వి.ప్రకాశ్‌
tsmagazineఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి (లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌)కి జరిగిన ఎన్నికల్లో స్థానిక సంస్థల నియోజకవర్గాలనుండి తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థులు ముగ్గురు ఎన్నికైనారు. వీరు: హైదరాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ప్రజా సమితి కార్యదర్శి ఎస్‌. వెంకట్రాంరెడ్డి తిరిగి తన స్థానాన్ని గెలుచుకున్నారు. 1969లో ఇదే స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆయన తొలిసారి ఎమ్మెల్సీగా శాసనమండలికి ఎన్నికైనారు. మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ప్రజా సమితి అభ్యర్థి పి. నర్సిరెడ్డి గెలుపొందారు. మెదక్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి శాసనమండలికి ప్రజా సమితి అభ్యర్థి ఎస్‌. లక్ష్మారెడ్డి గెలుపొందారు. ఈ 3 స్థానాల్లో రెండు స్థానాలు ప్రజా సమితి తరఫున గెలిచిన అభ్యర్థులే తిరిగి నిలబెట్టుకున్నారు.

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికల్లో పోటీ చేసిన కౌన్సిల్‌లో తెలంగాణ ఐక్య సంఘటన నాయకులు, తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కొండా లక్ష్మణ్‌), కార్యదర్శి కె. రామచంద్రారెడ్డి ప్రజా సమితి అభ్యర్థి నర్సిరెడ్డి చేతిలో పరాజయం పాలైనారు. నెల్లూరు, గుంటూరు, మెదక్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ నియోజకవర్గాలలోని మొత్తం 10 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా వీటిలో 6 స్థానాలను కాంగ్రెస్‌ గెలుచుకున్నది.

సిద్ధిపేట ఉప ఎన్నిక: సిద్ధిపేట శాసనసభా స్థానానికి వి.బి. రాజు రాజీనామా చేసి రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నది. ప్రజా సమితి పక్షాన సిద్ధిపేట స్థానానికి మదన్‌మోహన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఖైరతాబాద్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మట్టికరిపించిన ప్రజా సమితి సిద్ధిపేట స్థానాన్ని గెలుచుకోగలమనే ధీమాలో వున్నది.

ఓటమి భయంతో కార్పొరేషన్‌ ఎన్నికల రద్దు
జూన్‌ 26న శాసనసభ ప్రోరోగ్‌ అయిన కాసేపటికే హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలను రద్దు చేస్తూ, స్పెషల్‌ ఆఫీసర్‌ నియామకానికి ప్రభుత్వానికి అధికారమిస్తూ బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది.ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో ప్రజా సమితి ఘన విజయం సాధించడంతో ప్రభుత్వం కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించడంవలన తమకు ప్రయోజనంలేదని భావించింది. గతంలో రెండుసార్లు మేయర్‌గా తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థులే ఎన్నికైనారు. కార్పొరేషన్‌లో మెజారిటీ సభ్యులు కూడా ప్రజా సమితినుండే ఎన్నికవుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కార్పొరేషన్‌ సభ్యులు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎంతో చురుకైన పాత్ర నిర్వహించడమేకాక పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు.

స్పెషల్‌ ఆఫీసర్‌ పాలన రెండేళ్లు వుంటుందని, అవసరమైతే పదవీ కాలాన్ని మరో సంవత్సరం పొడిగించే అవకాశం వుంది. ప్రస్తుతం కార్పొరేషన్‌ జూలై 2తో ముగుస్తున్నది.

ఆర్డినెన్స్‌ ప్రజాస్వామ్య విరుద్దం-కార్పొరేషన్‌ సమావేశం
మున్సిపల్‌ ఎన్నికలను రద్దు చేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌ను ఖండిస్తూ కార్పొరేషన్‌ సర్వసభ్య సమావేశం తీర్మానం చేసింది. దీన్ని అవాంఛనీయ ఆదేశంగా పేర్కొన్నది. తీర్మానాన్ని ప్రతిపాదించిన తెలంగాణ వాది టి. గోవింద్‌సింగ్‌ ‘ఇది ముందుగా ఆలోచించుకొని రూపొందించిన పథకం. దీనివెనుక రాజకీయ దురుద్దేశం వుంద’ని అంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 9మంది సమైక్యవాదులు వాకౌట్‌ చేశారు.

