మహబూబ్ నగర్ జిల్లా ఒకప్పుడు సామంతుల రాజ్యం ఒక్కో సంస్థానం క్రింద వందలాది గ్రామాలు ఉండేవి. పరిపాలనా సౌలభ్యం కోసం కాకతీయుల కాలంలో ఏర్పడిన పలు సంస్థానాలు తెలంగాణ జిల్లాల నిండా మనకు కనిపిస్తాయి. వందల యేళ్ళ చరిత్ర ఈ సంస్థానాలు సొంతం. మహబూబ్‌నగర్ జిల్లాకు కీర్తి పతాకంగా నిలిచిన గద్వాల కోట కూడా అలాంటి గొప్ప సంస్థానమే. గతంలోని ఘన కీర్తికి ప్రతీకగా ఇక్కడి గద్వాల కోట నిలుస్తుంది. పాకనాటి వంశస్థులు ఈ కోటను పాలించారు. వీరి కాలంలో కవులను, కళాకారులను, పలు కళలను పోషించారు. జరీ అంచుతో పట్టుచీరలను నేసిన నైపుణ్యం ఇక్కడి కళాకారుల స్వంతం. మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 6 వరకు సంస్థానాలున్నాయి. అందులో గద్వాల సంస్థానం గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి.
మహబూబ్‌నగర్ జిల్లా గుండా ప్రవహిస్తున్న కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య విస్తరించి ఉన్న గొప్ప కోట గద్వాల. జిల్లాలోనే ఎంతో ప్రాధాన్యం, ప్రాముఖ్యత కలిగిన సంస్థానం ఇది.
గద్వాల, సింగప్ప, సిద్ధావురం, అహోబిలం, బండి ఆత్మకూరు, సిరిసిల్ల ప్రాంతాలు సహా 100 గ్రామాలు గద్వాల సంస్థానంలో ఆనాడు వుండేవి. 1663వ సం||లో పెద్దసామ భూపాలుడు ఈ విశాలమైన శత్రు దుర్భేద్యమైన కోటను కట్టించాడు. అదే గద్వాల కోట. కాకతీయుల కాలంలో శత్రువుల దాడులను ఎదుర్కోవడానికి ప్రతాప రుద్రుడు అనేకమంది సంస్థానాధీశులను నియమించారు. వారిని ‘నాడేగౌడ్’లు అని పిలిచేవారు. వీరికి పలు ప్రత్యేక అధికారాలతో పాటు సంస్థానాల్ని అప్పగించారు. ఒక రకంగా చక్రవర్తులకు వీరు సామంతరాజులు. కాకతీయుల పాలన ముగిసిన తరువాత ‘నాడేగౌడ్’లు స్వతంత్ర పాలనను సంస్థానాలపై కొనసాగించారు . 17వ శతాబ్దంలో ‘పెద్దిరెడ్డి’ గద్వాల ప్రాంతానికి నాడేగౌడ్’గా ఉండేవాడు. ఈయన వూడూరి నాడేగౌడ్ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. పూడూరు సంస్థానాన్ని 49 సం||ల పాటు పాలించిన పెద్ద సామ భూపాలుడు. పెద్ద సామ భూపాలుడి పేరే చరిత్రలో సోమనాద్రిగా కనిపిస్తుంది. 1663 – 1712 సం||ల మధ్య కాలం వరకు అంటే 49 సం||ల పాటు గద్వాల సంస్థానాన్ని ఆయన పరిపాలించారు. ఈయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు సంతానం కలగకపోతే. రెండవ భార్య కుమారులు రాజాతిరుమలరావు, రాజారామారావులు ఆయన వారసులుగా తరువాతి కాలంలో గద్వాల కోటను పాలించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ సంస్థానానికి మొదట పూడూరు ప్రధాన కేంద్రంగా వుండేది. పూడూరు మరమ్మతు సమయంలో దొరికిన నిధి నిక్షేపాలను కాపాడుకోవడానికి వారికి ఒక పటిష్ఠమైన కోటలాంటి నిర్మాణం అవసరమైంది. అందుకే గద్వాల కోట నిర్మాణాన్ని వారు మొదలుపెట్టారు.
దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ కోట చుట్టూ ప్రహరి గోడ మట్టితో కట్టబడి వుంది. మట్టితో చేసిన నిర్మాణమే అయినా అత్యంత పటిష్ఠంగా నిర్మించినందువల్ల 400 సంవత్సరాలు అయినా ఈ కోట ఏమాత్రం చెక్కు చెదరలేదు. అంతులేని సంపదను కాపాడుకోవడానికి ఈ గడిరాజులు జాగ్రత్తగా సంస్థానాన్ని పాలిస్తూ వచ్చారు. ఆసక్తికర విషయమేమిటంటే ఎన్నో సార్లు సంస్థానాధీశుల రాజులు చనిపోయిన వెంటనే అధికారంలోకి వచ్చేవిధంగా వారి వారసత్వ మహిళలు సిద్ధంగా వుండేవారు. గద్వాల కోట పూర్తయిన తరువాత గద్వాల సంస్థాన కేంద్రాన్ని వూడూరు నుండి గద్వాలకు మార్చారు. సోమనాద్రి సామంతుడిగా వున్న కాలంలోనే నాటి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు బీజాపూర్ రాజుపై యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధంలో పెద్ద సోమభూపాలుడు ఔరంగజేబుకి సహకరించారు. దీనితో ఇతనికి ‘రాజా’ అని ఔరంగజేబు బిరుదును ఇచ్చారు. తరువాత కాలంలో నిజాం వుల్ ముల్క్ హైదరాబాద్‌కి రాజు అయ్యాడు. తరువాత స్వతంత్య్రంగా వున్న గద్వాల సంస్థానాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి దిలీప్‌ఖాన్‌ను పంపించాడు నిజాం. భీకరంగా జరిగిన ఆ యుద్ధంలో సోమనాద్రి చనిపోవటంతో గద్వాల సంస్థానం నిజాం వశమైంది. అనంతరం సంస్థాన బాధ్యతలను ఆయన వారసులు కొనసాగించారు.
సోమనాద్రి చనిపోయే నాటికి ఆయన పిల్లలు చిన్నవాళ్ళు. దీంతో సంస్థాన బాధ్యతలను సోమనాద్రి భార్యలు రాణి లింగమ్మ, రాణి చొక్కమ్మలు తీసుకున్నారు. తరువాత సోమనాద్రి పెద్ద కుమారుడు రాజా తిరుమలరావు చిన్న కుమారుడు రాజా రామారావులు పాలించారు. 1862 నుండి 94 వరకు పెద్ద సోమ భూపాలుడి మనవడు, రాజా చిన్న సోమభూపాలుడు గద్వాల సంస్థానాన్ని పాలించాడు. ఈయన కాలంలోనే పోలీసు, సివిల్ లాంటి అనేక ప్రత్యేక అధికారాలు సంస్థానాధీశుడికి దక్కాయి. సంస్థానాన్ని పాలించిన వారిలో ముఖ్యమైనవాడు రాజారామా భూపాలుడు. ఈయనకు కూడా సంతానం లేకపోవడంతో దత్త పుత్రుడుగా వెంట్రామిరెడ్డిని పెంచుకొని ఆయనకు ‘మహరాజా సీతారామా భూపాల్ బహదూర్’ అనే పేరు పెట్టి దత్తత తీసుకున్నాడు.
నిజాం ప్రభువు అనుమతితో సంస్థాన బాధ్యతల్ని దత్త పుత్రుడికి అప్పగించాడు. 1924లో ఈయన మరణించడంతో నిజాం ప్రభువు సంస్థానాన్ని తిరిగి వశం చేసుకున్నాడు. అయితే ఈయన భార్య ఆదిలక్ష్మీ దేవమ్మ తిరిగి సంస్థాన బాధ్యతల్ని తీసుకుంది. ఈమెకు కూడా సంతానం లేకపోవడంతో దోమకొండ రాజు రాజసోమేశ్వర రావు కుమారుడ్ని దత్తత తీసుకొని ఆయనకు గద్వాల కోట బాధ్యతల్ని అప్పగించి అతడి పేరుతో సంస్థాన బాధ్యతల్ని కూడా తానే కొనసాగించింది.
