కొత్తూరులో-అమెజాన్‌-కేంద్రం-ప్రారంభంరాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగానే అతి తక్కువ సమయంలో పరిశ్రమలు, వ్యాపార కేంద్రాలకు అనుమతులు ఇస్తున్నదని, ఇందుకు నిదర్శనం అమెజాన్‌ కేంద్రం ఇంత త్వరలో ప్రారంభం కావడమేనని రాష్ట్ర ఐ.టి, పంచాయతిరాజ్‌ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. జూన్‌ 10వ తేదీన మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తూరు మండంలోని పెంజర్ల గ్రామంలోని పి&జి పరిశ్రమ ఆవరణలో నూతనంగా నెలకొల్పిన అమెజాన్‌ సంస్థ ఫుల్‌ఫిల్మెంట్‌ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అమెజాన్‌ కేంద్రం ఏర్పాటుకు పది రోజుల్లోనే అన్ని అనుమతులు ఇవ్వడం జరిగింది. ముందు ముందు అన్ని పరిశ్రమలకు కూడా ఇలాగే ఒకే ఒక్క దరఖాస్తుతో అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు. ఈ సంస్థ ద్వారా సుమారు 600 మందికి ఉపాధి లభిస్తుందన్నారు.

పాలమూరు జిల్లాకు పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. అమెజాన్‌ సంస్థ 7 వేలకు పైగా ఉత్పత్తులను ఆన్‌లైన్‌ ద్వారా వినియోగదారులకు అందిస్తుందని తెలిపారు. ఫుల్‌ఫిల్మెంట్‌ కేంద్రం ఏర్పాటుతో రవాణా, ప్యాకింగ్‌ వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. చేనేత ఉత్పత్తులను కూడా ఈ సంస్థ మార్కెటింగ్‌ చేస్తుందని తెలిపారు. సంస్థకు చెందిన డాటా కేంద్రాన్ని హైదరాబాదులో నెలకొల్పడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరిశ్రమల్లో స్థానిక యువతకు అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగాలన్నా, తలసరి ఆదాయం పెరగాలన్నా పరిశ్రమల స్థాపన తప్పనిసరి అన్నారు. అందుకే పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎం.పి. బాల్క సుమన్‌, స్థానిక ఎం.ఎల్‌.ఏ. వై. అంజయ్య యాదవ్‌, జిల్లా కలెక్టర్‌ శ్రీదేవి, జడ్‌పి ఛైర్మెన్‌ బండారి భాస్కర్‌, వైస్‌ఛైర్మన్‌ నవీన్‌ రెడ్డి, అమెజాన్‌ ఇండియా ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ అఖిల్‌ సక్సేనా తదితరులు పాల్గొన్నారు.

Other Updates