కాలచక్ర గమనం ఎవరికోసమూ ఆగదు. నేటికి నిన్న గతమైతే రేపు భవిత. కదలిపోతున్న సంవత్సరాల్లో 2019 విభిన్న అనుభవాలను సమీక్షించుకుంటూ రానున్న కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ వెళ్ళిపోతున్నది. అయితే నిన్నటి అనుభవాలను బేరీజు వేసుకుని, నేటి అవసరాల ప్రాతిపదికపై రేపటి ప్రణాళికలను రూపొందించుకోవడం విజ్ఞుల లక్షణం. అందుకే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంత ఆవశ్యకమో, తరతరాలుగా మన పెద్దలు చెబుతున్నారు.
ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో నూతన సంవత్సర వేడుకలు వైభవంగా జరుగుతాయి. మన దేశంలో ఆయా రాష్ట్రాల్లో అక్కడి సంప్రదాయాలకు అనుగుణంగా సంవత్సరాది పండగను ఘనంగా జరుపుకుంటారు. దీనితోపాటు పాశ్చాత్య సంస్కృతీ సంప్రదాయాలను పాటించడం రాను రాను విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఆంగ్ల సంవత్సరం వేడుకలు కూడా ప్రజల సంబరాల్లో భాగమయ్యాయి. ఈ సందర్భంగా నిన్నటి మంచిని వెంటతీసుకుని కొత్త ఏడాదికి స్వాగతం పలుకుదాం. మన వ్యవహారశైలిలో ఎదురైన ఎగుడు దిగుళ్ళను అధిగమించి ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుదాం. 2020 సంవత్సరపు తొలిరోజున మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మనల్ని ఇంకా విజయభ్యుదయాల దిశగా నడిపించాలని ఆకాంక్షిస్తూ కొత్త ఏడాదికి తెలంగాణ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నది. తెలంగాణ పాఠకులకు శుభాకాంక్షలు తెలుపుతున్నది.