తెలుగువారి చిత్రకళ

శిల్పకళ వలెనే తొలి రోజులలో దేవాలయాలను ఆశ్రయించి ఉండేది. దీనిలో వస్తువు సైతం శిల్పకళలో వలె పౌరాణిక సంబంధమైనదై ఉండేది.కాలక్రమేణ వస్తువులో వైవిధ్యం వచ్చింది. నృత్యాలు, తాండవాలు, సామాజికపరమైన ఎన్నెన్నో విశేషాలు చిత్రకళకు కొత్త మెరుగులు అద్దాయి. మన శిల్పానికి వర్తించిన సూత్రాలన్నీ దాదాపుగా చిత్రకళకు వర్తిస్తాయి. శిల్పకళ మూడు ఆయతనాలుగల లలితకళ అయితే చిత్రకళ రెండు ఆయతనాలుగల లలితకళ. అయితే శిల్పకళలో సాధ్యంకాని వాతావరణ శోభను ప్రస్ఫుటం చేసే అవకాశం చిత్రకళకు ఉంది.

చిత్రకళను ప్రాథమికంగా రేఖాచిత్రాలు, వర్ణచిత్రాల విభాగాలుగా విడగొట్టవచ్చును. రేఖాచిత్రం సాధారణగేయం లాంటిదిగా భావిస్తే, వర్ణచిత్రాన్ని వాద్యాలతో కూడిన మధుర సంగీతరూపకంగా అభివర్ణించవచ్చు.

సంగీతంలో వలెనే వర్ణజాలములోను సప్తవర్ణాలున్నాయి. అవి-ఉదా:- నీలి, నీలము, ఆకుపచ్చ, పసుపుపచ్చ, నారింజ, ఎరుపు, వర్ణాలను వివిధ తరహాల్లో మేళవిస్తే అసంఖ్యాకమైన రంగులు ఏర్పడతాయి. వాస్తవానికి ఎరుపు, పసుపు, నీలము మాత్రమే ప్రాథమిక వర్ణాలు.

చిత్రకళ శిల్పకళ మాదిరిగా చిరంజీవికాదు. సూర్యరశ్మితో దీనికి క్రమేణ కాలదోషం పడుతుంది. అందుచేతనే చిత్రలేఖనాన్ని పూర్వులు చీకటి గుహలలో, దేవాలయ కుడ్యాలపై వేయించి ముందు తరాలకు భద్రపరిచారు.

విశ్వవిఖ్యాతినిపొందిన అజంతా చిత్రలేఖనాలు శాతవాహనయుగంలో అవతరించాయి. అయితే ఇవే మన చిత్ర లేఖనానికి ప్రాథమిక దశకాదు. పరాకాష్ఠగా పేర్కొనవచ్చు. సుమారు వెయ్యి సంవత్సరాల ఆ గుహ్యాంత రాలలో వాకాటక, చాళుక్యయుగాలలో ఆ చిత్ర కళారాధన కొనసాగింది.
tsmagazine

”బోధివృక్షపూజ” అనే చిత్ర లేఖనం భారతీయ చిత్రకళకు వేగుచుక్క. బోధి సత్వ పద్మపాణి చిత్రం ఆసియా ఖండ చిత్ర సముదాయం అంతటికి మకుటాయమానమైంది. పది శతాబ్దాలలో పరిణామ రమణీయమైన చిత్ర లేఖనకళ అజంతా గుహలలో కనిపిస్తుంది. అజంతాలోని ఒక గుహలో గౌతమీపుత్ర శాతకర్ణి పేరు కూడా కనిపిస్తుంది. పదవ గుహలోని షడంత జాతకకథ క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దినాటిదని కళాకోవిదుల అభిప్రాయం.

విజయనగర పతనం తర్వాత ముస్లింల పాలన ప్రారంభం కావడంతో వారు మెచ్చిన, కోరిన చిత్రాలు వేయడానికి చిత్రకారులు పరిమిత మయ్యారు. ఈ కాలంలో సుల్తానుల జీవనశైలి, వారి రూపచిత్రాలు ప్రతిబింబించిన చిత్రకళా ధోరణే-”దక్కన్‌ చిత్రకళ”గా పేరు పొందింది.

ఇలా చిత్రకళ ఎంత వైవిధ్యానికి లోనయినా అది మన పూర్వీకులు పరంపరగా అందించిన సంప్రదాయాల లక్ష్మణరేఖ దాటకుండానే కొనసాగింది. పందొమ్మిదవ శతాబ్దంలో ఫొటోగ్రాఫిక్‌ కెమెరా అందుబాటులోకి వచ్చిన తర్వాత చిత్రకళలోని వాస్తవికతకు విలువతగ్గి, సృజనకు విలువ పెరిగింది.

ఈ నేపథ్యంలో మన చిత్రకళ అనుసరించిన సమస్త సంప్రదాయాలను తలక్రిందులుచేస్తూ నవ్యులు చిత్ర లేఖనంలో ప్రయోగాలుచేశారు. కలలో కూడా ఊహించనివిధంగా సైన్సు దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న విధంగానే ప్రపంచంలో ఏ మారుమూల తలెత్తిన నూతన ధోరణి అట్టే వ్యవధి లేకుండా మరో ప్రాంతానికి తెలిసిపోతున్నది. వేగపూరితమైన సమాచర వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన ఫలితంగా వర్ధమాన చిత్రకారులు ఆయా వినూత్న ధోరణులను తమశైలిలో వెంటనే తర్జుమా చేసే సౌకర్యం పెరిగింది.

ఇతర కళా ప్రక్రియలలోకన్నా వేగంగా చిత్రలేఖన ధోరణులు మారుతున్నాయి. సుమారు ఐదు దశాబ్దాల క్రితం తెలియని నైరూప్య పద్ధతిలో ఈనాడు చిత్రకారులు తలమునకలైనారు. ఇంప్రెషనిజంతో ప్రారంభమై సర్రియలిజం, డాడాయిజమ్‌ కాకుండా ఆప్‌ ఆర్ట్‌, పాప్‌ ఆర్ట్‌ సరళి దాకా ఆవిర్భవించింది. ఈ సమకాలీన చిత్రకళారీతులను సంప్రదాయ, విషయాశ్రయ, విషయాతీత పద్ధతులనే మూడు విభాగాలుగా వర్గీకరించవచ్చు. కానీ ఈ మూడింటిలో ఏ విధానాన్ని సరిగా, సంపూర్ణంగా ఏ చిత్రకారుడు అనుసరించడం లేదు. కానీ ఈ మూడు పద్ధతుల్లోని మీగడ తరగల్లాంటి విశేషాంశాలను, సౌందర్యాన్ని సమకాలీనులు తమ చిత్రాల్లో ప్రతిబింబిస్తున్నారు.

వాస్తవానికి మన చిత్రకారులను స్థూలంగా పరిశీలిస్తే వారిలో మూడు రకాల ధోరణులవారు కనిపిస్తారు. మొదటి తరహావారికి హైదరాబాద్‌లో ఆధునిక చిత్రకళకు రామకృష్ణవామన్‌ దేవస్కర్‌ వైతాళికుడు. వీరు 1900లోనే బొంబాయిలోని జె.జె. స్కూల్‌లో చదువుకుని వచ్చి-మరాఠీ డ్రామా కంపెనీలకు తెరలు రూపొందించారు. ఆ తర్వాత యూరప్‌ పర్యటించివచ్చారు. మూర్తి చిత్రణలో పోట్రేట్‌ చిత్రణలో సిద్ధహస్తుడు. మూడో సాలార్‌జంగ్‌కు సన్నిహితుడు. ప్రపంచ ప్రసిద్ధికెక్కిన సాలార్‌జంగ్‌ మ్యూజియంకు తొలి క్యూరేటర్‌. వారి చిత్రకళలో జీవం, సౌందర్యం తొణికిసలాడతాయి.

వీరి కుమారుడు సుకుమార్‌ దేవ్‌స్కర్‌. వీరు హైదరాబాద్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ ప్రిన్సిపాల్‌గా ఎందరో యువ చిత్రకారులను తీర్చిదిద్దారు. వీరుకూడా మూర్తి చిత్రణలో చేయి తిరిగినవారు. శాంతినికేతనంలో నందన్‌లాల్‌బోస్‌ చెంత చిత్రకళ సాధన చేశారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్‌ పారిస్‌లో చిత్రకళ అభ్యసించారు. జర్మనీ, స్పెయిన్‌ ఇత్యాది దేశాల్లో చిత్రకళా ప్రదర్శనలు చేశారు. వీరు గీసిన గోల్కొండ నవాబుల చిత్రాలు ప్రసిద్ధమైనవి. బెంగాల్‌లోని శాంతినికేతన్‌లో చదువుకునివచ్చి ”బెంగాల్‌ స్కూల్‌”ను ఇక్కడ ప్రవేశపెట్టి ఆ ధోరణి చిత్రాలు కొనసాగించినవారు రెండో తరహావారుగా అభివర్ణించవచ్చు. వారిలో ఇరుకుల కుమారిలస్వామి, కొండపల్లి శేషగిరిరావు ప్రభృతులు వంగ సంప్రదాయం జీర్ణించుకుని అపురూపమైన చిత్రాలు వేశారు.
tsmagazine

