వి.ప్రకాశ్
1969 జనవరిలో విద్యార్థులచే ప్రారంభించబడిన తెలంగాణ ఉద్యమం ప్రజా సమితి నాయకత్వ బాధ్యతలు డా|| మర్రి చెన్నారెడ్డి చేపట్టిన తర్వాత వివిధ రంగాల ప్రజలను, రాజకీయ నాయకులను, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో మహోద్యమంగా వ్యూహాత్మకంగా పురోగమించింది. ఎప్పుడైతే బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం తెలంగాణ ముఖ్య నేతలను జైళ్ళో పెట్టిందో ఉద్యమం తగ్గుముఖం పట్టింది. నాయకులు జైలునుండి విడుదలై మళ్ళీ ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి ఎంత ప్రయత్నించినా, ఎన్ని ఆందోళనా కార్యక్రమాలకు పిలుపునిచ్చినా ఆశించిన స్థాయిలో అవి విజయవంతం కాలేదు. ప్రజా సమితి నాయకుల్లో విభేదాలు కూడా ఎక్కువై కొందరు సంస్థనుండి వైదొలిగి పోటీ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు.
1969లో పరీక్షలు రాయనందున ఒక విద్యా సంవత్సరాన్ని తాము నష్టపోయామనే భావన విద్యార్థుల్లో వారి తల్లిదండ్రుల్లో కలిగింది. ఉద్యమంలో చురుకైన పాత్ర నిర్వహించిన టీఎన్జీవో నేత కె.ఆర్. ఆమోస్‌ను జైళ్ళో పెట్టి, ఉద్యోగంలోనుండి తొలగించడంవలన ఉద్యోగులు కూడా ఉద్యమానికి దూరంగా వుంటున్నారు. ఇదే సమయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే గురుమూర్తి మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తెలంగాణ ప్రజాసమితిని రాజకీయ పార్టీగా మార్చి ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా దీర్ఘకాలం కొనసాగించాలనే వత్తిడి కొంతకాలంగా ప్రజా సమితి నాయకత్వంపై కొనసాగుతున్నది. ప్రజల నాడీ తెలుసుకునేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నికను ప్రజా సమితి ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న సికింద్రాబాద్ పట్టణ ప్రజా సమితి అధ్యక్షుణ్ణి తన అభ్యర్థిగా ప్రజా సమితి ప్రకటించింది. మే, 19న డా|| చెన్నారెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ ప్రజా సమితి కార్యవర్గ, ముఖ్య నేతల సమావేశంలో నాగం కృష్ణ అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం ఏర్పడింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో 69వేలమంది ఓటర్లున్నారు. ఈ సమావేశంలో శాసనసభలో తెలంగాణ ఐక్య సంఘటన నాయకుడు నూకల రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు.
పోటీ ప్రజా సమితినుండి మరో అభ్యర్థి
తెలంగాణ ప్రజా సమితినుండి విడిపోయి పోటీ ప్రజా సమితిని ఏర్పాటు చేసుకున్న శంకర్‌రావు బిలోల్కర్, ఎల్లప్ప, గణేశ్‌రావు గత ఖైరతాబాద్ ఎన్నికల్లో పోటీచేసి పరాజయం పాలైన మాజీ కౌన్సిలర్ శంకరయ్య ముదిరాజ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించారు. శంకరయ్య మే 19న నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నిజాం వ్యతిరేక పోరాటంలో పలుమార్లు జైలుకు వెళ్ళిన చరిత్ర శంకరయ్యది. జనసంఘ్‌పార్టీనుండి ఏ లక్ష్మీనారాయణను అభ్యర్థిగా ప్రకటించగా ఆయన తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని ఎన్నికల అదికారి టి.ఎన్.కపూర్ (నగర పాలక కమిషనర్) ప్రకటించారు.
ఎన్నికల కమిషన్‌కు డా|| చెన్నారెడ్డి విజ్ఞప్తి
కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ఖైరతాబాద్ ఉప ఎన్నికలను స్వేచ్ఛగా, నిజాయితీగా నిర్వహిస్తుందనే విశ్వాసం తమకుగానీ, ప్రజలకుగానీ లేదని, ఈ ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘమే నిర్వహించాలని ఎన్నికల నిర్వహణకు అవసరమైన యంత్రాంగాన్ని స్వయంగా ఏర్పాటు చేసుకోవాలని డా|| మర్రి చెన్నారెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఒక పరిశీలకున్ని ఢిల్లీనుండి పంపించింది.
