తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుతున్న క్రీడాకారులకు ఊతమిచ్చేవిధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. నూతన క్రీడా విధానాన్ని రూపొందించడానికి కొంతకాలం నుండి తీవ్ర కసరత్తు చేసింది. క్రీడాకారులు, క్రీడా నిపుణులు, కోచ్‌లతో విస్తృతంగా చర్చించి నూతన క్రీడావిధానాన్ని ప్రకటించడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను అనుసరించి, క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చే అంశంలో భాగంగానే క్రీడాకారులకు భారీ ప్రోత్సాహకాలను ప్రకటించామని, ప్రభుత్వ కార్యదర్శి (క్రీడలు,
యువజన సర్వీసులు) వెంకటేశం తెలిపారు.
ఇక నుండి ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్‌షిప్‌లు, టోర్నీలలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన క్రీడాకారులు, వారి కోచ్‌లకు నగదు ప్రోత్సాహకాలను ప్రభుత్వం అందించనున్నది. ఒలింపిక్స్‌లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించిన వారికి వరుసగా 2 కోట్లు, కోటి, యాభై లక్షల నగదును అందజేయాలని తీర్మానించింది. ప్రభుత్వం జనవరి 3 నాడు జీవోయంఎస్ నెం1ని విడుదల చేసింది. ఇవి గతంలో 25, 16, 10 లక్షలుగా ఉండేవి. దశాబ్దంన్నర క్రితం నాటి క్రీడాశాఖ జీవోలో సవరణలు చేస్తూ, ఇకపై క్రీడాకారులకు అందే ప్రోత్సాహకాలు ఒలింపిక్స్‌లో పతకాలు సాధిస్తే అందజేసే ప్రోత్సాహాకాలే కాకుండా అందులో ప్రాతినిథ్యం వహించినా 5 లక్షల నగదు బహుమతి అందుతుంది.
ఇక మిగతా అంశాలలో
పారా ఒలింపిక్స్: స్వర్ణ పతకానికి 5 లక్షలు, రజతానికి 3 లక్షలు కాంస్యపతకానికి 2 లక్షలు ( ఈవిభాగంలో ఇదివరకు ఎలాంటి ప్రోత్సహకాలు లేవు)
స్పెషల్ ఒలింపిక్స్: స్వర్ణపతకానికి 3 లక్షలు, రజతానికి 2 లక్షలు, కాంస్యానికి ఒక లక్ష (ఈ విభాగంలో ఇదివరకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవు)
ప్రపంచ చాంపియన్‌షిప్: స్వర్ణ పతకం సాధిస్తే 50 లక్షలు, రజతానికి 30 లక్షలు, కాంస్యానికి 20 లక్షలు (ఇవి ఇదివరకు 16,7.5, 6 లక్షలుగా ఉండేవి)
ఆసియా క్రీడలు: స్వర్ణ పతకం సాధిస్తే 30 లక్షలు, రజతం సాధిస్తే 20 లక్షలు, కాంస్యం సాధిస్తే 10 లక్షలు (ఇవి ఇదివరకు 10,7.5,5 లక్షలుగా ఉండేవి) ఇవి కాకుండా ప్రాతినిథ్యం వహిస్తే 2 లక్షలు (ఇది గతంలో లేదు)
కామన్వెల్త్ క్రీడలు: స్వర్ణం, రజతం, కాంస్యాలకు వరుసగా 25,15, 10 లక్షలు. ఇవి ఇదివరకు 10,7.5,5 లక్షలుగా వుండేది.
జాతీయ క్రీడలు: స్వర్ణం, రజతం, కాంస్య పతకాలకు వరుసగా 5, 3, 2 లక్షలు. ఇవి ఇది వరకు 3,4,1 లక్ష రూపాయలుగా వుండేవి.
దక్షిణాసియా క్రీడలు: ఇదివరకు ఎటువంటి ప్రోత్సాహకాలు లేవు.
ఇకముందు స్వర్ణానికి 3 లక్షలు, రజతానికి 2 లక్షలు, కాంస్యానికి లక్ష రూపాయలుగా అందించనున్నారు.
చెస్ టైటిళ్ళు: ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ ఐజిఎంకు 3 లక్షలు. ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం)కు లక్ష, ఇంటర్నేషనల్ వుమెన్ మాస్టర్ (ఐడబ్లుఎం)కు లక్ష.