tsmagazineతెలంగాణ రాష్ట్రంలో ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న నూతన జోనల్‌ వ్యవస్థకు కేంద్ర ఆమోదం సాధించడంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు విజయం సాధించారు. కొద్దిరోజులుగా కొత్త జోనల్‌ వ్యవస్థపై దృష్టిసారించిన ముఖ్యమంత్రి ఆగస్టు మాసంలోనే రెండుసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీఅయ్యారు. కొత్త జోనల్‌ వ్యవస్థ ఆవశ్యకతను ముఖ్యమంత్రి వివరించగా అందుకు ప్రధాని సానుకూలంగా స్పందించారు. రాష్ట్రపతి

ఉత్తర్వులను సవరిస్తూ, కొత్త జోనల్‌ వ్యవస్థను రూపొందించారు. దీనికి కేంద్రం ఆమోదం తెలపడంలో జాప్యం జరగడంవల్ల కొత్త నియామకాలు జరపడంపై ప్రభావం చూపుతోందని ముఖ్యమంత్రి వివరించారు. దాంతో ప్రధాని కొత్త జోన్లకు ఆమోదం తెలిపారు. దీనిప్రకారం ఇక నుంచి రాష్ట్రంలో జరిగే నియామకాలలో స్థానిక యువతకు 95 శాతం ఉద్యోగాలు లభించనున్నాయి.

కొత్త జోనల్‌ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలపడంతో ఇక దీనికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేయడమే తరువాయి.

వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇవ్వాల్సిన రూ.450 కోట్లను వెంటనే విడుదల చేయాలని, మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన వడ్డీ సబ్సిడీలో , రైతులకు ఇవ్వాల్సిన వడ్డీ సబ్సిడీలో కేంద్రం వాటాను విడుదల చేయాలని కూడా ప్రధాని మోదీని ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ కోరారు. హైకోర్టును సత్వరంగా విభజించాలని, రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు నిధులు కేటాయించాలని, జాతీయ రహదారుల విస్తరణ, కొత్త సెక్రటేరియట్‌ నిర్మాణానికి రక్షణ శాఖ భూములు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు.ఈ విషయాలపై ఇప్పటికే అనేకసార్లు అటు పార్లమెంటులోను, ఇటు ప్రధానమంత్రివద్ద, మరోవైపు ఆయా శాఖల మంత్రులకు విజ్ఞప్తిచేసిన విషయాన్ని కె.సి.ఆర్‌ గుర్తుచేశారు.

తాను ప్రస్తావించిన అన్ని ఆంశాలకు సంబంధించి పరిష్కారం, ఆమోదం లభించేలా చొరవ చూపాలని, ఆయా మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీచేయాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి కోరారు.
tsmagazine

తెలంగాణ రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం సూచించిన మేరకు జి.ఎస్‌.డి.పిలో మరో అరశాతం అదనంగా ఎఫ్‌.ఆర్‌.బి.ఎం నిధులు సమకూర్చాలని కూడా ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్‌ రాష్ట్రం కనుక 3.5 శాతం వరకూ నిధులను అప్పుల రూపంలో తీసుకొనే వెసులుబాటును 14వ ఆర్థిక సంఘం కల్పించిన విషయాన్ని ప్రధానికి వివరించారు.

కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌తో భేటి
ముఖ్యమంత్రి కె.సి ఆర్‌ ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోం శాఖామంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్థిక శాఖామంత్రి అరుణ్‌ జైట్లీతో వేరువేరుగా సమావేశమయ్యారు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటుచేసిన జోనల్‌ వ్యవస్థకు ఆమోదం తెలిపే విషయంలో చొరవచూపినందుకు రాజ్‌ నాథ్‌ సింగ్‌కు కతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇచ్చే నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖామంత్రిని కోరారు.
tsmagazine

