తెలంగాణ తెలుగు ఒక విలక్షణమైన భాష. ఒక సుసంపన్న భాష. అనేక యితర భాషా పదాలను స్వీకరించి పరిపుష్టమైన భాస్వంత భాష. ముఖ్యంగా ఉర్దూ పదాలను సొంతం చేసుకొని గంగా జమునా తహజీబ్‌కు గొప్ప నిదర్శనంగా నిలిచిన భాష. గంగా యమునల సమ్మేళనంతో ఏర్పడిన సమ్యక్ సంస్కృతీ సంప్రదాయాల పలుకుబడి తెలంగాణ భాషకు కలిగిన ప్రత్యేకత. ఉర్దూ భాష మార్దవంగా వుంటుంది. మృదుమధురంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తిని చక్కగా గౌరవించగలిగిన సముచిత పదసంపద ఉర్దూలోనే ఎక్కువ. తెలంగాణను నాలుగు శతాబ్దాలకు పైబడి పరిపాలించిన ముస్లిములవల్ల తెలంగాణ భాషలో ఉర్దూ పదాలు తెలుగు పదాలే అన్నట్లుగా కలిసిపోయాయి. అందువల్ల తెలంగాణ భాష ఒక చక్కని సెక్యులర్ భాషగా తయారైంది. హిందూ ముస్లిం భాయీ భాయీ అన్నట్లు, పూవుకు తావి అబ్బినట్లు తెలుగు పదాలకు ఉర్దూ పదాలు తోడయ్యాయి. అవి తెలుగులో పాలలో పంచదారలా కలిసిపోయినై. పందిరి మీదికి తీగల్లా పాకిపోయినై.
తెలుగు భాషలోని ప్రధాన ద్వారం, సింహద్వారం మొదలైన పదాలకు తెలుగులో ‘పెద్ద దర్వాజ’ సమానార్థకం. దర్వాజా అనే మాటలకు తలుపులు, ద్వారం అని అర్థాలు. ‘తలుపులు మూయండి’ అనే తెలుగు వాక్యాల్ని ‘ధర్వాజ బంద్ చెయ్యిండ్రి’ అంటున్నారు తెలంగాణలో. ‘బంద్ చేయడం’ అంటే బంధించడం. ఈ ‘బంధించడం’ నిజానికి సంస్కృతం. అది తర్వాత హిందీలోకి వెళ్ళితదుపరి తెలంగాణకు వచ్చింది. ‘ఫ్యాన్ బంద్ చెయ్యి, టి.వి. బంద్ చెయ్యి’ అనే వాక్యాలు వరుసగా తెలుగులో ‘ఫ్యాన్ కట్టెయ్యి, టి.వి. కట్టెయ్యి’ అవుతాయి. బంధించడం అన్నా, కట్టివేయి అన్నా అర్థం ఒక్కటే! కాకపోతే కట్టివేయడంలో తెలుగుతనం వుంది. బంద్ చేయడం అంటే మానివేయడం అనే అర్థమూ వుంది. హైదరాబాద్ బంద్, కర్నూలు బంద్ అని రాజకీయపార్టీలు పిలుపు ఇచ్చాయంటే అన్ని పనులు మానివేయడమే కదా!
ఆధునిక ప్రమాణభాషలో ఉన్న నారింజలు తెలంగాణలో ‘సంత్రాలు’ అవుతాయి. ఇక బతాయిలు ‘మోసంబీలు’ అవుతాయి. ఇప్పటికీ ఈ పండ్లను తెలంగాణలో చాలామంది సంత్రాలు, మోసంబీలు అనే వ్యవహరిస్తారు. ద్రాక్షకు బదులు అంగూర్లు అంటారు అలవోకగా. అంగూర్లలో సీడ్‌లెస్‌ను ‘బేదానా’ అని పలుకుతారు. ఎండు ద్రాక్షను ‘కిస్మిస్’లు అంటారు. తెలుగులోని ‘సీమరేగుపండు’ను తెలంగాణలో ‘సేప్’ అని పిలుస్తారు. ఇదే ‘ఆపిల్’. కూరగాయల్లో సైతం ‘క్యాబేజీ’ని ‘గోబి’ అని, క్యారెట్‌ను ‘గాజర్’ అనీ పిలిచే కొందరున్నారు తెలంగాణలో. బంగాళాదుంపల్ని తెలంగాణ వాసులందరూ ఆలుగడ్డలనే అంటారు. పుచ్చకాయను కొందరు ‘తర్బూజా’ అని పేర్కొంటే, పసుపువన్నె పండును కర్బూజా అని పలుకుతారు.