గద్వాల పట్టణం నడిబొడ్డున పెద్ద కోటలాంటి గడిని నిర్మించారు నాటి సంస్థానాదీశులు. ఈ ప్రాంతం రెండు నదుల మధ్య వున్న ఎతైయిన కొండపై ఎంతో ఎత్తు వుంటుంది. అందుకే ఈ ప్రాంతానికి వరద ముప్పు ఏమాత్రం వుండదు. కట్టుదిట్టమైన భద్రతతో కట్టిన ఈ కోట లోపల అత్యంత విశాలమైన ప్రాంగణముంది. 18 అడుగుల ఎత్తయిన ప్రహరీ గోడతో పాటు కోట చుట్టూ లోతైన కందకం కూడా వుండేది. కోట లోపలికి వెళ్ళడానికి ఎత్తయిన మహా ద్వారం వుంది. ఇది దాదాపు 30 అడుగుల ఎత్తును కలిగి ఠీవీగా నిలబడి వుంటుంది. ఈ ద్వారం ప్రక్కన సాధారణ ప్రజలు వెళ్ళడానికి 10 అడుగుల ఎత్తులో చిన్న ద్వారం గుండా దారి కూడా వుంది. గడిలోపలికి వెళ్ళగానే విశాలమైన ఒక భవనం కనిపిస్తుంది. వరుసగా రాతి స్తంభాలతో అందమైన పొడవాటి కిటికీలు, దృఢమైన దర్వాజాలతో పర్షియన్, ఇస్లామీ శైలిలో సువిశాలమైన స్థలంలో నిర్మించిన భవనం మనకు అద్భుతంగా కనిపిస్తుంది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో వున్న ఈ గడిలో అనేక విభాగాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. గడిలోని ప్రతి నిర్మాణం కూడా కళాత్మకంగానేర్పుతో తీర్చిదిద్దినట్టు కనిపిస్తుంది. కోట లోపలి భాగంలో అందమైన దిగుడు బావి ఉంది. ఆ కాలంలో కోటలోని వారి నీటి అవసరాలని ఈ బావి తీర్చింది. ఇంతటి దుర్భిక్ష పరిస్థితులలో నేటికీ అందులోని నీరు ఇంకక పోవడం విశేషం.
గడిలోపల అక్కడక్కడ నాటి సంస్థానాధీశుల విగ్రహాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కేవలం ఒకరి ఆధ్వర్యంలో నిర్మించినవి కావు. వందల సంవత్సరాల పాటు ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క నిర్మాణం ఒక్కో రీతిలో తీర్చిదిద్దబడింది. అయితే ఒక్కొక్క భవనం మీద ఒక్కొక్క పేరు కూడా మనం గమనించవచ్చు. గడి లోపలికి వెళ్ళగానే మనకు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం కనిపిస్తుంది.
ఈ కోటలో మరో ప్రాంగణం చెన్నకేశవ స్వామి ఆలయం. పెద్ద సోమభూపాలుని కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. ఆలయ గోపురం మాత్రం తరువాతి కాలంలో చిన్న సోమభూపాలుడు నిర్మించినట్లు చరిత్రకారుల కథనం. దేవాలయంలోని శిల్పకళ, ఆలయం ఎదుట వున్న 90 అడుగుల ఎత్తయిన గాలి గోపురం అత్యంత సుందరంగా అందరినీ ఆకట్టుకునేలా ఠీవీగా నిలిచి ఉంది. కోట రాతి గోడలపై శిల్పులు చెక్కిన అద్భుతమైన డిజైన్లు మనలను అబ్బుర పరుస్తాయి. అనంతర కాలంలో నేత కార్మికులు కొందరు ఈ డిజైన్లనే చీరలపై వాడారు. ఈ ఆలయాన్ని పెద్ద సోమ భూపాలుడు అత్యంత అందంగా ప్రత్యేక శ్రద్ధతో నిర్మించారు. ఈ కోటకి ఎంతటి చరిత్ర వుందో అంతే చరిత్ర ఈ దేవాలయానికి కూడా ఉంది. ప్రధాన ఆలయంలోని చెన్నకేశవ స్వామి మహా మహి మాన్వితుడని ప్రతీతి. పలు సందర్భాలలో సంస్థానాధీశులు ఈ స్వామి దయ వల్ల ఎన్నెన్నో ఆపదల నుండి కాపాడబడ్డారని, కష్టాల నుండి గట్టెక్కారని నాటి ఘటనలని నేటి తరం వారు కూడా కథలుగా నెమరు వేసుకుంటారు. కాకతీయ శిల్పకళావైభవం కొంత ఈ మందిర నిర్మాణంలో మనకు కనబడుతుంది. కొన్ని ఉపాలయాలు కూడా ప్రధాన దేవాలయం చుట్టూ ఉన్నాయి. విశాలమైన మండపం ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ. శిల్పుల అద్భుత నిర్మాణ చాతుర్యం అడుగడుగునా మనకు ఈ ఆలయంలో కనిపిస్తుంది. కోటలోని శిల్పకళ కొంత భాగం చాళుక్యుల శిల్ప రీతిని పోలి ఉంది. 18 అడుగుల ఎత్తయిన రాతి స్తంభాలు, ఆ స్తంభాలపై చెక్కిన వివిధ ఆకృతుల భంగిమలు అడుగడుగునా మనల్ని అబ్బుర పరుస్తాయి. ఏకశిలాపై చెక్కిన 12 అడుగుల సూర్యనారాయణ విగ్రహం చూపరులను అబ్బురపరుస్తుంది. కోట లోపలి శివాలయం పూర్తిగా ధ్వంసమయింది.