కృష్ణా జలాలను మళ్లీ పంచండి
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు న్యూఢిల్లీలో కేంద్ర జల వనరులు, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పలు వినతి పత్రాలు సమర్పించారు. కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించిన వివాదంలో సరైన న్యాయం జరగాలంటే, ఈ అంశాన్ని కృష్ణా వాటర్‌ డిస్ప్యూట్‌ ట్రిబ్యునల్‌-2 (కేడబ్ల్యూఆర్టీ-2)కు అప్పగించాలని కోరారు.ఇంటర్‌ స్టేట్‌ రివర్‌ వాటర్‌ డిస్ప్యూట్‌ ఆర్ట్‌ (ఐఎస్‌డబ్ల్యూఆర్‌) సెక్షన్‌ 3 ప్రకారం మొత్తం కృష్ణా బేసిన్‌లో పున: పంపిణీ జరగాలని కేసీఆర్‌ కోరారు. ఏపీ పునర్విభజన బిల్లు సెక్షన్‌ 80 ప్రకారం కృష్ణా నదీ జలాల కేటాయింపు అంశాన్ని బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు అప్పగించారని, ఈ ట్రిబ్యునల్‌ కేవలం తెలంగాణా, ఏపీ రాష్ట్రాల మధ్య జలాల పంపిణీ అంశానికి పరిమితం అని సీఎం చెప్పారు. దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరగదని, కృష్ణా నదీ జలాల కేటాయింపులో తెలంగాణకు బచావత్‌ ట్రిబ్యునల్‌ లోనే అన్యాయం జరిగినందున, మొత్తం కృష్ణా జలాల విషయంలో మళ్లీ పంపకం జరపాలని సీఎం కోరారు. కాబట్టి ఈ అంశాన్ని బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌కు పరిమితం చేయకుండా, ఐఎస్‌డబ్ల్యూఆర్‌ చట్టంలోని 3వ సెక్షన్‌ ప్రకారం విచారించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే ఇదే విజ్ఞప్తిని చేశామని, ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో తాము ఈ డిమాండ్‌ చేస్తున్నామని కేంద్రమంత్రి దృష్టికి కేసీఆర్‌ తెచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదని, దీన్ని పాత ప్రాజెక్టుగానే గుర్తించాలని, దీనికి సంబంధించి కేంద్ర జల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రమంత్రి గడ్కరీని కోరారు.

సమైక్య రాష్ట్రంలోనే 2005లో రాజీవ్‌ దుమ్ముగూడెం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌, ఇందిరా సాగర్‌ రుద్రమకోట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పేర్లతో గోదావరి నదిపై ప్రాజెక్టులు మంజూరైన విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. 2007లోనే ఈ రెండు ప్రాజెక్టుల పని ప్రారంభమయిందన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికే ఈ రెండు ప్రాజెక్టులకు కలిసి 1,771.16 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇందిరాసాగర్‌ హెడ్‌వర్క్స్‌ ఉన్న ప్రాంతం ఏపీలో కలవడంతోపాటు, వన్యప్రాణుల సాంక్చురీకి ఆటంకం కలుగకుండా తాము ప్రాజెక్టును రీ డిజైన్‌ చేశామని సీఎం చెప్పారు. అంతర్రాష్ట వివాదాలు తలెత్తకుండా ఉండడంకోసం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ను తెలంగాణ భూభాగానికి మార్చామని, వన్యప్రాణులకు హాని కలుగ కుండా అలైన్‌మెంట్‌ మార్చామని చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులను కలిపి, ఒకే ప్రాజెక్టుగా నిర్మిస్తున్నామని, దీనికి సీతారామ అనే పేరు పెట్టామని వివరించారు. ప్రాజెక్టు డీపీఆర్‌ను కూడా కేంద్ర జల సంఘానికి పంపామని, కేంద్ర జల సంఘం అనుమతులకోసం గోదావరి రివర్‌ మేనేజ్‌ మెంట్‌ బోర్డుకు పంపినట్లు తెలిసిందన్నారు. గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పరిధి కొత్త ప్రాజెక్టులకు సంబంధించి ఉంటుందని, సీతారామ ప్రాజెక్టు దాని పరిధిలోకి రాదని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్‌ చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చినట్లే, పాత ప్రాజెక్టును సీతారామ ప్రాజెక్టుగా మార్చామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పాత ప్రాజెక్టుగా పరిగణించినట్టే, సీతారామను కూడా పాత ప్రాజెక్టుగానే పరిగణించాలని సీఎం కోరారు.

సంగారెడ్డి-నర్సాపూర్‌-తూప్రాన్‌-గజ్వేల్‌-జగదేవ్‌పూర్‌-భువనగిరి-చౌటుప్పల్‌ మీదుగా వెళ్లే 154 కి.మీ. రహదారిని, చౌటుప్పల్‌-యాచారం- షాద్‌నగర్‌-చేవెళ్ల-శంకర్‌పల్లి-కంది మీదుగా వెళ్లే 180 కి.మీ. రహదారిని జాతీయ రహదారిగా విస్తరించేందుకు అంగీకరించినందుకు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు రహదారులు హైదరాబాద్‌ నగరానికి రీజినల్‌ రింగ్‌రోడ్డుగా మారుతున్నాయని వివరించారు. ఇది హైదరాబాద్‌కు కేవలం 50-60 కి.మీ. దూరంలోనే ఉంటుందని, తెలంగాణ రాష్ట్ర పురోగతిలో ఈ రహదారి కీలకపాత్ర పోషిస్తుందని సీఎం చెప్పారు.

