పెద్ద ఎగిలివారంగనే అందరికీ మేల్కువ వస్తది. కని మేల్కొలిపేతందుకు బుడు బుడ్కలాయన ఒక పాట పాడుకుంట ఇంటికి వస్తడు. చిడ్లుం బిడ్లుం అనే గమ్మతిగ సప్పుడు చేసికుంట వస్తడు. అదొక గమ్మత్తైన సప్పుడు. ఆ కాలంలో వాకిలి అవుతల గేట్లు ఉండేవి కావు. వాకిట్లకు చిడ్లుం బిడ్లుం అని సప్పుడు చేస్తేనే ఇంట్ల అందరికి తెలివి వస్తది. బుడుబుడ్కలవాల్లు కళాత్మకంగా పాట పదమై గానం చేస్తూ వస్తరు.
నిజానికి అందరి నిద్ర చెడగొట్టుడు అనుకోవచ్చు. ఆ సమయంలో తెల్లరంగా 5 అయితది. కానీ ఎవరూ విసుక్కోరు. ఇంట్లకెల్లి అమ్మ దోసెడె వడ్లో జొన్నలో ఆయన జోలెల పోస్తది.
ఆయన మనలను మేల్కొలిపే ఆయన. పల్లెటూల్లలో ఒక సంస్కృతి తరతరాలుగా వస్తుంది. ఇప్పుడు విచ్ఛిన్నమయ్యింది. అది వేరే సంగతి. ఈ బుడుబుడ్కలవాల్లు ఎక్కడుంటరు.. ఏడ దిగుతరో ఎవలకు తెల్సేదికాదు. పెద్దెగెలి వారంగనే మనల లేపి బిచ్చం తీసుకపోవుడు ఆ సంచార కళాకారుల పని. అయితె కొద్దిగ అటూ ఇటూ గంపలకింద జంబుల కింద కమ్మిన కోళ్ళు సుత కొక్కరోకో అంటయి. ఒక కోడిని చూసి మరో కోడి పుంజు కూస్తనే ఉంటయి ఇగ అప్పుడు తెల్లారిందని లేసుడు సుర్వు అయితది.
అట్లనే ఇంటి సుట్టు చెట్లమీద పిట్టలు సుత కిసకిస మంటనే ఉంటయి. ప్రకృతి ఎంత రమ్యంగా ఉంటదో తెల్లా రుతాంటనే కన్పిస్తది. పిట్టలు గూళ్ళు వదిలి ఎగిరిపోతయి. కోళ్ళు కూస్తయి. ఆవు, బర్రె అంబా అంటనే ఉంటయి. ఇంట్ల ఉన్న పిల్లి లేశి పొయ్యికాడికి వంటింట్లకు తిరుగుతది. సాదుకం కుక్క తోకూపుకుంట వాకిలంత తిరుగుతది. ఇదంత ఎగెలివారంగ నాలుగు అయిదు మధ్య సంగతి. ఇగ అప్పుడు బాలసంతుల ఆయన పెద్ద గంట జోలె ఏసికోని దండ్క దండ్క అంటు ఇనుప బోకెలాగ ఉండే గంట సప్పుడు చేసుకుంట తిరుగుతడు. బుడుబుడ్కల కళాకారుని వాయిద్యం చిన్నగ సుతి మెత్తగ జర శ్రావ్యంగ అనిపిస్తే బాల సంతుల గంట సప్పుడు పెద్ద దోనిమీద రాళ్ళు పడ్డట్టు ఉంటది. ఆయన ఊరంతా ఉరికి వచ్చినట్టే నడుస్తడు. ఇంటింటి ఇంటి పేరు పెట్టి అవ్వా అనుకుంట తిరుగుతడు. ఆయన వచ్చిండంటే ఇంట్ల అందరు లేసి పనులకు పోవాల్సిందే. కొత్తగా పెళ్ళి అయినవాల్లకు గిప్పుడేం లొల్లిర అన్పియవచ్చు గాని ఇంకెవ్వలకు అన్పియ్యదు. బాలసంతుల పెద్ద మనిషి వచ్చి గంట సప్పుడు చెయ్యంగనే అవ్వ శాట్ల వడ్లిత్తులు తెచ్చి ఆయన జోలెల పోసుడే ఉంటది. అది వీల్ల రివాజు వాల్ల హక్కు.తెల్లారంగట్లనే ఒక సాంస్కృతిక వాతావరణం పల్లెలో పాటతోనే పరవశించిపోతది. తెల్లారకముందే ఇంటి పెద్ద మనిషి పొలం పనికి కరెంటు మోటర్లు పెట్ట, నీళ్ళు గట్ట పోతడు. బాయికాడికి పోయిన ఆయన చేసే మొట్టమొదటి పని ఎడ్లను ఇడిచిపెట్టుడు. గుంజకు కట్టేసిన ఎడ్లు ఇడవంగనే రెట్టించిన ఆనందం వాటి కన్నుల్లో కన్పిస్తది. అటెన్క ఆయన యాపపుల్ల ఏసుకొని పొలం పనులల్లో లీనమైపోతడు. ఇక్క డ ఇంటి ఆమె లెవ్వంగనే పొయ్యిల బూడిద ఎత్తిపోసి వాకిలి ఊడిచి, సాన్పుసల్లి ముగ్గులు ఏసుడులోనే పురాగ తెల్లారుతది. పెండ నీళ్ళతో కలిపి సల్లే వాకిలివల్ల పచ్చని కళ వాకిలికి అంటుకుంటది. అట్లనే చేయి వేళ్ళ సందుల నుంచే రాలి పడేట్టు సుద్ద గీతలు వేస్తరు. వాటిని ముగ్గులు అంటరు. ఆ చిత్రకళ, ఆమె తన తల్లినుంచి ఆమెకు ఆమె తల్లినుంచి వస్తున్న వారసత్వం. ఇంటి వాకిలి నిండా కళాత్మక చిత్రాలు ఇంటిముందు పొద్దు పొడిచి ఇంత ఎక్కక ముందే కన్పిస్తయి.