ఆలయం దాటి కొంత ముందుకు వెళితే నాటి రాజదర్పానికి చిహ్నంగా నిర్మించిన రాజ దర్బార్ కొంత శిథిలమై వున్న పరిస్థితుల్లో మనకు కనిపిస్తుంది. ఈ అందమైన విశాలమైన రాజ భవనాన్ని చూస్తే నాటి రాజుల రాజసం వారి దర్పం మనకు గుర్తుకు వస్తాయి. 2 అంతస్తుల ఈ భవనంలో ప్రతి అడుగు నైపుణ్యంతో నేర్పుతో కట్టబడినట్లు కనిపిస్తుంది. పూర్తిగా శిథిలమైన ఈ భవనం గతంలో ఎంతో అందంగా వుండేదని ఇక్కడి స్థానికుల కథనం. రాజ దర్బారు పెనౖ వున్న పలు కిటికీలు ఎంతో అందమైన ఆర్కిటెక్చర్‌తో చేయబడ్డాయి. ఈ కిటికీలకు వాడిన చెక్క ఇప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా వుంది. రాజదర్బారు దాటి ముందుకు వెళితే మనకు పెద్ద సొమభూపాలుడి విగ్రహం కనిపిస్తుంది. భవనం లోపలి ప్రతి నిర్మాణం ఎంతో అందంగా తీర్చిదిద్దబడి వుంది. ప్రతి చెక్క స్తంభాల్ని వరుసలో అమర్చి కట్టారు. దర్భార్‌లో కొన్ని రహస్య గదులు, నేల మాళిగలు అత్యంత పటిష్ఠమైన దర్వాజాలతో మనకు కనిపిస్తాయి. కోటలో కొన్ని సొరంగ మార్గాలు ఉన్నాయని. శత్రువుల దండయాత్ర సమయంలో రాజ కుటుంబీకులు ఆ మార్గం గుండా తప్పించుకునే వారని కథనం.
హాల్‌లోని ప్రతి నిర్మాణాన్ని చెక్కతో నిర్మించారు. నాటి శిల్పకళ ఎంతో అందంగా అద్భుతంగా కనిపిస్తుంది. ఆనాటి కాలంలో ఈ విశాలమైన హాల్‌లోనే కవితా గోష్ఠులతో పాటు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. ఈ ప్రాంతం దాటి ముందుకు వెళితే విశాలమైన రాజకోట కనిపిస్తుంది. మూడు ప్రక్కల పలు రాతి కట్టడాలు మధ్య చిన్న చెరువుతో, ఈ ప్రాంతం నాటి రాజుల విలాసవంతమైన జీవితాలకు గుర్తుగా కనిపిస్తాయి. ఈ చెరువు ప్రత్యేకత ఏంటంటే ఏ కాలంలోనూ నీరు ఇంకిపోదు. చెరువు లోపలికి దిగడానికి రాతి మెట్లు కూడా వున్నాయి. ఈ కోట, పూర్తిగా శిథిలావస్థకు చేరటంతో లోపలికి ప్రస్తుతం ఎవరినీ అనుమతిండం లేదు.
కోట గోడలపై నిర్మించిన రాతి బురుజులు శిథిలావస్థలో మనకు దర్శనమిస్తాయి. కోట గడి నిర్మాణంలో కొండరాళ్ళు డంగు సున్నం, చెక్క ఎక్కువగా వాడారు. ఈ కోటలోఅనేక ఇతర భవన నిర్మాణాలు అద్భుతంగా నిర్మించి ఔరా అనిపించారు. ప్రతి అంతస్తుకు విశాలమైన ఓపెన్ ప్లేస్ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మూడు అంతస్థుల పైకి ఎక్కితే చుట్టు ప్రక్కల నదులు గద్వాల పట్టణ ప్రాంతం కూడా కనిపిస్తుంది. కోట మధ్యలో నాటి కాలంలో అందమైన నీటి ఫౌంటెయిన్‌లు, పూల తోటలు కూడా ఉండేవి. అందుకు గుర్తుగా కొన్ని శిథిలాలు మనకు కనిపిస్తాయి.