మజ్లిస్‌ కౌన్సిలర్ల నాయకుడు ఖాజా నిజాముద్దీన్‌ ఈ తీర్మానాన్ని బలపర్చారు. జనసంఘ్‌ కౌన్సిలర్‌ మోయ హన్మంతరావు కూడా తీర్మానాన్ని బలపర్చారు. సీపీఐ, సీపీఎం నేతలు కూడా తీర్మానాన్ని బలపర్చారు. ఈ.వీ. పద్మనాభం, రామారావు దోకే, కేఆర్‌ అబ్బయ్య తీర్మానాన్ని సమర్ధించారు. తీర్మానంలో ఈ ఆర్డినెన్స్‌ ‘ప్రజలలో తన ప్రాభవాన్ని కోల్పోయిన ప్రభుత్వంయొక్క ప్రజాస్వామిక విరుద్ధమైన, ప్రజా వ్యతిరేకమైన చర్య తప్ప మరేమీకాద’ని పేర్కొన్నారు. ‘ఆర్డినెన్స్‌ ఉపసంహరించి వెంటనే ఎన్నికలు జరపాల’ని తీర్మానం అభ్యర్థించింది. జూలై 3న ఈ ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని సంయుక్త సోషలిస్టుపార్టీ నగర శాఖ అధ్యక్షుడు శీతల్‌సింగ్‌ లష్కరీ హైకోర్టులో రిట్‌ వేశారు.

తెలంగాణకు 42 శాతం నిధులు
తెలంగాణ వ్యవహారాల సమీక్షా సంఘం 1970 జూన్‌ 29న ప్రధాని ఇందిరాగాంధీ అధ్యక్షతన ఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, ఉప ముఖ్యమంత్రి జె.వి. నర్సింగరావు, టి.ఆర్‌.సి. (తెలంగాణ ప్రాంతీయ సంఘం) అధ్యక్షులు చొక్కారావుతోబాటు కేంద్ర మంత్రులు ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌, జగ్జీవన్‌రామ్‌, స్వరణ్‌సింగ్‌, ప్రణాళికా సంఘం అధ్యక్షులు ఆర్‌. వెంకట్రామన్‌ హాజరైనారు. 1971-72, 1972-73 రాష్ట్ర ప్రణాళికా బడ్జెట్‌ మొత్తంలో 42 శాతం నిధులు తెలంగాణా ప్రాంతానికి కేటాయించడానికి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి అంగీకరించారు. ప్రణాళికా కాలంలోని మిగిలిన 3 సంవత్సరాలకు కేటాయింపుల విషయంలో ప్రణాళికా సంఘం సభ్యుడైన వెంకట్రామన్‌తో సంప్రదింపుల అనంతరం నిశ్చయించాలని నిర్ణయించబడింది. సర్వీసుల విలీనీకరణలో జరిగిన అభివృద్ధిని కూడా ఈ సమావేశంలో పరిశీలించారు. వరంగల్‌ ఆజంజాహీ మిల్లుకు ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. పోచంపాడు, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులలో పనులను చురుకుగా కొనసాగించాలని ప్రధాని ఈ సమావేశంలో ముఖ్యమంత్రిని ఆదేశించారు. అస్వస్థత కారణంగా కేంద్ర ఆర్థికమంత్రి వై.బి. చవాన్‌ ఈ సమావేశానికి హాజరు కాలేదు.

