ennela-elugu

తీర్థాలంటే పోరగాండ్లకు పెద్దోల్లకు సంబురమైన యాది. కొత్తకొండ తీర్థం, ఎల్లమ్మ తీర్థం, కొంరెల్లి తీర్థం, అయిలేని తీర్థం, కొత్తగట్టు తీర్థం ఇట్ల ఎక్కడ జాతరలు అయినా అదొక చెప్పలేని ఆనందం. తీర్థాలల్లనే మనుషులు ఎక్కడెక్కడోల్లో కల్సుకుంటరు, మాట్లాడుకుంటరు. దేవునికి మొక్కుకొని మొక్కు తీర్సుకుంటరు.

తీర్థంకు బండికట్టుడు ఇంటింటికి ఉంటది. ఊరందరు కల్సి దప్పుసప్పుల్లతోని ఊరు దాటుతరు. ఎడ్ల బండికి ముందుగ పుదిస్తరు. బండి గీరెలకు జనుము సిలాండర్‌ఏసి తయారు పెడుతరు. కాల్చిన వరిగడ్డి బూడిదతోని బండి గీరెలకు పూస్తరు. నొగలను మంచిగ కడుగుతరు. బండికి కట్టుకపోయే వలుపట దాపట ఎడ్లను ముందురోజే లగాంచి మేపు కొని ఉంచుతరు. వాటి కొమ్ములకు నువ్వుల నూనె రాస్తరు. వాటిని బొజట్ల మంచిగ పీసుపెట్టి కడిగి అందంగ చేస్తరు. అటెన్కవాటికి సుత బొట్లు పెట్టి పుదిస్తరు. బండి నొగలకు కానికాడికి రంగురంగుల చీరెలు అలంకరణ కొరకు కట్టుతరు. బండ్లె వరిగడ్డి పరిశి దానిమీద గొంగడి ఏసి అండ్ల కూసుంటరు. బండికి మ్యాకపోతును కట్టుకపోతరు. బండ్లె బియ్యం, చింతపండు, పప్పు, అల్లం, ఎల్లిపాయకారం పట్టుక పోతరు. అక్కడ వండుకతినేతందుకు. ఊల్లెకెల్లి ఎల్లెటప్పుడు దప్పులు కొట్టుకుంట ముందు దీటీలు పట్టుకొని ఒగ బండెనుక ఒగ బండి కొట్టుకపోతరు. ఇంట్ల ఆడోల్లు, మొగోల్లు, పోరగాండ్లు మంచిగ నెత్తిమీదికెల్లి కుంకుడుకాయతో తానం చేసి ఆడోల్లు గదువలకు పసుపు పెట్టుకొని పయనం అయితరు. అదొక సందోహం లెక్క ఉంటది.

ఇగ కొత్తకొండ తీర్థం పోయేటప్పుడు ఒగ బండి ఎనుక ఒకటి పోతది కొందరు పై కొట్టుతరు పై కొట్టుడు అంటే ఓవర్‌టేక్‌ చేయడం అన్నట్టు. ఎడ్లుకూడ మంచి ఉత్సాహంగా ఉంటయి. వాటికి అవసరమైన సొప్ప గడ్డి సుత అండ్లనే తీసుకపోతరు. ఊర్లల్లకెల్లి ఎల్లిన బండ్లవరుస తీర్థంపోయి, సక్కగ దేవుని సుట్టు బండ్లను తింపుతరు.ఇట్ల ఐదు సుట్లు తింపినంక బండిని ఒగ దగ్గర నిలబెట్టి ఎడ్లను నొగలకు కట్టేస్తరు. అట్ల ఆ ఊరోల్లు అందరు ఒక్క పక్కనే ఉంటరు. తర్వాత దేవుని గుల్లెకు పోతరు. ఈ సందుల చిలకలపేర్లు కొనుక్కుంటరు. బెండ్లు కొనుకుంటరు.. పీకెలు, లబ్బర్‌ చెండ్లు, పిల్లనగోల్లు ఇట్ల అరొక్కసామాను ఆ తీర్థంల అమ్ముతరు. ఇంక అక్కన్నే రికార్డింగ్‌ డ్యాన్స్‌లు, రంగులరాట్నం రకరకాల ఆటలు ఉంటయి. బుక్క, కుంకుమ, గులాలు దొరుకుతయి. రాత్రి దాకా తిరిగి దర్శనం చేసికొని పాలకాయకొట్టి మల్ల ఎవల సక్కినవాల్లే ఇడిశిన బండికాడికి వస్తరు. అప్పుడు అక్కన్నే మ్యాకను కోసుకునేటోల్లు, కోల్లు కోసుకునేటోల్లు కోసుకొని వండుకుంటరు. అక్కన్నె అన్ని దొరుకుతయి. తీర్థంల తిరిగే క్రమంలో పాత సుట్టాలు ఊరోల్ల సుట్టాలు, ఎల్లిపోయినోల్లు తప్పకుండ కలుస్తరు. చాలా రోజులనుంచి సూడనోల్లు కనపడేవరకు వలపోసుకుంట కొంగు కప్పుకొని ఏడుస్తున్న దృశ్యాలు కన్పిస్తాయి.

తీర్థాలంటే ఒక కలయిక. ఒక జ్ఞాపకం. ఒక ఆధ్యాత్మికత. అట్ల రెండు రోజులు అక్కన్నే ఉండి తిరుగు ప్రయాణం అయితరు. తీర్థాలు సాదరంగ వారం పదిరోజులు సాగుతాయి. తీర్థాలను జాతర పోవుడు కూడా అంటరు. జాతర, దేవుని కాడికి పోవుడు అంటరు. అవతలిపక్క తెలుగువాల్లు అయితె తిరునాళ్ళు అంటరు. ఎవరు ఏపేరుతో పిలిచినా తీర్థం ఒక పురా తీపి జ్ఞాపకం. ఒక ఆట విడుపు. రెండు రోజులు సంబు రమైన సందర్భం. తీర్థాలు పండుగలతోనే ముడిపడి ఉంటయి. సంక్రాంతి, శివరాత్రి ఇట్లా కల్సి వస్తాయి. అయితె ఇప్పటికీ ఈ తీర్థాల ప్రభ కోల్పోలేదుకాని ఎడ్లబండ్ల వంతుకు ట్రాక్టర్లు వస్తున్నయి. ఊరోల్లు ఇప్పుడు ఆటోలల్ల వస్తున్నరు.. కార్లల్ల వస్తున్నరు. మల్ల గదే గుడిసుట్టు బండి తిరుగుడు ఉండే ఉంటది. తీర్థం చిన్నశిల్కలపేర్లు బత్తీసలు, బెండ్లు, ఏకుడు పాలాలు, లాడుముద్దలు. పుట్నాలు ఇంటిసుట్టు సుట్టపోల్లకు దగ్గరోల్లకు ఇచ్చుడు ఒక తుర్తి.

అన్నవరం దేవేందర్‌

Other Updates