కాకతీయ ప్రభువులు గావించిన ప్రజాహితకరమైన పనులలో చెరువుల నిర్మాణాలు ప్రధానమైనవన్న సంగతి జగద్విదితం. సుమారు 3,500 చెరువులు వారి కాలంలో జలకళతో తళతళలాడాయి. ‘వాపీూప తటాకాదికం’ నిర్మాణం చేయడంవెనుక పుణ్య సముపార్జనం, భావికాలాన కీర్తి ప్రతిష్ఠలతోపాటు వర్తమాన కాలాన పాడిపంటలు-ఇలా త్రిముఖ వ్యూహంగా కాకతీయరాజులు సాగించారు. ఈ చెరువుల నిర్మాణంలో తెలంగాణ నేలిన పశ్చిమ చాళుక్యులు వీరికి ఆదర్శం. ఈ ఉభయ రాజవంశాలు బృహత్తటాకాలు నిర్మించి వీటకి సాగరాలు అని పేరు పెట్టినారు. నాగసముద్రం, సేసముద్రం, ధర్మసాగరం, విలాస సాగరం, ఇలా పేర్లున్న సాగరాలవంటి చెరువులు వారి ప్రతిష్ఠను చిరస్మరణీయం చేశాయి. ‘యస్యోత్తుంగ తరంగ తాడిత వియత్’ సప్తార్ణవీయం జలం అని వేయిస్తంభాల గుడిలో వేయించిన శాసనంలోని శ్లోకం వేరే సందర్భానిదే ఐనా కాకతీయుల చెరువులను వర్ణిస్తున్నట్టుగా మనం భావించవచ్చు.
చెరువులు నిర్మిస్తే సరిపోదు. చెరువులు అందానికేకాదు వాటిలోని చివరి నీటి బొట్టు సేద్యం కావాల్సిన ఆఖరి పొలందాకా పారిందా లేదా అన్నది పరమ లక్ష్యంగా పాలన సాగాలి. అంటే చెరువుల నిర్మాణంతోబాటు సేద్యపు కాలువల నిర్మాణం ప్రధానమే. చెరువులు శాశ్వతంగా నిలిచినా జలసారణులు (కాలువలు) శాశ్వతంగా ఉండవు. వాటిని జాగ్రత్తగా నిర్వహించినా, వాటిలోని పారేనీరు ప్రతి సేద్యగాని పొలానికి అందాలిగదా! ఆ నిర్వహణను కాకతీయ ప్రభువులు చక్కగా నిర్వహించారా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. దానికి సాక్ష్యంగా ఓ సంఘటన వివరిస్తాను. అది కాకతీయుల కాలంనాటి అపురూప శాసనంలో గమనించాను.
నేటి కరీంనగర్ జిల్లాలో చామనపల్లి, దావనపల్లి అనే గ్రామాలున్నాయి. ఇవి చొప్పదండి దగ్గరలో ఉన్నాయి. గణపతిదేవ చక్రవర్తి సుకసం కథా వినోదాలతో పృధ్వీరాజ్యం చేస్తుండగా జరిగిన ఓ ఘట్టం ఇది. ఈ చామనపల్లి గ్రామం పక్కనుండి ‘గొనుగు కాలువ’ ప్రవహిస్తోంది. దాని నీరు పైన ఉన్న వారెవరో దొంగలించినారో ఏమో, చామనపల్లి వారికి నీటిహక్కు పోయింది. ఈ గ్రామంలోని బ్రాహ్మణులు కొందరు గణపతి దేవునివద్దకు వెళ్లి మొరబెట్టుకున్నారు. ఆయన తన బావమరిది జాయప నాయకుణ్ణి పిలిచి, ఈ వివాదం పరిశీలించమన్నాడు. జాయప తనవద్దగల అమాత్యుడు మంచిరాజు అనే బ్రాహ్మణున్ని పరిశీలకాధికారిగా పంపినాడు. ఆ సమయంలో సబ్బి మండలాధిపతి (సబ్బి=కరీంనగర్ ప్రాంతం) అక్షయ చంద్రదేవుణ్ణి నెడవూరు గ్రామాన కలిసి, వారి అమాత్యులైన రవిదత్త, వాఘదేవ, హింగదేవులనే అధికారులను మొదట (కార్తీకమాసాన) కలిసి వివాద నిర్ణయార్థం చామనపల్లికి మంచిరాజు వచ్చినాడు. ఒక చిన్న పంచాయతి కూటమి నేర్పర్చి ఆయన కుమ్మరికుంట, దేవనపల్లి, కట్యకోలపల్లిలోని వృద్ధులను పిలిపించి, కాలువ పక్కన సభ పెట్టి సాక్ష్యాలు అడిగినాడు. వివరాలతో, చామనపల్లి బ్రాహ్మణులను తీసికొని, కాలరి పన్ను కట్టించుకోవడానికి ఓరుగల్లు వెళ్లి గణపతిదేవునికి, ఆ పిదప అక్షయ చద్రదేవునికి విన్నవించి వారి ఆజ్ఞ తీసుకొనినాడు. అక్షయచంద్రుని అధికారు లిద్దరు నారాయణ, మహరుకా అనే వారిద్దరూ రెండోసారి సమీక్ష చేసినారు. పోచిరాజు, బొల్లమరాజు, చామనపల్లి వృత్తి బ్రాహ్మణులను విచారించినాడు. శ్రీధరపెద్ది, పోతారెడ్డి, పురాణం మల్లయ్య, సోమేదుల మల్లయ్యవంటి వారిని, రుఏవాసెట్టి మొదలైన వైశ్యులను, ఇతరులను సాక్షులుగా విచారించినాడు. కొందరు రెడ్లను, కొందరు నాయుళ్లను, కొందరు వైష్ణవ జియ్య (వామ జియ్య, మల్లి జియ్య)లను, దేవనపల్లి గ్రామంలోని సోబకుల అన్నపరెడ్డిని, మిట్టపల్లి మాదిరెడ్డిని, గట్లపెల్లి నామినాయుడును, కట్టెరోలపల్లి సోమప్పయ్య, నాగదేమాచి, దోవతుల గుండ్రెడ్డి, మాదిరెడ్డి ప్రోతిరెడ్డి మొదలగు వారిని విచారించగా అందరూ ఏకగ్రీవంగా నీళ్లు మహాజనులవే (బ్రాహ్మణులవే) అని పలికినారు.
