తెలంగాణ ప్రజా సమితికి, తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీకి మధ్య అవగాహన కుదరడంతో డా|| మర్రి చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, వి.బి. రాజు, నూకల రామచంద్రారెడ్డి, మదన్‌మోహన్‌, జి. వెంకటస్వామి, టి. అంజయ్య, ఇ.వి. పద్మనాభన్‌ తదితర నాయకులంతా టి.పి.ఎస్‌. అభ్యర్థి నాగం కృష్ణ గెలుపుకోసం వాడవాడ తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేశారు. ప్రచారంలో పాల్గొననీయకుండా తిరుగుతూ విద్యార్థి నేత మల్లికార్జున్‌ను ప్రభుత్వం జైళ్ళో పెట్టింది. కోర్టు బెయిల్‌ నిరాకరించింది.

కాంగ్రెస్‌ అభ్యర్థి యాదగిరిపై దాడి.. చెన్నారెడ్డి ఇంటిపై ప్రతిదాడి
ఖైరతాబాద్‌ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని తన ఇంటికి తిరిగి వస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి యాదగిరిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళతో దాడి చేశారు. యాదగిరికి, ఆయన వెంట వున్న మాజీ మేయర్‌ కొండారెడ్డికి స్వల్ప గాయాలైనాయి. ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రి అనుచరునిగా సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తూ ఉద్యమకారులపై పలుమార్లు దాడులు చేసినందుకు ప్రతీకారంగా యాదగిరిపై గతంలో కూడా నాటు బాంబులతో కొందరు దాడి చేశారు. ప్రతిగా గతంలో డాక్టర్‌ చెన్నారెడ్డి ఇంటిపై నాటు బాంబులతో సమైక్యవాదులు దాడి చేశారు. ఈసారి యాదగిరిపై దాడికి ప్రతీకారంగా కూడా మరోసారి డాక్టర్‌ చెన్నారెడ్డి ఇంటిపై కొందరు వ్యక్తులు రాళ్ళతో దాడికి దిగారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు. ఇంటికి కొంత నష్టం జరిగింది. చుట్టుప్రక్కల ఇళ్లల్లోంచి జనం రావడం చూసి రాళ్ళు రువ్విన వాళ్ళు పారిపోయారు. పోలీసులు సమయానికి రాలేదని ఆరోపిస్తూ వారి వైఖరిని డా|| చెన్నారెడ్డి ఖండించారు. సనత్‌నగర్‌లో ఒక తెలంగాణ వాదిపైన, ప్రజా సమితి ఎన్నికల కార్యాలయంలో వున్న మరో వ్యక్తిపైన సమైక్యవాదులు దాడి చేశారని ఆరోపిస్తూ పార్లమెంట్‌ సభ్యులు జి. వెంకటస్వామి ఆ దాడులను, చెన్నారెడ్డి ఇంటిపై దాడిని ఖండించారు. ప్రజా సమితి ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటున్న కె. శ్రీరాములు, ముత్యాలరావు, శివరాజు తదితర నాయకులను ఇండియన్‌ పీనల్‌కోడ్‌ 51వ సెక్షన్‌ క్రింద పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో ఒకరిని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కొట్టారని ప్రజా సమితి ఒక ప్రకటనలో తెలిపింది.

ఖైరతాబాద్‌లో ప్రజాసమితి నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో డా|| చెన్నారెడ్డి ప్రసంగిస్తూ ‘ప్రజా సమితి అభ్యర్థి నాగం కృష్ణ గెలుపు ప్రత్యేక రాష్ట్ర అవతరణకు నాంది కాగలదన్నారు. ఎ. మదన్‌మోహన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో నూకల రామచంద్రారెడ్డి కూడా ప్రసంగించారు.

కాంగ్రెస్‌ అభ్యర్థి యాదగిరి గెలుపుకోసం పి.సి.సి. అధ్యక్షులు పి. నర్సారెడ్డి, ఉప ముఖ్యమంత్రి జె.వి. నర్సింగరావు, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎర్రం సత్యనారాయణ, శ్రీమతి రాజమణీదేవి, మంత్రి దామోదరం రాజనర్సింహ తదితరులు ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో మే 30న పాదయాత్ర చేశారు. ఫతేనగర్‌లో జరిగిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారసభలో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపు సమైక్యవాదుల విజయమనీ, దౌర్జన్యశక్తుల ఆటకట్టించాలని మంత్రి రాజనర్సింహ అన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని ప్రజాసమితి..
ఉద్యమం తగ్గుముఖం పట్టిన పరిస్థితిని గమనించి ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిని నిలిపి రాజకీయాలను సాధనంగా ఉపయోగించాలనుకున్న తెలంగాణ ప్రజాసమితి అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మాత్రం పోటీకి దిగలేదు. ఫలితంగా తెలంగాణలో మూడింట ఒకవంతు పంచాయతీలకు ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికైనారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 753 పంచాయతీల్లో 224, హైదరాబాద్‌లోని 400లో 101, నల్గొండలోని 682లో 114, వరంగ్‌లోని 630లో 200, ఖమ్మంలోని 442లో 147, కరీంనగర్‌లోని 725లో 299, నిజామాబాద్‌లోని 405లో 142, మెదక్‌లోని 660లో 160, ఆదిలాబాద్‌లోని 537 పంచాయతీల్లో 213 పంచాయతీలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి తోట రామస్వామి ప్రకటించారు. మొత్తం 15,934 పంచాయతీలకు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించగా 4902 పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు మంత్రి ప్రకటించారు.

