నియామకాలకు సిద్ధమైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్
తెలంగాణ రాష్ట్రం తనను తాను రచించుకుంటున్న సందర్భంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అవతరణ అత్యంత కీలకమైనది. రాష్ట్ర సాధన ఉద్యమంలో నీళ్లు, నిధులతో ఎగిసిన ఉద్యమానికి ‘మా ఉద్యోగాలు మాకే’ అనే డిమాండ్ తెలంగాణ నేలపై కదం తొక్కింది. రాష్ట్రం వచ్చిన తర్వాత మన చరిత్రను మనం చదువుకుంటూ, మన సంస్కృతిని మనం ఆకళింపు చేసుకుంటూ, నవ తెలంగాణ నిర్మాణానికి సమర్థవంతమైన పునాదులు వేసేందుకు మానవ వనరుల సైన్యాన్ని తయారుచేసే కేంద్రం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్. యిది చాలా కీలకమైనది.
శ్రీ జూలూరు గౌరీశంకర్
పబ్లిక్ సర్వీస్ కమీషన్ అనేది రాజ్యాంగంలో ఒక అంగం. ఈ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌కు ఎటువంటి రాజకీయ నీడలు లేకుండా స్వతంత్రంగా వ్యవహరించేందుకు సమర్థుడైన వ్యక్తి చక్రపాణిని చైర్మన్‌గా ఎంపిక చేశామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బహిరంగంగా ప్రకటించారు. ఎవరు చెప్పినా వినని వ్యక్తి, ఒక లక్ష్యంతో ముందుకు సాగే యువకుడినే ఈ సర్వీస్ కమీషన్‌కు చైర్మన్‌గా ఎంపిక చేశామని కెసిఆర్ గర్వంగానే ప్రకటించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ అంటే అదొక అవినీతి పాతాళం లాగాపేరు బడింది. పాత బూజులు దులిపి, పాత సిలబస్‌లను పాతరేసి, ఈ నేల ప్రశస్తిని చాటి చెబుతూ, ఆధునిక సమాజాలను అందుకుంటూ ముందుకు సాగే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌ను తీర్చిదిద్దేపని దిగ్విజయంగా జరుగుతూ ఉంది.
తెలంగాణ రాష్ట్రం అవతరించాక సిలబస్‌లో వస్తున్న మార్పులను చూస్తే యిప్పటి దాకా తెలంగాణ చరిత్రను, సంస్కృతిని ఆధిపత్య సంస్కృతి ఎంత అదిమిపెట్టిందో తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గతానికి భిన్నంగా, తెలంగాణ నవ చైతన్యంతోటి ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. జూలై 2, 2014న తెలంగాణ రాష్ట్రం అవతరిస్తే ఆ ఏడాది డిసెంబర్ 18న పబ్లిక్ సర్వీసు కమీషన్‌ను ప్రకటించింది.
గతంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్‌కు అంత మంచి పేరేమీ లేదు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ అంటే అనేక రకాలుగా లోపభూయిష్టంగా ఉందని, అనేక అవినీతి ఆరోపణలు కూడా వెలుగులోకి రావటం జరిగింది. పాత విధానానికి భిన్నంగా తెలంగాణ అస్థిత్వంతో పరీక్షా విధానం రూపుదాల్చేందుకు ఘంటా చక్రపాణి ఎంతో కృషి చేశారు. గత పరీక్షా విధానాన్ని సమూలంగా మార్చివేశారు. ఇందుకోసం ఆయన భారీగానే కసరత్తు చేయడం జరిగింది. నూతన పరీక్షా విధానాన్ని చేపట్టేందుకు ఆయన తెలంగాణ విద్యారంగంలో నిపుణులందరినీ ఒక దగ్గరకు చేర్చారు. ప్రొ|| హరగోపాల్, ప్రొ|| కోదండరాం, విద్యావేత్త చుక్కా రామయ్య, వివిధ రంగాలలో నిష్ణాతులైన వ్యక్తులను 32 మందిని ఒక కమిటీగా వేసి పరీక్ష విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. రెండు నెలలు ఈ కమిటి వివిధ పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను తయారుచేసింది. కమీషన్‌ను ప్రభుత్వం నియమించిన తక్కువ కాలంలోనే దీని పరిధిలోకి వచ్చే 300 రకాల డిపార్ట్‌మెంట్‌ల పరీక్షలను నిర్వహించడం జరిగింది.
