తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 33 కు పెరిగింది. కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో జిల్లాల సంఖ్య పెరిగింది.
పది జిల్లాలతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం దష్ట్యా 2016 అక్టోబరు 11వ తేదీన కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటుచేశారు. ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హామీమేరకు ములుగు, నారాయణపేట జిల్లాలు ఏర్పాటయ్యాయి. ఇవి ఫిబ్రవరి 17 నుంచి అమలులోకి వచ్చాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి ములుగు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి నారాయణపేటలను వేరుచేసి జిల్లాలుగా ఏర్పాటుచేశారు.
ములుగు కేంద్రంగా తొమ్మిది మండలాలతో ములుగు జిల్లా, నారాయణపేట కేంద్రంగా 11 మండలాలతో నారాయణపేట జిల్లా ఏర్పాటయ్యాయి. ములుగు జిల్లాలో ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, సమ్మక్క – సారక్క, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెకటాపురం, వాజేడు మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాకు జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్లు గ్రామీణం జిల్లాలు, చత్తీస్‌ఘడ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి.
నారాయణపేట జిల్లాలో నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గి, మద్దూరు, ఊట్కూరు, నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాకు సరిహద్దుగా మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, వికారాబాద్, కర్ణాటక రాష్ట్రం ఉన్నాయి.