సంగారెడ్డి-చౌటుప్పల్‌ రహదారిని జాతీయ రహదారిగా గుర్తించి, విస్తరణ పనులకోసం ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించారని, చౌటుప్పల్‌-కంది రోడ్డును ఇంకా నోటిఫై చేయాల్సి ఉందని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు.150 అడుగుల వెడల్పుతో ఆరు లేన్ల రోడ్డు నిర్మించడానికి రూ. 11వేల కోట్ల అంచనాతో తాము ప్రతిపాదనలు సిద్ధం చేశామని, దానికి అనుగుణంగానే నిధులు కేటాయించాలని సీఎం కోరారు.

167 నంబరు జాతీయ రహదారిలో జడ్చర్ల-మహబూబ్‌నగర్‌ మధ్య 15 కి.మీ. నాలుగు లేన్ల రోడ్డు నిర్మించాలని సీఎం కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో 2వేల కి.మీ. మేర రహదారిని నాలుగులేన్ల రోడ్డుగా మార్చేందుకు ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించారని, ఇందులో 1000 కి.మీ. విస్తరణ జరిగిందని సీఎం చెప్పారు. మరో 400 కి.మీ. పని పురోగతిలో ఉందన్నారు. అయితే మిగిలిన 600 కి.మీ. పనులు టెండరు దశలోనే ఉన్నాయని, ఈ రహదారులు బాగా పాడైపోయినందున మరమ్మతులకోసం నిధులు ఇవ్వాలని సీఎం కోరారు.

తెలంగాణ రాష్ట్ర పీడబ్ల్యూడీ ద్వారా నిర్వహిస్తున్న జాతీయ రహదారుల అభివృద్ధికి 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,635 కోట్లు, 2017-18లో రూ. 3,030 కోట్లు మంజూరు చేసినందుకు కేంద్రమంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. అయితే 2018-19లో కేవలం రూ. 353 కోట్లకే అనుమతులకు పరిధి విధించారని సీఎం కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. తెలంగాణలో 3600 కి.మీ. జాతీయ రహదారిని రాష్ట్ర పీడబ్ల్యూడీ నిర్వహిస్తున్న దని, వీటి నిర్వహణకోసం ఈ ఏడాది రూ. 3000 కోట్ల నిధులు సమకూర్చాలని కోరారు.

రాష్ట్రంలో పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించినందుకు కేంద్రమంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించి అలైన్‌మెంట్‌, గెజిట్‌ నోటిఫికేషన్లు రావడంలో ఆలస్యం జరుగుతోందని కేంద్రమంత్రికి వివరించారు. చౌటుప్పల్‌-కందికి అలైన్‌మెంట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉందన్నారు. మెదక్‌-సిద్ధిపేట- ఎల్కతుర్తి రోడ్డును నోటిఫై చేయాలన్నారు. కరీంనగర్‌-సిరిసిల్ల-పిట్లం రహదారికి అలైన్‌మెంట్‌, నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉందన్నారు. గౌరెల్లి- వలిగొండ- మహబూబాబాద్‌-కొత్తగూడెం రహదారికి నోటిఫికేషన్‌ ఇవ్వాలని, మెదక్‌-రుద్రూర్‌ రహదారికి నోటిఫికేషన్‌ ఇవ్వాలని, బోధన్‌-బాసర-భైంసాకు వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని, దుద్దెడ-సిద్ధిపేట-సిరిసిల్ల రహదారికి అలైన్‌మెంట్‌ అనుమతి ఇవ్వాలని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు.

జాతీయ రహదారులను గ్రీన్‌ హైవేలుగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతిష్ఠాత్మకమైన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. జాతీయ రహదారుల పక్కన మొక్కలు పెంచే బాధ్యత వర్క్‌ ఏజెన్సీలు, నిర్వహణ సంస్థలదే అయినా, వారు సరిగ్గా నిర్వహించడం లేదని సీఎం చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా మొక్కలు నాటినప్పటికీ, వాటి సంరక్షణ సరిగా లేదని వివరించారు. జాతీయ రహదారుల వెంటన మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడంలాంటి పనులను అనుభవం, యంత్రాంగం కలిగిన రాష్ట్ర అటవీశాఖకు అప్పగించాలని కోరారు. దీనివల్ల జాతీయ రహదారులను గ్రీన్‌ హైవేలుగా మార్చే లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు.

Other Updates