Sampadakeeyamగడచిన ఏడాదిన్నర కాలంగా తెలంగాణ రాష్ట్రంలో కార్యరూపం ధరిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వాటి ద్వారా నెరవేరుతున్న ప్రభుత్వ లక్ష్యాలు దేశవ్యాప్తంగా చర్చనీ యాంశంగా మారాయి. బాలారిష్టాలను అధిగమించి అభ్యుదయ పథంలో పురోగమిస్తున్న క్రమంలో అన్ని విధాలా నిలదొక్కుకొని అడుగు ముందుకు వేస్తున్న దృశ్యం ఆవిష్కృతమవుతోంది. ప్రధానంగా మానవీయకోణం ప్రాతిపదికపై ప్రవేశపెట్టిన అనేక పథకాలు నిరుపేద, బడుగు వర్గాల ప్రజలలో విశ్వాసాన్ని పెంచాయి.

ఇక సుదీర్ఘ దూరదృష్టితో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల అమలు మలి అడుగు దశలో ముందుకు సాగుతున్నాయి. వీటి ఫలాలు అందడానికి మరికొంత కాలం పట్టవచ్చు. అయితే ఆయా పథకాల రూపకల్పన, అమలు తదితర అంశాల్లో ప్రభుత్వ సార ధుల అంకితభావాన్ని రాష్ట్ర ప్రజానీకం గుర్తించి బాసటగా నిలవడం గమనార్హం. నీటిపారుదల ప్రాజెక్టులు, ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీటి సరఫరా వంటి ప్రాధాన్యాంశాల విషయంలో రూపొందుతున్న ప్రణాళికలు సర్వత్రా చర్చనీయాంశాలయ్యాయి. నిన్నటి అనుభవాలను బేరీజు వేసుకొని, నేటి గమనాన్ని నిర్ధారించుకుంటూ భవిష్యత్తు వైపు అడుగేయడంలో కాలం తిరుగులేని ప్రధాన పాత్ర వహిస్తుంది. కాలగమనంలో నెలలు, సంవత్సరాలు గడచిపోతుంటాయి. వర్తమానం నుంచి భవితవైపు సాగుతున్న ప్రస్థానంలో వచ్చే కొత్త సంవత్సరం మైలురాయిగా నిలిచిపోవాలని ఆశిద్దాం.

రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ప్రగతి సాధకులకు కొత్త ఏడాది, మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బహుముఖంగా సాగిపోయే ప్రగతి సాధనలో మనవంతు కర్తవ్యాన్ని స్వీకరించి, స్ఫూర్తిగా ముందడుగు వేయడమే కొత్త సంవత్సరానికి మనం ఇచ్చే అపురూప స్వాగతం.

Other Updates