400 ఏళ్ళ చరిత్ర గత గద్వాల సంస్థానానికి ఎంతోమంది కళాకారులను పోషించిన చరిత్ర వుంది. సంస్థానం ఏర్పడిన తొలినాళ్ళ నుండే ఇక్కడ పండితులకు, బ్రాహ్మణులకు, కవులకు మంచి గౌరవ మర్యాదలతో కూడిన ఆదరణ వుండేది. నాటి రాజులు బ్రాహ్మణుల పట్ల భక్తిశ్రద్దలు ప్రదర్శించేవారు ఇక్కడి సంస్తానాదీశులు. అందుకే ఈ సంస్థానానికి విద్వత్ గద్వాల అనే పేరు కూడా వచ్చింది. ప్రతి యేటా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు గద్వాల జాతర అత్యంత వైభవంగా జరిగేది. వేలమంది పాల్గొనే ఈ జాతరలో కళాకారులను ఘనంగా సన్మానించేవారు. గద్వాల గడి ప్రాంగణంలోనే రానా, శిక్షణా కేంద్రాలుండేవి, కోర్టులుండేవి. దీంతో వారు సంస్థానానికి సంబంధించిన న్యాయ వ్యవహారాలను ఇక్కడే పరిష్కరించేవారు. ఈ ప్రాంతం నేడు పూర్తిగా శిథిలమై ఉంది.
సంస్థానం విలీనం కావడానికి ముందు సుమారు 10 వేల ఎకరాల వ్యవసాయ భూములు వీరి క్రింద వుండేవని గ్రామస్తులు చెబుతున్నారు. తవ్వకాల్లో విలువైన నిధి, నిక్షేపాలు దొరకటం, కొంతకాలం పాటు స్వతంత్ర పాలకులుగా వుండటం, వందల సంవత్సరాల పాటు సామంతులుగా వుండటంతో, ఈ సంస్థాన వారసులు లెక్కలేని సంపదకు వారసులయ్యారు. సంస్థానంలో ఇతర కులాల వారి కంటే పద్మశాలిలు ఎక్కువ. అసలు గద్వాలకు ఇంత పేరు రావడానికి, కారణం కూడా వీరి నైపుణ్యమే. గద్వాల అంటే మనకి ఇప్పటికీ గుర్తుకొచ్చేది నేత చీరలే. ఈ సంస్థానం బాధ్యతలు ఎక్కువగా మహిళల చేతిలో వుండటం వలన దీనికి సంబధించిన ఆనవాళ్ళు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా చేనేత పరిశ్రమను అభివృద్ధి చేసింది ఇక్కడి రాణులేనని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు.
చీరల తయారీలో గద్వాల మన రాష్ట్రానికే పేరు తెచ్చింది. జరీ అంచుతో తళుకులీనే నూలు చీరలకు గద్వాల చేనేత కార్మికులు పెట్టింది పేరు. ఆ కాలంలోనే చేనేత కార్మికులను సంస్థానాధీశులు ప్రోత్సహించేవారు. నిజాం సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం అయి జాగీర్‌దార్ల పాలన రద్దయ్యే వరకు ఈ ప్రాంతం పాకనాటి రెడ్డి వంశస్తుల ఆధీనంలోనే వుండేది. ప్రస్తుతం కోట లోపల ప్రాంతాన్ని ప్రభుత్వ డిగ్రీ, జూని యర్ కాలేజ్‌లకు ఇచ్చారు. సంస్థానా వారసులు హైదరాబాద్‌లో వ్యాపారస్తులుగా స్థిరపడ్డారు. గత పాలకుల కాలంలో కోట పాలన కొంత నిర్లక్ష్యానికి గురయింది. ఈ కోటను ప్రభుత్వం పూర్తిగా స్వాధీన పరచుకొని కొద్దిమేర మరమ్మతులు చేయించి కొన్ని వసతులు కల్పిస్తే పర్యాటకులు లెక్కకు మిక్కిలిగా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి గద్వాల దగ్గరగా ఉండటం వల్ల కొంత, రవాణా సౌకర్యం కూడా బాగా ఉండటం వల్ల కొంత, గద్వాలను ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దవచ్చు.