తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అసువులు బాసిన వారి జ్ఞాపకార్థం స్మారక చిహ్నాలను నిర్మించాలని మునిసిపల్ కార్పొరేషన్ చేసిన తీర్మానం ప్రకారం మేయర్ లక్ష్మీనారాయణ ముదిరాజ్ పోలీసుల నిర్భంధం నడుమ 1970 ఫిబ్రవరి 23న గన్‌పార్క్‌లో శంకుస్థాపన చేయగా, డిప్యూటీ మేయర్ రామచంద్రయ్య ఫిబ్రవరి 25న సికింద్రాబాద్‌లోని క్లాక్‌టవర్ పార్క్‌లో శంకుస్థాపనకు సిద్ధమైనారు. గన్‌పార్క్‌వద్ద మేయర్‌ను, మరికొందరు నేతలను అరెస్ట్‌చేసి జైళ్ళో పెట్టినా డిప్యూటీ మేయర్, ఉద్యమకారులు వెనుకంజ వేయలేదు.
1970 ఫిబ్రవరి 25న ఉదయం 9.40 ని||లకు అనుకున్న ముహూ ర్తానికే స్మారక చిహ్నం శంకుస్థాపన చేయాలని డిప్యూటీ మేయర్ తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడు డా|| మర్రి చెన్నారెడ్డి బయలుదేరినారు. అప్పటికే ప్రజాసమితి కార్యాలయంవద్ద నిషేధపుటుత్తర్వులను ధిక్కరించి గుమికూడిన ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు.
నగరంలోని వివిధ ప్రాంతాలనుండి ప్యాట్నీ సర్కిల్‌కు చేరిన ప్రజలకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. నిషేధపుటుత్తర్వులు అమల్లో ఉన్నాయని, వెంటనే చెదిరిపోవాలని ముందుకు వస్తున్న ప్రజలను పోలీసులు హెచ్చరించారు. ఉద్యమకారులు క్లాక్‌టవర్ పార్క్ వైపుకు కదలడంతో పోలీసులు భాష్పవాయు వును ప్రయోగించారు. జనం కోపంతో పోలీసులపై రాళ్ళు రువ్వినారు. పికెట్‌వద్ద ఒక బస్సుకు నిప్పుపెట్టారు. మనోహర్ టాకీస్‌వద్ద కూడా పోలీసులు లాఠీఛార్జీ చేశారు.
లాఠీఛార్జీ తర్వాత పోలీసులు, ఆందోళనకారులకు నాయకత్వం వహిస్తున్న విద్యార్థి సంఘం నేత మల్లికార్జున్‌ను అరెస్టు చేశారు. లాఠీఛార్జీలో ఆయన తలకు, నడుముపై దెబ్బలు తగిలాయి.
అల్లర్లు జరిగిన ప్రాంతాలలోని దుకాణాలను మూసివేశారు. క్లాక్‌టవర్ వైపుకు వెళ్ళే అన్నిదారుల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎవరినీ ఆ వైపుకు రానీయలేదు. కానీ డా|| చెన్నారెడ్డి, డిప్యూటీ మేయర్ క్లాక్‌టవర్ పార్క్ సమీపానికి మరో పది నిముషాల్లో వస్తున్నారనగా పోలీసులు ఆంక్షలను ఉపసంహ రించుకొని, బ్యారికేడ్లు తొలగించారు. తరువాత అమరుల స్మృతి చిహ్నానికి క్లాక్ టవర్ పార్క్‌లో డిప్యూటర్ మేయర్ రామచంద్రయ్య, డా|| చెన్నారెడ్డి శంకుస్థాపన చేశారు. మల్లికార్జున్ అరెస్ట్ విషయాన్ని శాసనసభ్యులు పోల్సాని నర్సింగరావు సభలో ప్రస్తావించారు.
శంకుస్థాపనను ప్రభుత్వం అనుమతించిందంటే క్లాక్ టవర్ పార్క్ స్థలం మునిసిపల్ కార్పొరేషన్‌దేనని గుర్తించడమేనని డా|| చెన్నా రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గోవింద్‌సింగ్, గౌరీశంకర్ తదితర నేతలు పాల్గొన్నారు.
మేయర్, నేతల అరెస్ట్‌పై శాసనసభలో చర్చ
1970 ఫిబ్రరి 26న తెలంగాణ ఉద్యమకారిణి, రిపబ్లికన్‌పార్టీ నేత ఈశ్వరీబాయి గన్‌పార్క్, సికిం ద్రాబాద్ క్లాక్‌టవర్ ఘటనలను శాసనసభలో ప్రస్తావిస్తూ వాయిదా తీర్మానాన్నిచ్చారు.
