cmdహైదరాబాద్‌ నగరం, సిద్ధిపేట పట్టణాల మధ్య మరో అందమైన పట్టణానికి అంకురార్పణ జరగనున్నదా అంటే అవుననే అనిపిస్తోంది. అదే గజ్వేల్‌. ఒక మహా నగరంలో ఉండే అన్ని సౌకర్యాలను అందుకుని కొత్త చరిత్రను లిఖించనున్నది. నిజం చెప్పుకోవాలంటే నిన్న మొన్నటి వరకు కొంత వరకు పెద్ద ఊరది.. అంతేకాదు, ప్రాథమిక సౌకర్యాలు కూడా లేకుండా కొట్టు మిట్టాడిన చరిత్ర ఆ ఊరుది.. రాజకీయంగా కూడా అంతగా ప్రాధాన్యం లేనిది. పేరుకు హైదరాబాద్‌ నగరానికి సమీపంలో ఉన్నా ఎటువంటి ప్రాధాన్యతను సంతరించుకోలేదు. అదంతా గతించిన చరిత్ర. గత ఆంధ్రప్రదేశ్‌ పాలకుల పుణ్యమా అని చరిత్ర చీకటి పొరల మధ్య నలిగిపోయిన ఆ పట్టణం ఇప్పుడిప్పుడే వెలుగు రేఖల వైపు పయనిస్తోంది. చీకటి చరిత్రకు చరమగీతం పాడుతోంది. గత సంవత్సరం నుంచి రాష్ట్రంలోనే వార్తలలో నలుగుతున్న ఆ పట్టణం గజ్వేల్‌.

తెలంగాణ రాష్ట్ర రాజకీయ యవనికపై శాశ్వత స్థానాన్ని లిఖించుకుంటున్న గజ్వేల్‌కు ఇంతటి ప్రాధాన్యత సంతరించుకోవడానికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తుండడమే.

మే 9న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గజ్వేల్‌ పట్టణంలో పర్యటించి వరాల వర్షం కురిపించడంతో స్థానికులలో ఆనందం వెల్లి విరిసింది. కేవలం రెండేళ్లలో సుందర నగరంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దుతానని ప్రకటించారు. మొత్తం గజ్వేల్‌ పట్టణంలో రూ.98.72 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన మొదలు పెట్టారు. మరింత అభివృద్ధి జరగవల్సి ఉన్నదని అన్నారు. అయితే తాను తలపెట్టిన పనులు సరిపోవని సమగ్రంగా మార్పు రావాలంటే రెండేళ్ల కాలం పట్టనున్నదని ప్రకటించారు.ఎవరొచ్చినా ఇక్కడే ఇల్లు కట్టుకుని ఉంటే బాగుండు అన్నతీరుగా గజ్వేల్‌ను మార్చేస్తానని సీఎం ప్రకటించారు. వచ్చే ఏడు నెలల్లో ఇంటింటికీ మంచి నీళ్లు అందిస్తానని ప్రకటించారు.
పాండవుల చెరువు మినీ ట్యాంక్‌బాండ్‌ పాండవుల చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిది ద్దుతామని గతంలో ప్రకటించిన కేసిఆర్‌ ఇందుకు రూ. 8.65 కోట్లు మంజూరు చేశారు.ఈ పనులకు ఆయన శంకుస్థాపన చేయడంతో స్థానిక ప్రజలలో ఆనందం వెల్లివిరిసింది.పైలాన్‌ను ఆవిష్క రించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ కాన్వాయిని చెరువు వైపు పరుగులు పెట్టించి అధికారులను ఆశ్చర్యంలో ముంచెత్తి చ్చారు. సక్కగా చెరువు దగ్గరికి వెళ్లా రు. కారు దిగి పూడిక పనులు చేస్తున్న కార్మికులతో సమంగా గడ్డపార, పారను చేతబట్టి మన్ను తోడి తట్టలో వేసి ట్రాక్టరులో పోశారు. సాధ్యమైనంత బిరాన ట్యాంక్‌బండ్‌ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువు శిఖంలో కబ్జాలున్నాయని వాటిని తొలగించాలని సూచించారు. కోటి రూపాయలతో నిర్మించనున్న వైకుంఠదామం, పర్యాటక కేంద్రం పనులకు కూడా శంకుస్థాపన చేశారు.