”తెలంగాణలో పూర్వం టౌన్‌ మునిసిపాలిటీలుగా ఉండి పెద్ద పంచాయతీలుగా మార్చబడిన 22 పంచాయతీల్లో రోడ్డు, రక్షిత మంచినీటి పథకాలు పూర్తయినాయి. ప్రజలలో గ్రామాలు బాగు చేసుకోవాలని మంచి ఉత్సాహం కలిగింది. రాస్తాల (రోడ్లు)కోసమని 35 లక్షల రూపాయల విలువచేసే భూమిని తెలంగాణ ప్రజలు దానంగా ఇస్తూ నాల్గవవంతు ఖర్చు మేరకు శ్రమదానం చేసార’ని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి తోట రామస్వామి ప్రకటించారు. గ్రామాల్లో పరిస్థితినిబట్టి ఒక మైలుకు రూ. 15వేలనుంచి 45వేల రూపాయల వరకు ప్రభుత్వం నిధులను కేటాయించిందని మంత్రి అన్నారు.

ఉధృతంగా ఖైరతాబాద్‌ ఎన్నికల ప్రచారం
తమపార్టీ అభ్యర్థుల గెలుపుకోసం వివిధ పార్టీలు ఖైరతాబాద్‌లో ప్రచారాన్ని ఉధృతం చేశాయి. భారతీయ జనసంఘ్‌ అగ్రనేత అటల్‌ బిహారీ వాజ్‌పేయి తమపార్టీ అభ్యర్థి లక్ష్మీనారాయణకు మద్దతుగా జూన్‌ 3న హైదరాబాద్‌లోని మోతీలాల్‌భవన్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

‘దేశం యిప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకోసం, ధర్మంకోసం శిక్షణతో, దీక్షతో పనిచేస్తున్న జనసంఘం అభ్యర్థిని ఈ ఎన్నికల్లో గెలిచేటట్లుగా ఓటర్లకు బాగా నచ్చజెప్పాలి. అధికారంలోవున్న కాంగ్రెస్‌ పక్షం దేశ విద్రోహశక్తులైన కమ్యూనిస్టుపక్షాలతో చేతులు కలిపి వారి దురాగతాలు సహిస్తూ ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకోవడానికి జనసంఘం, రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్‌లపై దుష్ప్రచారాన్ని సాగిస్తున్నద’ని అన్నారు. ఈ సభలో అభ్యర్థి లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ వి. రామారావు, నగర జనసంఘం అధ్యక్షులు విజయదుర్గ తదితరులు పాల్గొన్నారు. జనసంఘం సమైక్యవాదాన్నే బలపర్చింది.

మరోవైపు డా|| చెన్నారెడ్డి ప్రజాసమితి అభ్యర్థి నాగం కృష్ణారావును, కార్యకర్తలను వెంటబెట్టుకొని ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేశారు. ప్రజాసమితి నగర అధ్యక్షులు బి. రాందేవ్‌ ఆధ్వర్యాన కార్యకర్తల సమావేశాన్ని చెన్నారెడ్డి ఇంటిపైన నిర్వహించారు. డా|| చెన్నారెడ్డి వెంట తెలంగాణ ప్రాంతీయ యాదవ మహాసభ అధ్యక్షులు కె. వెంకటేశ్వరరావు యాదవ్‌ నగరపాలక సంఘం సభ్యులు శ్రీమతి కున్వర్‌రాణి, ఎం.ఎస్‌. రామస్వామి, రహమత్‌ అలీ, మాజీ ఉప మేయర్‌ డి. యాదవరావు, మాణిక్‌రావు, వై. వెంకటకృష్ణయ్య, ఎం. బలరాం, కె. వెంకటరెడ్డి, ఎస్‌. జగన్నాధం, యు. సురేష్‌బాబు, ఎస్పీ జగన్నాధప్రసాద్‌, విఠల్‌రెడ్డి, ఎస్‌. నారాయణరెడ్డి, మోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్‌ అధికారి ఎన్‌. దుర్గయ్య, డాక్టర్‌ వకల్‌చంద్‌, డా|| జి.పి. రామయ్య, మేజర్‌ రంగస్వామి, ప్రొ|| ఖలీల్‌, విద్యార్థి నేతలు, తదితరులు ప్రజాసమితి అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపుకోసం ముఖ్యమంత్రి తెరవెనుకనుంచి మార్గదర్శకత్వం చేస్తుండగా ఇంటింటి ప్రచారంలో పీసీసీ అధ్యక్షులు పి. నరసారెడ్డి, చొక్కారావు, ఉప ముఖ్యమంత్రి జె.వి. నర్సింగరావు, హోంమంత్రి జలగం వెంగళరావు, సరోజినీపుల్లారెడ్డి,

