hospitalఆలోచన చేయడమేకాదు.. ఆచరణలోకి తీసుకుని వచ్చి అందరూ హర్షించేలా ఆదరణను చూరగొన్న గజ్వేల్‌ సీమాంక్‌-హైరిస్క్‌ ప్రసూతి కేంద్రం ప్రభుత్వ నిబద్దతకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ. తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలినాళ్ళలోనే మునుపటి మెదక్‌, ఇప్పటి సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో హైరిస్క్‌ ప్రసూతి కేంద్రాన్ని 2015 జనవరి 5న ప్రారంభించింది. ఇంకా రెండు సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోకముందే 5628 మందికి పురుళ్ళు పోసింది ఆసుపత్రి సిబ్బంది. ఇదే దవాఖానలో 2001నుండి డిసెంబర్‌ 2014 వరకు దాదాపు పధ్నాలుగు సంవత్స రాలలో పురుడు పోసుకున్నవారి సంఖ్య 3,472 మాత్రమే. ఈ దవాఖానాలో ప్రస్తు తం 143మందికి సరిపోయే విధంగా మంచాలు వున్నాయి. అవసరాన్నిబట్టి ఎప్పటి కప్పుడు ఈ మంచాల సంఖ్యను పెంచుతూ పోతున్నారు. ఇక్కడ సాధారణ ప్రసవం అయినవారిని మూడురోజులలో, ఆపరేషన్‌ అయినవారిని వారం రోజుల్లో, ఇంటికి పంపిస్తుంటారు. గ్రామీణ ప్రాంత బాలింతలకు వెయ్యి రూపాయలు, నగర పంచాయ తీలవాళ్ళకు ఆరువందల రూపాయలను, జననీ సురక్ష పథకం ద్వారా చెల్లింపులు కూడా సక్రమంగా జరుపుతున్నది ప్రభుత్వం. పురుడు పోసుకున్న బాలింతలను జననీ ఎక్స్‌ప్రెస్‌ 102 వాహనమే ఇంటివద్ద సురక్షితంగా దిగబెడుతుంది.

ఇక్కడి హైరిస్క్‌ కేంద్రంలోవున్న మహిళా వైద్యాధికారుల కృషి ఫలితంగానే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతున్నదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ దవాఖానాకు కేవలం గజ్వేల్‌ నియోజకవర్గ మహిళలేకాకుండా దుబ్బాక, మేడ్చల్‌, భువనగిరి, తుర్కపల్లి, మెదక్‌ జిల్లా నర్సాపూర్‌, రామాయంపేట ప్రాంతాలవారు కూడా ఇక్కడే పురుడుపోసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దాంతో మొత్తం రాష్ట్రంలోనే అత్యధికంగా గర్భిణులకు పురుళ్ళుపోసిన దవాఖానగా ఖ్యాతిని గడించింది.

ఈ దవాఖానకు రోజూవచ్చే గర్భిణులు, చిన్న పిల్లలకు అవసరమయిన సలహాలను అందించడంకోసం సహాయ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. కాన్పుకోసం గర్భిణులు వచ్చిన సమయానికి వైద్యులు అందుబాటులో లేకపోతే, కబురుచేసి వెంటనే వైద్యులను రప్పిస్తారు. ఏదైనా కేసు క్లిష్టంగా వుంటే వెంటనే వారిని హైదరాబాదుకు తరలించ డానికి జనని ఎక్స్‌ప్రెస్‌ 102 వాహనాన్ని సిద్ధంగా వుంచుతారు. గజ్వేల్‌ నియోజకవర్గం పరిధిలోవున్న పీహెచ్‌సీలలోని గర్భిణుల వివరాలను ముందే సేకరించుకుని వారి ప్రసవం తేదీ సమాచారాన్ని ఫోన్‌ద్వారా వారికి అందజేస్తారు.

అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధునీకరణ

త్వరలోనే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకరిస్తామని మంత్రి లక్ష్మారెడ్డి వివరించారు. కాంట్రాక్టు స్పెషలిస్టు డాక్టర్ల నియామక బాధ్యత ఇకముందు హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీలదే… స్థానిక అవసరాలకు అనుగుణంగా, కాంట్రాక్టు స్పెషలిస్టు డాక్టర్ల నియామక బాధ్యతను ఇక నుంచి హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీలే తీసుకోవాలని మంత్రి చెప్పారు. పై స్థాయి నుంచి అన్ని రకాల నియామకాలు జరిగి, పనులు కావాలంటే ఆలస్యం అవుతుందని, అందుకోసం, జిల్లా కలెక్టర్లతో చర్చించి, కాంట్రాక్టు స్పెషలిస్టు డాక్టర్ల నియామక బాధ్యత ఇకముందు హాస్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీలే చెప్పట్టాలని మంత్రి సూచించారు.

వంద శాతం హాజరు-క్షేత్ర స్థాయి పర్యటనలు

ఈ లక్ష్యాలు అన్నీ సాధించాలంటే డాక్టర్లు, సిబ్బంది విధులకు వంద శాతం హాజరు కావాలని మంత్రి అన్నారు. వాళ్లతో పని చేయించాలంటే అధికారులు కూడా వంద శాతం హాజరు కావాలన్నారు. ప్రజలకు ఇప్పుడిప్పుడే ప్రజా వైద్యం మీద నమ్మకం పెరుగుతున్నదని, దాన్ని మరింతగా పెంచే విధంగా మొత్తం వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం పని చేయాలని మంత్రి ఉద్బోధించారు.విధుల పట్ల నిజాయితీతో మెలగాలి. ఎంతో నమ్మకం, వ్యయ, ప్రయసాలకు ఓర్చి వచ్చే రోగులను మానవతా దృక్పథంతో ఆదరించాలని మంత్రి లక్ష్మారెడ్డి వివరించారు. ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగంలోనే అనుభవజ్ఞులు, నిష్ణాతులైన వైద్యులు ఉన్నారు. కలిసికట్టుగా పని చేస్తే సాధించలేనిది లేదు. బాగా పని చేసే వైద్యులు, సిబ్బందికి, అధికారులకు వారి కృషికి తగ్గ ప్రోత్సాహం ఉంటుంది. మనం అంతా కలిసి ప్రజారోగ్యం కోసం తద్వారా సీఎం కేసీఆర్‌ కల ఆరోగ్య తెలంగాణ సాధన దిశగా పని చేయాలని మంత్రి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కుటుంబ వైద్య విధాన పరిషత్‌, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, DH లలితకుమారి, TSMSIDC ఎండి వేణుగోపాల్‌, జజు లక్ష్మణ్‌ రెడ్డి, డాక్టర్‌ శ్రీనివాస్‌, 31 జిల్లాల DM&HOలు, హాస్పిటల్‌ సూపరింటెండెంట్లు, తదితరులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.

Other Updates