tsmagazineజోగుళాంబ గద్వాల జిల్లాలోని తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన గట్టు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శంకుస్థాపన చేశారు. గద్వాల నియోజకవర్గంలోని గట్టు, ధరూర్‌, కేటిదొడ్డి మండలాలలోని 33వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు, 41 చెరువులను నింపేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. మంత్రులు టి. హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, సి. లక్ష్మారెడ్డి, జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. రూ. 553.98 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా ఈ ప్రాంతంలోని రైతులు పెద్దఎత్తున తరలివచ్చి సీఎంకు అభినందనలు తెలిపారు.

గట్టు ఎత్తిపోతల పథకం పూర్వాపరాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి గద్వాలలో జరిగిన బహిరంగ సభలో గట్టు హైలెవెల్‌ కెనాల్‌ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆయ న హయాంలో ఈ పనులు ప్రారంభం కాలేదు. నిధులూ మంజూరు కాలేదు. 2012 సెప్టెంబర్‌ 14న జరిగిన ఇందిరమ్మ కార్యక్ర మంలో ఆనా టి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ర్యాలపాడు నుంచి నీళ్లను ఎత్తిపోతల ద్వారా మళ్లించి గట్టు మండలంలోని చెరువులను నింపుతామని ప్రకటించారు. ఈ ప్రకటన చేసిన తర్వాత దాదాపు సంవత్సరంన్నరపాటు ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు మంజూరు చేయలేదు.

2014 ఎన్నికలకు ముందు మళ్లీ గట్టు ఎత్తిపోతల పథకం ప్రస్తావన తెచ్చారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం కేవలం 0.31 టీఎంసీల నీటితో చెరువుల కింద ఉన్న 3,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు సర్వే చేయడానికి జీవో నెం. 3ను 2014 జనవరి 22న విడుదల చేసింది. సర్వే జరుగలేదు. ప్రాజెక్టు ప్లాన్‌ లేదు.. డీపీఆర్‌ రాలేదు.. టెండర్లు లేవు.. అయినా శంకుస్థాపన చేశారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ రిటైర్డ్‌ ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. మంత్రి హరీష్‌రావు స్వయంగా గట్టు, ధరూర్‌, కె.టి. దొడ్డి మండల ప్రజలతో మాట్లాడారు. కరువు మండలాలకు నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ద్వారా, కేవలం 3వేల ఎకరాలకు నీరు ఇచ్చేందుకు పనులు చేయడంవల్ల కరువు ప్రాంతాలకు న్యాయం జరుగదని ప్రభుత్వం భావించింది. దాదాపు 28వేల ఎకరాల వరకు కొత్త ఆయకట్టుకు గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా నీరు ఇచ్చే సమగ్ర సర్వే చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జీవోఆర్టీ నెం. 461ని 2016 మే 3వ తేదీన విడుదల చేసింది. 52.46 లక్షల రూపాయలు అదనంగా మంజూరు చేసింది. ప్రాజెక్టు సమగ్ర సర్వే సమర్పించే దశలో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ కోసం రిజర్వు చేసిన ఐదువేల ఎకరాలను ఆయకట్టు పరిధిలోకి తేవాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. వారి కోరికను ప్రభుత్వం కాదనలేదు. తిరిగి రీ సర్వే చేయించింది. తద్వారా 25వేల ఎకరాలనుంచి 33వేల ఎకరాలకు నీరిచ్చేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. గట్టు ఎత్తిపోతల పథకం ద్వారా 2.8 టీఎంసీల నీటితో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తారు. 41 చెరువులు నింపుతారు. 33వేల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. దీనికోసం 553.98 కోట్లను మంజూరు చేశారు. 2018 మే 31వ తేదీన ఈ మేరకు జీవోఎంఎస్‌ నెంబర్‌ 60 విడుదల చేశారు.

‘తుమ్మిళ్ళ’ పథకాన్ని పరిశీలించిన సీఎం
జూరాల ఆధారితంగా నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి వీలుగా అవసరమైన వ్యవస్థను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నీటి పారుదల శాఖను ఆదేశించాఠు. తుమ్మిళ్ల ఎత్తిపొతల పథకం నుండి ఈ ఏడాదే మొదటి దశ పంపింగ్‌ ప్రారంభం కావాలని చెప్పారు. తుమ్మిళ్ల ఎత్తిపో తల పథకం పూర్తి చేయడం ద్వారా 87,500 ఎకరాల ఆర్డిఎస్‌ ఆయకట్టును వందకు వంద శాతం స్థిరీకరించగలుగుతామన్నారు.