ఇంకా ‘ఈ కాలువ వివాదమున్ను ఎన్నండులేదు. ఈ కాలువ పక్క పదునొకండవ మడి, ఉత్తరాన పల్లముదాక, మడికుంట తూర్పెల్లి మహాజనులదే’ అని పలికినాడు. ఈ నిర్ణయాలను నాలుగుపక్కల రెండు రాగిరేకుల శాసనంగా చెక్కించి, వారికి రాజాజ్ఞగా అందజేసి ఓరుగల్లుకు వెళ్లిపోయినాడు.
ఈ శాసనం కరీంనగర్ జిల్లాలోని మోతె సంజీవరావునుండి పురావస్తుశాఖ స్వీకరించింది. ఈ సంఘటన తీర్పు శనివారం, డిసెంబరు 15, క్రీ.శ. 1246 (పరాభవ పౌష్య శు|| షష్ఠి) నాటిది. శాసనంలో ఇది ‘గొనుగుకాలువ వివాదం’ అని పేర్కొనబడింది. కార్తీకంలో మొదలైన పరిశీలన రెండు నెలలకు తీర్పుగా వెలువడింది.
సాధారణంగా శాసనాలు దానాదికం విషయంగా ఉంటే ఈ శాసనం కాకతీయ ప్రభువుల పరిపాలనను వివరిస్తోంది.
ప్రభువు నీటిపట్ల ఎంత శ్రద్ధగలవారో తెలియజేస్తోంది. ఒక్కోసారి కాకుండా నిర్ణయాన్ని రెండుసార్లు, ఇద్దరు అధికార పురుషులతో పునఃపరిశీలన చేయించడం విశేషం. కాలువ పక్కన సమావేశం, ఇతర గ్రామాలవారిని పిలిపించి అడిగే విధానం, అన్ని కులాలవారిని సాక్ష్యంగా స్వీకరించడం, జలవిధా నాలపట్ల, న్యాయ నిర్ణయాలపట్ల గణపతిదేవునికిగల శ్రద్ధాసక్తులను వివరిస్తోంది. సేద్యపు నీళ్లపట్ల ప్రభుత్వానికున్న శ్రద్ధ, అక్రమాలు జరిగితే జాగ్రత్త అనే హెచ్చరిక, సందేశం ప్రజలకు అందేందు ఈ శాసనం నిర్మాణం జరిగిందంటే కాకతీయ ప్రభువుల శ్రద్ధ స్పష్టమవుతుంది.
ఇక్కడ మరొక ముఖ్యాంశం ఉంది. దేవనాగరి లిపిలో సంస్కృతంలో రాయబడ్డ ఈ శాసనంలో తుది పంక్తులు లిపి సంస్కృ తమే ఐనా తెలుగులో ‘నిర్ణయం’ ప్రకటించబడింది. స్థానికులముందు ఆ శాసనం చదువుతుంటే ప్రభువు ఏం చెప్పదలచినాడో సామాన్యులైన జనులకు, రైతులకు అర్థమయ్యేలా ఉంది. అంటే మాతృభాషలో జీవో జారీ ఐందన్నమాట. పాలితుల మాతృభాషకు పాలకులిచ్చిన శ్రద్ధను శాశ్వతం చేసిందీ శాసనం.
అందు కాకతీయ ప్రభువుల రాజ్యం అంతయ్యాక 2 శతాబ్దుల తరువాత కూడా ప్రజలు వారి మంచితనాన్ని మరవక, తరువాతి ప్రభువుల శాసనాల్లో ధర్మాత్ములైన ప్రభువులని పేర్కొనడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన అంశం.
మన ప్రస్తుత ర్రాష్ట ప్రభుత వీరి కోవలోనే ప్రజాహితకరంగా ‘మిషన్ కాకతీయ’ ప్రజా విధానాన్ని ఆచరిస్తుందని ఆశిద్దాం.