నిరుద్యోగులైన ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పబ్లిక్ సర్వీసు కమీషన్‌లో తన పేరును నమోదు చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాపితంగా బహుళజాతి కంపెనీలు అమలుపరిచే విధంగానే వన్‌టైం రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. నిరుద్యోగి ఉచితంగా సమగ్ర సమాచారాన్ని పబ్లిక్ సర్వీస్ కమీషన్ వెబ్‌సైటులో వీక్షించవచ్చు. తన పేరున రిజిస్ట్రేషన్ చేసుకొని అభ్యర్థి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తు ఫారంలో ఆధార్ నెంబర్‌తో సహా, అన్ని రకాల క్వాలిఫికేషన్లు, అభ్యర్థికి ఏ రకమైన ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉందో తెలియజేయవచ్చు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ వెబ్‌సైట్ ద్వారా సంపూర్ణ వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ దరఖాస్తు ఫారంలో అభ్యర్థి మొబైల్ నెంబర్, ఈమెయిల్ నెంబరు అడుగుతారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ అభ్యర్థి మొబైల్ టియస్ ద్వారా 10 డిజిటల్ నెంబర్లున్న కోడ్ నెంబర్‌ను యిస్తారు. నోటిఫికేషన్ విడుదలైనప్పుడు, ఉద్యోగాలలో ఖాళీలు ఏర్పడినప్పుడు, ఆ నోటిఫికేషన్ వివరాలను నమోదు చేసుకున్న వారికి ఎస్‌ఎమ్‌ఎస్, ఈమెయిల్ రూపంలో అభ్యర్థికి సమాచారం పంపడం జరుగుతుంది. అభ్యర్థికి ఎస్‌ఎమ్‌ఎస్, ఈమెయిల్, అప్లికేషన్ ఫాం లింకును పంపుతారు.ఆ లింకును క్లిక్ చేస్తే ఒక విండో తెరుచుకుంటుంది. దాంట్లో మొబైల్ టిఎస్ ద్వారా ఆ అభ్యర్థికి కేటాయించిన 10 అంకెల కోడ్ నెంబర్‌ను అడగటం జరుగుతుంది. ఆ 10 అంకెల కోడ్ నెంబర్‌ను టైపు చేస్తే కంప్యూటర్‌లో అప్లికేషన్ ఫిలప్ అవుతుంది. దాన్ని అభ్యర్థి క్రాస్ చెక్ చేసుకోవాలి. 2వ సారి మీట నొక్కితే పరీక్షా రుసుము చెల్లించే మరో కిటికీ తెరుచుకుంటుంది. క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా అన్ని జాతీయ బ్యాంకుల్లో ఆన్‌లైన్ ద్వారా ఫీజులు చెల్లించవచ్చు.
మొబైల్ మనీ ద్వారా కూడా పరీక్ష ఫీజులు చెల్లించవచ్చు. పరీక్షకు వారం రోజులు ముందు మరొక సమాచారం వస్తుంది. ఇంట్లో కూర్చుని అభ్యర్థి కంప్యూటర్ ద్వారా అప్లికేషన్ తీసుకొనవచ్చు. పరీక్ష రాసాక ఫలితాలు, మెమో కూడా మెయిల్, మొబైల్ ద్వారా పొందవచ్చును. పరీక్ష రాసే అభ్యర్థి ఆదిలాబాద్ జిల్లా మారుమూల ఉట్నూరు దగ్గర నుంచి చేతిలోని మొబైల్ ఫోను ద్వారా, కంప్యూటర్ నెట్ వర్క్ సెంటర్ల ద్వారా సమగ్ర సమాచారాన్ని పొందవచ్చు. మార్కుల ఫలితాలను కూడా ఈ విధానం ద్వారా తెలుసుకొనవచ్చు. అపాయింట్ మెంట్ కోసం మాత్రమే అభ్యర్థి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ మెట్లు ఎక్కవలసి ఉంటుంది.
ఇలా పాత పరీక్ష విధానాన్ని సమూలంగా మార్చి ఆధునిక పరీక్ష విధానం అమలు చేసే పనిలో చక్రపాణి సఫలీకృతుడయ్యాడనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ కొత్త పరీక్ష విధానం దేశానికే ఆదర్శంగా నిలువనుంది. ఇలాంటి పరీక్షా విధానం కేరళ రాష్ట్రంలో ఉంది. కేరళలో సర్వెంట్ నియామకం దగ్గరనుంచి సర్వీసు కమీషన్ నియామకం వరకు పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ విధానం కంటె కూడా మెరుగైన విధానాన్ని ప్రవేశపెట్టేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కృషి చేస్తోంది.
