ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు క్రియాశూన్యంగా వ్యవహరించకుండా, అన్ని వేళలా చురుకుగా వ్యవహరిస్తే ఎలా ఉంటుందో కేసీఆర్ ప్రభుత్వం తెలియపరిచిందని ప్రముఖ పారిశ్రామికవేత్త శాంతా బయోటెక్నిక్స్ ఛైర్మన్ వరప్రసాద రెడ్డి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకి హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తూ మే 10వ తేదీన ఒక లేఖ రాశారు. ఇదీ లేఖ సారాంశం…
గౌరవనీయులైన ప్రియతమ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారికి.. కృతజ్ఞతాపూర్వక నమస్కారాలతో…
శాంతాబయోటిక్నిక్స్ సంస్థ 1993లో మేడ్చల్‌లో ప్రారంభించడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం ( శ్రీ చంద్రబాబు నాయకత్వంలోనిది) ఏ రకమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు కల్పించలేదు. అప్రోచ్ రోడ్, ఎలక్ట్రిక్ లైన్స్, కమ్యూనికేషేన్ లైన్స్ వగైరాలు మేము స్వయంగా సమూర్చుకున్నాం. కాని నీటి వసతి కోసం ప్రభుత్వాన్ని 1993 నుంచి కోరుతూ, ప్రాధేయపడుతూ పదే పదే గుర్తు చేస్తూ, అప్పుడప్పుడు నిరసన తెలియజేస్తూ నేటి వరకు ప్రయత్నం చేస్తూనే వున్నాం. గడిచిన 23 సంవత్సరాల సుదీర్ఘకాలంలో శ్రీ చంద్రబాబు గారు, శ్రీ రాజశేఖర రెడ్డి గారు, శ్రీ రోశయ్య గారు, శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గార్ల ప్రభుత్వాలు వరుసగా ఈ నీటి వసతిని కల్పించడంలో విఫలమైనవారే. ఎన్ని విజ్ఞప్తులు చేసినా వారందరూ ఈ విషయాన్ని వేలం వాగ్దానాల పరిమితం చేసి క్రియాశూన్యులుగా మిగిలిపోయారు.
మీరు జనవరి 29, 2015న మా ఇన్సులిన్ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసిన శుభసందర్భంలో, సభాముఖంగా మేము ఎదుర్కొంటున్న నీటి దురవస్థను తెలియబరిచాను. మీరు వెంటనే స్పందించి, దానికి ఒక యుద్ధప్రాతిపదికన క్రియాపూర్వక సంకల్పం చేశారు. 23 సంవత్సరాల నిరీక్షణకు మీ ద్వారా ‘శాంతా’ సంస్థకు నేటితో నీరు అంది, కథ సుఖాంతమైంది. అందుకు మీకు మరోసారి కృతజ్ఞతాభివందనాలు. ఈ నీటి సమస్యను తీర్చే క్రియాపర్వంలో మీరు చూపిన చొరవ, పర్యవేక్షణ, వేగం, అనన్య సామాన్యం. ఇంతవరకు నేనెరిగిన ఏ ముఖ్యమంత్రివర్యులూ మీ విధంగా పర్యవేక్షించడం, అందునా మీలాగా స్వయంగా పర్యవేక్షించడం జరగలేదు. అందుకు మరోసారి ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీనినే పనిచేసే ప్రభుత్వంగా చెప్పుకోవాలి. వేలం వాగ్ధానాలకు పరిమితం కాని క్రియా పూర్వక ప్రభుత్వంగా చెప్పుకోవాలి.
‘శాంతా’ దాహార్తి తీర్చడానికి ఎన్నో ప్రభుత్వాలు ఎంతోమంది ముఖ్యమంత్రులను దాటి మీ ప్రభుత్వం, మీరూ రావల్సివచ్చింది. ఇది దైవ నిర్ణయం. మీ ఈ సహాయం ద్వారా మా వ్యాక్సిన్ల తయారీకి ఎంతో దోహదం చేశారు. ప్రపంచం నలుమూలలకు ఈ వ్యాక్సిన్లు అంది, ప్రతి కుటుంబంలోని పిల్లలకు అనేక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి. మీరు శాంతా ద్వారా ప్రపంచంలోని పిల్లల జనాభాకు ప్రాణరక్షణను, ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు.
ఈ ఆరోగ్య యజ్ఞానికి మీరిచ్చిన ప్రోత్సాహం మరువరానిదీ, విలువైనది.
భవదీయుడు
వరప్రసాద్
(2016, మే 5న ప్రయోగాత్మకంగా శాంతా సంస్థకు నీటిని విడుదల చేయడం జరిగింది.)