముఖ్యమంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అనంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మాట్లాడుతూ, సుమారు 32వేల ఎకరాల మేరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతం చాలా వరకూ చదునుగా, వివిధ సిటీల నిర్మాణానికి అనువుగా వున్నదన్నారు. అందుకే ఈ ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతోకూడిన సినిమా, క్రీడ, విద్యా నగరాలను నిర్మించ తలపెట్టామన్నారు.
రాచకొండ ప్రాంతంలో ఏరియల్ సర్వే సందర్భంగా హెలీప్యాడ్‌వద్ద రాచకొండ గుట్టలపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను ముఖ్యమంత్రి తిలకించారు. నల్లగొండ కలెక్టర్ చిరంజీవులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్, తదితర అధికారులతో భేటీ అయ్యారు. అంతకుముందు మంత్రులు జగదీశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి కూడా ఏరియల్ సర్వే నిర్వహించారు.
ముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెండు జిల్లాల కలెక్టర్లు కూడా ఏరియల్ సర్వేలో పాల్గొన్నారు.
రాచకొండలో ఏర్పాటు చేయనున్న నగరాలన్నీ హైదరాబాద్‌కి కేవలం 40 కిలో మీటర్ల దూరంలోనే ఉండటం ఎంతో అనుకూల అంశం. దీనికితోడుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి రాచకొండను అనుసంధానిస్తూ కొత్త హబ్‌లకు నలువైపులా నాలుగులైన్ల రహదారులు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల రవాణాపరమైన ఇబ్బందులు కూడా ఉండవు. రాచకొండ ప్రాంతం, నల్లగొండజిల్లా పరిధిలో 16,000 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 14,000 ఎకరాలు వస్తోందని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు. ప్రతి అంగుళం భూమి వివరాలు సేకరించి, అవి దేనికి ఉపయోగపడతాయో కూడా సమగ్ర నివేదిక రూపొందించ వలసిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
హోం
»