చెరువులు
అలుగు పారడం ఎంత ఆనందం
చెరువులు
పండుగ కావడం ఎంత సంతోషం

మేఘాల ఉరుముల ప్రభంజనం చెరువు
చినుకుల సమ్మేళనం చెరువు
వాగుల సన్నాయి మేళం చెరువు
కుంటల కోలాటం చెరువు

గుంటుకలు కోండ్రెస్తున్నవి
నాగండ్లు నవ్వుతున్నవి
పలుగు పారలు నలుగు పంచుతున్నవి
కాడెడ్లు కొమ్ముల్ని ఇదిలిస్తున్నవి
కలువపూలు కాంతులీనుతున్నవి
మోదుగుపూలు విచ్చుకుంటున్నవి

ఎన్నేండ్లయిందో
బిడ్డం మొఖం తల్లి
తల్లి ముఖం బిడ్డ ఎడబాపిన
వలస కంసుల పరిపాలన

తల్లి.. బిడ్డను చిటికెన వేలు పట్టి నడిపిస్తున్నట్లు
నదిని వేలు పట్టి నడిపిస్తున్న అపరభగీరథుడు
నది బిడ్డలకు కడుపార పాలిస్తున్నది
చెరువులు అలుగెల్తున్నవి

చెరువుది ఊరుది రక్త సంబంధం
తల్లిబిడ్డల అనుబంధం
తరతరాల ప్రేమబంధం
బిడ్డ కడుపునిండా
పాలిచ్చిన నదీమ తల్లి
అరికాలు పాదానికి కాటుక
చెంపలపై బంగారు ముద్దులు
చెరువు నుదుట సాదుబొట్టు

కట్టకింద ఈదుల్ల కల్లు
దూపార్పుకుంటున్న మోదుగాకులు
తేనెటీగల పడవల హోరు
కందిరీగల గాలిపటాల జోరు
తుమ్మెదల గంతులాటలు
చేపలతో కొంగల విందులు

గంగిరెద్దుల దీవెనలు
ఘంటపకీరులు
బాలసంతుల తొలికోడి కూతలు
త్యాగాల వలపోతలు
అమరుల యాదులు
సీతమ్మ బాలనాగమ్మల
అరవై ఏండ్ల విముక్తి
బాలవొద్దిరాజు బాణసంచాలు

గణపసముద్రం
చెరువు కట్టపై సూర్యుడు నీళ్లతో
హోలీ ఆడుతున్నడు
తంగేడుపూలు తలలూపుతున్నవి
బంతిపూలు భరత నాట్యం
గునుగుపూల బొడ్డెమ్మల బహుళదర్వులు
గౌరమ్మ గంగమ్మ పసుపు కుంకుమలు

సద్దుల బతుకమ్మ పూలతేరులు
కట్టమైసమ్మ పోషమ్మ బోనాలు
కట్టమీది దర్గాకు ఫాతెహల
కందూర్లు

పీర్లు చెరువుకొస్తున్నయి
గగ్గరపత్తి బెల్లం మటికీళ్లు
పెరుగు సద్దుల ప్రసాదాలు
చెరువుల పునరుద్దరణ
పునర్నిర్మాణ తోవలు
స్వయం పోషక కేంద్రాలు
సమస్త వృత్తుల ఆదెరువులు
ఆత్మగౌరవ పతాకాలు
పర్యాటక జలక్షేత్రాలు
ఊర్లు సగౌరవంగా
తలెత్తుకు తిరిగే
సంక్రాంతులు ఉగాదులు!

– వనపట్ల సుబ్బయ్య

Other Updates