అలలిప్పుడిప్పుడే
దరులను ముద్దాడుతున్నయి
కొమ్మలిప్పుడిప్పుడే
నేలకందుతున్నయి
సిలుమెక్కిన అతారలు
చందమామలా నవ్వుతున్నయి!
జీలు జీలు బండమీద జింకాలుండే
జింకల కొమ్ములకు ఏమేముండే
ఏ పువ్వుల నోట విన్నా
కాముని పున్నమి కథల్లా
కల్యాణలక్ష్మి
షాదీ ముబారక్‌ల ముచ్చట్లు!
కురిసిన చినుకులు కుప్పైతున్నవి
చెరువులు నిండు జలాశయాలై
కొత్త సాళ్ళు మునుమెల్తున్నవి
ఆశయాలు కలువలై పూస్తున్నయి
చిక్కులు తొలగి సూర్యుడెదురొస్తున్నడు
వెన్నెల వానై కురుస్తున్నది
వడ్లదాతి ముందు
మెసులనియ్యని గడాలు
కొలిమిలో పదునెక్కుతున్న కొడవండ్లు
సెలుకల్ల గుట్టల్లా బుడ్డల వాములు
తరిపొలాలన్ని వరికల్లాలు
పిచ్చుకలు స్వేచ్ఛగా ఆడుతున్నయి!
నిస్సహాయులకు ఆసరా
ఆమెకు
నెల నెల పింఛను
కొండంత అండ
ఆమె
ఇపుడు ఒంటరికాదు సమాజం
కాలం మాట తప్పలే
కాతను వాగ్దానం చేసింది
తల్లిబిడ్డలు క్షేమం
ఆరోగ్యానికి ఐకాన్ సర్కారు దవాఖానలు
భూమి లొసుగులు తొలగి
భూ లెక్కల్ని పక్కాచేసిన భూ సమగ్ర సర్వే
కారుచీకట్లను చీలుస్తూ
రెప్పమూయని కరెంటు ఆనందకాంతులు
గురుకులాల సాలు స్వర్ణయుగమే!
చెరువు వొడ్డున వలల తడి నవ్వులు
కొర్రమట్టలు, బంగారు తీగలు, జెల్లలు, కంచెలు దండిగా జలపుష్పాలు
మత్స్యకారుల బతుకుల్లో వెలుగులు
వృత్తులన్ని కొత్తబట్టలు
ఊర్లన్నీ సంక్రాంతులు!
ఒకప్పుడు
ఇంటి ముందల మేకలు గొర్లు
ఎచ్చిడి బతుకులు
ఇయ్యాల గొర్లు
స్వయంపోషక సగౌరవాలు
గొల్ల కురుమల్ని నిలబెట్టే జీవగర్రలు
కోలాటం పాటందుకున్నది
గుడిముందు యక్షగానం పొద్దెక్కింది
హనుమద్దాసు ఇద్దాసుల తత్వాలతో
భజన పాటలు జడలల్లుతున్నవి
అలావుకాడ తప్పెట్లు తీన్మార్లు
శివసత్తులు పోతురాజుల దర్వులు
దేవరుల విన్యాసాలు
రెక్కలిప్పుతున్న సాంస్కృతిక వికాసాలు!
చరిత్రను తిరగరాస్తున్న
మిషన్ కాకతీయ మిషన్ భగీరథలు
ఎదురెక్కుతున్న ఎత్తిపోతలు
దోసిట్ల కృష్ణా, గోదావరులు
మురిసిపోతున్న మడులు
రైతుబంధు ఆపద్బంధువై
మృగశిర తొలకరిని ముద్దాడే
అమరుల స్థూపంపై పూలవర్షం
– వనపట్ల సుబ్బయ్య