పొద్దు పొడిచీ పొడవక ముందే ఇంటింటినుంచి ఊర బర్లు కొట్టుకపోయే దృశ్యం బహు గొప్పది. ఇంటింటికీ ఉన్న బర్లు అన్ని కలిపి ఒక్కడే కాస్తుంటడు. తెల్లారంగనే బర్లన్న ఒక చెట్టుకింద అడ్డ పెడ్తడు. ఆ బర్లు ఉన్న కాడికి పెండ తట్ట పట్టుకొని ఇంటింటినుంచి ఉన్న పిలగాండ్లు పెండేరుకరాను పోతరు. పెండ ఎయ్యంగనే తట్టలేసుకునే ఆరాటం పోటీ తత్త్వం ఆనాటినుంచే వస్తయి. అట్లా తెచ్చుకున్న పెండతోనే వాకిలి సల్లడం మిగిలిన పెండను సేంద్రీయ ఎరువుగ మార్చడం కొరకు పెంటలో వెయ్యడం ఒక ప్రాకృతిక వ్యవసాయ పనితనం. అట్లా వాకిలి సల్లి తలెగండ్లల్ల ఎర్రమన్నుతోని అలికి అండ్ల ముగ్గులు వేసి ఆడవాళ్ళు ఇంట్లకు పోతరు. ఇండ్లల్ల వారం వారం శుక్రవారం నాడు ఇల్లు ఎర్రమన్నుతో అలికి గోడవారగ సుక్కలు మధ్యలో గమ్మతిగ ముగ్గులు వేస్తరు ఇదొక కళ.
తెల్లారుతందనంగనే ఇంటిముందు శాదబాయి గిరుక సప్పుడు బొక్కెన సప్పుడులు ఇనొస్తయి. అంబా అనే ఆవుల మందల అలికిడి వస్తది. తర్వాత రోజులల్ల బోరింగ్ కొట్టే సప్పుల్లు వినవచ్చేవి. ఇప్పుడు నల్ల సప్పుడు వస్తంది. తెలతెలవారుతందనే సంకేతం ప్రకృతిపరంగ తెలిపే ఒక సన్నివేశం.
ఇదే విషయాలు రొటీన్‌గా కాకుండా ఇంటికి వచ్చిన సుట్టాలు అమ్మమ్మలు, పెద్దమ్మలు, మేనత్తలు వచ్చినప్పుడు అందరు లేవకముందే లేచి ముచ్చట్లు పెట్టుకుంటరు. అంటె నాలుగు గంటలనుంచే కడుపునిండా లేశి అక్కడి ముచ్చట్లు, ఇక్కడి ముచ్చట్లు మాట్లాడుకుంటరు. మాట్లాడుకుంట వట్టిగ కూసోరు. వాళ్ళు ఎంటికలకు శిక్కులు తీసికుంట సమరు రాసుకుంటరు.. ఎల్లి పాయలు పొట్టు తీస్తరు… ఏదో పనిలో ఆడవాల్లు సేద తీరుతరు.
ఊరు, ఇల్లు, చెట్లు, కోళ్ళు, కోయిలలు సంచార కళాజీవుల పాటలు, ఆయా మాటలు వినసొంపుగనే ఉంటాయి. తెల్లారిన తర్వాత మల్లా ఒక చేతిలో ఈత సాప అల్లుకుంట, మరో చేతిల తబ్ల కొట్టుకుంట, జబ్బకు కట్టిన కొంగుల పిల్లను పండుకోబెట్టు కొని ‘అవ్వ.. అవ్వ.. ఓ అవ్వ.. అవ్వా.. ఓ అవ్వా అంటూ’ ఇల్లిల్లు తిరిగే ఆమె ఒకవైపు నడుస్తునే ఉంటది. అప్పుడే తెల్లారినట్టు.