ఉప ఎన్నికల షెడ్యూల్
ఖైరతాబాద్ ఉప ఎన్నికకు జూన్ 14న పోలింగ్ జరుగుతుందని, మే 13 నుండి 20 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చునని, 21న నామినేషన్ల పరిశీలన, 23న ఉపసంహరణ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఉప ఎన్నికల్లో ప్రజా సమితి నిర్ణయాన్ని తప్పుబట్టిన కొండా లక్ష్మణ్ బాపూజీ
”ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ఒక యునైటెడ్ అభ్యర్థిని నిలబెట్టలేకపోవడానికి చెన్నారెడ్డి బాధ్యుల”ని కొండాలక్ష్మణ్ బాపూజీ, కె.ఎస్. నారాయణ (ఎమ్మెల్యే), టి. సదాలక్ష్మి తది తరులు విలేకరుల సమావేశంలో ఆరోపించారు. తాము మాజీ నగర మేయర్ ఎస్.ఆర్. వెంకటేశంకు మద్దతునిస్తా మని ప్రకటించారు. ఎన్నికల్లో రాజకీయపార్టీ కానటువంటి ప్రజా సమితి ఎలా అభ్యర్థిని నిలబెడుతుందని కొండా లక్ష్మణ్ ప్రశ్నించారు. నాగం కృష్ణను అభ్యర్థిగా నిర్ణయించే ముందు తమను సంప్రదించలేదని ఆయన అన్నారు. ప్రజాసమితిలో చీలికలకు చెన్నారెడ్డి మొండి వైఖరే కారణమని కె.ఎస్. నారాయణ ఆరోపించారు.
ఎన్నికల్లో నిలిచిన ఏడుగురు అభ్యర్థులు
నామినేషన్ పత్రాల ఉపసంహరణ గడువు మే 23న ముగిసిపోవడంతో ఏడుగురు అభ్యర్థులు ఎన్నికల్లో పోటీకి అర్హత పొందారు. వీరిలో అధికార (కొత్త) కాంగ్రెస్ అభ్యర్థి ఎస్. యాదగిరి, ప్రజా సమితి అభ్యర్థి నాగం కృష్ణ పోటీ ప్రజా సమితి అభ్యర్థి ఎస్. శంకరయ్య, కొండాలక్ష్మణ్, సదాలక్ష్మి తదితరులు బలపరిచిన ఎస్.ఆర్. వెంకటేశం, జనసంఘ్ పక్షాన ఎ. లక్ష్మీనారాయణ ప్రధాన పార్టీలు, సంస్థలు లేదా ప్రముఖ నేతలు బలపరిచిన అభ్యర్థులు.
డిప్యూటీ మేయర్ మ్యాడం రామచంద్రయ్య తన నామినేషన్‌ను ఎస్.ఆర్. వెంకటేశంకు మద్దతుగా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు.
పై ఐదుగురు ప్రధాన అభ్యర్థుల్లో ముగ్గురు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న వారే. కొత్త కాంగ్రెస్ పక్షాన బ్రహ్మానందరెడ్డి బలపరిచిన ఎస్. యాదగిరి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలకు వ్యతిరేకంగా సమైక్యవాదుల ఏజెంట్‌గా పనిచేస్తూ ఉద్యమకారుల పై దాడులు చేయిస్తున్న నాయకులు. గతంలో రెండుసార్లు యాదగిరిపై ఉద్యమకారులు ప్రతిదాడులు చేశారు. సమైక్యవాదుల ప్రచారాన్ని అడ్డుకున్నా, దాడులు చేసినా వారికి తగువిధంగా బుద్ధి చెప్తామని కార్మికమంత్రి జి. సంజీవరెడ్డి ఉద్యమకారులను హెచ్చరించారు.
కొండా లక్ష్మణ్ ప్రకటనపై రాజారాం విమర్శ
ప్రజాసమితి పక్షాన నాగం కృష్ణ అభ్యర్థిత్వాన్ని తప్పుపడుతూ కొండా లక్ష్మణ్ విలేకరుల ముందు చేసిన వ్యాఖ్యలను ప్రజాసమితి కార్యదర్శి జీ రాజారాం తీవ్రంగా విమర్శించారు.
