మహిళలకు 1.02 కోట్ల బతుకమ్మ చీరలు .. వచ్చే ఏడాది చీరలకు బ్రాండింగ్ – కె.టి.ఆర్
బతుకమ్మ పండుగకు రాష్ట్రంలోని మహిళలకు బహుమతిగా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది. వివిధ నియోజకవర్గాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ ఛైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆడపడుచులకు బతుకమ్మ పండుగకు చీరెలను బహుమతిగా ఇవ్వడం, ఈ చీరల తయారీ ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడమనే ద్విముఖ వ్యూహంతో బతుకమ్మ చీరల పథకానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాల పైబడిన మహిళలకు చీరలను అందచేశారు. మొత్తం ఒక కోటి రెండులక్షలమంది అర్హులైన మహిళలు ఉన్నట్లుగా గుర్తించారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.313 కోట్లు వెచ్చిస్తోంది.
రాష్ట్రంలో మహిళలందరు ప్రీతిపాత్రంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు కానుకగా ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మూడు సంవత్సరాలుగా బతుకమ్మ చీరలను అందిస్తున్నారు. పవర్ లూం కార్మికులకు బతుకమ్మ చీరల ద్వారా 16వేల కుటుంబాలకు ప్రత్యక్ష్యంగా ఉపాధి దొరికింది. 26వేల మరమగ్గాల ద్వారా చీరలను తయారు చేశారు. పంపిణీకి ముందుగా, మసాబ్ ట్యాంక్‌లోని సీడీఎంఏ కార్యాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యార్, సీడీఎంఏ డైరెక్టర్ శ్రీదేవి, సెర్ప్ సీఈవో పౌసమి బసు, టెస్కో జీఎం యాదగిరి తదితరులతో కలిసి ఐ.టి, పురపాలక శాఖల మంత్రి కె. తారక రామారావు మీడియా సమావేశంలో బతుకమ్మ చీరలను ప్రదర్శించి, వాటి వివరాలను వెల్లడించారు.
ఈ సంవత్సరం 10 రకాల డిజైన్లు, 10 రకాల రంగుల్లో మొత్తం 100 వెరైటీల్లో చీరలను తయారు చేశారు. బతుకమ్మ చీరల ద్వారా మరమగ్గాల కార్మికులకు గతంలో నెలకు రూ.8 నుంచి 12వేల రూపాయలు మాత్రం దక్కేదని కానీ బతుకమ్మ చీరల తయారీ తరువాత నెలకు రూ.16-20వేల రూపాయల వరకు లభిస్తోందని మంత్రి కె.టి.ఆర్ తెలిపారు. బతుకమ్మ చీరల కోసం గత మూడు సంవత్స రాల్లో ప్రభుత్వం రూ.715కోట్లు కేటాయించిందన్నారు.
చేనేత, జౌళి శాఖ డైరెక్టర్ శైలజా రామయ్యార్ మాట్లాడుతూ, గత మూడు సంవత్సరాలుగా చీరల పంపిణీ చేస్తున్నామని, ప్రతి సంవత్సరం డిజైన్లు, నాణ్యతలో మరింత మెరుగుగా ఉండే విధంగా చీరల తయారీ చేయిస్తున్నా మన్నారు. చీరతో పాటుగా జాకెట్ కూడా అందిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సంవత్సరం 1.02కోట్ల మహిళలకు చీరలు అందచేస్తున్నారు.
తొలిరోజే 20 లక్షల చీరలు పంపిణీ
ప్రారంభించిన తొలిరోజే 20 లక్షల మంది మహిళలు చీరలను అందుకున్నారు. ఐటి, పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నల్లగొండలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు సీఎం స్వంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ ఛైర్‌పర్సన్ రోజా శర్మతో కలిసి ప్రారంభించారు. పాలకుర్తిలో పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ములుగులో గిరిజన, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చీరల పంపిణీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నల్లగొండలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బతుకమ్మ చీరల పంపిణీ ఆడపడచులకు కానుకగానే కాకుండా చేనేతకు పూర్వ వైభవం తెస్తుందన్నారు. ఇప్పటి నుంచి విద్యార్థుల డ్రెస్‌లు కూడా చేనేతవే తెస్తామన్నారు. ఆడపడచులపై ప్రత్యేక అభిమానంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. 50శాతం సబ్సిడీతో నేతన్నలకు ముడిసరుకు సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని పేర్కొన్నారు.
గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, చిరునవ్వుల తెలంగాణ చూడడమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమన్నారు. ఉపాధిలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం కేసీఆర్ బతుకమ్మ చీరలను నేయడానికి నేతన్నలకు అవకాశం ఇచ్చి వారు ఆర్థికంగా బాగుపడేలా చేశారన్నారు.
ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగను చాటిచెప్పిన ఘనత మన ప్రభుత్వానిదేనని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మనల్నిచూసి ఇతర దేశాలు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాయన్నారు. మహేశ్వరం, కందుకూరు మండలాల్లో ఆమె బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు. కేవలం ఆడపడచులకు చీరలు లభించడమే కాకుండా ఈ పంపిణీ ద్వారా ఎందరో చేనేత కార్మికులకు ఉపాధి లభించిందని మంత్రి సబిత తెలిపారు.
గ్రేటర్‌లో 15.50 లక్షల చీరల పంపిణీ
ఆడపడుచులకు బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు అందించి గౌరవించేందుకు గాను ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని నగర మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. మల్లాపూర్ లోని వి.ఎన్.ఆర్ గార్డెన్‌లో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మేయర్ రామ్మోహన్ మాట్లాడుతూ…దసరా కానుకగా ప్రభుత్వం ఆడుపడుచులందరికీ అందిస్తున్న బతుకమ్మ చీరల్లో గ్రేటర్ హైదరాబాద్ లోనే పదిహేనున్నర లక్షల చీరలను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. గొప్ప సంస్కృతిక వారసత్వ చరిత్ర తెలంగాణాకు ఉందని, ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన అనంతరమే బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించిందని గుర్తుచేశారు. గ్లోబలైజేషన్ ప్రభావంతో రాష్ట్రంలోని కుల వృత్తుల మనుగడ ప్రమాదంలో పడిందని, ఈ నేపథ్యంలో నేత కార్మికులను ఆదుకునేందుకుగాను ముఖ్యమంత్రి కెసిఆర్ బతుకమ్మ చీరల ద్వారా ఉపాధి కల్పించారని పేర్కొన్నారు.
ములుగులో మంత్రి సత్యవతి రాథోడ్
తెలంగాణ బతుకమ్మ పండగ అంటే ఆడపడచుల పండగ. అందరూ ఆనందంగా జరుపుకునే పండగ. ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ పండగను మరింత శోభాయమానంగా చేసేందుకు ఆడపడచులకు బతుకమ్మ చీరల పంపిణీ సంప్రదాయానికి మూడేళ్ల క్రితం శ్రీకారం చుట్టారు. మూడేళ్లలో ప్రతి ఏటా పంపిణీ చేసే చీరల సంఖ్య పెంచుకుంటూ ఈ ఏడాది కోటి చీరలను తెలంగాణ ఆడపడుచులకు అందిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ మేడారంలోని సమ్మక్క-సారలమ్మల దీవెన తీసుకుని, మొదట అమ్మవార్లకు బతుకమ్మ చీరలు సమర్పించి, ములుగులోని ఆడపడచులకు పంపిణీ చేశారు.
ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే అనసూయ (సీతక్క) ముగ్గురు మహిళా ప్రజా ప్రతినిధులు ముచ్చటగా ఒకే వేదిక మీదకు చేరి, ములుగు ఆడపడచులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన రంగురంగుల చీరలను అంగరంగ వైభవంగా అందించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ…ఈ రోజు గొప్ప సుదినమని అభివర్ణించారు. ఈ ప్రాంతంలోని గిరిజన తండాలో పుట్టి, తన సొంత గిరిజన ప్రాంతంలో, మహిళా మంత్రిగా ఆడపడచులకు బతుకమ్మ చీరలు అందించే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నాను అన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యధికంగా గిరిజనులు ఉన్న ములుగులో త్వరలో గిరిజన యూనివర్శిటీ ప్రారంభం కాబోతుందని సత్యవతి రాథోడ్ చెప్పారు. 2020 ఫిబ్రవరి 5,6,7,8 తేదీల్లో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లలో భాగంగా ఇక్కడకు వచ్చి సదుపాయల కల్పనపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు.
ములుగులో 1,06,200 మంది లబ్ధిదారులకు 3 కోట్ల 50 లక్షల రూపాయలతో ముఖ్యమంత్రి కేసిఆర్ అన్నగా బతుకమ్మ చీరలను పంపించారని చెల్లెళ్లుగా వీటిని మేము అందిస్తున్నామని సత్యవతి రాథోడ్ చెప్పారు.
ఆడపడుచుల కోసం, గిరిజనుల కోసం సిఎం కేసిఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, ఇన్ని పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వం పేదల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తోందని, ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలనే ఆశయంతో సిఎం కేసిఆర్ చేస్తున్న పనులు సంపూర్ణంగా ఫలించాలని ఆడపడచులంతా మనస్ఫూర్తిగా దీవించాలని సత్యవతి రాథోడ్ కోరారు.
ఈ కార్యక్రమంలో జడ్పి ఛైర్మన్ జగదీష్, కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, స్థానిక జడ్పిటిసి లు, ఎంపిపిలు, సర్పంచ్, అధికారులు పాల్గొన్నారు.