మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలంలో అంతర్జాతీయ ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం అమెజాన్ సంస్థ తమ గోడౌన్ల నిర్మాణం చేపట్టడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు ఐటి, పంచాయతీరాజ్ శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సమక్షంలో అమెజాన్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షులు డేవ్ క్లార్క్, ఇండియా కంట్రీ మేనేజర్ అమిత్ అగర్వాల్‌లు ఏప్రిల్ 8న తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ గోడౌన్లు దేశంలోనే పెద్దవిగా ఉంటాయని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. గోడౌన్ల ఏర్పాటు విషయంలో తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వారికి హామీ ఇచ్చారు. టీఎస్‌ఐపాస్ ద్వారా కొత్త ప్రాజెక్టులకు మూడు వారాల్లో కేవలం సొంత దృవీకరణ ద్వారా అనుమతులు ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. అమెజాన్‌కు 11 రోజుల తక్కువ వ్యవధిలో అన్ని అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరం పెట్టుబడులకు స్వర్గధామమన్నారు. బౌగోళిక పరిస్థితులు అన్నింటికీ అనుకూలంగా ఉంటాయన్నారు. ఇక్కడి నుండి దేశ, విదేశాలకు ఉన్న రవాణా సౌకర్యాలు అమెజాన్ లాంటి సంస్థలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఇలాంటి పెట్టుబడుల వల్ల ప్యాకేజింగ్, సరుకు రవాణాతో పాటు ఆతిథ్య రంగాలు లాభపడతాయన్నారు. కొత్త కొత్త వ్యాపారాలకు హైదరాబాద్ కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెజాన్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షులు డేవ్ క్లార్క్ మాట్లాడుతూ, ఐటీ పరిశ్రమలకు తెలంగాణ ఎంతో అనుకూలంగా ఉందన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం వల్లే తాము ఇక్కడ గోడౌన్ నిర్మాణానికి ముందుకు వచ్చామన్నారు. ఈ గోడౌన్ల నిర్మాణం ద్వారా అమెజాన్ వినియోగదారులకు త్వరగా వస్తువులను డెలివరీ చేయడంతో పాటు వేలాదిమంది చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు అండదండగా ఉంటుందన్నారు. అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మరిన్ని వ్యాపారాలు ప్రారంభిస్తామన్నారు. అమెజాన్ ద్వారా తాము అందిస్తున్న 2.1 కోట్ల విస్త్రృత శ్రేణి సర్వీసులను తెలంగాణ పౌరులు ఉపయోగించుకోవాలని కోరారు.
వేర్‌హౌజ్ కేంద్రం ప్రత్యేకతలు
అమెజాన్ ఏర్పాటు చేయనున్న వేర్‌హౌజ్ కేంద్రం 2లక్షల 80వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా అమెజాన్.ఇన్ ద్వారా కొనుగోలయ్యే ఉత్పత్తులను వారు ఈ కేంద్రం ద్వారా దేశవ్యాప్తంగా అమ్ముకునేందుకు వీలు కలుగుతుంది. ఈ కామర్స్ విధానం ద్వారా వస్తువులను అమ్ముకునేందుకు వచ్చే వ్యాపారులకు శిక్షణ ఇవ్వనున్నట్లు అమెజాన్ ప్రతినిధులు తెలిపారు.
నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధుల హర్షం
షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలంలో అమెజాన్ సంస్థ దేశంలోనే పెద్దవైన గిడ్డంగులను ఏర్పాటు చేయడం పట్ల ఇక్కడి ప్రజా ప్రతినిధులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు గాను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఐటి శాఖామంత్రి కేటీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్మాణాల వల్ల తమ ప్రాంతం ఎంతో అభివృద్ధిచెందుతుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేశారు.