khilla-ghanpur‘రాజులు పోయారు రాజ్యాలు పోయాయి’ కానీ అలనాటి రాజులు నిర్మించిన అద్భుత కట్టడాల చరిత్ర మాత్రం ఇప్పటికీ సజీవమే. శతాబ్దాల క్రితం వారు నిర్మించిన అనేక కట్టడాలే ఇందుకు సజీవ సాక్ష్యాలుగా నేటికీ నిలుస్తున్నాయి. గత కాలపు ఘనకీర్తిని తెలియజేసే ఆనాటి గొప్ప నిర్మాణాలు మన శిల్పకళావైభవానికి, మనవారి విజ్ఞానానికి ప్రతీకలుగా, సోపానాలుగా నిలుస్తాయనటంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి గొప్ప నిర్మాణాల్లో ప్రముఖ స్థానంలో నిలుస్తుంది మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి 25 కి.మీ. దూరంలో, వనపర్తి మండల కేంద్రానికి 6 కి.మీ. దూరంలో వున్న ఖిల్లా ఘన్‌పూర్‌.

నాగబాల సురేష్‌ కుమార్‌

దక్షిణాపథాన రెండు శతాబ్దాల పాటు తిరుగులేని ఆధిపత్యాన్ని నిలుపుకొని, ఎన్నెన్నో విజయకేతనాలు ఎగురవేసిన కాకతీయ వైభవం మాటల్లో చెప్పలేనిది. వారి పాలనలో మన తెలుగు నేల ఒక వెలుగు వెలిగింది. నిర్మాణ, శిల్పకళా రంగాలు సరికొత్త వైభవాన్ని సంతరించుకొని కొత్త పుంతలు తొక్కాయి. కాకతీయ ప్రభువులు చేపట్టిన ప్రతి నిర్మాణము అనితర సాధ్యమైన ఒక అద్భుతమే. సజీవము అనిపించే శిల్పకళా సంపదకు నాటి మహరాజులు జీవం పోశారు. అలాంటి నిర్మాణ కోవలోకి వస్తుంది మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఖిల్లా ఘన్‌పూర్‌. కాకతీయ రాజులు తమ ప్రజల సుఖ సంతోషాలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు కాబట్టే వారు చరిత్రలో మంచి స్థానం సంపాదించి ప్రజారంజక రాజుల్లో మొదటి వరుసలో నిలిచారు. కోటలో ఎటువైపు చూసినా రాతి బురుజులు, శిథిల మందిరాలు, ఎత్తయిన ప్రాకారాలు, ఎత్తయిన రాతిమెట్లు, శిలా తోరణాలు, అద్భుతశిల్ప సంపద మనకు కనిపిస్తుంది. సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కోటలో ఎటువైపు చూసినా గొప్ప శిల్ప సంపద నాటి రాజుల అసమాన శౌర్యాలకి ప్రతీకగా నిలువెత్తు నిదర్శనంగా నిలిచి ఉంది. కొండ ప్రాంతపు గిరి దుర్గం కావటంతో ప్రస్తుతం శిథిల కట్టడాలు అక్కడక్కడ మాత్రమే మిగిలి నాటి వైభవాన్ని చాటి చెబుతున్నాయి. ప్రజారంజక పాలనలో భాగంగానే వారు అనేక ఆలయాలను నిర్మించారు. ఆ ఆలయాలలో మహా అద్భుతం అనిపించే శిల్ప సంపదతో పాటు జీవం ఉట్టిపడే నైపుణ్యంతో నిర్మించిన కళాఖండాలు అనేకం. సుమారు 9 శతాబ్దాల క్రితం నిర్మించినవే అయినా ఇప్పటికీ ఆ నిర్మాణాలు, శిల్పాలు చెక్కు చెదరలేదు. ఆ నిర్మాణాలన్నీ ఆనాటి వైభవానికి చరిత్రకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి.

‘ఖిల్లా ఘన్‌పూర్‌’ మహబూబ్‌నగర్‌ జిల్లాలోని గిరి దుర్గాలలో ఒకటి. ఇది వనపర్తికి సమీపంలో ఘనపురంలో క్రీ.శ. 1224లో 24 అడుగుల ఎత్తయిన మూడు ముఖ ద్వారాలతో పలు బురుజులతో శతృదుర్భేద్యంగా 18 అడుగుల ఎత్తయిన రాతి ప్రహరి గోడలతో రేచర్ల పద్మనాయకులు, గోన గన్నారెడ్డిల కాలంలో అద్భుతంగా నిర్మించబడింది. వారు కాకతీయ ప్రభువులకు సామంతరాజులు. వారు నిర్మించిన ఈ కోట ఎత్తయిన రెండు కొండల మధ్య నిర్మించబడి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. మొత్తం తొమ్మిది కొండలు ఉన్న ఈ ప్రాంతం అత్యంత సురక్షిత ప్రాంతంగా భావించి వారు ఈ కోట నిర్మాణం గావించారు. రాణి రుద్రమ దేవి మనుమడు చివరి కాకతీయ ప్రభువు ప్రతాపరుద్రుడు ఘనపురం రాజు గోనగన్నారెడ్డి కుమార్తెను ఈ కోటలోనే వివాహమాడినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు సైన్యం కూడా ఈ కోటపై దాడి చేసినట్టు ఆధారాలున్నాయి. ఖిల్లా ఘన్‌పూర్‌లోని పలు చారిత్రక నిర్మాణాలు ఈ కోట వైభవానికి ఆనాటి రాజుల జన రంజక పాలనకు సాక్షీభూతాలుగా నిలుస్తాయి. వారు దూరదృష్టితో చేపట్టిన అనేక నిర్మాణాలు నేటి తరాన్ని అబ్బురపరుస్తున్నాయి. అందుకే కాకతీయుల సామ్రాజ్యం దశ దిశల వ్యాపించింది. కోటలో ఎటు చూసినా రాతి మందిరాలు, సైనిక గదులు, గజ అశ్వశాలలు, గొప్ప శిలాతోరణాలు, మంచి నీటి కొలనులు మనల్ని అబ్బురపరుస్తాయి. 18 అడుగుల ఎత్తయిన రాతి గోడలు కోట చుట్టూ నిర్మించడమేగాక లోతైన కందకం కోట చుట్టూ తవ్వించటంతో శతృవులకు ఇది శతృదుర్భేద్యంగా ఉండేది. సహజంగానే ఇది కొండ ప్రాంతం, అందులోనూ శతృదుర్భేద్యమైన కోట కావడంతో కోటపైకి దండెత్తాలంటే అపరిమితమైన సైనిక బలం అవసరం అయ్యేది. అయినా ఈ కోట పలు యుద్ధాలకు కేంద్రం అయింది.

ఖిల్లా ఘన్‌పూర్‌గా పిలువబడుతున్న ఈ ప్రాంతాన్ని రేచర్ల, మల్యాల, గోన వంశానికి చెందిన రాజులు నాలుగు శతాబ్దాల పాటు పాలించారు. వీరంతా కాకతీయ రాజులకు మంచి విధేయులు కాబట్టి వారి సామంతులుగా ఈ ప్రాంత రాజ్యాలను పాలించారు. ఖిల్లా ఘన్‌పూర్‌ చారిత్రక శిల్పకళకు నెలవవ్వడమేగాక ప్రకృతి అందాలకు కూడా ఎంతో సుప్రసిద్ధం. ఇక్కడ గణపతి సముద్రం పేరుతో ఆనాటి కాకతీయ రాజులు నిర్మించిన పెద్ద చెరువు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆనాడు కోటలోని ప్రజల నీటి అవసరాన్ని ఈ చెరువు తీర్చేది. నేటికీ ఈ చెరువులో సమృద్ధిగా నీరు లభిస్తుంది. ఈ గణపతి చెరువును అప్పటి కాకతీయ సామంత రాజైన మల్యాల గుండనగా ప్రసిద్ధుడయిన గుండ దండాధీశుడు రాణీరుద్రమదేవి కాలంలో నిర్మించాడు. కోటలో అద్భుతంగా నిర్మించిన రాతి బావుల్లో ఇప్పటికీ పుష్కలంగా నీరు ఉండటం విశేషం. శతృ రాజులు కోటపై దండయాత్ర చేసినప్పుడు నెలల తరబడి ఈ నీటి తటాకాలు, బావులు వారి నీటి అవసరాలని తీర్చేవి. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం ఈ కోట కొంత కాలంపాటు బహమనీలు, బీజాపూర్‌ రాజులు, విజయనగర రాజులు, అనంతరం గోల్కొండ, అసఫ్‌ జాహీల ఏలుబడిలో కొనసాగింది. కోటను పాలించిన రాజులు ‘ఆయా చక్రవర్తులకు తగిన విధంగా సామంతులుగా కొనసాగారు.