తుంగభద్ర నది నుండి నీటిని ఎత్తిపోసి ఆర్డీఎస్‌ కాలువలకు అందించే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పరిశీలించారు. తుంగభద్ర వద్ద ఇంటేక్‌ పాయింట్‌ ను, అప్రోచ్‌ కెనాల్‌ను, పంప్‌హౌజ్‌లను పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్‌ రావు, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కష్ణారావు, ప్రణాళికా సంఘం వైస్‌ ఛైర్మన్‌ ఎస్‌. నిరంజన్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు తదితరులు వున్నారు.

”ఆర్డీఎస్‌ ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి వుండగా గత పదేళ్లుగా పూర్తి ఆయకట్టుకు నీరు రావడం లేదు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తి ఆయకట్టుకు నీరందుతుంది” అని ముఖ్యమంత్రి చెప్పారు.

”తుమ్మిళ్లతో పాటు గట్టు ఎత్తిపోతల పథకాలు పూర్తయితే కష్ణా, తుంగభద్ర నదుల మధ్య వున్న నడిగడ్డలో లక్షా 20 వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి” అని ముఖ్యమంత్రి అన్నారు. ”జూరాల ద్వారా లక్షా నాలుగు వేల ఎకరాలు, నెట్టెంపాడు ద్వారా రెండున్నర లక్షల ఎకరాలు, భీమా ద్వారా రెండున్నర లక్షల ఎకరాలు, కోయిల్‌ సాగర్‌ ద్వారా 50 వేల ఎకరాలు, ఆర్డీఎస్‌ ద్వారా 87,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించడానికి ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారానే తాగునీరు కూడా అందిస్తాం. నీటిని సమగ్రంగా వినియోగించుకోవడానికి ప్రస్తుతం నిర్మిస్తున్న రిజర్వాయర్లతో పాటు ఇంకా ఎన్ని రిజర్వాయర్లు అవసరమవుతాయో నిర్ధారించి, ప్రతిపాదనలు రూపొందించాలి. అవసరమైన పంపు హౌజ్‌లు, కాలువల నిర్మాణం పూర్తి చేయాలి” అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం వివరాలు:

  •  రూ.783 కోట్ల వ్యయం
  • 87,500 ఎకరాలకు సాగునీరు
  • ఈ సీజన్‌ నుంచే నీటి లిఫ్టింగ్‌
  • ఆర్డీఎస్‌ ద్వారా గద్వాల, ఆలంపూర్‌ నియోజకవర్గాల్లో 75 గ్రామాల్లోని 87,500 ఎకరాలకు సాగునీరు అందాలి. 15.9 టిఎంసిల నీటి కేటాయింపు ఉన్నది
  • కానీ గత పదేళ్లుగా కేవలం 31,500 ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నది. మిగతా 56వేల ఎకరాలకు సాగునీరు లేక బీడు బారి పోయింది
  • కేవలం 5 టిఎంసిలు మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్నాం. మిగతా 11 టిఎంసిలు అందడం లేదు
  • ఈ గ్యాప్‌ ను పూడ్చడానికి మొత్తం 87,500 ఎకరాల భూమికి నీరు ఇవ్వడానికి రూ.783 కోట్ల వ్యయంతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టారు
  • తుంగభద్ర నది నీళ్లు నిల్వ చేసే సుంకేసుల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి తుమ్మిళ్ల గ్రామం వద్ద నీటిని లిఫ్ట్‌ చేసి, ఆర్డీఎస్‌ కెనాల్‌ లో నీరు పోస్తారు. దీంతో 56వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది
  • రెండో దశలో మల్లమ్మకుంట, జులకల్‌, వల్లూరు రిజర్వాయర్లు నిర్మిస్తారు. ఒక టిఎంసి నీటిని రిజర్వ్‌ చేస్తారు

Other Updates