తెలంగాణ సాధనకై ఏకైక సంస్థ ఆవశ్యకత
తెలంగాణా సమస్య తెలంగాణ ప్రజలకు సంతృప్తికరంగా పరిష్కారం అయ్యే వరకు ప్రజా సమితి, తెలంగాణా ఐక్య సంఘటన, తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఈ మూడు విలీనం అయి తాత్కాలికంగా, ఒకే సంస్థగా ఏర్పడడం మేలని తెలంగాణా ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు కొండా లక్ష్మణ్‌ బాపూజీ సూచించారు. జూలై 6న విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ కొండా లక్ష్మణ్‌ బాపూజీ ‘అటువంటి సంస్థ పూర్తి రాజకీయపక్షంగా కాకుండా కొన్ని రాజకీయపక్షం లక్షణాలున్న (సెమీ పొలిటికల్‌) సంస్థగా ఉంటుంది. దీనికి ఒక ప్రిసీడియం లేక ఉన్నత కార్యనిర్వాహక మండలి ఉంటుంది. దీనిలో సభ్యుడైన ఒక వ్యక్తి కార్యదర్శిగా వ్యవహరిస్తార’ని అన్నారు.

ఈ సంస్థ కార్యక్రమాన్ని వివరిస్తూ ‘ఒక్కో సీనియర్‌ నాయకుని ఆధిపత్యంలో ఒక్కో ఉపసంఘం వుంటుంది. వ్యవస్థీకరణ, సమన్వయం, ఆర్థిక విషయాలు, ప్రచార విషయాలు, ఇతర సంస్థలతో, వ్యక్తులతో సంప్రదింపులు, సమాలోచనలు, ఆందోళన కార్యక్రమం, దాని అమలు, ప్రచురణ-ప్రచారం-సమాచారం, ఎన్నికలు జరిగే సంస్థలు అనగా పార్లమెంట్‌, శాసనసభలు తదితర సంస్థల వ్యవహారాలు,

ఉద్యమకారులపై ప్రభుత్వం పెట్టిన కేసులు, బాధితులకు సహాయ, ఉపశమన కార్యక్రమాలు తదితర అంశాలపై ఈ ఉపసంఘాలు వుంటాయ’ని బాపూజీ అన్నారు.

”ప్రధానమంత్రి స్థితి ఇప్పుడు బాగా బలపడినది కనుక తెలంగాణా సమస్యకు సమీప భవిష్యత్తులో పరిష్కారం చేకూర్చగలస్థితి రాగలదు లేనిచో, తెలంగాణా ప్రజలు సమాయత్తం అయి, ఇక జాగు లేకుండా అంగీకారం అయ్యే రీతిలో పరిష్కరించేట్లుగా జాతీయ నాయకులపై ఒత్తిడి తేవచ్చును. ఈ పరిస్థితులలో తెలంగాణా ప్రజలకు, తెలంగాణా ఉద్యమంలోని అందరు నాయకుల సమష్టి నాయకత్వం, ఒకే వేదిక, సమైక్య కార్యాచరణ యీ మూడు అత్యవసరం’ అని బాపూజీ అన్నారు. తెలంగాణా ప్రజా సమితిని రాజకీయపార్టీగా మార్చడానికి తాము వ్యతిరేకమని బాపూజీ స్పష్టం చేశారు. ‘రాష్ట్రస్థాయిలో రాజకీయపార్టీ వలన జాతీయ స్థాయిలో ప్రయోజనకారి కాజాలదనీ, దీనివలన ప్రత్యేక తెలంగాణవాదులలో వివిధ సిద్ధాంతాలపై నమ్మకం ఉన్నవారు కలవడానికి సాధ్యపడద’ని బాపూజీ అన్నారు.

‘వివిధ రాజకీయ పార్టీలతో అనుబంధంగల నాయకులు తెలంగాణ ఉద్యమంలోఉన్నారు. తెలంగాణా లక్ష్యంకోసం వారు ప్రస్తుతానికి జాతీయ రాజకీయ సంస్థలకు దూరంగా ఉండవచ్చును. తెలంగాణా ప్రజా సమస్యలు తీరగానే, వారు తమతమ పార్టీలలో చేరగలరని భావిస్తున్నాము. ‘సమష్టి నాయకత్వం, ఏకవేదిక, సమైక్య కార్యాచరణ’ ఇవి ఈనాడు ముఖ్య ఆవశ్యక అంశాలు. ఇందుకు సంబంధించిన వారంతా, ఈ రీతిగా అభిప్రాయపడితేనేగానీ, తదనుగుణంగా ఆచరణకు సిద్ధం అయితేనేగానీ సమైక్యత సాధించడం జరగద’ని బాపూజీ అభిప్రాయపడ్డారు. (ఆంధ్రపత్రిక 8.7.1970)