‘పునాదిరాయిని ప్రశాంతంగా చేసుకొననిచ్చిన పోలీసులు ఆ తర్వాత జనం ప్రశాంతంగా వెళ్ళిపోతుండగా లాఠీఛార్జీ జరిపి విద్యార్థి నాయకుడు మల్లికార్జున్‌ను ఇతరులను దారుణంగా కొట్టార’ని ఈశ్వరీబాయి అన్నారు.
‘గన్‌పార్క్‌వద్ద తెలంగాణ మృతవీరుల స్మారక చిహ్నాల పునాదిరాయి వేసిన సందర్భంలో నిర్భంధంలోకి తీసుకున్న మేయర్, ఇతర నాయకులను, నిన్న సికింద్రాబాద్‌లో అరెస్టు చేయబడిన వారిని ప్రభుత్వం సత్వరమే వదలివేయా’లని తెలంగాణ ఐక్య సంఘటన సభ్యులు కోరినారు. ‘ఫిరంగి పార్కు చుట్టూ ఇంకా కాపలా కాస్తున్న పోలీసులను ఉపసంహరించాలని’ కూడా వారు విజ్ఞప్తి చేశారు.
అరెస్టు చేసినవారిని విడుదల చేయాలనీ, ఫిరంగి పార్క్‌లో వేసిన పునాదిరాయిని పోలీసుల స్వాధీనంలో నుంచి విడుదల చేయాలని కొండా లక్ష్మణ్, కె.ఎస్. నారాయణ కోరినారు.
ఈ అంశంపై హోంమంత్రి జలగం వెంగళరావు సమాధానమిస్తూ ‘అరెస్ట్ చేయబడిన వారిపై కేసులు ఉపసంహరించుకోవడాన్ని గురించి తాము ఇప్పుడే ఏమీ చెప్పజాలమ’ని అన్నారు.
ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. సికింద్రాబాద్‌లో పోలీసులు పునాదిరాయిని వేసుకోనిచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ ‘ఆయా పరిస్థితులను ఏవిధంగా ఎదుర్కోవాలో ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అధికారం పోలీసు అధికారులకు ఉన్నది. నిన్న ఆ విధంగా జరిగి వుంటుంద’న్నారు.
మల్లికార్జున్ అరెస్ట్‌పై విద్యార్థుల నిరసన
విద్యార్థి ఐక్యకార్యాచరణ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున్‌ను పోలీసులు అరెస్ట్ చేసినందుకు నిరసనగా జంటనగరాల్లోని అనేక విద్యాసంస్థల్లో విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కూడా విద్యార్థుల హాజరుశాతం స్వల్పంగా వుందని విశ్వవిద్యాలయ ప్రతినిధి పత్రికలకు వెల్లడించారు. ఆర్ట్స్ కళాశాల ముందు ఒక బస్సును విద్యార్థులు ధ్వంసం చేశారు. వెంటనే యూనివర్సిటీకి వెళ్ళే బస్సులన్నింటిని ఆర్టీసీ నిలిపివేసింది. నగరంలోని ఇతర కొన్ని ప్రాంతాల్లో కూడా విద్యార్థులు బస్సులపై రాళ్ళు రువ్వినారు. ఆ మార్గాల్లో బస్సులను నిలిపివేసినారు అధికారులు. అదేరోజు సాయంత్రం మల్లికార్జున్‌ను వ్యక్తిగత పూచీకత్తుపై జైలునుండి విడుదల చేసింది న్యాయస్థానం.
మేయర్‌తో సహా నేతలందరి విడుదల
హైదరాబాద్ గన్‌పార్క్‌లో తెలంగాణ మృతవీరుల సంస్మరణార్థమై స్థూపావిష్కరణ చేస్తూ అరెస్టు కాబడిన మేయర్ లక్ష్మీనారాయణ ముదిరాజ్‌ను, ఆయన వెంట అరెస్ట్ కాబడిన ఉస్మానియా వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ బి.కె. నాయుడు, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ధర్మపాల్, ఎల్లయ్య, హరినారాయణ, సంగం కృష్ణ, భీష్మదేవ్, కర్రా నరసింహ, శివపెర్షాద్, రామదాస్, శంకర్‌సింగ్ తదితరుల ను వ్యక్తిగత పూచీకత్తుపై జైలునుంచి ప్రభుత్వం విడుదల చేసింది.
ఒక ప్రక్క అరెస్టయిన నేతలను విడుదల చేస్తూనే మరోవైపు గన్‌పార్క్ ఘటనలో పాల్గొన్నాడనే ఆరోపణపై ప్రముఖ తెలంగాణ నాయకుడు టి. గోవింద్‌సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
(వచ్చే సంచికలో.. ఇందిరతో తెలంగాణ ఎంపీలు)