తెలంగాణలో ఉర్దూ మిళిత తెలుగు భాషను ‘దర్జాగా’ మాట్లాడుతారు. ఫలానా వస్తువు బ్రహ్మాండంగా వుందీ, సర్వశ్రేష్ఠంగా వుందీ అని చెప్పడానికి ‘అవ్వల్ దర్జగ’ వుంది అంటారు. ‘అవ్వల్’ సర్వోత్కృష్టమైన అని అర్థం. మరి కొందరు ‘అవ్వల్ దర్యగా’ వుందంటారు. ఇంకా కొంతమంది ‘ఆలదర్యగా’ వుందని చెబుతారు. ఈ ‘అవ్వల్ దర్జ, అవ్వల్ దర్య, ఆలదర్యలు’ అన్నీ ఉర్దూ భాషాపదాలే! అది చాలదన్నట్లు ‘బేత్రీన్‌గ ఉంది, బొంబాట్‌గ ఉంది’ అని కూడా చెబుతారు. అయితే ఒక్కోసారి అది ఉర్దూ పదమా, హిందీ పదమా అని కనిపెట్టడం కష్టం. ఉర్దూ అంటేనే అరబిక్, పర్షియన్, టర్కిష్, సంస్కృతం, హిందీ మొదలైన భాషలతో ఏర్పడిన సంపద్వంతమైన సంకరభాష. మొదట అది సైనికులది. ఇవాళ అందరి భాష. ప్రామాణికంగా చలామణి అవుతున్న తెలుగు భాషలో సైతం వందలాది, వేలకొద్ది ఉర్దూ పదాలు చేరిపోయి అసలు అవి తెలుగు పదాలే అన్నట్లుగా మారిపోయినై. అసలు, అమలు, ఖరీదు, జవాబు, తనఖా, రోజు, చోరీ, మిర్చి… ఇట్లా ఎన్నో పదాలను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణలో అయితే పదాలే కాదు, సామెతలు సైతం ఉర్దూలోంచి వచ్చాయి. ఉదా|| చారాన దావత్‌కు బారాన టాంగా. అంటే రెండణాల విందుకు నాల్గణాల జట్కాబండి బాడుగ. నియ్యతెంతో బర్కత్ అంత. (నియ్యత్ అంటే నీతి, నిజాయితీ, నియతి, నియమబద్ధ జీవనం) మనం ఎంత నియమబద్ధంగా, నీతిగా బతుకుతుంటామో అంత ఐశ్వర్యమూ, నిండుదనమూ, పరిపూర్ణతా (బర్కత్) మనకు సిద్ధిస్తాయని సామెత అర్థం.
‘నిశ్చింత’ తెలంగాణలో ‘నిర్రంది’ అయ్యింది. ఇది చిత్రమైన పదబంధం. ‘నిర్’-సంస్కృత సంబంధితం. ‘రంది’ (రంజ్) ఉర్దూ బాబతు పదం. రెంటినీ కలిపారు తెలంగాణీయులు. ‘నిర్భయం’ పదానికి ‘బేఫికర్’ సమానార్థకం. ‘నిరర్థకం’ అనే దానికి ‘బేకార్’. అప్పు పూర్తి తీరిపోతే ‘బేబాకీ’ కావడం. స్పృహ తప్పితే ‘బోవోష్’ అవడం (బేహోశ్). కృతజ్ఞత లేని వాణ్ణి ‘బేయిమాన్ మనిషి’ అంటారు. ఇంకా ఎక్కువ కృతఘ్నుడైతే అతణ్ణి ‘గుర్రపు బేయిమాన్ మనిషి’ అని వ్యవహరిస్తారు. ‘ఆత్మగౌరవ సమస్య’ అనే సమాసం ‘ఇజ్జత్ కా సవాల్’ అవుతుంది తెలంగాణలో. పరువు నష్టం కేసు ‘ఇజ్జత్ దావా’గా మారుతుంది. మనం గౌరవం పలచన అయిన సందర్భంలో ‘ఇజ్జత్ పంచనామా’ అయిపోయింది అంటారు తెలంగాణ వాసులు. ఏది ఏమైనా ఉర్దూ పదాల మేళవింపుతో తెలంగాణ భాషకు ఒక లాలిత్యం వచ్చింది. అది మరింత ప్రసాదగుణ భరితం అయ్యింది. తెలంగాణ తెలుగు లావణ్యానికి, తారళ్యానికీ, సారళ్యానికి ఉర్దూ కూడా ఒక కారణం-ఒక ప్రేరకం.
డా. నలిమెల భాస్కర్