హద్దుపద్దులేని కాల్పులు-న్యాయాధికారి నివేదిక
1969 ఏప్రిల్‌ 4న సికింద్రాబాద్‌ కాల్పులపై మెజిస్టీ రియల్‌ ఎంక్వయిరీని ప్రభుత్వం జరిపించింది. ప్రభుత్వానికి న్యాయాధికారి తమ నివేదికను అందజేశారు. ‘మెజిస్ట్రేట్‌ శ్రావణ్‌కుమార్‌ పోలీసు కాల్పులను సమర్ధించారు. అయితే పోలీసులు అవసరంకన్నా ఎక్కువ పర్యాయాలు కాల్పులు జరిపారని, హద్దుపద్దు లేకుండా ఈ కాల్పులు జరిగాయని జిల్లా మెజిస్ట్రేట్‌ తమ నివేదికలో వెల్లడించార’ని హోంమంత్రి జలగం వెంగళరావు శాసనసభలో జూలై 21న తెలిపారు.

తెలంగాణా ఉద్యమ నేతలు కొండా లక్ష్మణ్‌ బాపూజీ, బద్రీ విశాల్‌ పిట్టీ అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తూ హోంమంత్రి పై విధంగా వెల్లడించారు.

‘మెజిస్ట్రేట్‌ నివేదికలో ప్రభుత్వం ఆమోదించిన దానిపై చర్యలు తీసుకోవలసిందిగా నగర పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించామ’ని హోంమంత్రి అన్నారు.

‘మితిమీరి కాల్పులు జరిపిన పోలీసు అధికారులపై ప్రభు త్వం ఏమి చర్యలు తీసుకున్నదీ సభకు తెలపాల’ని బాపూజీ హోంమంత్రిని నిలదీశారు. దీనికి జవాబిస్తూ ‘ఇకముందు జరిపే కాల్పులలో మెజిస్ట్రేట్‌ నివేదికలోని అంశాలను దృష్టిలో పెట్టుకోవలసిందిగా పోలీసులకు ఆదేశాలిచ్చామ’ని హోం మంత్రి తెలిపారు.

మార్క్సిస్టుపార్టీ నాయకుడు భీంరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ, పోలీసులు ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపారని మెజిస్ట్రేట్‌ తమ నివేదికలో తెలిపినపుడు ఆయన పోలీస్‌ కాల్పులను సమర్ధించినట్లు ఎలా చెప్తున్నారని హోంమంత్రిని ప్రశ్నించారు.తెలంగాణా యునైటెడ్‌ ఫ్రంట్‌ సభ్యుడు ఎం. మాణిక్‌రావు మాట్లాడుతూ ‘మెజిస్ట్రేట్‌ తమ నివేదికను సమర్పించిన కొద్ది రోజులకే ఆయనను ఆ పదవినుండి సచివాలయానికి బదిలీ చేశారని, నివేదికను కూడా ప్రభుత్వం పూర్తిగా మార్చివేసిందని, ఆ నివేదిక ప్రతిని సభకు అందజేయడానికి ప్రభుత్వానికి ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమేనని, నివేదికలోని ముఖ్యాంశాలు తాము సభకు చెప్పామని, నివేదిక అందజేసే ప్రశ్నేలేదని హోమంత్రి అన్నారు.

హోంమంత్రి సమాధానానికి తమ అసమ్మతిని తెలియజేస్తూ తెలంగాణా యునైటెడ్‌ ఫ్రంట్‌ సభ్యులు, శ్రీమతి ఈశ్వరీభాయి (రిపబ్లిక్‌ పార్టీ), బద్రి విశాల్‌ పిట్టీ (ఎస్‌.ఎస్‌.పి.)సభనుండి వాకౌట్‌ చేశారు.

Other Updates