టి. పాంచజన్యం, అన్నెం విశ్వనాధం, మంత్రులు డా|| ఎం.ఎస్‌. లక్ష్మీనరసయ్య, శ్రీమతి రోడా మిస్త్రీ, జి. సంజీవరెడ్డి, రామచంద్రరావు కళ్యాణి,
వి. పురుషోత్తమరెడ్డి, మునిసిపల్‌ కౌన్సిలర్‌ హరిశ్చంద్రం, డి. ప్రతాపరెడ్డి, రంగపాండు, వేదప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజాసమితికి ప్రభుత్వ వేధింపులు కార్యకర్త హత్య
ప్రచారంలో తెలంగాణ ప్రజాసమితికి లభిస్తున్న ఆదరణ చూసి ఓటమి తప్పదని భావించిన ముఖ్యమంత్రి పోలీసులను, గుండాలను ఉద్యమకారులపై ఉసిగొల్పుతూ వేధింపుల పర్వం ప్రారంభించారు. అభ్యంతరకరమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలున్నాయనే సాకుతో ప్రజాసమితి కరపత్రాలు, పోస్టర్లను ముద్రణాలయంనుంచి, కార్యకర్తల చేతుల్లోంచి స్వాధీనం చేసుకున్నారని ప్రజాసమితి నాయకులు మాణిక్‌రావు ఆరోపించారు. అక్రమకేసులు పెడుతూ ప్రజాసమితి కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

జూన్‌ 5న రాత్రి సికింద్రాబాద్‌లో మోండా వీధిలోని పాన్‌షాప్‌ యజమాని 40 ఏళ్ల సాంబయ్యను కొందరు గుండాలు 16సార్లు కత్తితో పొడిచి హత్య చేశారు. భయంతో వేరే షాపులోకి వెళ్లగా బయటకు లాగి చంపారు. సాంబయ్య రిపబ్లికన్‌ పార్టీలో కోశాధికారిగా వుంటూ తెలంగాణ ప్రజాసమితిలో సీతాఫల్‌మండి ఉపాధ్యక్షునిగా చురుగ్గా పనిచేస్తున్నారు. ఈ హత్య కాంగ్రెస్‌ గుండాలే చేశారని, వారు ప్రయాణించే వాహనంలో కాంగ్రెస్‌ అభ్యర్థి పోస్టర్లు ఉన్నాయని డా|| చెన్నారెడ్డి ఆరోపించారు. దాడిలో గాయపడిన కృష్ణ మరో వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ దాడిని వి.బి. రాజు ఖండించి సాంబయ్యకు నివాళులర్పించారు. ఈ ఘటనను సాకుగా చేసుకొన్న పోలీసులు బోయిగూడాలో జరుప తలపెట్టిన ప్రజాసమితి ఎన్నికల సభ అనుమతిని రద్దు చేశారు. నగరంలో ఊరేగింపులు నిషేధించారు.

తెలంగాణ ఉద్యమకారుడు సాంబయ్య మృతికి సంతాప సూచకంగా జూన్‌ 6న సికింద్రాబాద్‌లో దుకాణాలను వర్తకులు స్వచ్ఛందంగా మూసివేశారు. హింసాయుత గుండా చర్యలతో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నదని డా|| చెన్నారెడ్డి అన్నారు. ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలు న్యాయంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగాలని, పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలని ఆయన కోరినారు. సాంబయ్య హత్యకు నిరసనగా ప్రజాసమితి సికింద్రాబాద్‌ బంద్‌కు అభ్యర్థి నాగం కృష్ణం, ఎమ్మెల్యే మాణిక్‌రావు పిలుపునిచ్చారు. మరణించినా సాంబయ్య సికింద్రాబాద్‌లోని తొలి సత్యాగ్రాహి అని నాగం కృష్ణ తెలిపారు.

