vikasamడాక్టర్‌ సి. వీరేందర్‌

రజిత పరీకూజులు వ్రాసేముందు తనకు ఏదీ గుర్తుకు రావటం లేదని, తనకు తక్కువ మార్కులు వస్తాయని.. విపరీతంగా బాధపడింది. మిగతా మిత్రులంతా ఆమెను అనునయించారు. పరీక్షా ఫలితాలు చూస్తే 90 శాతం మార్కులు వచ్చాయి. మిత్రులంతా సంతోషపడి, అభినందనలు చెబితే, రజిత దు:ఖంతో ”ఛీ అవేమి మార్కులు! మీరు నన్ను అవమానిస్తున్నారు. నాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి.. నాకింతే, ఎప్పుడూ ఎక్కువ మార్కులు రావు” అంటుంటే.. అవాక్కవ్వడం స్నేహితుల వంతయ్యింది.

రాజీవ్‌ సాగర్‌కు తన ఫైనల్‌ పరీక్షలో 65 శాతం మార్కులు వచ్చాయి. తను ఎంత చదివినా, ఎన్ని సార్లు సాధన చేసినా సరే! తనకు అన్నే మార్కులు వస్తాయని, అందుకోసం తాను ఎక్కువ చదవనని.. తన తెలివితేటలు ఇక పెరగవని, తాను ఎక్కువ చదవడం అనవసరమనే ఆలోచనను పదే పదే అందరికి చెప్తుతుంటాడు.

చాలా మంది యువతీయువకులు, తమకు తెలివితేటలు తక్కువ అని, తమ నైపుణ్యాలు ఏమి చేసినా పెరగవని, జీవితాంతం చాలా తక్కువ స్థాయి జీవితంలోనే ఉండాలని అనుకుంటుంటారు. అలాంటి పనులే చేస్తుంటారు. నిజానికి మనిషికి తెలివితేటలు అపారం. పుట్టుకతోనే 10 రకాల తెలివితేటలతో పుడతారని ప్రొఫెసర్‌ హవర్డ్‌గార్డ్‌నెర్‌ చెప్పారు.

కొన్ని వేల కోట్ల న్యూరాన్స్‌తో అనంతమైన జ్ఞాపకశక్తి మనిషి సొంతం. కాని మనం పెరుగుతున్నప్పుడు పరిసరాల వల్ల, తల్లిదండ్రుల వల్ల టీచర్ల వల్ల, చదివిన కథల, అనుభవాల వల్ల మనిషి తనకు తెలియకుండానే కొన్ని ‘నమ్మకాలు’ ఏర్పరచుకుంటాడు. ఆ నమ్మకాలు బలంగా తయారయ్యి, మనిషిని పూర్తిగా వాటికి బానిసగా తయారుచేస్తుంది. నిజానికి మనిషి ఎంతో శక్తిమంతంగా పుడుతున్నాడు. కాని ఏర్పరచుకున్న ‘నమ్మకాల’ వల్ల చాలా తక్కువ శక్తిని ఉపయోగించుకుంటున్నాడు.

మనిషి శక్తి అపారం. దానిని పూర్తి స్థాయిలో ఉపయోగించడంలోనే మనిషి విజయం దాగి ఉంటుంది. మనకు తెలియకుండా మనం ఏర్పరచుకున్న’లిమిటెడ్‌ బిలీఫ్‌’ పరిమిత విశ్వాసాల వలన చెయ్యగలిగిన శక్తి వున్నా చెయ్యలేమన్న భావన మనల్ని మన నమ్మకానికి అనుగుణంగా పని చేయిస్తోంది. ఇలా మన ప్రవర్తనని, మన ఫలితాలని కంట్రోల్‌ చేసే నమ్మకాలను కోర్‌ సెల్ఫిష్‌ అంటాము. ఇవి మనల్ని మనం చూసుకునే విధానాన్ని, ప్రపంచాన్ని చూసే విధానాన్ని, ఇతర వ్యక్తులను అర్థం చేసుకునే పద్ధతిని, అలాగే మన భవిష్యత్తుని దర్శించేందుకు మన మెదడుతోఒక కిటకీ లాగా దాంట్లోంచి మాత్రమే చూడగలిగేట్టు ప్రభావితం చేస్తుంది.

ఉదాహరణకు ఒక పుచ్ఛపండును ఒక డబ్బాలో అది చాలా చిన్నగా ఉన్నప్పుడే పెడితే పెరిగిన తర్వాత ఆ డబ్బా ఎలా ఉంటే అలాంటి చతురస్రాకారంగా ఉన్న పండులాగానే ఉంటుంది. నిజానికి ‘పుచ్చపండు’ గుండ్రంగా లేదా చాలా పెద్ద కోడి గుడ్డు ఆకారంలో పెరుగుతుంది. కాని ఇక్కడ డబ్బా దాని ఎదుగుదలను నియంత్రిస్తుంది. అలాగే మన నమ్మకాలు కూడా మనకున్న సామర్థ్యం పూర్తి స్థాయిలో కాకుండా డబ్బాలాంటి నమ్మకాలతో మన సామర్థ్యాన్ని కూడా నియంత్రించి.. మనకున్న ”సామర్థ్యాన్ని” ఉపయోగించడానికి వీలులేకుండా మన స్థాయి ఇంతే అనే భ్రమను కల్గిస్తుంది. కాబట్టి ఇలా ఏర్పడిన నమ్మకాలను మనం మార్చుకునే శక్తి మనలోనే వుంది.