కరీంనగర్‌కు చెందిన కుమారస్వామి నిరుపేద దళిత కుటుంబంలో పుట్టారు. ప్రముఖ రాజకీయవేత్త రావి నారాయణరెడ్డి సలహామేరకు ఢిల్లీకి చెందిన ధక్కర్‌బాబా ఆశ్రయంపొంది, చిత్రకళలో సాధన చేశారు. ఒకరోజు ఆశ్రమవాసుల

యోగక్షేమాలు తెలుసుకోవడానికి గాంధీ మహాత్ముడు వచ్చినప్పుడు కుమారుల స్వామి చిత్రాలు చూసి కన్నీరు పెట్టుకున్నాడట. బరువులు మోస్తున్న శ్రామికుణ్ణి గీసిన తీరుచూసి, ఆ బరువులు నానెత్తిన పెట్టకపోయావా? అని ఆవేదన వ్యక్తం చేశారట. చిత్రకళలో అంత మహత్తును చూపిన కుమారస్వామిని మరింత శిక్షణ నిమిత్తం శాంతినికేతనం పంపించారు. అక్కడ నందలాల్‌బోస్‌ వద్ద చిత్రకళా రహస్యాలు తెలుసుకుని జీవితకాలమంతా ఆయన సాధన చేశారు.

ఇట్లాగే వరంగల్‌కు చెందిన కొండపల్లి శేషగిరిరావు రామాయణ, మహాభారతం, భాగవతం పఠించి ఎన్నో పౌరాణిక సంబంధ చిత్రాలు వేయ డంలో తన ముద్రవేశారు. ఈ చిత్రాలు చూసిన నవాబ్‌ మోహదీ నవాజ్‌ జంగ్‌ బహద్దూర్‌ అంటే అనంతర కాలంలో కేంద్ర లలిత కళా అకాడమి అధ్యక్షులుగా, గుజరాత్‌ గవర్నర్‌గా పనిచేసిన కళాహృదయుడి దూరదృష్టిచేత కొండపల్లి శేషగిరిరావును శాంతినికేతన్‌కు పంపించి నందలాల్‌బోస్‌ వద్ద చిత్రకళలోని మెళకువలు నేర్చుకోవడానికి దోహదం చేశారు.

ఇది ఇట్లా ఉండగా-కరీంనగర్‌జిల్లా అన్నారం లోని రైతు కుటుంబంలో జన్మించిన పాకాల తిరుమల్‌రెడ్డి తనదైన ఆధునిక బాణిని అలవర్చుకుని ఇక్కడ యువచిత్రకారులు, శిల్పులపై ఎంతగానో ప్రభావం వేశారు. పి.టి.రెడ్డిగా పేరు పొందినవీరు 1940లోనే చిత్రలేఖనంలో డిప్లొమా పొందారు. జాతీయ, అంతర్జాతీయ చిత్రకళారంగంలో వస్తున్న ధోరణులను అధ్యయనం చేసి వందలు, వేల చిత్రాలు వేశారు, శిల్పాలు చెక్కారు. దేశంలో వ్యష్టి చిత్రకళా ప్రదర్శన నిర్వహించిన తొలి చిత్రకారుడు వీరేనని అంటారు. దేశంలోని వివిధ నగరాల్లోనే కాకుండా ఆస్ట్రేలియా, జపాన్‌, జర్మనీ, బ్రిటన్‌లాంటి విదేశాల్లో జరిగిన చిత్రశిల్ప కళా ప్రదర్శనలలో పాల్గొని తెలుగు జెండా ఎగరవేసిన సృజనశీలి ఈయన. కొంతకాలం వీరు ఆస్థాన చిత్రకారుడిగాను ఉన్నారు. వీరు జీవితకాలంలో వేసిన చిత్రాలు – శిల్పాలతో ”సుధర్మ ఆర్ట్‌గ్యాలరీ”ని తమ గృహంలోనే ఏర్పాటు చేశారు.

సికింద్రాబాద్‌కు చెందిన సుప్రసిద్ధ చిత్రకారుడు-బద్రి నారాయణ. మన జానపదశైలిని ఆధారం చేసుకుని అధునాతనంగా చిత్రించిన పలు చిత్రాలకు జాతీయ స్థాయి బహుమతులు వచ్చాయి. దేశంలోని మహానగరాల్లో మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ వీరు వేసిన చిత్రాల ప్రదర్శన నిర్వహించారు. వీరికి 1987లో పద్మశ్రీని కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసింది.