గోన వంశ రాజులు, మల్యాల వంశ రాజులు మంచి విధేయులుగా కాకతీయ రాజుల దగ్గర మెలిగేవారు. ఈ సాన్నిహిత్యం వల్లనే గోన, మల్యాల రాజుల మధ్య అత్యంత సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో మల్యాల గుండనాధీశుడు గోన బుద్ధారెడ్డి కూతురు కప్పాంబికను వివాహము చేసుకున్నాడు. వారి కాలంలో కోటలో కొత్త మందిరాలు, నిర్మాణాలు చోటు చేసుకున్నాయి. సహస్ర గణపతేశ్వర ఆలయాన్ని కూడా అదే సమయంలో గోన బుద్ధారెడ్డి నిర్మించారు. అద్భుతమైన ఆ మందిరం శిథిలాలు నేటికీ కనిపిస్తాయి. ఆ మందిర ప్రారంభోత్సవానికి ఆయన గణపతిదేవ చక్రవర్తిని ఆహ్వానించి బంగారు ఆభరణాలతో తూకం వేయించి ఆయనకు ఘనసన్మానం చేయటమేగాక ఆయన పేరిట ‘ఘనపురం’ గ్రామాన్ని నిర్మాణం గావించి తన ప్రభు భక్తిని, విశ్వాసాన్ని చాటుకున్నాడు. వరంగల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలో గణపతి దేవ చక్రవర్తి కాలంలో ఘన్‌పూర్‌, ఘనపురం లాంటి అనేక గ్రామాలు ఉండటంతో దీనిని ‘ఖిల్లా ఘన్‌పూర్‌’గా పిలవటం మొదలయింది.

గోన బుద్ధారెడ్డికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. అందులో మొదటి వాడే గోన గన్నారెడ్డి, రాణి రుద్రమదేవికి ఆయన అత్యంత విశ్వాస పాత్రుడు. రెండవ వాడు కచ్చరెడ్డి గోన. మూడవ వాడు గోన విఠలంత, కూతురు కప్పాంబిక. గోన కచ్చరెడ్డి, గోన విఠలంతలు ఇద్దరు మంచి రచయితలు. వారి తండ్రి గోన బుద్ధారెడ్డి ప్రారంభించిన రంగనాథ రామాయణాన్ని వారిద్దరూ కలిసి పూర్తి చేశారు. ఈ గ్రంథం ద్విపద ఛందస్సులో తెలుగులో వచ్చిన మొదటి రామాయణం. వీరి కాలంలో కవులకు, కళాకారులకు మంచి ఆదరణ ఉండేది. అద్భుతమైన శిల్పాలు, రాజసం ఉట్టిపడే శిలా తోరణాలు నేటికీ కోటలో అక్కడక్కడా మనకు కనిపిస్తాయి. వాటిని పరికించినపుడు అలనాటి కోటలోని శిల్పకళా వైభవం మనకు గుర్తుకు వస్తుంది. కోటలోని విశాలమైన ప్రాంగణంలో నాడు వారు ఏర్పాటు చేసిన అందమైన పూల తోటలు, నీటి

ఫౌంటెయిన్స్‌కు సంబంధించిన ఆనవాళ్ళు, రాచవీధులు మనల్ని ముగ్ధులను చేస్తాయి.