ఉప ఎన్నికకు ఢిల్లీ పర్యవేక్షకుల రాక
ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలను సజావుగా జరిపించడానికి ఢిల్లీనుండి పర్యవేక్షకులను పంపించాలని డా|| ఎం. చెన్నారెడ్డి చేసిన విజ్ఞప్తిని, హైదరాబాద్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కమిషన్‌ ఇద్దరు అధికారులను జూన్‌ 11న పంపించింది. వీరు నాగ సుబ్రహ్మణ్యం, రోషన్‌లాంగ్‌, ఓట్ల లెక్కింపు పూర్తయ్యేదాకా వీరు హైదరాబాద్‌లోనే వుంటారని కమిషన్‌ ప్రకటించింది.

ప్రశాంతంగా పోలింగ్‌… నాగం కృష్ణ గెలుపు
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్‌ జూన్‌ 13న ప్రశాంతంగా జరిగింది. యాభై శాతానికి మించి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 68,774 మంది ఓటర్లకోసం 73 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సనత్‌నగర్‌, ఖైరతాబాద్‌, బేగంపేట, రాంగోపాల్‌పేట, జీరా, ఎర్రమంజిల్‌, అమీర్‌పేట, ప్రకాశంనగర్‌ ఈ నియోజకవర్గంలో వున్నాయి. చాలా పోలింగ్‌ కేంద్రాల్లో పురుషులకన్నా స్త్రీలు అధిక సంఖ్యలో లైన్లలో నిలబడి ఓటు వేశారు. నిరక్షరాస్యులైన ఓటర్లను కొందరిని విలేకర్లు ప్రశ్నించగా తెలంగాణకోసం ‘పార’ గుర్తుకు ఓటువేసినట్లు తెలిపారని పత్రికలు రాశాయి. ప్రధాన పోటీ కాంగ్రెస్‌-ప్రజా సమితి మధ్యనే జరిగింది. తెలంగాణ మంత్రులంతా కాంగ్రెస్‌ అభ్యర్థికోసం చురుగ్గా ప్రచారం చేయగా తెలంగాణవాదులు, మేధావులు, విద్యార్థులు, వైద్యులు, న్యాయవాదులు ప్రజా సమితి అభ్యర్థి గెలుపుకోసం పనిచేశారు.

జూన్‌ 15న ఓట్ల లెక్కింపు జరుపగా తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థి నాగం కృష్ణ కాంగ్రెస్‌ అభ్యర్థి సమైక్యతావాది యాదగిరిపై సుమారు 14వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. యాదగిరికి 10,401 ఓట్లు లభించగా, నాగం కృష్ణకు 24,391 ఓట్లు వచ్చాయి. అంటే నాగం కృష్ణకు వచ్చిన ఓట్లలో సగం ఓట్లు కూడా ముఖ్యమంత్రి నిలబెట్టిన కాంగ్రెస్‌ అభ్యర్థి యాదగిరికి రాలేదు. జనసంఘం అభ్యర్థి లక్ష్మీనారాయణకు 1642 ఓట్లు రాగా ‘జై తెలంగాణ’ పక్షాన చెన్నారెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించే పోటీ ప్రజా సమితి అభ్యర్థి శంకరయ్యకు కేవలం 134 ఓట్లు మాత్రమే వచ్చాయి. పోటీనుండి ఎస్‌.ఆర్‌. వెంకటేశం వైదొలిగినా 74 ఓట్లు పడ్డాయి. చెల్లని ఓట్లు 845 ఇండిపెండెంట్ల ఓట్లకన్నా ఇవే ఎక్కువ. నాగం కృష్ణారావుకన్నా యాదగిరికి మొత్తం 73 కేంద్రాల్లో ఆంధ్ర ఉద్యోగులు, వలసవచ్చిన వారుండే 10 కేంద్రాల్లోనే ఎక్కువ ఓట్లు పడినాయి. ఈ 10 కేంద్రాలున్న ప్రాంతాలు ఎర్రమంజిల్‌, సోమాజీగూడ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్‌లోని ప్రెండర్‌గాస్టు రోడ్‌. 37 ఏళ్ళ వయస్సున్న నాగం కృష్ణ సికింద్రాబాద్‌ టీపీయస్‌ శాఖకు అధ్యక్షునిగా వున్నారు. ‘జై తెలంగాణ’, ‘నాగమ్‌ జిందాబాద్‌’ నినాదాలతో ఓట్ల లెక్కింపు జరిగిన ప్రాంతమంతా మార్మోగింది. అత్యధిక మెజారిటీతో నాగం కృష్ణను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు నాయకులు. దీన్ని ప్రజా విజయంగా అభివర్ణించారు. డా|| చెన్నారెడ్డి, వి.బి.రాజు.

Other Updates