harish-raoతెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి, తెలంగాణ భూములను సస్యశ్యామలం చేసే దిశగా ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మిస్తున్నదని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. నగరంలోని ఎర్రమంజిల్‌ జలసౌధలో మే 8న ఏర్పాటు చేసిన మిషన్‌ కాకతీయ మీడియా అవార్డుల ప్రధాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రాజెక్టులే సరైన పరిష్కారమన్నారు.

భారీ ప్రాజెక్టులు ఉన్న చోట రైతుల ఆత్మహత్యలు లేవని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రైతుల ఆత్మహత్యలు లేని తెలంగాణను మనం చూడబోతున్నామన్నారు. అందుకు మీడియా సహకారం కూడా అవసరమన్నారు. మిషన్‌ కాకతీయ విషయంలో మీడియా ఎలాంటి సహకారాన్ని అందించిందో అలాంటి సహకారమే ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కూడా అందించాలని ఆయన మీడియా ప్రతినిధులను కోరారు. తెలంగాణకు కేటాయించిన ప్రతి నీటిచుక్కను వాడుకుంటామన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో ఉన్న నీటిలో మనవాటా పూర్తిగా వినియోగించుకుంటామన్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామన్నారు.

ఇందుకోసం సీఎం కేసీఆర్‌ అహర్నిశలూ శ్రమిస్తున్నారన్నారు. గతంలో లాగా 15 నుంచి 20 ఏండ్లు నిర్మాణాలు సాగకుండా, నాలుగు సంవత్సరాల లోపే ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే విధంగా రూ. 25వేల కోట్లు విడుదల చేసి, పనులు శరవేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందేలా కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను మీడియా ప్రజల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశ్యంతోనే తాము మిషన్‌కాకతీయ మీడియా అవార్డులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

మిషన్‌ కాకతీయలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చెరువులు నిండితే గ్రామంలోని అన్ని కులాలు, జాతుల వారికి ఉపాధి లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇంతమంచి కార్యక్రమానికి మీడియా అందించిన చేదోడు వర్ణించలేనిదన్నారు. ఈ సందర్భంగా మీడియా అవార్డులను ప్రధానం చేశారు.

ప్రింట్‌ మీడియాలో మొదటి బహుమతి చెరువుల చరిత్ర, చెరువులు, గ్రామీణ వృత్తులు అనే అంశంపై వరంగల్‌ నమస్తే తెలంగాణ ప్రతినిధి నూర శ్రీనివాస్‌కు అందచేశారు. రెండవ బహుమతి చెరువుల చరిత్ర, సంస్కృతి, పూడికమట్టి అనే అంశంపై కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ సాక్షి రిపోర్టర్‌ పైడిపల్లి అరుణ్‌కుమార్‌కు అందచేశారు. మూడవ బహుమతి మిషన్‌ కాకతీయ ప్రభావాలు-గ్రౌండ్‌ రిపోర్ట్‌ అనే అంశంపై హన్స్‌ ఇండియా హైదరాబాద్‌ రిపోర్టర్‌ మహేష్‌ అవధూతకు ఇవ్వడం జరిగింది. ప్రత్యేక జ్యూరీ బహుమతిని గొప్ప పునరుద్దరణ, విశ్లేషణాత్మక కథనంకు కునాల్‌ శంకర్‌ ఫ్రంట్‌లైన్‌కు, మిషన్‌ కాకతీయ కార్యక్రమాల క్రోడీకరణకు నమస్తే తెలంగాణ సదాశివనగర్‌ రిపోర్టర్‌ నర్సాగౌడ్‌కు ఇచ్చారు. ఎలక్ట్రానిక్‌ మీడియాకు సంబంధించి 10టీవీ రిపోర్టర్‌ వంగపల్లి పద్మకు మొదటి బహుమతి, జెనిమిటీవీ రిపోర్టర్‌ వీ.భూమేశ్వర్‌కు ద్వితీయ బహుమతి, ఈటీవీ తెలంగాణ రిపోర్టర్‌ సతీశ్‌కు తృతీయ బహుమతి ఇచ్చారు. ప్రత్యేక జ్యూరీ బహుమతులను టీన్యూస్‌ కరీంనగర్‌ రిపోర్టర్‌ వేణుగోపాల్‌రావు, దూరదర్శన్‌ (యాదగిరి) రిపోర్టర్‌ కడెంపల్లి శ్రీరాములుకు ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామచంద్రమూర్తి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, బుద్ద పూర్ణిమా ప్రాజెక్టు డైరెక్టర్‌ మల్లేపల్లి లక్ష్మయ్యలతో పాటు పలువురు ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.

Other Updates