గోన బుద్ధారెడ్డి మరణం తరువాత అతని సోదరుడు గోన లక్కమరెడ్డి ఘన్‌పూర్‌ సామ్రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. కానీ అతను మాత్రం తన అన్నలా కాకతీయులకు విధేయుడిగా వుండటానికి ఇష్టపడలేదు. ఒక రకంగా తిరుగుబాటుకు సిద్ధపడ్డాడు. ఇది గమనించిన బుద్ధారెడ్డి పెద్ద కుమారుడైన గోన గన్నారెడ్డి తన అధిపతులైన కాకతీయులకు అనేక యుద్ధాలలో ఉపయోగపడి వారి పట్ల తన విధేయతను, ప్రభు భక్తిని చాటాడు. ఆ సందర్భంలోనే గోన గన్నారెడ్డి వర్థమాన పురానికి రాజైనాడు. నిజానికి బుద్ధాపురం (ప్రస్తుతం బూత్‌పూర్‌) వర్థమానపురం (నంది వడ్డేమాన్‌) రాజ్యాలు మల్యాల రాజుల ఆధీనంలో పలు దశాబ్దాల పాటు కొనసాగాయి. మల్యాల గుండన అనంతరం అతని భార్య కప్పాంబిక పాలన కొంత కాలంపాటు కొనసాగించినా శత్రువుల బెడద తీవ్రం కావటంతో గన్నారెడ్డి ఆ రాజ్యాలని స్వాధీనం చేసుకున్నాడు. గుండన, కప్పాంబికలు పలు చెరువులను వారి పాలనలో తవ్వించి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు.

అందుకు కాకతీయుల సహకారం అతనికి లభించింది. గోన గన్నారెడ్డి మహా పరాక్రమవంతుడు కావటంతో ఈ ప్రాంతంలోని అనేక చిన్న చిన్న రాజ్యాలు, సంస్థానాలు అతని ఏలుబడిలోకి వచ్చాయి. గన్నారెడ్డిని లొంగదీయడానికి బహమనీలు ప్రయత్నించినా చాలా కాలం పాటు వారి ఆటలు సాగలేదు.

అయితే ఇతడి చరిత్ర ఈ ప్రాంతానికి, ఈ కోటతో ముడిపడి వుంది. ఈ కోట ఎన్నో అద్భుత యుద్ధాలకు ప్రతీకగా నిలిచింది. అందులో బహమనీలకు విజయనగర సామ్రాజ్య వంశస్థులకు అలాగే బీజాపూర్‌ రాజులు, కుతుబ్‌ షాహీలకు మధ్య జరిగిన అనేక పోరాటాలకు ఈ కోట నెలవైంది. కొన్నాళ్ళపాటు ముస్లిం రాజుల ఆధీనంలో ఈ కోట ఉండటంతో వారి కాలంలో వెలిసిన మసీదులు, దర్గాలు, ఇతర ఇస్లాం శైలి కట్టడాలు సైతం కోటలో నిర్మించబడ్డాయి. ఆ కాలంలోనే అనేక దేవాలయాలు, మందిరాలు ధ్వంసం చేయబడ్డాయి. ఈ ప్రాంతంలో గోన బుద్ధారెడ్డి కాలంలో నిర్మించిన అనేక కట్టడాలు అనంతర కాలంలో ధ్వంసం చేయబడటమేగాక ముస్లిం సైనికుల ఆగడాలు మితిమీరటంతో కోటలోని ప్రజలు క్రమంగా వలసబాట పట్టడంతో క్రమంగా కోట వైభవం కనుమరుగయింది.

