లాస్య గతంలో జరిగిన ఒక సంఘటనను పదేపదే గుర్తు తెచ్చుకుంటోంది. దానివల్లతాను కోల్పోయిన చదువుకునే సమయం, కోల్పోయిన ఏకాగ్రత, మార్కులు అన్నీ గుర్తుకు వస్తున్నాయి. దుఖం వస్తోంది. ఇంతకూ ఆ సంఘటన తనకు నచ్చిన ఫ్రెండ్ తనను సెల్ఫిష్ అనడమే. తను నిజంగా అంత స్వార్థపరురాలా? నిజంగానా! తన గురించి తనకు తెలియదా! ఇలా ఎన్ని రోజులనుంచో ఆలోచించి… ఆలోచించి… తన మార్కులనుూడా కోల్పోయింది.
ఎంతో బాగా చదివే ప్రీతి ఉన్నట్టుండి మార్కులను తక్కువగా స్కోరు చేసింది. ఏంటి సంగతి? ఆరా తీస్తే తన మిత్రురాలు తన గురించి మిగతా వాళ్ళకు చెడుగా చెపుతోంది. ఇన్ని రోజులు ఎలా తనతో స్నేహం చేసింది. అనవసరంగా నన్ను ‘క్రిటిసైజ్’ చేస్తోందని మదనపడుతోంది.
ఎంతోమంది విద్యార్థులు ప్రతి చిన్న చిన్న విమర్శలకు దిగులుపడి ఎంతో విలువైన కాలాన్ని, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని అన్నింటికన్నా ముఖ్యమైన ఏకాగ్రతను కోల్పోతారు. నిరంతరం ”ఎందుకు ఇలా! జరుగుతోంది. నిజంగా నేను అలాంటి వ్యక్తినేనా!… అవునా!” అనే సందిగ్ధంలో వుంటూ కాలాన్ని వృథా చేసుకుంటారు. తనకు ఎంతో సన్నిహిత మిత్రులే ఇంతటి బాధాకరమైన ‘కామెంట్’ చేశారని బాధపడుతూ వుంటారు. అయితే ఈ క్రిటిసిజమ్ ను ఎలా ఎదుర్కొనాలో… ఎందుకు క్రిటిసిజమ్ వస్తుందో అర్థం చేసుకుంటే అనవసర ఆందోళననుండి బయటకు రావడమే కాకుండా మరింత శక్తివంతంగా మీ వ్యక్తిత్వం తీర్చిదిద్దుకోవచ్చు.
‘క్రిటిసిజమ్’ఎందుకు వస్తుంది
దగ్గరి స్నేహితులు తమ స్నేహితుడు తప్పు చేస్తున్నాడని అన్పించినపుడు హెచ్చరించడం… క్రిటిసిజమ్ లాగా అన్పించే అవకాశం వుంది.
కొంతమంది నిజంగానే ఏడ్పించడానికి ఎదుటివ్యక్తిలో లేనిది, ఏ మాట అంటే వారు బాధపడుతారో అదే మాటను అంటారు.
తోటివాళ్ళ ప్రవర్తనలో మార్పు తేవాలని తలంచి అది వారికి ఎలా చెప్పాలో తెలియక, దగ్గరి మిత్రులతో వాపోతారు. అది చేరాల్సిన వ్యక్తికి వేరే అర్థంలో చేరడం, ఇద్దరి మధ్య యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తుంది.
కొందరికి విమర్శించడం అలవాటుగా వుంటుంది.
ఎదుటి వ్యక్తులకు తాను మాట్లాడేది చేరుతుందా… అని తనకు నచ్చని అంశాలను ఎదుటివ్యక్తి గురించి తన స్నేహితులతో మాట్లాడడం జరుగుతుంది.
కొంతమంది నిజాయితీగా స్నేహితులకు నేరుగా తాము చెప్పదలచిన విషయాన్ని చెప్పేస్తారు. ఇది వ్యకులను విపరీతంగా బాధిస్తుంది.
ఒక్కోసారి తోటి విద్యార్థులతీరు నచ్చక, నచ్చిన తము అలా వుండలేక, క్లాసులో వాళ్ళకు వున్న గుర్తింపు, అధ్యాపకులదగ్గర వున్న చనువు ఇవ్వన్నీ వారిని ఈర్ష్య పడేట్టు చేసి ఎలాగైనా ఆ విద్యార్థిని హింసించాలి అంటే చదువులో చేయలేము.. వ్యక్తిగానే చేయగలమని తలచి ఆ విద్యార్థిపై లేనివి.. వున్నవి తోటి విద్యార్థులకు చెపుతారు. ఎక్కువ విశ్వాసం లేని వాతావరణంలో ఈ విమర్శ ఎక్కువగా విలసిల్లుతుంది.
వాతావరణం వత్తిడిలో వున్నప్పుడు, వత్తిడినుండి బయటకు వచ్చే పద్ధతుల్లో ఇదొక పద్ధతిని ఎంచుకుంటారు. దీనివల్ల ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్.
ఎదుర్కొనడం-బాధండి బయటకు రావడం
మనకు సంబంధించిన మిత్రులుకూడా మనకు ఇష్టంలేని విషయాలు.. వాళ్ళకు ఇష్టమైనవి మాట్లాడే అధికారం, హక్కు కలిగి వుంటారని నమ్మాలి.