యువతీ యువకులు వాళ్ళను వాళ్ళు శక్తివంతులుగా తీర్చిదిద్దుకోవడానికి కొన్ని బలమైన కొత్త నమ్మకాలను ఏర్పరచుకోవాలి. ప్రపంచంలో విజయం సాధించిన వారంతా ఈ కింది నమ్మకాలను నిరంతరం ఆచరణలో పెడతారు. మరిన్ని విజయాలను సాధిస్తారు.. విజయులుగా ప్రస్థానం కొనసాగిస్తారు. విజయం సాధించాలనుకునే వారందరు పాత నమ్మకాలను ‘పరిమిత విశ్వాసాన్ని’ (లిమిటెడ్‌ బిలీఫ్‌) ప్రతిఘటించి వాటిని మార్చుకుంటారు.

ఒక సంఘటన పట్ల మన మెదడు ఒక అభిప్రాయం ఏర్పరుచుకుంటుంది. వెంటనే మెదడు దానికి సంబంధించిన ‘సాక్ష్యం’ కోసం వెతికి పట్టుకొని ఆ అభిప్రాయాన్ని బలపరుచుకుంటుంది. ఇలా చాలాసార్లు జరిగిన తర్వాత ఒక ‘నమ్మకం’ ఏర్పడుతుంది.. అయితే ఎక్కువసార్లు మనకు వ్యతిరేకంగా, అంటే మన శక్తిని తక్కువ చేసే దానికి మాత్రమే అది ఉపయోగపడుతుంది.

ఉదాహరణకు ఒక విద్యార్థికి గణితం కష్టంగా ఉంటుంది. అయినా పరీక్ష కోసం కష్టపడి వ్రాస్తాడు. తోటి స్నేహితుడు లేదా తల్లిదండ్రులు ‘వీడికి గణితం చాలా కష్టం సరిగ్గా చేయలేడు’ అంటారు అది విద్యార్థి ఆలోచనల్లో దూరి పరీక్షల్లో తక్కువ మార్కులు రాగానే.. వెంటనే అవును నాకు గణితం కష్టం. అనే నమ్మకాన్ని ఏర్పరచుకుంటాడు. ఇలా జరిగిన ప్రతిసారి నమ్మకం మరింత బలంగా మారి చివరకు ‘నాకు గణితం కష్టం, ఏం చేసినా నాకు రాదు.’ అనే దానికి బందీ అవుతారు.

ఇప్పుడు మనం కొత్త నమ్మకాన్ని ఏర్పరుచుకుందాం. ఈ రోజు నుండి ”నేను తెలివైన విద్యార్థిని” నేను గణితాన్ని బాగా చేయగలుగుతాను. అనే కొత్త నమ్మకాన్ని ఏర్పరుచుకుందాం. మెదడు వెంటనే చేసేపని ఒక ‘సాక్ష్యం’ కోసం వెదుకుతుంది.. గతంలో ఎన్నో సార్లు ఎన్నో తెలివైన పనులు చేసారు. ఎన్నో పరీక్షలు పాసయ్యారు. గణితాన్ని కూడా నేర్చుకున్నారు. ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని కనుగొన్నారు. ఈ సాక్ష్యాలన్నింటిని మెదడుకు చేరవేస్తాయి. వెంటనే ‘కొత్త నమ్మకం’ బలపడుతుంది.. ఇలా కొన్ని రోజుల తర్వాత పూర్తిగా మారిపోతారు. తెలివైన విద్యార్థిగా మీరు రూపాంతరం చెందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పటి నుండి మీ ఫలితాలు అనుకున్న స్థాయిలో రావడం మొదలవుతుంది.

రాబోయే జీవితంలో విజయ పరంపర కొనసాగాలంటే, గతంలో ఏం జరిగిందనేది ముఖ్యం కాదు. అది జరిగిపోయింది. గతం ఎప్పుడు భవిష్యత్తు కాదు, గతాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఏ మనిషికి లేదు. కానీ, భవిష్యత్తును మార్చుకునే శక్తి మనిషికి ఉంది. ఆ భవిష్యత్తును మనం అనుకునే విజయం వైపు ప్రయాణం చెయ్యాలంటే పాతనమ్మకాలను పాతరేసి కొత్త నమ్మకాల విత్తనాలను విత్తి విజయాల తోటలను పెంచుకుందాం. విజయాలను అందించే ”కొత్త నమ్మకాల” విత్తనాలు విత్తాలి మనం.

Other Updates