నాటి పోరాటాలకు గుర్తులుగా ఫిరంగులు ఇప్పటికీ కోట శిఖర భాగంపై చెక్కు చెదరకుండా నిలిచి వున్నాయి. రాజుల మందిరాలు, సైనికుల కోసం నిర్మించిన నివాసాలు శిథిలమై కనిపిస్తాయి. అంతకుముందు ఈ ప్రాంతానికి నాగినేని పల్లిగా పేరుండేది. కోటలోకి ప్రవేశించడానికి నిర్మించిన ఎత్తయిన ముఖ ద్వారాలపై చెక్కిన అనేక రాతి శిల్పాలు అలనాటి శిల్పుల అద్భుత ప్రతిభకు తార్కాణంగా నిలుస్తాయి. తొండం పైకెత్తి పరిగెత్తుతున్న గజరాజులు, గాలిలో తేలియాడుతున్న అశ్వాలు వేటాడుతున్న సింహాలు నాటి రాజుల శౌర్యానికి దర్పణంగా నిలుస్తాయి. అనేక అందమైన శిల్పకుడ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి.

ఇక్కడి ప్రజల కథనం ప్రకారం ఈ కోటలో ఇప్పటికీ అపారమయిన బంగారు నిధులు నిక్షేపాలు ఉన్నాయని చెబుతారు. రెండు భారీ తోపుల ఆనవాళ్ళు కూడా కోటలో మనకు కనిపిస్తాయి. రెండు సొరంగ మార్గాలు కోటలో మనకు కనిపిస్తాయి. శత్రురాజులు దండయాత్ర చేసినప్పుడు రాజకుటుంబీకులు క్షేమంగా కోట దాటడానికి ఈ సొరంగ మార్గాలు ఉపయోగపడేవట. ఒకటి కోట క్రింది ప్రాంతానికి అయితే మరొకటి పానగల్‌ కోట వరకు వుందని కథనం.

ఈ కోటలో ఇప్పటికీ వీరభద్రస్వామి ఆలయం, నరసింహ స్వామి, చౌడేశ్వరి ఆలయ నిర్మాణాల ఆనవాళ్ళు కనిపిస్తాయి. కొండపై వెలిసిన ఈ కోటలో చాలా వరకు గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో నిధులు ఉన్నాయని స్థానికుల విశ్వాసం. ట్రెక్కింగ్‌కు ఇది బాగా అనువైన ప్రాంతం. లోపల నాటి రాతి చెరువుల నిర్మాణాలున్నాయి. ఇవి ఆహ్లాదాన్ని అందించటంతో పాటు టూరిస్ట్‌లు సందర్శన చేయడానికి ఎంతగానో ఉపయోగ పడతాయి. కోటలోకి ఒకరిద్దరు కాకుండా కనీసం పదిమంది బృందంగా గైడును తీసుకొని వెళితే అనేక విశేషాలు తెలుసుకోవచ్చు. మారుమూల ప్రాంతం కావటం వల్ల జాగ్రత్తగా ఉంటే మంచిది.

హైదరాబాద్‌ నుండి సుమారు 120 కి.మీ. దూరంలో ఉన్న ఈ కోటలో పర్యాటకుల కోసం అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించటమేగాక కొన్ని రాతి నిర్మాణాలని మరమ్మతులు చేయించి మెరుగుపరిస్తే భావి తరాలకి ఈ చరిత్రాత్మక కోట వైభవాన్ని, చరిత్రని తెలియజేసినవాళ్ళమవుతాం. ఇతర కోటల్లో మాదిరిగానే దుండగులు కోటలో నిధులు, నిక్షేపాల కోసం విలువైన శిల్ప సంపదను పాడు చేయటంతో కోటలో చాలా భాగం ధ్వంసమయింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ కోట పరిరక్షణకు తగిన చర్యలు తీసుకొని గొప్ప పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దితే బాగుంటుందని స్థానికుల అభ్యర్థన. ఆ దిశగా తగిన చర్యలు ప్రభుత్వం తీసుకొంటుందని ఆశిద్దాం.

గోన గన్నారెడ్డి మహా పరాక్రమవంతుడు కావటంతో ఈ ప్రాంతంలోని అనేక చిన్న చిన్న రాజ్యాలు, సంస్థానాలు అతని ఏలుబడిలోకి వచ్చాయి. గన్నారెడ్డిని లొంగదీయడానికి బహమనీలు ప్రయత్నించినా చాలా కాలం పాటు వారి ఆటలు సాగలేదు.

Other Updates