assemblyతెలంగాణ వెనుకబడిన తరగతులు, దళిత, గిరిజనుల ( విద్యా సంస్థలలో సీట్లు, ఉద్యోగ నియామకాలు, పదవుల కేటాయింపు) రిజర్వేషన్ల బిల్లు 2017కు రాష్ట్ర శాసన సభ, శాసన మండలి ఆమోదం తెలిపాయి. బీసి- ఇ గ్రూపు ద్వారా ముస్లింలకు అదనంగా 8 శాతం, గిరిజనులకు అదనంగా 4 శాతం రిజర్వేషన్లు పెంపునకు ఉద్దేశించిన ఈ బిల్లును ఏప్రిల్‌ 16న ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన శాసన సభ సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రవేశపెట్టారు. అదేరోజు సాయంత్రం శాసన మండలి సమావేంలో ముఖ్యమంత్రి ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించాయి.

ఈ సందర్భంగా శాసన సభలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రసంగిస్తూ, రాష్ట్రంలో ఇప్పటివరకూ 50 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 62 శాతం చేస్తున్నట్టు ప్రతిపాదించారు. ఈ బిల్లు చారిత్రాత్మకమైనదిగా పేర్కొంటూ కొందరు ప్రచారంచేస్తున్నట్టుగా ఇది మత పరమైన బిల్లు కాదని స్పష్టంచేశారు. గతంలో ముస్లింలకు ప్రభుత్వం కల్పించిన 4 శాతం రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు. దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపి ఆమోదింపచేస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా వెనుకాడబోమని సి.ఎం చెప్పారు.

దేశంలో 50 శాతానికి మించిన రిజర్వేషన్లు తమిళనాడు, రాజస్థాన్‌ వంటి 5 రాష్ట్రాలలో అమలుచేస్తున్నారని, అలాగే మనకు కూడా ఇది సాధ్యమవుతుందని చెప్పారు. గిరిజనులకు 6 శాతంగా ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతున్నట్టు సి.ఎం తెలిపారు. వాల్మీకి, బోయ వంటి కొన్ని కులాలను ఎస్టీలలో చేర్చుతున్నట్టు తెలిపారు. తెలంగాణలో ఉన్న గిరిజనుల జనాభాను అనుసరించి ఈ పెంపు చేస్తున్నట్టు తెలిపారు.

సభ్యులు లేవనెత్తిన పలు అంశాలకు ముఖ్యమంత్రి కె.సి.ఆర్‌ సావధానంగా సమాధానమిచ్చారు. దీంతో శాసన సభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. బిల్లుతోపాటు తెలంగాణ వారసత్వపు బిల్లు 2017, వస్తు సేవల బిల్లు 2017 లను కూడా సభ ఆమోదించింది.

Other Updates