ఇక మూడవ తరహా ధోరణి హైదరాబాద్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ ఏర్పడిన తర్వాత అక్కడ బోధించిన అధ్యాపకులది, వారి ప్రేరణలో తయారైన చిత్రకారులది, శిల్పులది. ఇట్టివారిలో కొండపల్లి శేషగిరిరావు, సయ్యద్‌బిన్‌ మహ్మద్‌, కె. రామయ్యలాంటివారు – ముందు తరంవారు. వారి తర్వాతి తరం వారిలో ప్రతిష్ఠులైనవారిలో లక్ష్మాగౌడ్‌, సూర్యప్రకాశ్‌, ప్రభృతులు ఉన్నారు. తెలుగువారి సంస్కృతి-సంప్రదాయాలు, పండుగలు- పబ్బాలు ముఖ్యంగా బతుకమ్మ, బోనాలు, ఎల్లమ్మజోగి, ఇతర గ్రామీణ దేవతలు వారి చిత్రాల్లో, శైలిలో ఒదిగిపోతాయి. బెంగాల్‌కు జామినీరాయ్‌ ఎంతటి చిత్రకారుడో, తెలుగువారికి కాపు రాజయ్య అంతకుమించిన చిత్రకారుడు. లలితకోమలమైన జానపదచిత్రాలకు చిరునామా-కె. రాజయ్య.

సయ్యద్‌బిన్‌ మహ్మద్‌ చిత్రకళలో కొత్త టెక్నిక్‌ ప్రవేశపెట్టి తన ప్రత్యేకతను చాటాడు. ఆయన వేసిన గౌతమీపుత్ర శాతకర్ణి వారి చారిత్రక అధ్యయనాన్ని ద్యోతకం చేస్తుంది. ఈ చిత్రం పార్లమెంటులో ఉంది. పల్లెపట్టులలోని స్త్రీ, పురుషుల నిత్య జీవితం, సుఖదుఃఖాలు, కోపతాపాలు, ధ్వనించే తిట్లు, అందులోని శృంగారం లక్ష్మాగౌడ్‌ చిత్రాల్లోని వస్తువు. మెదక్‌ జిల్లా నిజాంపూర్‌లో వీరు జన్మించారు. సూర్యప్రకాశ్‌ రంగుల సమ్మేళనంతో వివక్త రూపాలు వేయడంలో విశిష్ట చిత్రకారుడు. ఖమ్మంలో పుట్టినవీరు ఆధునిక చిత్రకళారంగం వికాసానికి గ్యాలరీల ఏర్పాటు లో ఎంతో కృషి చేశారు.

సమకాలీన చిత్రకారుల్లో తోట వైకుంఠం, చింతల జగదీశ్‌లాంటి చిత్రకారులు జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. వైకుంఠం తెలంగాణ మహిళను వేయడంలో ప్రత్యేకతను సాధించారు. చింతల జగదీశ్‌ తనప్రత్యేక పద్ధతిలో కళాసాధన చేసి దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందారు. ఇక్కడే కాకుండా అమెరికా, బ్రిటన్‌లలో తన స్టూడియోలు నెలకొల్పి నాలుగుచేతులా కళాకృతులను రూపొందిస్తున్న స్పందనశీలి జగదీశ్‌.

భారీ సైజులో ఫైబర్‌గ్లాస్‌తో రూపొందించే మహిళల శిరస్సుల రూపకల్పనలో చేయి తిరిగినవాడు-రవీందర్‌రెడ్డి. వీరి కళాకృతులకు ఇవ్వాళ అంతర్జాతీయస్థాయిలో ఎంతో డిమాండ్‌ ఉంది.

స్థానిక చిత్రకారుల్లో సూర్యప్రకాశ్‌, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీహరిభోలేకర్‌, భరత్‌యాదవ్‌లాంటివారి చిత్రాలకు కేంద్ర లలిత కళా అకాడమి అవార్డులు ప్రదానం చేసి గౌరవించింది. పత్రికలు ప్రజలకు చేరువకావడంతో వాటిలో తాను బొమ్మలు వేయడంలో సాధనచేసి, భావాత్మకమైన రేఖాచిత్ర కళలో తనముద్ర వేసినవాడు-చంద్ర. తొలిరోజుల్లో బాపు అడుగుజాడల్లో నడిచిన చంద్ర ఆ తర్వాత తన మార్గం వేసుకున్నాడు. తెలుగు పత్రికలలో అధిక్షేపం, హాస్యం మేళవించిన కార్టూన్‌ చిత్రాలను వేయడంలో శంకర్‌ చక్కని ఒరవడి దిద్దాడు. మరెందరో ఈ రంగంలో ఇవాళ్ళ కృషి చేస్తున్నారు.
tsmagazine

టి. ఉడయవర్లు

Other Updates