మనలో వున్న చెడు గుణాలను మార్చుకొమ్మని మిత్రులు చెప్పినపుడు ఆగ్రహాన్ని ప్రకటించకుండా, వాదనలకు దిగకుండా, నిజంగా ఆ గుణం ఉన్నదా లేదా! అని నిజాయితీగా పరీక్షించుకోవడం నేర్చుకోవాలి.
మనం చేసే ప్రతి పని మిత్రులైనా సరే ఆమోదం తెలపాలని కోరుకోూడదు.
మిత్రులు చేసే కామెంట్‌కి మనం బాధ పడుతున్నాం అంటే దానికి సంబంధించిన అంశం నిజంగానే వుందని గుర్తించాలి.
అతి ముఖ్యమైన విషయం, మనల్ని మిత్రులు మాత్రమే విమర్శిస్తారు. మిగతావారికి మనల్ని విమర్శించే అవసరం వుండదు, వున్నా చాలా తక్కువ అవకాశం వుంటుంది.
మన గురించి తెలిసిన వారే ఎక్కువగా విమర్శిస్తారు. ఎక్కువమంది ఈ విషయం తెలియక విమర్శకంటె.. నా మిత్రుడు నన్నే విమర్శించాడు అనే బాధపడతారు.
విమర్శకు మారు అర్థం నువ్వు ప్రగతి సాధిస్తున్నావనే అర్థం. దానిని ఎదుటివారు ఆమోదించటానికి కష్టపడుతున్నారనే దీనిని పరీక్షించి అర్థం చేసుకోండి.
నీ చుట్టూరా వున్న మిత్రులను మంచివారని, చెడువారని విభజించవద్దు… చాలా మంది ఈ రెండింటి మధ్య వుంటారు. ఏదైనా నీకు నచ్చని పని చేస్తే, మీ అభిప్రాయం ఆ పని వర చెప్పండి కానీ, మిత్రుని వ్యక్తిత్వం మొత్తానికి దానిని అన్వయించకండి. ఎదుటివారి విమర్శలతో మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. అమితమైన దు:ఖసాగరంలోకి వెళ్ళవద్దు. అది ఎదుటి మిత్రుని అభిప్రాయం మాత్రమే.
ప్రతి వ్యక్తి తన అభిప్రాయం వుండే హక్కు కలిగి వుంటారు. అలాగే ఇది. అంటే ప్రతి విషయంలో ఎదుటివ్యక్తి యొక్క ఆమోదయోగ్య పత్రం గురించి ఆందోళన పడవద్దు. ప్రతిక్షణం ఇతరులు తనను తప్పుగా అంచనా వేస్తారేమో అని, అందరికి నచ్చే విధంగా వుండటానికి ప్రయత్నించవద్దు. దానివలన అనవసర ఆందోళన, ఏకాగ్రత కోల్పోయి ఎప్పుడూ ఎదుటివారి మెప్పుకోసం తాపత్రయపడడం జరుగుతుంది.
ఇతరుల మెప్పుకోసం మీకోసం మీరు చేయాలనుకున్న పనులు వాయిదా వేయకుండా, భయపడకుండా పూర్తి చేసుకోండి.
ఒక వారంలో ఇలా ఎన్ని విషయాలు, విమర్శమిమ్మల్ని భయపెట్టాయో, బాధపెట్టాయో ఒక నోట్‌బుక్‌లో వ్రాసుకొని పరీక్షించుకోండి. విశ్లేషించుకోండి. నిజం మీకు అర్థం అవుతుంది. ఆందోళన తగ్గుతుంది. నిజానికి మంచి విమర్శవలన ఎంతోమంది ప్రఖ్యాత వ్యక్తులు తమ పనితనాన్ని మెరుగుపరుచుకున్నారు.
తోటి విద్యార్థుల గురించి విమర్శించేవారు కోకొల్లలు. వారితో స్నేహాన్ని కొనసాగించాలో లేదో నిర్ణయించుకోండి. అయితే ఇది సర్వసాధారణం అని నమ్మండి. కొందరు తమ ప్రక్క విద్యార్థుల మన్నన పొందడానికి, తనను తాను గొప్పవ్యక్తిగా చూపించుకునే పద్ధతిలో ప్రక్క విద్యార్థిని విమర్శిస్తారు వాటిని సీరియస్‌గా తీసుకోూడదు.
ఎదుటి వ్యక్తి చేసే విమర్శకు బాధపడడం సెన్సిటివ్‌గా వున్నాననే భావనను ఎదుటి వాళ్ళకు కన్పించడంకోసం బాధపడడాన్ని అభ్యాసం చేయవద్దు. దానిని సెన్సిటివ్ అనరు. అనవసరంగా బాధపడడం అంటారు.
ఎదుటివారి విమర్శలను బేరీజు వేసుకోవడానికి మన మెదడులో రెండు, మూడు ఫిల్టర్స్‌ను ఏర్పరుచుకోవాలి. వాటినిదాటి మనస్సును తాకితే అప్పుడు ఆలోచించడం చేయండి. సైకాలజిస్టులు చెప్పే సూత్రం ”మన మనస్సు అనుమతి లేనిదే ఎవరూ మనల్ని బాధపెట్టలేరు” అని.
సో డియర్ ఫ్రెండ్స్ ఎదుటివారు చేసే విమర్శలకు బాధపడకుండా… విమర్శను… ఆయుధంలా మార్చుకునే పై పద్ధతులను నేర్చుకుని ఆనందంగా వుండడం అభ్యాసం చేసుకోండి. ఆల్ దిబెస్ట్.
వీరేందర్