కొండా లక్ష్మణ్ ప్రకటన పరస్పర విరుద్ధంగా వున్నదని, ప్రజా సమితి పోటీ చేయరాదని అంటూనే, అభ్యర్థిని నిర్ణయించేముందు తనను సంప్రదించలేదని అనడాన్ని రాజారాం ఉదాహరించారు. ప్రజా సమితి ఏమి చేయాలో ఎవరిని నిర్ణయించాలో సభ్యులు నిర్ణయిస్తారు తప్ప ఇతరులుకాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజా సమితికి కొండా లక్ష్మణ్ రాజీనామా చేసిన విషయాన్ని రాజారాం గుర్తు చేశారు. ప్రజా సమితి నుండి వైదొలిగిన ఒక వ్యక్తిని అభ్యర్థిగా నిర్ణయించాలని కొండా లక్ష్మణ్ సహచరులు కోరారని, కానీ అభ్యర్థిని నిర్ణయించడానికి ఏర్పడిన సంఘం వివిధ నాయకులతో సంప్రదించిన తర్వాత నాగం కృష్ణను నిర్ణయించిందని రాజారాం వివరించారు.
ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరూ లేరని, ఎస్.ఆర్. వెంకటేశంను వ్యక్తిగత హోదాలో కొండా లక్ష్మణ్ బలపరుస్తున్నారని రాజారాం అన్నారు. (కొండా లక్ష్మణ్ అధ్యక్షతనగల టీపీసీసీకి కూడా ప్రధాన కార్యదర్శిగా రాజారాం ఉన్నారు)
తెలంగాణ వాదుల మధ్య పోటీ
నివారణకై రాజీయత్నాలు
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో తెలంగాణ ఉద్యమకారులు మూడు గ్రూపులుగా విడిపోయి ముగ్గురు అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపారు. వీరిలో ‘జై తెలంగాణ ప్రజా సమితి’ అభ్యర్థి శంకరయ్య గతంలో ఇదే నియోజకవర్గం నుండి శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. ఈసారి ఆయనకు ప్రముఖ ఉద్యమనేతల మద్దతు లభించలేదు. తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి నాగం కృష్ణకు ఉద్యమకారుల మద్దతు ఎక్కువగా లభిస్తున్నది. ఆయన విజయం కోసం డా|| చెన్నారెడ్డి, మదన్‌మోహన్, ఎస్. వెంకట్రాంరెడ్డి శాసనసభలో తెలంగాణ ఐక్య ఫ్రంట్‌నేతల నూకల రామచంద్రారెడ్డి, ఎంపీ జీ వెంకటస్వామి, శాసనసభ్యులు టి. అంజయ్య, జాయెద్ అలీఖాన్ తదితర నాయకులు వీధుల్లో ఇల్లిల్లు తిరుగుతూ ప్రచారం చేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొండా లక్ష్మణ్ బాపూజీ బలపరిచిన అభ్యర్థి మాజీ నగర మేయర్ ఎస్.ఆర్. వెంకటేశంవైపు ఉద్యమకారులు ఎక్కువ సంఖ్యలో లేకపోయినా ఆయనకున్న స్వంత పలుకుబడితో, కొండా లక్ష్మణ్ బాపూజీకున్న పలుకుబడితో తెలంగాణ అనుకూల ఓటు చీలే అవకాశం వున్నది. దీన్ని నివారించడానికి వి.బి.రాజు, నూకల రామచంద్రారెడ్డి, డా|| చెన్నారెడ్డితో, కొండా లక్ష్మణ్ బాపూజీతో చర్చలు ప్రారంభించారు. ఇద్దరిలో ఒకరు పోటీనుంచి తప్పుకొని మరొక అభ్యర్థికి మద్దతిస్తూ ప్రకటన, ప్రచారం చేయాలని వి.బి. రాజు కోరినారు. రెండు, మూడు ధఫాలు చర్చించిన తర్వాత తెలంగాణ ఉద్యమ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొండా లక్ష్మణ్ బాపూజీ తమ అభ్యర్థి ఎస్.ఆర్. వెంకటేశంను పోటీనుండి ఉపసంహరించారు. దీనితో ప్రధాన పోటీ కాసు బ్రహ్మానందరెడ్డి అభ్యర్థి అయిన యాదగిరికి, ప్రజా సమితి అభ్యర్థి నాగం కృష్ణరే మధ్యనే ఉన్నది.