ఆధునిక పద్ధతుల ద్వారా పరీక్షా విధానంలో పారదర్శకత, జవాబుదారీతనం తేవాలి. అవకతవకలకు అపవాదులకు తావులేకుండా పరీక్షలు నిర్వహించాలి. గతంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా జరిగిన తప్పిదాలను, జరుగకుండా చూసుకోవాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చేపట్టిన ఈ నిర్వహణా పద్ధతులు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నాయి. ఇటీవల సిమ్లాలో జరిగిన సమావేశంలో యుపిఎస్‌సి చైర్మన్ మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ వెబ్‌సైట్ చూసి ఇది ఎంతో ఆధునాతనంగా ఉందని అభినం దించారు. అతి పిన్నవయస్కుడైన చైర్మన్ అతి తక్కువ కాలంలో నిర్మాణయుతంగా ఇంత పని చేయగలిగినందుకు చక్రపాణిని ఆ సమావేశంలో ‘యువ డైనమిక్ చైర్మన్’ అని ఆయన అభినందించారు. జాతీయంగా వేసిన నేషనల్ స్టాడింగ్ కమిటీలోని ఆరుగురు సభ్యులలో మన ఘంటా చక్రపాణి ఒకరు.
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్వహిస్తున్న పరీక్షలలో గతమాదిరిగా సిలబస్ ఉండదు. ఇందుకు సంబంధించిన సమూల మార్పులు జరిగాయి. తెలంగాణ అవగాహనతో, తెలంగాణ అస్థిత్వంతో, తెలంగాణ గత వైభవం, చరిత్ర, వారసత్వం, సంస్కృతి మొత్తంగా తెలంగాణ అంటే ఏమిటో తెలుసుకోకుండా ఈ పోటీ పరీక్షలలో పాల్గొనడం కష్టం. తెలంగాణ సమాజం తెలియకుండా ఇక్కడ ప్రజల పరిస్థితులు, సామాజిక జీవనం, సబ్బండ వర్ణాల సంస్కృతి, సాహిత్యం, ఈ నేల విశిష్టత, ఇక్కడి నదులు, ఏరులు, పుణ్యక్షేత్రాలు, తెలంగాణ సరిహద్దులు, తెలంగాణ చెరువులు, తెలంగాణ బతుకమ్మ, బోనాలు, తెలంగాణ సంబురాలు, తెలంగాణ దుఃఖాలు, ఈ మట్టిపై ఎగిసిన వీరోచిత పోరాటాలు, వీర తెలంగాణ సాయుధ పోరాటాలు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం, ఈ ఉద్యమంలో కొనసాగిన సుదీర్ఘ పోరు యాత్ర, ఇక్కడ జరిగిన విప్లవోద్యమాలు, ఈ నేలపై జరిగిన నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు, సమగ్ర చరిత్ర తెలియకుండా తెలంగాణ అధికారిగా, ఉద్యోగిగా నియమించబడితే ఫలితమేముంటుంది? తెలంగాణ నేలలో జరిగిన పోరాటం, ఇక్కడ ప్రజలపై జరిగిన అణచివేత, మన చరిత్ర మనకు స్పష్టంగా తెలియాలి. గత వైభవంతోపాటు భవిష్యత్తులో ఎలా ఉండాలి? నవ తెలంగాణను ఎలా నిర్మించుకోవాలి? మారుతున్న సమాజానికి సంబంధించి మానవ వనరులను ఎలా సన్నద్ధం చేసుకోవాలి? పది జిల్లాల చరిత్ర ప్రతి ఒక్కరికీ తెలియాలి. అందుకే సిలబస్‌లో సంపూర్ణ మార్పులు చేపట్టామని కమీషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి పలుసార్లు బహిరంగంగా వేదికలపైననే ప్రకటించారు.
ఒక ఉద్యోగిగా నియమించబడే వ్యక్తి ఆ ఉద్యోగ బాధ్యతలను సమగ్రంగా తెలుసు కుని తన వృత్తిలో కొనసాగేందుకు ఎలాంటి ప్రశ్నలు అడగాలో? ఎలాంటి సిలబస్‌ఉండాలో? రూపకల్పన చేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కమీషన్ నియ మించిన తర్వాత వారిని ప్రత్యేకంగా కోరారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ అంటే గ్రూప్‌వన్, గ్రూప్ టు పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుందన్న ఆలోచన అందరిలోఉంది. కాని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ సర్వీస్ కమీషన్ ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా వివిధ కార్పొరేషన్‌లకు సంబంధించిన ఉద్యోగాలను కూడా ఈ కమిటీయే భర్తీ చేస్తుంది.
