sampadakeeyam‘రాష్ట్ర ప్రజల సంక్షేమం’ ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇతర రాష్ట్రాల ప్రతినిధులు మన రాష్ట్రానికి వచ్చి ఆయా పథకాలను అధ్యయనం చేయడంతోపాటు తమ రాష్ట్రంలో వీటిని అమలు చేస్తామని పలు సందర్భాల్లో ప్రకటించడం గమనార్హం. వాస్తవానికి దశాబ్దాలపాటు తీరని నిర్లక్ష్యానికి గురి అవుతూ, అవధులులేని వివక్ష అనుభవించిన తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించడంతోనే సకల అనర్థాలు కనుమరుగయ్యాయి. స్వీయ పాలన ఆకృతి దాల్చడం ద్వారా మంచి రోజులు వచ్చాయని ప్రజలు సంబరపడ్డారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి సమగ్ర పరిశీలన జరుపుతూ ఆయా పథకాలను రూపొందించి జయప్రదంగా అమలు జరిగేలా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో భూరికార్డులను సమగ్రంగా పరిశీలించి గ్రామ రైతుల సమక్షంలోనే నిర్ధారణలు జరిపించేలా కార్యాచరణకు గత మాసంలో శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ శాఖల రికార్డుల్లోనే పొంతనలేని విధంగా చోటు చేసుకున్న రికార్డులను ప్రక్షాళన చేసి, కొత్తగా పాస్‌బుక్‌లు రైతులకు అందజేయాలనే యోచన గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభ్యున్నతికి ఎంతో దోహదం చేస్తుంది. త్వరలో కార్యరూపం ధరించనున్న ఎకరానికి ఎనిమిదివేల పెట్టుబడి పంపిణీకి, రికార్డుల శుద్ధి ఆవశ్యకమని నిర్ణయించి, అమలు చేయడంద్వారా ఎక్కడా ఏ విధమైన లొసుగులకు అవకాశంలేని పకడ్బందీ వ్యవస్థ రూపు దిద్దుకుంటుంది.

ఇక పట్టణాలతోపాటు గ్రామాలు అన్నివిధాలా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అన్నిరంగాల్లో పురోగమిస్తుందనే విశ్వాసంతో ముఖ్యమంత్రి గ్రామీణ ఉపాధి కల్పన దిశగా పలు కార్యక్రమాలు అమలు చేయిస్తున్నారు. గొర్రెలు, పాడిపశువుల పంపిణీ ద్వారా స్థానికంగానే లబ్ధిదారులకు ఉపాధి కల్పించడం చక్కని యోచన. ఆవిధంగా లబ్ధిదారులు పెంచి పోషిస్తున్న మూగజీవాలకు తక్షణ ప్రాతిపదికపై ఉత్తమ వైద్యసేవలు అందించే లక్ష్యంతో దేశంలో మరెక్కడాలేని విధంగా సంచార పశువైద్యశాలల పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.

పశు వైద్య నిపుణులు నేరుగా వెళ్ళి వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకానికి అన్నివైపులనుంచి హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి.

మూస కార్యక్రమాలకు భిన్నంగా వినూత్న కార్యాచరణలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమగ్ర పరిశీలనతో ముందుకు సాగుతుంది.

ఈ క్రమంలో గడచిన మూడేళ్ళ కాలంలో వివిధ పథకాలు ప్రగతి ఫలాలు అందిస్తూ విజయవంతంగా కార్యరూపం ధరిస్తున్నాయి. దశాబ్దాల అణచివేత అనే చీకటిని తుదముట్టిస్తూ స్వరాష్ట్రంలో అభివృద్ధి వెలుగులను విరజిమ్ముతున్న క్రమంలో కోటి దివ్వెల కాంతులలో తెలంగాణ ప్రకాశించాలి.

అందరికీ ‘దీపావళి’ శుభాకాంక్షలు.

Other Updates