సంగాపూర్‌లో విద్యాకేంద్రం

saewగజ్వేల్‌ పట్టణంలోగల ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటినీ సంగాపూర్‌కు తరలించనున్నామని ప్రకటించారు. అక్కడ ఎడ్యుకేషనల్‌ హబ్‌ను ఏర్పాటు చేయనున్నామని.. వాటికి అన్ని సౌకర్యాలు గల అధునాతన భవనాలు నిర్మించనున్నామని వివరించారు. రూ. 21. కోట్లతో బాలికల పాఠశాల, జూనియర్‌, డిగ్రీ కళాశాల, హాస్టల్‌ భవనాలు, రూ. 21.45 కోట్లతో బాలుర హైస్కూల్‌,జూనియర్‌, డిగ్రీ కళాశాల, హాస్టల్‌ భవనాలకు శంకుస్థాపన చేశారు.

ఆధునిక సౌకర్యాలతో అలరారనున్న గజ్వేల్‌

ప్రస్తుతం జూనియర్‌ కళాశాల ఆవరణలో రైతు బజార్‌, అందులోనే వెజ్‌, నాన్‌ వెజ్‌ విభాగాలు, హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఎకరం ఖాళీ స్థలంలో ఎమ్మెల్యే బిల్డింగ్‌ నిర్మాణం,అందులోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రకటించడంతో ప్రజల నుంచి హర్షద్వానాలు వ్యక్తమయ్యాయి.
అన్ని కార్యాలయాలు ఒకే దగ్గర ఉండేలా ఆఫీస్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చేపడతామని ప్రకటించారు. అనేక రకాల సౌక ర్యాలతో షాదీఖానా, అధునాతన ఆడిటోరియానికి సంబం ధించిన పనులు మొదలయ్యాయని వెల్లడిరచారు. ప్రజలకు సంబంధించిన వివాహాలు, విందులతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకు అనువుగా ఉండేలా దానిని నిర్మిస్తున్నామని వివరించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ఆడిటోరియంను నిర్మిస్తున్నామని, ఇంతేగాక 18 ఎకరాల సువిశాల స్థలంలో సుందరమైన పార్క్‌ నిర్మాణంలో ఉందని చెప్పారు. పట్టణం చుట్టూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు త్వరలో నిర్మాణం కానున్నదని ఆయన వివరించారు. గజ్వేల్‌ పట్టణమంతా అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీని నిర్మిస్తే బాగుంటుందని మంత్రి హరీష్‌ రావు సూచించారని, దానిని సైతం అమలు చేస్తామని ప్రకటించారు.

3వేలమంది పేదలకు ఇళ్ళు

గజ్వేల్‌ పట్టణంలో అన్ని ఆధునిక హంగులతో టౌన్‌షిప్‌ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్నది. వన్‌ ప్లస్‌ పద్ధతిన 1500 ఇండ్ల నిర్మాణం చేపట్టి 3 వేలమంది పేదలకు అందుబాటులోకి తేనున్నామని ప్రకటించారు. ఇందులో అన్ని అధునాతన సౌకర్యాలతోపాటు గుడి, మసీదు, చర్చిలను కూడా నిర్మించనున్నామని తెలిపారు.టౌన్‌షిప్‌ పరిధిలోనే పార్క్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌,విశాలమైన రోడ్లు, బస్‌బే,బస్టాప్‌లు ఉంటాయని మొత్తం అల్ట్రా మాడరన్‌ సౌకర్యాలతో టౌన్‌షిప్‌ నిర్మాణం కానుందని సీి.ఎం. వివరించారు.స్థానికంగా రూ.18.50 కోట్లతో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు.రూ. 6 కోట్లతో ఆడిటోరియం. రూ 19.75 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ ఆఫీస్‌ కాంప్లెక్స్‌, రూ. 35. 91 లక్షలతో నిర్మించే హెర్బల్‌ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. 2500 మంది బలహీన వర్గాల కుటుంబాలకు ఇండ్ల నిర్మాణం, జర్నలిస్టులు అంగీకరిస్తే వారికి అక్కడే ఇండ్లు నిర్మించి ఇస్తామని కూడా ప్రకటించారు.

మర్కుక్‌కు మహర్దశ

ములుగు మండలంలోని మర్కుక్‌ గ్రామంలో రూ. 98.72 కోట్ల వ్యయం కాగల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మే 9న శంకుస్థాపన చేశారు. రూ.1.20 కోట్లతో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, రూ.50 లక్షలతో సీసీ రోడ్లు, రూ.20 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌, , రూ. 10 లక్షలతో వైకుంఠదామం నిర్మాణ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌ రెడ్డి, బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే రామలింగా రెడ్డి, హరీశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.

Other Updates