చరిత్రకు ప్రాధాన్యం
ఘంటా చక్రపాణి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కావటం వల్ల పిల్లల చేతుల్లో చరిత్ర పుస్తకాలు వికసిస్తున్నాయి. గత పాలకులు చరిత్రను, సామాజిక శాస్త్రాలను విస్మరించారు. తొలి తెలంగాణ ప్రభుత్వం చరిత్రకు, సామాజిక శాస్త్రాలకు ప్రాధాన్యతను కల్పిస్తే, ఘంటా చక్రపాణి ఆ శాస్త్రాలకు పునరుజ్జీవనం కల్పించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్‌లో గత వెయ్యేళ్ల తెలంగాణ చరిత్ర-సంస్కృతి, స్వతంత్ర హైదరాబాద్ రాజ్య చరిత్ర, ఈ నేలలో జరిగిన మహోజ్వల పోరాటాలు, వీర తెలంగాణ సాయుధ పోరాటం, 1969 నాటి తొలి దశ తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ మహోద్యమం వరకు చేర్చారు. 19వ శతాబ్దంలో తెలంగాణలో జరిగిన అన్ని అస్థిత్వ ఉద్యమాలను, భూ పోరాటాలను, వెట్టి చాకిరీ వ్యతిరేక పోరాటాలను సిలబస్‌లో పెట్టారు. మొత్తం తెలంగాణ సమగ్ర స్వరూపం తెలియకుండా, అధ్యయనం చేయకుండా ఈ పోటీ పరీక్షల్లో నెగ్గడం కష్టం. తెలంగాణ మట్టి వాసనలు తెలిసిన వ్యక్తులే నవ తెలంగాణ నిర్మాణానికి పునాదులుగా నిలుస్తారని, దీర్ఘకాలిక లక్ష్యంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షా విధానాన్ని రూపొందించింది.
ఈ నేలలో భూమి, భుక్తి, విముక్తి కోసం సాయుధ పోరాటం ఎందుకు జరిగిందో విద్యార్థులు తెలుసుకోవాలి. 1970 నుంచి 1980 దశకంలో తెలంగాణలో ఎగిసిన పోరాటాల నేపథ్యం విద్యార్థులు అవగతం చేసుకోవాలి. భాగ్యరెడ్డివర్మ దగ్గరనుంచి నేటి వరకు జరుగుతున్న అన్ని అస్థిత్వ పోరాటాలను విద్యార్థులు చదువుకోవాలి. 1983 నుంచి 2009 వరకు తెలంగాణలో ఏం జరిగిందన్నది అత్యంత కీలకమైంది. ఆ కాలంలో జరిగిన పరిణామాలే మలి దశ తెలంగాణ ఉద్యమానికి ప్రాణమ య్యాయి. ఆ కాలంలో ఏం జరిగిందన్నది విద్యార్థులు సమ గ్రంగా తెలుసుకోవాలి. ప్రపంచీకరణ పరిణామాలు, సరళీ కరణల విధానాలు, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, సినిమా పరిశ్రమలు, యివన్నీ తెలంగాణపై ఏ రకమైన ప్రభావం చూపాయన్నది అత్యంత కీలకమైనవి. అవే మలిదశ తెలంగాణ ఉద్యమానికి కారణభూ తమయ్యాయి. యివన్నీ విద్యార్థి చదువుకొన్నప్పుడే ఈ నేలపై ప్రేమ ఏర్పడుతుంది. పోటీ పరీక్షలంటే పరీక్షలో మాత్రమే ఉత్తీర్ణం కావడం కాకుండా తెలంగాణ సమాజంలో జరిగిన, జరుగుతున్న పరిణామాలు సమగ్రంగా తెలుసుకోగలిగినప్పుడే ఆ ఉద్యోగి పాలనారంగంలో సమర్థుడిగా ఎదుగుతారు.అందుకే సిలబస్‌లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. అవి నవ తెలంగాణ నిర్మాణానికి దోహదపడ్తాయి.
ఈ లక్ష్యాల సాధనకు అనుగుణంగానే పరీక్షలకు సంబంధిం చిన సిలబస్‌ను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించి, వేలాది ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
ఎంతో కాలంగా ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రాంత యువతీయువకులకు నిజంగా ఇది బంగారు కానుకే!